Monday, December 28, 2015

స్వర్గసీమ

sk101-86 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
*శీర్షిక: స్వర్గ సీమ *

తొలి సంధ్య
బంగారు వర్ణాన కాంతికిరణాలు
పక్షుల కిల కిలా రావాలు
కోయిల కుహూ కుహూ రాగాలు
ఊరొడ్డున పారే సెలయేరు గలగలలు
ఊరిచివరన చెరువు అలుగు సవ్వడులు

పచ్చతివాచీ పరచినట్లు పొలాలు
అక్కడక్కడ పసుపు పరికిణీలా పొద్దు తిరుగుళ్ళు
బంగారు పళ్ళేరంలో
కడిగిన ముత్యాల తలంబ్రాల్లా
మల్లె తోటలు
చెట్టేక్కుతున్న బార్బీ బొమ్మల్లా
మక్క చేలో చిన్నజుత్తుతో  మక్క కంకులు

కురిసి కురిసి
జడివాన అలసిందేమో
చెట్టు ఆకు చిగురులు
అప్పుడే స్నానమాడిన చెలుల్లా ఉన్నాయి నీరోడుతూ
అరచి అరచి
ఆకాశం అలసిందేమో
మేఘాలన్నీ ఎచటికో పయనమైపోయాయి
ప్రేమికుల మేఘసందేశాన్ని మోసుకుని

ప్రకృతి ప్రశాంతంగా వుంది
ఆకాశం నిర్మలంగా వుంది
ఆ నిర్మల ఆకాశ సంద్రాన
తేలియాడే నావల్లా తెల్లని కొంగల గుంపు
సముద్రాన చేపల వేటకు వెళ్ళే
తెల్లని తెరచాప పడవల్లా తేలియాడుచున్నాయి

ఘల్లు ఘల్లు గంటల చప్పుడు
హయ్..హయ్..అదిలింపుల సందడి
ఏమి  సంగీతమో అది
మోహనరాగమో..!

మధ్యాహ్నం ఇంటికి చేరితె
కమ్మని అంబలి
రాగి ముద్ద
జొన్నగట్క
జొన్నరొట్టె
ముద్దపప్పు
గడ్డపెరుగు
కమ్మని గుమ్ము పాలు
సుష్టుగా భోంచేసి
పెరటి వేపచెట్టు క్రింద
నులకమంచమేస్తే
నా సామిరంగా!
పల్లే కదా స్వర్గ సీమ !
   ****అవేరా***

No comments:

Post a Comment