Tuesday, December 22, 2015

తొలిపొద్దు...మలిపొద్దు

SK101-15   ది 5/11/15

* శీర్షిక: తొలిపొద్దు...మలిపొద్దు *

ప్రభాత వేళ ........
తొలిపొద్దు పొడిచింది
చీకటిని వెలుగు రేఖలు తరుముతున్న వేళ
తూరుపు దిక్కున మంచు తెరలను చీల్చుకుంటూ
ఉదయ భానుడి ఉషోదయ కిరణం పలకరించినా
నీ ప్రేమ పలుకరింత లేకుండా తెల్లవారదు నాకు  

 నీ తీయని పిలుపుతో
కమ్మని కాఫీతో
వెచ్చని ముద్దుతో
నన్ను నిద్రలేపుతావు
పెరటి మామిడి చెట్టు పైనున్న కోయిల
కిటికీలోంచి తొంగి చూసి కుహూ..కుహూ అని
తీయనిగొంతుకతో తన ప్రియుడిని పిలిచింది
ఆ కోయిల పాటకు పరవశించే లోపే
దినచర్యకు కార్యోన్ముఖుడను చేసి పంపుతావు  

సాయం సంధ్య వేళ ........
మలి పొద్దు పొడిచింది  
వెలుగును చీకట్లు కబళించే వేళ
పడమర దిక్కున కొండలనడుమకు
ఎర్రబడిన సూరీడు  చల్లగా జారుకుంటున్నాడు
ఎర్రని  కిరణకాంతులు నల్లని కొండపై పగడపు కాంతులీనుచున్నవి
ఆ కాంతికి ఆకాశం ఎర్రసముద్రమైంది  
ఆకాశంలో.....
అలసి సొలసి ఇంటిదారి పట్టిన కపోతాలు
ఎర్రసముద్రంలో నావికావిన్యాసాలను తలపిస్తున్నాయ్

అలసిన ఒడలుతో బడలికతో
ఇంటికి చేరే నాకు
వెన్నెల నిండిన కన్నులతో  తలలో మల్లెలతో
గంధ సుగంధాలతో  దేవేరిలా ఎదురౌతావు
నల్లని కురుల మద్య నీ మోము
నల్లమబ్బులోంచి తొంగిచూసే చందమామలా ఉంది

నిన్ను  చూసిన క్షణం ...
నా అలసట ఆవిరైపోతుంది
నీ నల్లని కురులలో తురిమిన
తెల్లని మల్లెల మధుర సుగంధ పరిమళాలు
మదిని గిలిగింతలు  పెట్టే  మన్మధబాణాలవుతాయి  

ప్రేమానురాగాలు రంగరించిన గోరుముద్దలు  
నా హృదయ తంత్రులను మీటగా
అమ్మ ప్రేమను మరపించే అమృతభాండాలయ్యాయి  

పూలపానుపు    .... ఆపానుపు పై
పవళించిన మరో క్లియోపాత్రలా నువ్వు  
నా  స్పర్షకు అత్తిపత్తివౌతావు
నీ ముఖారవిందాన విరిసిన సిగ్గు దొంతరలు
కందిన నీ చెంపల కెంపులు చూసి
అతిశయమౌతుంది  నాలో ఆనందం అంబరానికెగసి
అందమైన మరో అనుభూతికి
సోపానమౌతుంది నీ  నులివెచ్చనిముద్దు
అందుకే
ప్రతి ఉదయం నాలో నూతన ఆశయాలు ఉదయిస్తాయి  
ప్రతి సాయం సంధ్య నాకు నూతన అనుభూతులను అందిస్తాయి  

***************అవేరా**********************

No comments:

Post a Comment