Tuesday, December 22, 2015

ఋతు రాగాలు


sk101-40
( ఒక స్త్రీ జీవితాన్ని ఋతు చక్రంతో పోల్చుతూ రాసిన కవిత
 వసంతంతో మొదలై శిశిరంతో ముగుస్తుంది )
*శీర్షిక : ఋతు రాగాలు*

నవవసంతంలో తరులతల చిగురింతల  క్రొత్త అందాలు
వసుధకు పచ్చ తోరణాలు తొడిగాయి
ఆడశిశువైై అమ్మ ఒడిలో ఒదిగాను
బాల్యంలో జ్ఞానమనే కొత్త చిగురులు తొడిగి
యవ్వనంలో అరవిచ్చిన లేలేత
క్రొంగొత్త అందాలు విరిసాయి
16ప్రాయంలోవికసించే కోరికలే  వీచేే  మలయ సమీరలై  అణువణువూ  తడిమి సాయంత్రపు సంధ్య వెలుగులు
నిండిన కలల కాసార   సాక్షిగా స్వర్ణ  వర్ణ  రంజితమై
ముగ్ధ సుకుమార సోయగ కుసుమాలపై
వ్రాలిన బ్రమరంలా అల్లరి చేస్తే
జలకాలాడుతూ చల్లని వెన్నెల  రేయి పరవశించే వేళ
సుముహూర్త కళ్యాణ వేళ
నవ వధువుగామంగళవాయిద్యాల నడుమ
ఏడడుగులు నడిిచాను వరుడి తోడ
పుట్టినిల్లు వదలి  మెట్టినింటికి

కాలం గ్రీష్మం లోకి నడిపించింది
యవ్వన మధువనిలో వన్నెచిన్నెల వికాసం
మండువేసవిలో పండువెన్నెలలో
విరిసిన సంపెంగ మల్లియల పరిమళ మలయ సమీరమై
కోయుల కుహూ కుహూ రాగాలు నా దరిచేరి
రతీమన్మదీయమై వీణియతంత్రిని తాకే అంగుళియై
నాలోని అణువణువూ మదిలో రాగాలను మీటుచున్నవి
అలసి వాలిన తనువు " ఆవిర" వుతున్నది
నాలోని  వీణాతంత్రులు  సుతిమెత్తని శ్రీరేడు అంగుళి
స్పర్ష కోసం నెలరేడు కోసం ఎదురు చూసే కలువల్లా
సంగమించే క్షణం
ప్రణవించే క్షణం
నను వయ్యారి వలపు తారను జేసి
జలతారు మేలిమబ్బు పరదాలు తీసి
నను చందమామను చేసి
సయ్యాటకు నను శృతి చేసి
నా హృదయ వీణఝమ్మనిపించే
ఆచిలిపి చూపుల రేడు నను చేరరాగా
చల్లని వెన్నల జల్లులు కురిసిన జాబిల్లి
మబ్బులతో దోబూచిలాడుతూ
సిగ్గుతో మబ్బును పరదా చేసుకుంది
నా సంసారమొక శృంగార నైషధమైనది
నవవసంత రాగమైనది ... గ్రీష్మ సరాగమైనది

గ్రీ ష్మం తరువాత ....
వర్షఋతువు రానే వచ్చింది
ఆకాశాన తేలియాడే మబ్బులు
చెలులకు మేఘ సందేశాలు మోస్తున్నవి
నల్ల మబ్బులు.. చల్లగాలులు...
చిరుజల్లులు ....చిరుతలై
గ్రీష్మతాపజింకను  తరుముతున్నవి
కడుపుపండి ముద్దులొలికే చిన్న కలల పంట
పాపాయి బోసినవ్వులు జల్లుల వానై
ఆనందపు వరదలు తెచ్చింది నాలో
మమతల ఊటలు నింపింది
నా మనస్సుకి  ఊరట నిచ్చింది  .....

నీ  వెనకే నేనున్నానంటూ
శరదృతువు చల్లని వెన్నెల తెచ్చింది
భర్త ప్రేమానురాగాలు  సరాగాలు
రాగ రంజితాలైనాయి
సంసార సాగరం పై కురిసే చల్లని వెన్నెల జల్లుల
కాంతులు తిమిరాంధకారాన్ని తరిమి వేసాయి
అందరి మనస్సులలో కార్తీక దీపాలు వెలిగాయి ......

కాలం ఆగితే వయసుతో పనేముంది
నేనూ ఉన్నానంటూ హేమంతం వచ్చింది
ఎదిగిన పిల్లల అల్లరి ఆనందం
హిమస్వేదంలా  గిలిగింతలు పెట్టింది
ఎదిగిన ఆర్దక పరిపుష్టి
హేమంతపు చల్లగాలిలా
మనసుకు స్వాంతన కలిగించింది
భవిష్యత్ ముగ్గులు పరిచింది
బ్రతుకున సంక్రాంతిని నింపింది
ముగ్దత్వంతో హుందా తనమే నిండింది......

ఇహలోక  వాంచల దీపం కొడిగట్టే  వేళ
శిశిరం రానే వచ్చింది
ఆరుపదులుదాటి వడలినమేనితో జీవంలేని మోముతో
వంగిన నడుముతో  తడబడు మాటతో
కాల చక్రమున శిశిరంలో
రాలే పండుటాకులా ఆద్యాత్మిక లోకంలో
పరమాత్ముని పిలుపు కోసం ఎదురుచూస్తూ నేను  .....
మరో నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ .......
      ******** అవేరా*********

No comments:

Post a Comment