Monday, December 28, 2015

తోడూ నీడ

అయుత కవితా యజ్ఞం
27/12/2015
సహస్రకవి  101
కవిత సంఖ్య :92
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: వివాహ బంధం

శీర్షిక: తోడు-నీడ

మనిషి జీవన ప్రయాణంలో ఎన్నోమలుపులు
శైశవంనుండి బాల్యమొక మలుపు
బాల్యంనుండి కౌమార్యమొక మలుపు
కౌమారంనుండి సంసారమొకమలుపు
బిడ్డలు వ్యక్తులుగా మారే మలుపు

ఈ జీవనయానం ఇరువురి వ్యక్తుల ఉమ్మడి భాగస్వామ్యం
ఈజీవిత నౌకకు ఇరువురూ సరంగులే
అనంత జీవనయానంలో తెరచాప ఒకరు
సుదూర లక్ష్యఛేధనలో చుక్కాని ఒకరు

ఉచ్ఛనీఛాల భావం నిరంకుశవాదం
పరిణామాల ఫలం చెరిసగమైతే
ఖేదమైనా మోదమైనా
మంచైనా చెడైనా
భాద్యత చెరిసగం

ప్రతి అపజయం గుణపాటమవ్వాలి
ప్రతి విజయం సోపానమవ్వాలి
రెండు శరీరాల్లో ఒకే ఆత్మలా
పొందే ఆనందం అంతరాత్మలా
అనుభూతులు సగం సగంగా

ఆశించకపొతేనే ఆనందం
ఆశించిన వాటిలో వెలితి దుఃఖం
చాలా చిన్నది జీవితం
ప్రేమించు
అనుభవించు
ఆస్వాదించు

ఆవేశకావేశాలు
అసూయా ద్వేశాలు .... నిప్పులు ...
రాజేయకండి

భాగస్వామి కలకాలం
నీతో ఉండాలంటే
నీలో ఉండాలంటే
నీవు తినేముందు పెట్టు
కరకుమాటనే ముందు
గాయం బాధ ఊహించు
మాటనేముందు చెప్పేది విను
ఖర్చుకు ముందు సంపాదించు
అసహ్యించుకునే ముందు ప్రేమించు
ప్రార్థనకు ముందు క్షమించు

పంచితే తరిగేది ధనం
పంచితే పెరిగేది ప్రేమ
ప్రేమిస్తే పోయేదేముంది?
మహా అయితే తిరిగి ప్రేమిస్తారు
ప్రేమించకపోయినా
నీకు మిగులుతుంది ఆత్మ సంతృప్తి
అందుకే జీవనంలో ప్రేమించు
మరణంలో జీవించు !
ఇవే  నూరేళ్ళ మీ జీవన ప్రయాణానికి
నా మంత్రాక్షితలు !
 ****అవేరా****

No comments:

Post a Comment