Monday, December 28, 2015

అమ్మా నాన్న

సహస్రకవి101-66
* శీర్షిక: అమ్మ-నాన్న *

నాన్నా!
నా చిరునవ్వులు చూసి మురిసావు
యెదపై ఆడించావు ఎత్తుకుని లాలించావు
నాకు  చేయూతనిచ్చావు
తొలి అడుగులు వేయించావు
నీ కష్టాన్ని గుండెలో దాచుకొని
నా కోరికలన్నీ తీర్చావు
నీ సంపాదన నీకోసం కాకుండా
మాకోసమే నన్నావు
బతకటానికి తినాలి
తినటానికి బతకొద్దన్నావు
నాకు తోడు ఆసరా ధైర్యం నువ్వే నాన్నా
నాగెలుపును నీ విజయంగా చెప్పుకుంటావు గర్వంగా
నా ఓటమిలో నేనున్నానని భుజంతట్టి ధైర్యాన్నిస్తావు
విద్య బుద్దులు నేర్పించావు
నా గెలుపుకి పూల  బాటను పరిచావు
అమ్మా !
సృష్టికి మూలపుటమ్మవు నీవు
నవమాసాలు బరువనుకోకుండా మోసావు
రక్తమాంసాలతో రూపమిచ్చావు
నీ ఊపిరి సాక్షిగ నాలో ఊపిరిలూదావు
కన్ను తెరవలేదు  కనలేదు లోకం
నీ వెచ్చని స్పర్షే నాకు ఇంద్రలోకం
పురిటికందుగ నన్నుహత్తుకున్న
నీ గుండియల స్పర్శ
సృష్టిలో మరేప్రాణికీ
దొరకని ఆత్మీయ స్పర్శ
లాలి పాడి జోలపాడి
కమ్మనైన చనుబాలు త్రాపి
అందు ప్రేమానురాగాలు మేళవించి
సుఖనిద్రనిచ్చావు
నే బాధ కలిగి "అమ్మా"అంటే
చెమర్చునమ్మా నీ కళ్ళు
ఆ కన్నీటిలో దాగున్న అనురాగ
బంధం ఎవరికి తెలియదు
నీచేతిచలువన నీ కంటివెలుగయ్యాను
భువికి దేవుడిచ్చిన పెన్నిధి నీవు
నీవు పంచిన ప్రేమ సుమాలు
నా బ్రతుకును పూలబాట చేశాయి
నా కంట నీరు నిండినప్పుడు
నీ గుండె చెరువయ్యేనా
అనురాగానికి అద్దం నువ్వు
మమతకు భూదేవి సమమవ్వు
ప్రేమకు ఆకాశం నువ్వు
తొలి నమ్మకం నీవే
తొలి ప్రేమ నీదే
తొలిగురువు నీవే
తొలి స్నేహం నీదే
తొలి విమర్షనీదే
అందుకే అమ్మా నువ్వు "అమ్మ"వు!!
          *****అవేరా*****

No comments:

Post a Comment