Tuesday, December 22, 2015

కవి

1)
sk 101_01  అనుసూరి వేంకటేశ్వరరావు ,హైదరాబాద్
మ్యాగజైన్  కోసం

కవి
హద్దులు  లేని రాజ్యం భావప్రపంచం
ఆరాజ్యానికి  రారాజు కవి
కవి కాంచనిది లేదీ జగమ్మున
రవి  కాంచనిదియు  కవి గాంచును
నయనమ్ము లకందనివి కవనమ్ముల ముందుంచగలడు  
కవితలల్లుట  ఒక తపస్సు  
చివరి  పంక్తికి  మొాక్షం
కవి  మితవాది  
ముత్యాల సరాల పదమాలికలో
ఆకాశమంత విషయాన్ని చెప్పగలడు
అక్షర అల్లికతో
సముద్రపులోతు అర్దాన్నీచెప్పగలడు
కవి అతివాది
మాటల తుాటాలతో సుడిగాలి సృష్టించ గలడు
అక్షర ఫిరంగులతో సునామీలు సృష్టించగలడు
కవి  హేతు  వాది
నిజాల లోతులు శోధించి
నిస్వార్థ చింతనుడై
నిజం  ఇజంను
పదాల పదఘట్టన తో
సమ సమాజం కోసం
సుమ జల్లులలో విరిసే
ఆనందపు హరివిల్లుల కోసం
సమాజం ముందుంచ గలడు  
కవి హితవాది
సమాజంలో కుళ్లును తొలగించటానికి
అక్షరాలనే స్వఛ్చ భారత్ లా సంధించి
ఉఛ్చమైన నవభారత్ సాధించగలడు
కలాము చెప్పిన సలాము మాట"కల"
కలలు లేని కలకనలేని యువతను
జూలు విదిల్చి లక్ష్యం కోసం కార్యోన్ముఖులనుచేయగలడు
కవి  మానవతావాది
ఆడపిల్లనుచు బూృణహత్యలు
పాల్పడు రక్కసులను దునుమాడ
కవిచేత కవిత నాగాస్త్రమవును
కాలేజి మహిళ లకు  ప్రేమాంధుల కామాంధు ల
నుండి ప్రాపుగ నిలువ
కవిచేత కవిత నారాయణాస్త్రమగును
అక్కరకు రాని వాగ్దానాలను
పుంఖాను పుంఖాలు గుప్పించి
లేని  ఆశలు  కల్పించి  లెక్క  తప్పి
నోటు రాజకీయాలు తో గద్దెనెక్కి
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే
కవిచేత కవిత  బ్రహ్మాస్త్రమగును
అందుకే
కవి చేత కలం ఓ అంకుశం
క  వి ఆశావాది
అక్షర ఆర్తి సమయస్పూర్తి
సందేశమవ్వాలి
యువతను  మేల్కొలపాలి
భవితకు  మార్గదర్శనమవ్వాలి
ఆ సందేశమే దేశానికి
ప్రగతి దిశానిర్దేశ్యం  
కవి  కలం నుంచి
జాలువారే ప్రతి అక్షరం
కోటి గొంతుకలకు
మాటవ్వాలి....పాటవ్వాలి
జగతికి   ప్రగతి  బాటవ్వాలి
మేలుకొలుపు ....సుప్రభాతమవ్వాలి
ఆశ...
సమ సమాజం కోసం
నేను సైతం...
సమిధనొక్కటి  ఆహుతిచ్చాను.  
ప్రమిదనొక్కటి వెలిగించాను...
       ************
1/11/2015  తెలుగువేదిక.నెట్ 7వ సంచికలో ప్రచురితమైన కవిత 

No comments:

Post a Comment