Tuesday, December 22, 2015

అవేరా కవనాలు - 41 - 85

                             అవేరా కవనాలు
                        (ఏవీరావు గారి కవితలు)
                           41 నుండి 85 వరకు

sk101-41 అనుసూరివేంకటేశ్వరరావు
* శీర్షిక: జయహో గణనాధ*

జయజయజయ విఘ్నరాజ
జయహో జయ జగద్రక్షక
జయజయజయ జయకరా
జయహో జయ పార్వతినందన
జయజయజయ శుభకరా
జయహోజయ పరాత్పరా
జయజయజయ ఏకదంత
జయహో జయ శ్రీకరా
జయజయజయ గణనాధా
జయములన్ని నీకయ్యా
వరములన్ని మాకయ్యా
కరుణజూపి మము కావుము
సహస్రకవుల మొరవినుము
విఘ్నాలు తొలగించు
వైభవమొసగు దీవెనలందించు!
      ****అవేరా****



sk101-42
cell 7207289424
తే దీ: 29/11/2015 సహస్ర కవుల ప్రధమ సంకలనం సందర్బంగా
విషయము;వినాయకుడు /విఘ్నేశ్వరుడు

* శీర్షిక : వందనం*

వందనం వందనం వక్రతుండ మహాకాయ వందనం
వందనం ఏకదంతాయ వందనం  
వందనమని నిను మ్రొక్కెద మెల్లని చూపుల దయకనగా
వందనమని నిను వేడెద నవిఘ్నమస్తని ధూర్జటినందనా

వందనం వందనం శూర్పకర్ణం దేవం వందనం
వందనం పాశాంకుశ ధరం దేవం వందనం
వందనమని నిను ప్రార్ధింతును ఆసరసవిద్యలనొసగమనీ
వందనమని నిను పూజింతును సద్బుద్దినివ్వమనీ

వందనం వందనం పార్వతీ నందనాయ  వందనం
వందనం శంకరప్రియనందనాయ వందనం
వందనమని నీకిత్తును ధూపదీపనైవేద్యం
వందనమని నీకిత్తును ధవళహారతులూ

వందనం వందనం మూషిక వాహనా వందనం
వందనం కోటిసూర్య ప్రభాయ వందనం
వందనమని నిను కొలిచెద పత్ర ఫల పుష్పాలతో
వందనమని నిను కొలిచెద దూర్వారయుగ్మపూజలతో

వందనం వందనం శ్రీ మహాగణపతిం వందనం
వందనం శ్రీ గణనాధాయ వందనం
వందనమని నిను వేడెద కష్టాలను బాపుమనీ
వందనమని నిను వేడెద శుభములనొసగమనీ

వందనం వందనం శ్రీ కాణిపాక నాయకా వందనం
వందనమని శరణంటిని కోటి ఆశలతో
వందనమని శరణంటిని శతకోటి ఆశయాలతో
వందనం జయకర శుభకర సర్వపరాత్పర  వందనం
వందనం సర్వవరప్రధాతకు  వందనం...
         ********అవేరా *********




sk101-43
* శీర్శిక: కూడిక *

నేను నేనను అహము నిన్ను నిన్నుగ నిలుపు
మేము మేమను ఇహము మనముగ నిలుపు
ఏక గరిక ఏ పాటి బలము
కూడితే గనుక గజము నిల్పగ నిజము
   ****అవేరా****


sk101-44

* శీర్శిక: వేదనలో లాలన *

మనసు మనసులో లేదు మనసున నినుతలచి
నీవు దూరమైనా నీ మది నాకు చేరువయ్యే
ఎడబాటు మనుషులకే కాని మనసులకు కాదహో
నిజము తెలియుము నిదే నిక్కుటముగా !!
      ********అవేరా*******





sk101-45

* శీర్షక: రక్తకన్నీరు *

మగడు చచ్చిన నేను మరియొక్కసారి
అరక దున్నితిని ఆశతోడ
విత్తు జల్లి నీరు పెట్టిజూడ
మొలకలొచ్చిన లేదు  పచ్చ జూడ
ఎరుపు రంగున నారు తిలక వర్ణమునుండె
సగటు రైతు రక్త కన్నీరు బోలి
    ******అవేరా*****

sk101-46
ఎయిడ్స్ డే సందర్భంగా
శీర్షిక:  ఎయిడ్స్

రోగములనాపేటి నిరోధక శక్తి
నీకిచ్చె ప్రకృతి నిజముగాను
ప్రకృతిని ప్రశ్నించె వికృత వైరస్సు ఒకటిబుట్టె
తిరుగు బోతుల తిక్క తిరిగి ఆలోచింప
జాగ్రతల నేర్పెను ప్రభుతలిచట
మందు మాకులేదు మాయదారి రోగమ్ము
మరణమొక్కటే మందుగాన
అంటి ఆగమకుకుట కన్న
అంటకుండుట జేయ
సచ్చీలతయే నీకు సరిబాట
  *******అవేరా******

sk101-47
*శీర్షిక: అమీరు--గరీబు *

ఆకలేసి ఒకడు
కడుపు కాలి ఒకడు
కేకలేసినాడు పుడమి పైన
వాడు గరీబు గాడు
పొట్టపగల ఒకడు
నట్టపొట్టనింపె నొకడు
పొట్ట పుట్టము నిండ
రోగ గ్రస్తమయ్యి పుండులుండ
కేకలేసినాడు పుడమిపైన
వాడు అమీరు గాడు
*******అవేరా *********

sk101-48
dt 2/12/2015
* శీర్షిక: ప్రియా!! *

గ్రీష్మం లో
ఈ హిమ వీచికలేమి?
నిను తాకిన మలయసమీరము
మంచు బిందువాయనా??

హేమంతంలో
ఈ ఉష్ణతాపమేమి ??
నినుతాకిన మంచుబిందువు
ఆవిరై నీలిమబ్బును చేరెనా??

ప్రియా! నీ ముందు
ఏ ఋతు ప్రభావమైనా శూన్యము..!
        *******అవేరా*******

సహస్రకవి 101-49

3-12-2015 ప్రపంచవికలాంగుల సంక్షేమదినోత్సవం

* శీర్షిక: దృక్పధ వైకల్యం *

మిత్రమా!
వైకల్యజీవివి కావు నీవు
వైఫల్యం అంతకన్నా కాదునీది
కళ్ళు లేవని కలత చెందకు
నా కళ్ళతో  కళ్ళుండీ  కబోదియైన ఈ లోకాన్ని చూడు
చేయిలేదని చింత చెందకు
నా చేయూత ఉంటుంది నీ చెంతన
కాలు లేదని నీవు బాధ పడకు
కాలంతో  నీవు పరుగులెట్టు
చెవులు లేవన్న వ్యధ నీకేల
చెవులుండీ వ్యధల ఘోష వినలేకున్నా !
నోరు లేదని నీరసం నీకెందుకయ్యా
అరచి అసత్యాలు పలుకని అదృష్టం నీదయ్యా!
ఆసక్తి ఉంది నీలో
అర్హత ఉంది నీలో
చేవ ఉంది నీలో
చేష్ట ఉంది నీలో
వైకల్యం నీకు సమస్య కాదు
సాఫల్యం నీ పాదక్రాంత
నిన్ను చూసి అయ్యో అనే
సమాజం ప్రభుత్వాల దృక్పధ వైకల్యం
పేదవారి కోసం
దళితుల కోసం
మైనారిటీలకోసం
పోరడే ప్రజాసంఘాలకు
స్వచ్చంద సంస్ధలకు
పాటు పడే ప్రభుత్వాలకు
కనపడవు మీ కన్నీటి చారికలు
వినపడవు మీ ఆకలి కేకలు
తెలియగ లేరు సామాజిక సంక్షోభం
చేయగ లేరు సమ్మిళితాభివృద్ధి
       *******అవేరా********








sk101-50
*శీర్షిక: గంగమ్మ*

ఆడ
ఈడ
యాడ
వెతికినా
కానరాదె
నీ జాడ
మనుజ లోకమ్ము వీడి
కైలాసమునకేగి
పతి సిగన
చలికాగుచుంటివా
చలికాలమైనా
చల్లగాలులు  లేవిట
అన్నదాతల కాష్టాలు భోగిమంటై...
   ****అవేరా****

సహస్రకవి 101-51
3/12/2015
* శీర్షిక: ప్రకృతి ప్రకోపమా!*

ప్రకృతి ప్రకోపమా?
వరుణుడి కోపమా ?
పారిస్ సదస్సుకు
పర్యావరణ హెచ్చరికా?
కుండపోత వర్షం తో
కుదేలైన చెన్నపట్నం
కుదురు లేక
పెచ్చరిల్లె గ్రీన్ హౌస్ వాయువులు
పెరిగెను భూతాపము
విరిగెను ప్రకృతి నడుము
ఫలియించని చర్చలతో
దశాబ్దాలు దొర్లాయి
పెరిగిన ఉష్ణోగ్రతతో
మంచు ఫలకాలు ద్రవమై దొర్లాయి
కర్బన ఉద్గారాలతో అభివృద్దికి సోపానం
మానవ మనుగడనే చేస్తాయి భూస్ధాపనం
కళ్ళు తెరిచి ప్రభుతలన్ని
చర్యలు చేపట్టాలి
పారిస్ పర్యావరణ సదస్సు సాక్షిగా...
            ******అవేరా******




 
సహస్రకవి101-52
3/12/2005

* శీర్షిక: మరణం*

పుట్టిన ప్రతి ప్రాణి గీట్టక తప్పదు
జీవితకాలాలే తేడా
పుట్టిన ప్రతిచెట్టూ
పుష్పిస్తుంది ఫలిస్తుంది
ప్రతిఫలాపేక్ష లేేకుండా
మానవునకందిస్తుంది
ప్రకృతితో మమైకమై
పర్యావరణాన్ని వాతావరణాన్నికాపాడి
ధన్యతనొంది కాలం చేస్తాయి
సర్వోత్తమ మనిషి జన్మ పొంది
స్వార్ధంతో పరోపకారము మరచి
జీవజంతు ప్రేమ మరచి
చెట్టు నరికి పుట్ట కూల్చి
చచ్చి శవమై చెరువు గట్టుకు చేరతాడు
చనిపోవడమే మరణంకాదు
ఏ పని చేయక పోవడమూ మరణమే
చేసే మంచిపనితో కాగలడు అమరుడే..
       *******అవేరా*******
సహస్రకవి101-53
3/12/2015 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా

* శీర్షిక:పోరాటం *

అమ్మా
ఆకలేస్తుందని అడుగలేనమ్మా !
నోరులేని లేగలా నేనున్నా
నా పేగు ఆకలి కేక నీకెలా వినిపించిందమ్మా !
అవిటినైనా అక్కున చేర్చుకుంటావు
అందరి లానే నన్ను చూస్తావు
మరెందుకమ్మా అందరూ నన్ను అవిటి అంటారు?
చదువులో ఆటలో ముందున్నా
అదోలా చూస్తారెందుకు?
ఆటపట్టిస్తారెందుకు?
వేరుచేస్తారెందుకు?
గేలిచేస్తారెందుకు?
నీవిచ్చే ప్రేమను వాళ్ళెందుకివ్వరు?
నీవిచ్చే ధైర్యం వాళ్ళెందుకివ్వరు?
ఎవరేమన్నా
ఎవరేమనుకున్నా
నాకూ కలలున్నాయి
నాకూ ఆశలున్నాయి
నాకూ ఆశయాలున్నాయి
నీవిచ్చే ధైర్యంతో
సమాజ దృక్పద వైకల్యాన్ని జయిస్తాను
నా కలలు ఆశలు ఆశయాలుా సాధిస్తాను...
               *****అవేరా******






సహస్రకవి101-54
* శీర్షిక:  గుండె చెరువు *

కాంక్రీటు జంగల్
మెట్రోపాలిటన్
చెరువైన చెన్నపట్నం
వరుణుడి కోపమో?
కర్బన ఉద్గారాల పాపమో ?
మనిషి సుఖజీవన వ్యమోహమో?
భారీ వర్షాలు భారమైనాయి
వరదలు వణికిస్తున్నాయి
గూడు చెదిరి  గుండె చెరువై
అన్నపానీయాల కోసం
అలో లక్ష్మణా  అంటూ
ఆదుకునే ఆపన్నహస్తం కోసం
కాలుకదపలేక
ఎటూకదలలేక
ఆహారంకోసం ఎదురు చూసే
గువ్వ పిల్లల్లాఎదురు చూస్తున్నాయి
చెరువైన చెన్నైలో
చెరువైన గుండెలెన్నో
త్రాగునీరు లేక
తడారిన గొంతుకలు
ఎడారిలో ఒయాసిస్సుల కోసం దీనంగా
ఎదురు చూస్తున్నవి
గొంతు తడిపే నీటి బొట్టుకోసం
కకావికలం జనజీవనం
ప్రభుత్వాల నిర్లక్ష్యం
ప్రజల స్వార్ధపరత్వం
మాయమైన చెరువులు
మాయమైన కాలువలు
ఆక్రమణలో నదులు
అడయార్ కూవం కశస్ధలి
పెరుగుతున్న విజ్ఞానం
తరుగుతున్న ఆచరణ
నీరు పల్లమెరుగు
నిజమే.......
మరి పల్లమెవరు ఎరుగు???
ప్రకృతి విలయం ప్రమాదమయితే
ప్రభుత్వాలది ఏమోదం??
మానవసేవే మాధవసేవంటూ
నాన్ ఉంగలోడు ఇరిక్కేన్ అంటూ
అందరం అందిద్దాం
అవసరానికి ఆపదలో
ఆపన్నహస్తం...!
  *******అవేరా*******










సహస్రకవి101-55
  7/12/2015
 * శీర్షిక: జండా--ఎజెండా *

వలసలు రాజకీయ రంగు మార్పిడులు
వలసలు ఊసరవెల్లుల విన్యాసాలు
నీతిమాలిన రాజకీయాలకు అద్దాలు
నిజాయితీని సమాధి చేసే నిశిక్రీడలు
ఒకరోజు త్రివర్ణం
ఒకరోజు కాషాయం
ఒకరోజు పసుపు
ఒకరోజు గులాబీ
ఒకరోజు ఎరుపు
ఒకరోజుపచ్చ
మరొక రోజు మరొక రంగు
ఒక్కొక్క రంగుకు
ఒక్కొక్క జండా
ఒక్కొక్క ఎజెండా వున్నా
ఒకే ఎజెండా తప్ప
ఏ ఎజెండా లేని వాళ్ళు ( వి) నాయకులు
ఆ ఒక్కటే పదవి ఎజెండా
ఒక జండాతో గెలుస్తారు
మరో జండా ధరిస్తారు
గెలవక ముందు నాయకుణ్ణి పొగుడుతారు
గెలిచాక కండువా మార్చి మరీ తెగుడుతారు
సిద్దాంతం  బద్దతకు ప్రమాణాలు చేసి
ఓటరు దేవుళ్ళంటూ ప్రణామాలు చేసి
జవాబు దారి లేని ప్రజా దేవుళ్ళీ (వి)నాయకులు
సిద్దాతం రాద్దాంతమైనపుడు
ప్రమాణాలను  ప్రణామాలనూ  తుంగలోతొక్కే
మారాజుల ఎన్నిక
కాదా ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం ??
(ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు)
          ********అవేరా*****
సహస్రకవి101-56
* శీర్షిక :అన్నదాత *

పురుగుమందుకు నేలకొరిగిరి ఒకరు
కరంటుతీగకు బలి అయ్యి ఒకరు
రైలుకు ఎదురెల్లి ఒకరు
ఉరికొయ్యకేళ్ళాడి ఒకరు
రైతుకాదని ఒకరు
రచ్చ చేయబూని ఒకరు
అన్నదాత అనాధఅయ్యెనా....అయ్యో......!
చావు లెక్కలు తేల్చక
బడ్జట్టు లెక్కలేస్తారు
సంబురాలు చేస్తారు
గిట్టు బాటు ధర అంటె
ముఖం చాటేస్తారు
ఖాళీ జేబూల్తో
కాలేకడుపుల్తో
కూలీదొరక్క
తన కడుపు నింపక
తనవాళ్ళ కడుపు నింపలేక
అభద్రతాభావంతో
అన్నదాత అసువులు బాసెనా...
అయ్యో అన్నదాతా !
మాకు అన్నం పెట్టే దిక్కెవరు?
దేశ ఆహారభద్రతకు దిక్కెవరు??
         *****అవేరా*****

సహస్రకవి101-57
* శీర్శిక: ప్రేమ *

 మాటలతోపుట్టి మాటలతోపెరిగి
మాట్లాడకుంటే పోయేదికాదు ప్రేమంటే
పోట్లాడుకుంటే పోయేది కాదు ప్రేమంటే
కంటి చూపుల్తో మాట్లాడు కోవటం కాదు ప్రేమంటే
సినిమాలకు "షి"కారు" ల కెల్లడం కాదు ప్రేమంటే
పబ్బుల నాట్యం కాదు ప్రేమంటే
ఆకర్షణలతో " అందు"కోవటం కాదు ప్రేమంటే
తిరస్కారానికి మరణశాసనం కాదు ప్రేమంటే
నమస్కారానికి ఆసిడ్ శాసనం కాదు ప్రేమంటే
ప్రేమించిన మనిషి సుఖాన్ని కోరేదే ప్రేమ
మనసులోపుట్టి మరణంవరకూ తోడు ఉండేదే ప్రేమ
         *******అవేరా*******



సహస్రకవి101-58
* శీర్షిక: సంస్కృతి *

సహనమే సంస్కృతి
ద్విసిద్దాంత సంస్కృతి
ఆదర్శవాద సిద్దాంతం
బౌతికవాద సిద్దాంతం
ఆదర్శవాద సిద్దాంతం
ఆర్య సంస్కృతి
వేదసంస్కృతి
బౌతికవాద సిద్దాంతం
బౌతిక పరిసరాలు అవసరాలు
జీవితానుభవ సిద్దాంతాల
విశ్వాస భావాల సంస్కృతి
"సమ్యక్ కృతి సంస్కృతి"
అంటే చక్కగా తీర్చిదిద్దినది
సంస్కరించునది సంస్కృతి
నాగరికత పరంగా
ఆచారవ్యవహారాలు
సంప్రదాయాలు
కట్టు బొట్టూ
కళలు
సాహిత్యం
జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి
సంపూర్ణవికాస చిత్రం సంస్కృతి
సమదృష్టి సమ దృక్పధం  సంస్కృతి
జాతీయ మనస్తత్వం మేధోసంపత్తి
జాతీయ సంస్కృతి
ప్రజలు ఏసమాజానికి చెందినా
సమ్మిళిత సమ్మిశ్రిత సంస్కృతి జాతీయ సంస్కృతి
           *********అవేరా********

సహస్రకవి101-59
* శీర్షిక: ప్రకృతి విలయము కాదు మానవ హత్యలు *

పొలమున జలము నిండిన
నీటికి దారి చేయు
మురుగు కాల్వలో.... కర్షకుండు
జలము నిండిన మురుగున
పారనతొలగింతురు పూడిక
నిండుగ దిగువకు దిగగ నీరు
చెన్నపట్టణాన  మురుగు దిగగ
దారి వెతుకుచు గంగమ్మ
దారి గానక పట్టణమ్మున జొచ్చె
మురుగు కాలువల పూడిక
ముప్పది శాతమట
చెరువులన్ని ఆక్రమణల వరములయ్యె
కాలువలందు కాలనీలు వెలసె
నదుల ఒడ్లు నడ్డివిరిగె
ప్రభుత చేతగాదు
చట్టమిచట లేదు
ఆక్రమణపూడికను
తొలగించె నాధుండెవ్వడు?
నాకే చేస్తారా "రాస్తారోకో" అని
ఆగ్రహాన గంగ జనహననమొందించె
ప్రళయ రాణి వోలె ప్రజ్వలించే
నిలుప ప్రాణము నిలిచె వైద్యాలయాలు
మందు మాకు లేక
విద్యుత్తు లేక
వెంటిలేటరు లేక
వెంటిలేషన్ లేక
కుళ్ళుతున్న శవాల
దుర్గంధ " భూతమై"
నిలిచినవి మిధ్యాలయాలై
చెన్నపట్టణము స్మశానము చేసినయట్టి
మానవాక్రమణలు శిక్షార్హమైన తప్పిదములే
ప్రకృతి విలయము కాదు
తరచి చూడ మానవ హత్యలివి
మరి నిలదీయగ లేడిచట "అపరిచితుండు"
        ******అవేరా *******

సహస్రకవి101-60
సహస్రకవుల రెండవ సంకలనం దీ 6/12/2015
విషయము : సరస్వతి

** శీర్షిక: సరస్వతి మాత **

ఓం జై సరస్వతి మాతా జైజై సరస్వతి మాతా
శరణాగతులను ఉద్దరించే మహిమాన్విత మాతా
                                            ఓం జై సరస్వతి.....
జ్ఞాన నేత్ర ప్రధాతా
మహాభాగ్యవిధాతా
నిను కొలిచే మనుజల సిరులిచ్చే మాతా
                                             ఓం జై సరస్వతిమాతా  ...
నీ దయ మించన  సిరి ఉందా
నావాక్కుననిలిచే దయవుందా
మనసా వాచా కొలిచేవారికి నీ దయ చూపు మాతా    
                                              ఓం జై సరస్వతిమాతా .....                                                                                                                                                               మనుజుల నేలే మహాదేవీ
మా వాక్కున నిలిచే వాగ్దేవీ
అంబ వాగీశ్వర మాతా ......
                                              ఓం జై సరస్వతిమాతా ......
సర్వ జ్ఞాన ప్రధాతా
సర్వ వేద విధాతా
నాలోసుస్వరమై నను గావుము మాతా
                                             ఓం జై సరస్వతి మాతా .....
ఓం నమో మహా మాయా
ఓం నమో  కమాలాసనా
నా మనసున నిలిచిన  మనోరంజని మాతా
                                             ఓం జై సరస్వతి మాతా  ....
భారతి నీవే అక్షరమై
నా జీవన రాగ సుస్వరమై
నా కవనంలో జీవమై నిలువుము మాతా
                                                       ఓం జై సరస్వతిమాతా ..
శాస్త్రరూపిణి మాతా త్రికాలజ్ఞమాతా
బ్రహ్మవిష్ణు శివాత్మికమాతా
భువనము నేలగ రావా  మాతా
                                                         ఓం జై సరస్వతి మాతా
కరుణను జూపవె కమలాక్షి
మూఢ మతులకు మతినిమ్ము
నిజనీరాజన మిదే  మాతా మము కరుణించుము మాతా
                                                        ఓం జై సరస్వతి మాతా
             ********అవేరా********

                                                       
సహస్రకవి101-61
 7/12/2015

* శీర్షిక: వలస పక్షులు *

కొన్ని వేలకిలో మీటర్ల ఆవల మా ఊరు
ఊరు వదలి దేశం వదలి ప్రకృతి ప్రేమలో
మైమరచి పోదామని వచ్చాము
వలస పక్షులం ఫ్లెమింగోలం మేము
ఇల్లూ వాకిలి లేని సంచార పక్షులం
ఆకాశం అంచును తాకగలం
మేఘాలను చుంబించగలం
శరదృతువులో మాకనుకూల వాతావరణంలో
పిక్నిక్ కని వచ్చాము సొంత గూడువదలి
అత్తగారింటికి వచ్చే పెళ్ళి కొడుకుల్లా
ప్రతీ ఏడు వస్తున్నాం ప్రకృతిలో పరవశించి వెళుతున్నాం
కానీ ఈ ఏడు ఆనంద ఉత్సాహలతో
ఇక్కడికి చేరుకున్న మాకు నిరాశే
ఆనాటి మెదక్ అడవుల పచ్చదనం ఏది??
వాగుల  వంకల ఎగిరి దూకే జలపాతములేవి?
మంజీరా వయ్యారాల వంపుల్లో
జలజల పారే జలసిరులేవి?
మంజీరా ప్రాజక్టు
ఆకలితో అలమటించే
పేదవాని ముఖము వలే
కళావిహీనమైనది జలములేక
ఋతుపవనాలు ముఖం చాటు చేసెనో ?
ఎల్నినో ప్రభావమో ?
గ్రీన్ హౌస్ వాయు ప్రభావమో ?
వర్షాలు లేక ఎండెను మా అభిమాన సరస్సు
కళకళలాడే పచ్చని
అడవి తల్లి వెలవెల బోయింది
నీరులేని సరస్సులో మాకాహారమేది .?
మాకు జలకాలాటల ఆనందమేది?
వేలలో వచ్చే మేము రేడియేషన్ మృత్యుపాశానికి
కొందరు బలి కాగా వందలలో మిగిలాము
ఎండిన సరస్సును జూచి
మరలిపోయారు సహచరులు కొందరు
నిరాశా నిస్పృహతో !
ఆందోలు చెరువులో నీరు తక్కువున్నా
తిప్పలు తప్పవనీ అక్కడ చేరాము
కరుణిస్తే ప్రకృతి వస్తాయి వానలని
ఆశతో కాలం వెళ్ళబోస్తున్నాం బిక్కు బిక్కంటూ
             *******అవేరా ********
సహస్రకవి101-62
 7/12/2015

* శీర్షిక: బుద్ద ఉవాచ *

తన్నుట తిట్టుట మాత్రమే కాదు హింస
మందలించుట మాత్రమే కాదు హింస
మనసు గాయపరిచే మాట కూడా హింసే

ఇష్టం పడేట్లు చెబితే
కష్టం లేకుండా గ్రహిస్తాడు
అదే"మనసెరిగి చెప్పటం"

మనషి పై మనిషి అధికారం
బానిస యజమానుల లక్షణం
అదిలించి చెప్పనేల
అనునయ భాషఉండగా
      *****అవేరా ****
సహస్రకవి101-63
* శీర్షిక: బాాల్యం *  

బాల్యమెక్కడమొదలయ్యెనో యాదిలేదు
బండెన్కబండి కట్టి రజాకార్లపై పోరాడిన పోరుగడ్డ
నల్లగొండ లో పోలీసులైన్ బడిల
నాల్గు పుస్తకాల్ మోస్క పోయిన
తర్గతి గదులున్నా సల్లని చెట్టుకింద చెప్పెటోల్లు పంతుల్లు
మా పంతుల్లు గిప్పట్లక్కగాదు
గోలచేస్తె తోడ్కదీసెటోల్లు
అసల్ అమ్మఅయ్యలు
పంతుల్తొపంచాయితికి స్కూల్ కొస్తె ఒట్టు
డిక్టేసన్ రాస్తి కాంపోసిషన్ బీ రాసినట్లు యాదికుంది
నెెలనెల వచ్చే చందమామ
బాలమిత్ర బొమ్మరిల్లు సదవటాన్కి
అమ్మ అక్క అన్నలిద్దరు తమ్మి
మస్తు కొట్లాడినమ్
నేనైతే
వడ్డాది పాపయ్య శాస్త్రి ముఖచిత్రం
మొదలు ప్రతిపేజి సదిగేది
గయ్యే మాకు పెద్దబాలచిచ్చ కన్న పెద్దబాలచిచ్చలైనయ్
కాలిదొరికిందంటే తమ్మి నేను
అమ్మ ఇచ్చిన పావలాతో
గోలీలు తెచ్చి మస్త్ గోలీలాడి
లాగుజేబునిండ గోలీల్ గెలిచిన
అక్కఅమ్మ తెల్లార్సరికి అన్నిగోలీల్
ఇంటెన్కబాయిపాల్జేస్తే మస్త్ఏడ్చిన
ఏడ్వకుబిడ్డా అని అమ్మ అయిదురూపాయలిత్తే
సిన్మాకు బోయిన కత్తిఫైట్ల కాంతారావు
ఎన్టివోడు నాగ్గోడు కిట్టిగోడు  శోబన్ బాబు సిన్మాల్ మస్త్ జూసిన
పండంటికాపురంల ఎస్వీఆర్ మస్త్ ఘోసపెట్టిండు
రమణారెడ్డి రేలంగి రాజబాబు పద్మనాభం
జోకులకు కడుపు పగల నగినా
గాడికెల్లి మా అయ్యకి తబాదలైతే
చౌటుప్పల్ జడ్పి స్కూల్లజేరిన
గాడ అరకిలోమీటర్ బోయి
ఈడ మూడుకిలోమీటర్ల నడకాయె
గిక్కడ గూడ గదే సీను
అందరు బెత్తంసార్లు
దెబ్బలుతిన్న ఎండలనిలబడ్డ గోడకుర్చీలు ఏసిన
టెన్నీకయిట్ వాలీబాల్ కబడీలు బీ ఆడిన
గీ సదువులకు ఆటలకు ఇస్కూల్ల కట్టిన ఫీజు ఐదు రూపాయలే
బడి పక్కన చెల్కల్ల రేగుపండ్లు తిన్న
ఇంటి దగ్గర పతంగులు వామనగుంటలు
అష్టచెమ్మ  అక్కతో తొక్కుడు బిల్ల దాగుడుమూతలు
ఆరుద్ర పురుగులతో ఆటలు తూనీగల వెంట పరుగులు
పండగలకు పిండివంటలు పంచుక తిన్నం
మామిడి పళ్ళు పిండుకు తిన్నం
అమ్మకు కళ్ళాపికి పేడ కూడ తెచ్చిచ్చినం
ఇంటిపక్క తంగడు కొమ్మ నా టూత్ బ్రష్
7 వ తరగతి అని భయపెట్టిన్రు అవలీలగ రాసినా
డెబ్బయి పైన వచ్చి నయ్ మార్కులు
గాడ్కెల్లి మల్లీతబాదల సికింద్రబాద్ కి
సెంట్ థామస్ ఇస్కూల్
స్కూల్ల మా సైన్స్ టీచర్లు హిందీ సార్
పెద్ద గ్రౌండ్ తప్ప ఏంనచ్చలే
కొత్తదోస్తులు కొత్త ఆటలు
గోలీలు బేస్ బాల్ ఫుట్ బాల్ కిరికిట్
ఏడాదిలనే స్కూల్ టీంల తీస్కున్నర్
ఒకటే మ్యాచ్ ఆడి టాప్ స్కోర్ తో స్కూల్ టాప్ లేపిన
గిదీ బాల్యం అంటే
కిలోల్ కిలోల్ పుస్తకాలు మొయ్యలే
కిలోల్ కిలోల్ సదువు మేసిన
వేలకు వేల్ పైసల్ కట్టలే
వందల లోపు ఫీజుల్ కట్టినా
ఏడ్చిన నవ్విన ఆడిన పాడిన
ఎదిగినా  బుద్దిలో......
.....ఆ తలపులే ఆనంద ఆర్నవాలు
గిలిగింతల సుమ తలంబ్రాలు !
         *****అవేరా****
సహస్రకవి101-64

* శీర్షిక:మేమేం పాపం చేశాం *

విధాతా!
మేమేం పాపం చేశాం మూగజీవులగా పుట్టించావు?
ఆకలేస్తే అర్థంకాని భాషలో అరవటం తప్ప ఏం చేయగలం
దాహమేసినా అదే భాషమాది
వానల్లేక పచ్చిమేత కంటిచూపుకానక పాయే
రైతుకు పంటలేక అసువులు బాసుతుండె
మరి ఎండు గడ్డి ఎక్కడిది
నీరు లేక బీడువారింది అదిలాబాదు
పాలమూరులో దుర్బిక్షంతో గడ్డికరువు
మెతుకుసీమ మెదక్ లో క్షామం కరాళ నాట్యం
గుప్పెడు గడ్డి కరవైన నిజామాబాదు
ఓరుగల్లులో కరువు కాటకం
ఖమ్మం లో కరువైన పశుగ్రాసం
నల్లగొండలో తీరని పశువుల ఆకలి
రంగారెడ్డిలో గండమైన పశుపోషణ
కరీంనగర్లో కనుమరుగైన పశుగ్రాసం
ఆకలితో అల్లాడుతున్న మూగ జీవాలం
మనుషుల్లా రోడ్లెక్కి రాస్తా రోకో చెయ్యలేము
నీరసించటం తప్ప నినాదాలివ్వలేము
పోరాటం చెయ్యలేము
మా కడుపు నింపలేని అన్నదాత
మా తల రాతను ఏకబేలాకో రాస్తాడు
కడుపులు కాలే మేము మీ
కడుపులు నింప కళ్యాణి బిర్యానీలవుతాం
కళ్యాణాల్లో ఢంకాలమవుతం
కాళ్ళకి చెప్పులమవుతాం
విధాతా! మేమేంపాపం చేశాం ??
        ******అవేరా*****

సహస్రకవి101-65
** శీర్షిక: తల్లిదండ్రులు **

తండ్రి కోపం తల్లి ప్రేమ
లక్ష్మన రేఖలు కారాదు
పిల్లలతో లాలనతో
కబుర్ల కాలక్షేపం
రోజువారీ చర్చల్లో
సాధక బాధకాలు
జయాపజయాలు
సంస్కార కుసంస్కారాలు
భాధ్యత గలపౌరునిగా
వికసించే భవిష్యత్తుకు సోపానాలు
ఆలు మగలు
పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలి
పిల్లముందు ఒకరినొకరు
దూషణ కు దిగరాదు
ఇద్దరిపై పూజ్యభావం
కలిగిచాలి శిక్షణతో
బాల్యం బంగారు భవితకు పునాది
పనులు నేర్పాలి ఓర్పుగా
బరువు భాధ్యత విలువల వలువలు తొడగాలి
వ్యక్తిత్వ నిర్మాణ విలువలు తెలపాలి
సంస్కృతి ఆచార వ్యవహారాలు
ఆచరణలో నేర్పాలి
సమాజ సంఘ జీవన ఔన్నత్య విలువలు నేర్పాలి
అందమైన ఊహా ప్రపంచాన్ని
భవిష్యత్తుని కలగనమనాలి
నచ్చినవి నచ్చనివి అన్ని విషయాలు
నేర్పుతో ఓర్పుతో నేర్పాలి
స్త్రీలను గౌరవించటం
మంచి స్నేహం బాలురకు
బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి
అతిగారం అతి దండనం
విపరీత పోకడలకు అసహనానికి ఇంధనాలు
తల్లి దండ్రుల అనునయ సమన్వయాలే రక్షణ కవచాలు
క్రమశిక్షణ లోపంతో నిండుతున్న
కౌన్సిలింగ్ కేంద్రాలు
తల్లిదండ్రుల ఉద్యోగ వత్తిడి
 సమన్వయ లోపం
పిల్లలకు అనురాగ ఆప్యాయతల లోటు
పిల్లల పట్ల లింగవివక్ష కూడదు
సెల్ ఫోన్ల వినియోగం
అంతర్జాల అప్రమత్త నేర్పాలి
బాలల బంగారు బాల్యానికి  భవితకు
అమ్మానాన్నలే పూల బాట వెయ్యాలి
పిల్లల భవిష్య నిర్మాణంలో నిత్యకార్మికులు
ప్రేమ అనురాగం ఆప్యాయతలే ఇటుకలుగా
విద్యవిజ్ఞానాలే సిమెంటుగా
బంగారు భవిష్యత్ భవన నిర్మాణంలో
నిత్య శ్రామికులు నిత్య కార్మికులు
కూలి ప్రతిఫలాపేక్ష లేని త్యాగధనులు

        ******అవేరా*******
సహస్రకవి101-66
* శీర్షిక: అమ్మ-నాన్న *

నాన్నా!
నా చిరునవ్వులు చూసి మురిసావు
యెదపై ఆడించావు ఎత్తుకుని లాలించావు
నాకు  చేయూతనిచ్చావు
తొలి అడుగులు వేయించావు
నీ కష్టాన్ని గుండెలో దాచుకొని
నా కోరికలన్నీ తీర్చావు
నీ సంపాదన నీకోసం కాకుండా
మాకోసమే నన్నావు
బతకటానికి తినాలి
తినటానికి బతకొద్దన్నావు
నాకు తోడు ఆసరా ధైర్యం నువ్వే నాన్నా
నాగెలుపును నీ విజయంగా చెప్పుకుంటావు గర్వంగా
నా ఓటమిలో నేనున్నానని భుజంతట్టి ధైర్యాన్నిస్తావు
విద్య బుద్దులు నేర్పించావు
నా గెలుపుకి పూల  బాటను పరిచావు
అమ్మా !
సృష్టికి మూలపుటమ్మవు నీవు
నవమాసాలు బరువనుకోకుండా మోసావు
రక్తమాంసాలతో రూపమిచ్చావు
నీ ఊపిరి సాక్షిగ నాలో ఊపిరిలూదావు
కన్ను తెరవలేదు  కనలేదు లోకం
నీ వెచ్చని స్పర్షే నాకు ఇంద్రలోకం
పురిటికందుగ నన్నుహత్తుకున్న
నీ గుండియల స్పర్శ
సృష్టిలో మరేప్రాణికీ
దొరకని ఆత్మీయ స్పర్శ
లాలి పాడి జోలపాడి
కమ్మనైన చనుబాలు త్రాపి
అందు ప్రేమానురాగాలు మేళవించి
సుఖనిద్రనిచ్చావు
నే బాధ కలిగి "అమ్మా"అంటే
చెమర్చునమ్మా నీ కళ్ళు
ఆ కన్నీటిలో దాగున్న అనురాగ
బంధం ఎవరికి తెలియదు
నీచేతిచలువన నీ కంటివెలుగయ్యాను
భువికి దేవుడిచ్చిన పెన్నిధి నీవు
నీవు పంచిన ప్రేమ సుమాలు
నా బ్రతుకును పూలబాట చేశాయి
నా కంట నీరు నిండినప్పుడు
నీ గుండె చెరువయ్యేనా
అనురాగానికి అద్దం నువ్వు
మమతకు భూదేవి సమమవ్వు
ప్రేమకు ఆకాశం నువ్వు
తొలి నమ్మకం నీవే
తొలి ప్రేమ నీదే
తొలిగురువు నీవే
తొలి స్నేహం నీదే
తొలి విమర్షనీదే
అందుకే అమ్మా నువ్వు "అమ్మ"వు!!
          *****అవేరా*****
సహస్రకవి101-67
 10/12/2015
* శీర్షిక: అమ్మ *

సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమంటారే
సృష్టికి మూలం అమ్మంటారే
అమ్మ దేవతా స్వరూపమంటారే
మమకార మూర్తి అంటారే
అనురాగ దేవతంటారే
త్యాగానికి ప్రతిరూపమంటారే
లాల పాడి జోలపాడి
గుండెల్లో దాచుకుంటుందంటారే
మరి "ఆ" అమ్మతనాన్ని అబద్దం చేశావెందుకు అమ్మా ?

ఈచెత్తకుప్పను పరుపుగా చేసావెందుకు ?
నీడలేని ఆకాశం కిందికి చేర్చావెందుకు ?
చుక్కలను లెక్కించమనా?
చల్లని మంచుకు వర్షానికి బలి చేశావెందుకు ?
దుర్గంధంలో దొర్లించావెందుకు ?
క్రిమి కీటకాలకు కుక్కలకు ఆహారంగా వేశావెందుకు ?
ఆడ పిల్లగా పుట్టినందుకింత శిక్షా ?
మానవతనూ అమ్మతనాన్నీ హత్య చేస్తావా?
నీవూ ఆడపిల్లగా పుట్టావన్నది మరిచావా అమ్మా??
             ******అవేరా********
సహస్రకవి101-68అనుసూరివేంకటేశ్వరరావు
11/12/2015

* శీర్షిక: జననం *

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం ....
జాతస్య హి ధ్రువోమృత్యర్థృవం జన్మమృతస్యచ
తస్మాదపరిహార్యేర్థే నత్వం శోబితు దుర్హసి ....
ఆదిశంకరుడు చెప్పినా
కృష్ణభగవానుడు చెప్పినా
పుట్టుక చావులు బ్రమణ చక్రాలు
మరణానంతరం మళ్ళీ
తల్లి కడుపున శయనం ...
శయనం తధ్యం పాడెన మళ్ళీ
త్యజించ ఖాయం జర్జర దేహం

ఐన్ స్టీన్ శక్తి సిద్ధాంతం(  E:::mc2 )
సృష్టికి శిరో దార్యం
శక్తి పుట్టుక నాశనము మిధ్య
జనన మరణాలు పరస్పర సయోద్య
నిరంతర విశ్వాంతర ప్రక్రియ

పదార్థ ఉద్భవం
అణు పరమాణు సంభవం
విశ్వచైతన్యశక్తే కారణం
అణుపరమాణు నిర్మితం
జీవులు సమస్తం
కాలుడి కదలికతో లయమై
జనన మరణ బ్రమణ చక్రమై
నిరంతర నియమ బద్దమై
శూన్యంలో తిరుగాడే జీవమై
విశ్వశక్తి నియంత్రణలో
శూన్యంలో ప్రాణశక్తిగ
ఈదులాడుతుంటాయి

వేదప్రవచితానుసారం సమస్తజీవులు
అరువది  నాలుగు వేలకోట్ల
యోనులంజీవ మరణాలు సంభవం
జీవమన్న జీవులన్న సమస్త ప్రాణికోటికనునయం

అండము పిండమై
స్తూల శరీర నిర్మాణమై
సూక్ష్మ శరీరము చైతన్యమై
తనువు ఆత్మల సంగమంతో
ప్రాణము జనియించి జననమవ్వు
జ్ఞానేంద్రియ జ్ఞానం సూక్ష్మ శరీరం
పంచభూతాంశ పరమాణు నిర్మితం స్తూల శరీరం
సూక్ష్మశరీరం విశ్వ చైతన్య శక్తియుక్తం
రూపరహితం
దేహం జర్జరమై మరణం తధ్యమైనపుడు
స్తూల శరీరాన్ని త్యజించి
సూక్ష్మశరీరం విశ్వచైతన్య శక్తిలో లీనమౌను
మరో తనువును వెతుకుతూ
కరిమబ్బులు తాకుతూ
ఆకాశంలో తేలియాడుతూ
కృష్ణ బిలాలు దాటుతూ
నక్షత్రలోకాన విహరిస్తూ
అనంత విశ్వంలో ఆత్మప్రయాణం
శూన్యంలోంచి సుదూర గ్రహాలు విశ్వాలు దాటి
మరో తనువుతో సంగమం ....
మరో జననం .....

జననం మరణం
మానవులకే కాదు
సమస్త వేలకోట్ల జీవులకు
బ్రమణ చక్రం సృష్టి క్రమం
సకల చరాచర సృష్టి  స్థితి  లయ లందు
ఆది జననము అంత్యము   మరణము  
           *****అవేరా*****








సహస్రకవి101-69
హైదరాబాదు 13/12/2015 ఇందిరాపార్క్ లో బాసరస్థలవేదికపై
సహస్రకవుల విజయం కవిసమ్మేళన సందర్భంగా

* శీర్షిక: విజయం *

ఈవిజయం మన విజయం
సహస్రకవుల విజయం
ఆనాటి జిలుగు వెలుగు
అష్టదిగ్గజముల తెలుగు
రాయల నేతృత్వంలో
రాచరికపు గొడుగు క్రింద
రాచఠీవి తేటతెలుగు
ఆనాటి విజయం భువన విజయం
రవీంద్రుని నేతృత్వంలో
ప్రకృతి వొడిలో
సేదతీరు తెలుగుకవిత నేడు
దిగ్గజకవులు సహస్రకవుల కవితామాలికలు
నవవసంత కోయిల పాటలు
స్వచ్ఛ సమాజానికి నిత్య దిక్సూచికలు
ఈనాటి సహస్రకవుల విజయం
సమాజ విజయానికి ఢంకానాదం
సమాజ రుగ్మతలకు సింహనాదం
విజయిాభవ సహస్రకవులారా
దిగ్విజయిాభవ సహస్రకవివిజయం !!
          *****అవేరా*****
సహస్రకవి101-70
11/12/2015

* శీర్షిక: కమత విలాపం *

బిడ్డా!
ఏ పొద్దాయె నీ ముఖం జూచి
ఎన్ని పొద్దులు పోయె
నీ పొద్దు పొడవక పోయె
ఎద్దులొచ్చినా అరక లేదు
అరక తొక్క నువు లేవు
గట్టు మీద వేపచెట్టు
అడిగింది నీజాడ
చెట్టు మీద కోయిలమ్మ
కూసింది నీ కోసం
జామ చెట్టుపైన జంటపావురాళ్ళు నూకల్లేక
చూశాయి నీకోసం
మట్టిలోన వానపాము ఆకలేసి
చూసింది నీ కోసం
ఎండిన పత్తి చేను తల వాల్చి
వేచింది నీకోసం
మిర్చి చేలో ఆకుచాటున ఆకుపురుగు
నిక్కినిక్కి చూసింది నీకోసం
వానచినుకు లేక
దాహంతో నోరెండి
ఒక్కతడైనా పెడతావని
ఎదరు చూస్తూ వున్నా నీ కోసం
కళ్ళు కాయలు కాచె
గుండె బీటలు వాసె
గాలినడిగా
ఎండనడిగా
వెన్నెలనడిగా
చెట్టునడిగా
పుట్టనడిగా
నీ జాడ తెలియదాయె
ఎన్ని పొద్దులు పోయినా
నీ పొద్దు పొడవక పోయె......!!
      ****అవేరా ****


సహస్రకవి101 -71
14/12/2015
ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో బయల్పడిన బౌద్దారామం సందర్బంగా

* శీర్షిక:  బౌద్ధం *

చిత్రాడలో సిత్రాలు
బౌద్ధమత చిహ్నాలు
బౌద్దం హీనయానమహా యాన సంహితం
వజ్రయానం పూజితం
బుద్ద పాద పద్మం
పాదాలమ్మగా విరాజితం
గొల్లప్రోలు మల్లవరం
పిఠాపురం చిత్రాడ
విలసిల్లెను బౌద్దారామాలై
విష్ణుకుండినులు ఇక్ష్వాకుల
రాజధాని పిఠాపురం
బౌద్ధారామాలకు నిలయం
చరిత్ర నిలిచిన బోది వృక్షం
       ****అవేరా****
సహస్రకవి101-72
 16/12/2015

* శీర్షిక: జలగలు *

కూటి కోసం ఒకరు
కూలీ దొరకక ఒకరు
కూతురి పెళ్ళికి ఒకరు
వ్యాపారానికి ఒకరు
సమాజ కాసారంలో
జలగలనాశ్రయించారు అప్పు కోసం
హద్ధులు లేని ఆశ అత్యాశై
"కాల్ మనీ'"పేరుతో
అత్యధిక వడ్డీకి అప్పులిచ్చాయి
ఋణ గ్రహీతల రక్తమాంసాలను
పీల్చి పిప్పి చేస్తున్నాయి
ఈ జలగల ఆగడాలను ఆపమని
రక్షకులకు పెట్టుకున్న అర్జీలు భక్షణతో
నీరుగారిపోయాయి
ప్రజా ప్రతినిధులే ప్రజా భక్షకులయ్యారు
"కాల్"నాగులయ్యారు
"కాల్" కేయులయ్యారు
వడ్డీ చెల్లింపులకు
నడ్డి విరుస్తున్నారు
పేదలు,
మద్యతరగతి వారు,
మహిళలు
తాళలేక తనువులు చాలిస్తున్నారు
తనువులు అర్పిస్తున్నారు....?
మహిళలే తోటిమహిళలను వేధిస్తున్నారు
" వంటి" తో వ్యాపారం చేయమని
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు
బతుకు భారమై
చావలేక బ్రతకలేక
ఆదుకునే దిక్కులేక
వారికి.....
మీడియానే దిక్కయింది
మీడియా శంఖనాదానికి
చెవులు దులుపుకుని
బద్దకంతో కుంభకర్ణ నిద్ర వీడింది ప్రభుత
విసిరే వలలకు చిక్కక
జారిపోతున్నాయి
జలగలు సుదూర తీరాలకు
కొత్త " ఆహారం" అన్వేషణలో......!!!
          ******అవేరా****

సహస్రకవి101-73
 16/12/2015

* శీర్షిక: హద్దు *

అనుకరణ అందమే
అందం కోసం అనుకరణ
ఆనంద దర్పం కోసం అనుసరణ
పాశ్చాత్యులు భారత సంప్రదాయాలత్యుత్తమం అంటుంటే
మనం వారి సంస్కార సంప్రదాయాలను అనుకరిస్తున్నాం
డ్రగ్గుల పబ్బుల సంస్కృతి
నేటి యువత భవితకు టోర్నడోలు
కొత్తొక వింత పాతొక రోత
పొరుగింటి పుల్ల కూర రుచి కాదా?
పరికిణీలు పోయి పంజాబీ లొచ్చాయి
కురచగౌనులయ్యె మెండుగా మిడ్డీలు
జీను ప్యాంటులలో టైటు ఫిట్టింగులు
గాగ్రా చోళీలలో జలతారు తెరగలు
లోనెక్కులలో లక్షల్లొ నెక్ లేసులు
అచ్ఛాదన లేని ఆరబోసిన ఆభరణం
చైను దొంగలకు అరుదైన విందు
అచ్చాదనల్లో వెలగలేదా ఆనాటి అందాలు
రాణులై రమణులై
నగ్నత్వ నగిషీల్లో రాణించునా అందం
అందమనిన నడత వినమ్రత  వ్యవహార భాషణం కాదా
హుందాతనమును వీడకు
నగ్నత్వంతో నడయాడకు
పాశ్చాత్య సంస్కృతికి హద్దులు దిద్దుకో
భారతీయత బహుబాగని చాటుకో
యువతకు "మన"సంస్కృతి నేర్పి
మహిళను "మాత"గా మార్చుకో !!
         ****అవేరా****

సహస్రకవి101-73
 16/12/2015

* శీర్షిక: హద్దు *

అనుకరణ అందమే
అందం కోసం అనుకరణ
ఆనంద దర్పం కోసం అనుసరణ
పాశ్చాత్యులు భారత సంప్రదాయాలత్యుత్తమం అంటుంటే
మనం వారి సంస్కార సంప్రదాయాలను అనుకరిస్తున్నాం
డ్రగ్గుల పబ్బుల సంస్కృతి
నేటి యువత భవితకు టోర్నడోలు
కొత్తొక వింత పాతొక రోత
పొరుగింటి పుల్ల కూర రుచి కాదా?
పరికిణీలు పోయి పంజాబీ లొచ్చాయి
కురచగౌనులయ్యె మెండుగా మిడ్డీలు
జీను ప్యాంటులలో టైటు ఫిట్టింగులు
గాగ్రా చోళీలలో జలతారు తెరగలు
లోనెక్కులలో లక్షల్లొ నెక్ లేసులు
అచ్ఛాదన లేని ఆరబోసిన ఆభరణం
చైను దొంగలకు అరుదైన విందు
అచ్చాదనల్లో వెలగలేదా ఆనాటి అందాలు
రాణులై రమణులై
నగ్నత్వ నగిషీల్లో రాణించునా అందం
అందమనిన నడత వినమ్రత  వ్యవహార భాషణం కాదా
హుందాతనమును వీడకు
నగ్నత్వంతో నడయాడకు
పాశ్చాత్య సంస్కృతికి హద్దులు దిద్దుకో
భారతీయత బహుబాగని చాటుకో
యువతకు "మన"సంస్కృతి నేర్పి
మహిళను "మాత"గా మార్చుకో !!
         ****అవేరా****


సహస్రకవి101-74
  16/12/2015

* శీర్షిక : తెలుగు తేజము *

మాత  శారదాంబ
ముద్దుబిడ్డలార
ముదితలార
మత్తైదువలార
మంగళకరమగు
మీ కవితా నాదము
మీ హేతు వాదము
శ్రావ్య గానమై
దిగ్దిగంతముల
తెలుగు తేజమ్ము
జగమ్మున విరజిమ్ము
నయాగరా నయగారమ్ము వోలె
గాన కోకిల వోలె
శిరమున మానవ సేవను దాల్చిన
మాత థెరసా వోలె
ఆధ్యాత్మికాంశకుండు పరమహంసవోలె
రవీంద్రుని గీతాంజలి వోలె
అహింసాత్మకుండు మహాత్ముని వోలె......!!
         *******అవేరా *****
sk101-75
  17/12/2015
* శీర్షిక: అధ్యాపకులు *

బాల భారత  దిశా నిర్దేశకులు
భావి భారత నిర్మాతలు
నిత్య జ్ఞానప్రధాతలు
సత్య శోధకులు
నిత్య శ్రామికులు
విద్యార్థుల బంధువులు
వారి ఆశలు కలలను పండించ
వరాలిచ్చే దైవాలు
వారి భోధనలే ఉలి దెబ్బలు
అందమైన ఆకృతి శిల్పాలే
రేపటి భావి భారత పౌరులు
అక్షరాస్యతను అందల మెక్కించి
నిరక్షరాస్యతను సమాధి చేసే
సమసమాజ నిర్మాతలు
ఎవరు ఎవరికి ఎవరో?
ఎవరికి ఎవరు ఎవరు కాకున్నా
అంతా నా వాళ్ళే అనే
విశాల హృదయమున్న  బందువులు ..
.....ఆత్మ బందువులు....
********అవేరా ********...
sk101-76
 17/12/2015

* శీర్షిక: చెట్టు *

అందమైన పచ్చని చెట్టు
అభివృద్ధికి మొదటి మెట్టు
స్వర్గ సుఖాలకు నిచ్చెన మెట్టు
ప్రాణవాయువుకు ఆయువు పట్టు
వన్యమృగాల ఉనికే చెట్టు
పశుపక్ష్యాదుల కులుకే చెట్టు
అందుకే ప్రతి మనిషీ ! ఒక చెట్టు పెట్టు !
పర్యావరణాన్ని ఒడ్డున పెట్టు !
నీవే మరో కార్చిచ్చైతే నీ చితి నిశ్చయం పట్టు!

        ****అవేరా****
sk101-77
 18/12/2015

* శీర్శిక:  నీ ఆడంబరమే నీ మృత్యువు *

అప్పు అందల మెక్కిస్తుంది... ఆ క్షణం
నిప్పు లా కాలుస్తుంది ... మరుక్షణం
అందుకే అప్పు చేసి "పప్పు"కూడేల?
అప్పు లేని సప్ప కూడే మేలు
అప్పు చేసి తెల్ల ఏనుగు కొననేల ?
తప్పనట్లు నల్ల ముఖం వేయనేల??
అందని ద్రాక్షలకు అర్రులేల పులుపని సర్దుకో
అందమైన జీవితాన్ని దిద్దుకో
ఆ"డంభ"రాలు అందలం ఎక్కితే
అప్పులూ అంబరం ఎక్కుతాయి
తీర్చ లేక తిరుగుతావు బొంగరమై
తప్పవు తీర్చలేక తిప్పలు
తప్పుకు తిరుగుటె మేలని
తప్పుకు వేసుకుంటావు శిక్ష
అప్పు తీర్చ లేక చేస్తావు మరో అప్పు తప్పు
అదీ తీర్చలేక రాజుకుంటుంది అవమానాల నిప్పు
ఏ నాడూ ఆడంభరమాదుకోదు నిన్ను
ఆనాడే కానలేదు కన్ను
అత్యాశ అంటింది మిన్ను
చేయి దాటిన తప్పు
దహించే  నిప్పు
వత్తిడి తాళలేక
అవమానాన్నోపలేక
ఆత్మాహుతి అంటావు!
నీవు చేసిన తప్పుకు
కుటుంబాన్ని బలి చేస్తావు !
నీ ఆడంభరమే నీ శత్రువు!
నీ అత్యాశే నీ మృత్యువు !
     *****అవేరా ****

sk101-78
18/12/2015

* శీర్షిక: శ్రద్ధ-సబూరి *

రెండక్షరాల  దివ్య పథమిది
మూడక్షరాల పరమ పథమిది
రెండక్షరాల కోసం మూడక్షరాల తపమిది
ఓపిక లేక గురు సాక్షాత్కారము కల్ల
అను సత్యము తెలుపు అక్షరసత్యమిది
భావ సంఘర్షణలు అడ్డు కాదు సబూరి ఉంటే
తలచిననే గురువౌను
తలవకనే తండ్రౌను
పిలిచిన స్నేహితుడౌను
దీక్షలెందుకు నీకు
ఆత్మ సాక్షాత్కారముండగా అంటాడు
దీక్ష ససేమిరా అంటాడు
కంటి చూపులో ప్రేమ పంచుతాడు
భక్తుని గుండెలో నిండుతాడు
పలకరింపులో ప్రేమ దొరలుతుండు
పలవరింతలో భక్తులు తరలుతుండు
కరస్పర్షలోన అనునయింపు
కడదాకా భక్తుల అనుసరింపు
సాయి తత్వంలో ప్రేమ భౌతికం కాదు
అలౌకికమూ  కాదు
అనిర్వచన భావనా కాదు
ప్రోది చేస్తే పెరిగేది ప్రేమ
ప్రతి విషయంలో అన్వేషించు ప్రేమకై
కాలమానపరిస్థితులకతీతమై
హింసలోనూ ప్రేమించు
అహింస లోనూ ప్రేమించు
సబూరిలేక  సాధ్యం కాదు ప్రేమ
ప్రేమ లేక సాధ్యం కాదు ఆత్మ సాక్షాత్కారం
అదే "శ్రద్ధ-సబూరి" మహత్యం.....!!!
         *****అవేరా*****

sk101-79
 18/12/2015
K
* శీర్షిక:ఆధ్యాత్మిక గురువు*

మౌలిక తత్వమే బ్రహ్మ జ్ఞానం
బ్రహ్మ వ్యక్తి కాదు శుద్ధ చైతన్య శక్తి
దృష్టి కోణమార్పు
బ్రహ్మ జ్ఞానం నేర్పు
ఆలోచనలు నిర్మలం
ఇంద్రియాల నిగ్రహం
ఇహపర వైరాగ్యం
కర్మ ధ్యాన యోగం
ఆ పై భక్తితో తత్వజ్ఞాన ప్రాప్తి
ఆధ్యాత్మిక గురువంటే
బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు
బ్రహ్మ నిష్ఢుడు
తత్వ జ్ఞాని
శమ,దమ వైరాగ్య భూతుండు
శిశ్యులలో
రాగ ద్వేశాల మాయపొరలు తొలగించి
శమము దమము
వైరాగ్యమను ఔషధములు నింపి
విశ్వాసం
వినయం
ఓపికలే అష్టైశ్వర్యాలుగ
అలరారే శిష్యులకు
బ్రహ్మ జ్ఞానంతో ఆధ్యాత్మిక ఉన్నతి సంభవం
      * ***అవేరా ******









sk101-80
18/12/2015

శీర్షిక: సత్యం-అహింస

పంచ నియమాలలో
ఉత్తమం సత్యం-అహింస
అహింస ప్రతీ జీవిలో ఉంది
క్రూర జంతువులోనూ ఉంది
ఆకలేస్తేనే వేటాడుతుంది పులి
మనిషిలోనూ ఉంది నిద్రావస్తలో
వినోదం కోసం వేట
అడవిలో అటవీ జంతువుల వేట
హింసలో ఆట
కోడి పందాల ఆట
ప్రేమ కోసం హింస
ప్రేయసి ముద్దు మోము పై ఆసిడ్ దాడి
మృదువైన మెడపై వేటకత్తుల దాడి
దేశం కోసం హింస
మతం కోసం హింస
రాజ్యం కోసం హింస
రాజకీయ సీటు కోసం హింస
జిహ్వ కోసం జంతు హింస
ఖండిచిన వారికి రాజకీయ ముండనం
మేల్కొనాలి మనిషిలోని
మహా మనీషి జ్ఞానోదయమై .....

నిత్యము సత్యము పలుకగ
నిశ్చయము విజయము
అపజయమందిన అనుమానము నీ సత్యనిష్ఠ
ఉన్నది ఉన్నట్టు
మాటలో
బుద్ధిలో
ఉనికిలో
హృదయంలో
సంకల్పంలో
సత్యమై నిలువ
సత్యవాది రుజు చిత్తము
చైతన్యము సత్యవాది
అసత్యమాడితినని  సత్యము బలుక
సత్యమే నిత్య శక్తియై
అపజయాలు రావిక
అంతిమ విజయం నీదే...!
         *** అవేరా ****


sk101-81
21/12/2015

** శీర్షిక: వెండి వెన్నెల **

అల్లంత దూరాన ....
వెండి వెన్నెల జల్లులు కురిపిస్తూ నువ్వు
ఆడుకుంటున్నావు నక్షత్ర పువ్వుల మధ్య
తేలియాడే సముద్ర తెరగుల మబ్బులతో
దోబూచిలాడుతూ మబ్బు దొంతరల మధ్యలో ...
ఆకాశానికే అందం నువ్వు

వెండి వెన్నెల జల్లులలో చెలి సందియలలో
నేనిట మన్మధ విరితూపుల బాధితుడనై
కేళీ వినోదము లాడుచుంటిని
ప్రణయ క్రీడకు ప్రమోదము నీవు
అచ్చాదన లేని నగ్నఆకాశం క్రింద
హృదయ ప్రణయ వేదనలో
రాసక్రీడా ప్రాంగణములో
మొగలి పారిజాత సంపెంగల
మల్లెల పరిమళాల మత్తులో
పున్నమి రాతిరి మిన్నాగుల వలె
గెలుపోటముల ఆరాటంలో
ప్రకృతినాస్వాదిస్తూ సంగమిస్తూ
అతిశయానందం ఆర్నవమై
అంబరాన్ని తాకింది నీ దరి చేరింది !
    ***********అవేరా******
sk 101 -82
 22/12/2015
* శీర్శిక: కలం బలం*

పల్లవి:: కలమంటే కాదురా
           కత్తిపీట వేటకత్తి
           కలమంటే ఆధిశక్తి
            చైతన్య పరాశక్తి

చ1      నిత్య జీవితంలో
           స్వచ్ఛ అక్షరానికి
           అమ్మై నిలుస్తుంది
          గుమ్మంలో  నిలుస్తుంది .....కలమంటే
చ2     వేధింపుల రాజ్యంలో
           సాధించే కుట్రలలో
           జనజీవన గమనానికి
           కంటికి కాగడా అవుతుంది........కలమంటే
చ3     కత్తి పోటు కాదు మిన్న
           కలంపోటు కన్న
           రక్తం చిందుంచునది
           రుధిరం  పొంగించునిది ...........కలమంటే
చ4     అరుదైనది ఆడజన్మ
          అచ్చమైన స్వచ్చ అమ్మ
          గర్బంలో తుంచొద్దని
          పొత్తిళ్ళలో తెంచొద్దని   చెప్పే ..కలమంటే
చ5     సమాజ పీడల చెట్టును
           రుగ్మతల ఊడల చెట్టును
           పదునెక్కిన అక్షర కత్తులతో
           వేరు వేరు తెగనరికి
           ఊడ ఊడ పెకలించే ..........కలమంటే
               ******అవేరా*****
sk101-83
22/12/2015

* శీర్షిక : ప్రేమాగ్ని *

కలలో ఊహించని కమ్మని కలవైనావు
ప్రేమ మాధుర్యమును  తెలిపినావు
కలయోనిజమో తెలిసే లోగా
మాయమై నాలో  ప్రేమాగ్ని రగిల్చినావు
నీ పునరాగమనం లేక ఈ అగ్ని చల్లారదు
చితిమంటై దహించి వేస్తుంది
నాలో నీవు నీలో నేను
తనువులు వేరైనా ఆత్మలు ఒకటే
ప్రియతమా! అందించవా నీ ఆపన్న హస్తం !
తాళలేకున్నా ఈ ప్రేమాగ్ని తాపం..!!
     *****అవేరా*******


sk101-84
* శీర్షిక: కోయిల *

నీ తుపాకి గుండుకి వెరచి
దాగుంది గండు కోయిల
కొమ్మల చాటున రెమ్మల మాటున
శబ్దభేది విద్య నీకిష్టమైతే
శబ్దాన్నే వినసొంపు పాటగా
మలిచింది నీ కోసం
నీ తుపాకీ గుండు
తాకిన మరుక్షణం
ఆగిన గడియారపు చప్పుడులా
ఆగింది తన గుండె చప్పుడు
ఆగుతూ అడిగింది .......
నేను నీకేం అపకారం చేశాను?
కమ్మి నైన పాట తప్ప పలుకైనా రాని దాన్ని
అందమైన పాటలతో మీ హృదయాలను
రంజింప చేసినందుకా?
ప్రకృతిని పరవశింప చేసినందుకా
మీ ప్రకృతిని వృక్షాలను
నాశనం చేసే క్రిమి కీటకాలను తిన్నందుకా?
నా గొంతే వినిపించింది నీకు
నాతో ఊసులాడే ప్రకృతి గుస గుస విన్నావా ?
సీతాకోక చిలుక రెక్కల రెపరెప విన్నావా?
చెట్టు చెట్టు చెబుతుంది నాకు కృతజ్ఞత
మరి నీకెందుకింత కృతఘ్నత?
నీవెందుకు చేశావీ పాపం?
       *****అవేరా******
sk101-85
24-02-2010నాడు తెలుగు పీపుల్.కామ్ లో
ప్రచురించిన కవిత (హాస్యనటుడు పద్మనాభం గారి జ్ఞాపకార్థం)

*శీర్షిక: మహా నివాళి
  ఆనాడు... వెండి తెరపైన రంగుల్లేవు!
 కానీ ప్రేక్షక మనసుల్లో...
రంగుల పూలు పూయించిన మహా నటులున్నారు...
నవరసాల మేళవింపు ఆనాడు సినిమా..
ఆ రసాలకే.. రారాజు.. హాస్య రసం..
ఆ హాస్యానికే.. మహా లాస్యం... నీవు..
 రాజ్యం లేని రారాజువి..
నవ్వుల మహా సమ్రాట్టువి!
ఎవరు పూయిస్తారు నవ్వుల పువ్వులు మాలో?
ఎవరు ఓదారుస్తారు 'పెళ్ళి కాని తండ్రులను'?
నీ జాతకమేంటో తెలియకపోయినా...
'జాతకరత్న మిడతంభొట్లు'ని రాశావు!
నీవొక నవ్వుల పూతోట...
నీవొక మహా కళా మేరువు..
ఆహార్యం నీ ఆభరణం...
భాషణం నీ భూషణం...
ఏమని పొగడాలి...
ఏమని తలచాలి..
మా సినీ పూతోటలో ఒక మహావృక్షం కూలింది
అందుకోవయ్యా... హాస్య బ్రహ్మ!
బరువెక్కిన గుండెతో అర్పిస్తున్నా..
................. నా కన్నీటి వీడ్కోలు!
       *****అవేరా****

No comments:

Post a Comment