Tuesday, December 22, 2015

హిజ్రా

sk101-36
ది; 20/11/2015
* శీర్షిక: హిజ్రా*

సమాజం అనంతాకాశం అయితే
ఆకాశపు  చివరి అంచున జీవిస్తున్నాం
విశ్వాంతరాల్లో కృష్ణబిలం అంచున
హక్కుల  రెక్కలు విరిగిన పక్షులమై జీవిస్తున్నాం
హక్కులు అందరికీ ఉన్నాయి
అడవిలోని కలుపు మొక్కకైనా
వర్షపు నీటిపై హక్కుంటుంది
కలుపు మొక్కల పాటి కావా మా బ్రతుకులు
కులం..మతం..లింగ భేదాలు హక్కులకాధారమా ?
మా హక్కులు కృష్ణబిలంలోకి
మీ హక్కులు మీ ఇంటి ముంగిట్లోకా??

మా హక్కులు కాలరాసినప్పుడు
పోరాటమే మా ఆయుధం
పురుషుడు స్త్రీలై నందుకు
వివక్ష ... వేదన ....హేళన లతో
నిత్యజీవన పోరాటం మాది
అర్ధనారీశ్వరులకు పొర్లు దండాలు
మాకు అవమాన దండలా??

సహనం సంతోషాలు మా  సంస్కృతి
యాచక వ్యభిచారాలు కాదు మా వృత్తి
వంచన మోసాలు కాదు మా ప్రవృత్తి
మా దీవెనలు దేవతాంశయుక్తం
మేము లేక ఏశుభకార్యము లేదు
దైవ వరప్రసాదులం మేము
మంచిపనులు చేసే సామర్ధ్యం మాకూ ఉంది
మేమూ నాయకు(రాళ్ళ)లమవుతాం
మేమూ పాలకు(రాళ్ళ)ల మవుతాం

వసంతం వాకిట్లొ మావిచిగురు రుచి ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో కోయిల కూస్తుంది తీయగా
ఆ కోయిల రాగాన్ని మేమూ ఆస్వాదిస్తాం మీ లాగానే
కలలూ కోరికలూ మాలోనూ చిగురిస్తాయి నవవసంతంలా

స్పందన ప్రతిస్పందవలు మాలోను ఉన్నాయి
మాలోనూ రక్తమాంసాలున్నాయి
మాలోనూ కోపతాపాలున్నాయి
మాలోనూ సుఖదుఃఖాలున్నాయి
మాలోనూ బాధ సంతోషాలున్నాయి
మాలోనూ పంచేంద్రియాలున్నాయి
మరి మాకెందుకీ వివక్ష??

మాకు కావల్సింది మీ దయా దాక్షిణ్యాలు కావు
మా అస్తిత్వానికి గుర్తింపు
అన్ని హక్కులూ మాకు వర్తింపు
         ****అవేరా****

No comments:

Post a Comment