Tuesday, December 22, 2015

అవేరా కవనాలు

                            అవేరా కవనాలు
                       (ఏవీరావు గారి కవితలు)

sk 101-01
శీర్షిక: కవి
హద్దులు  లేని రాజ్యం భావప్రపంచం
ఆరాజ్యానికి  రారాజు కవి
కవి కాంచనిది లేదీ జగమ్మున
రవి  కాంచనిదియు  కవి గాంచును
నయనమ్ము లకందనివి కవనమ్ముల ముందుంచగలడు  
కవితలల్లుట  ఒక తపస్సు
చివరి  పంక్తికి  మొాక్షం
కవి  మితవాది
ముత్యాల సరాల పదమాలికలో
ఆకాశమంత విషయాన్ని చెప్పగలడు
అక్షర అల్లికతో
సముద్రపులోతు అర్దాన్నీచెప్పగలడు
కవి అతివాది
మాటల తుాటాలతో సుడిగాలి సృష్టించ గలడు
అక్షర ఫిరంగులతో సునామీలు సృష్టించగలడు
కవి  హేతు  వాది
నిజాల లోతులు శోధించి
నిస్వార్థ చింతనుడై
నిజం  ఇజంను
పదాల పదఘట్టన తో
సమ సమాజం కోసం
సుమ జల్లులలో విరిసే
ఆనందపు హరివిల్లుల కోసం
సమాజం ముందుంచ గలడు
కవి హితవాది
సమాజంలో కుళ్లును తొలగించటానికి
అక్షరాలనే స్వఛ్చ భారత్ లా సంధించి
ఉఛ్చమైన నవభారత్ సాధించగలడు
కలాము చెప్పిన సలాము మాట"కల"
కలలు లేని కలకనలేని యువతను
జూలు విదిల్చి లక్ష్యం కోసం కార్యోన్ముఖులనుచేయగలడు
కవి  మానవతావాది
ఆడపిల్లనుచు బూృణహత్యలు
పాల్పడు రక్కసులను దునుమాడ
కవిచేత కవిత నాగాస్త్రమవును
కాలేజి మహిళ లకు  ప్రేమాంధుల కామాంధు ల
నుండి ప్రాపుగ నిలువ
కవిచేత కవిత నారాయణాస్త్రమగును
అక్కరకు రాని వాగ్దానాలను
పుంఖాను పుంఖాలు గుప్పించి
లేని  ఆశలు  కల్పించి  లెక్క  తప్పి
నోటు రాజకీయాలు తో గద్దెనెక్కి
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే
కవిచేత కవిత  బ్రహ్మాస్త్రమగును
అందుకే
కవి చేత కలం ఓ అంకుశం
కవి ఆశావాది
అక్షర ఆర్తి సమయస్పూర్తి
సందేశమవ్వాలి
యువతను  మేల్కొలపాలి
భవితకు  మార్గదర్శనమవ్వాలి
ఆ సందేశమే దేశానికి
ప్రగతి దిశానిర్దేశ్యం
కవి  కలం నుంచి
జాలువారే ప్రతి అక్షరం
కోటి గొంతుకలకు
మాటవ్వాలి....పాటవ్వాలి
జగతికి   ప్రగతి  బాటవ్వాలి
మేలుకొలుపు ....సుప్రభాతమవ్వాలి
ఆశ...
సమ సమాజం కోసం
నేను సైతం...
సమిధనొక్కటి  ఆహుతిచ్చాను.
ప్రమిదనొక్కటి వెలిగించాను...
       *******అవేరా*****
1/11/2015  తెలుగువేదిక.నెట్ 7వ సంచికలో ప్రచురితమైన కవిత
sk101_02
sk101_02
నేటి రైతు దయనీయ స్తితికి అద్దం పట్టి
బతుకమ్మ పాటలో మీ ముందుంచుతున్నా
ఆత్మాహుతి రైతులకు నివాళులతో అంకితం

*శీర్షిక:  పల్లెబతుకమ్మ *

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల
బంగారు బతుకమ్మ ఉయ్యాల
బతుకు భారమై ఉయ్యాల
బతుకులీడుస్తున్నముయ్యాల
చెట్టు పుట్ట లేక ఉయ్యాల
చెదపురుగు బతుకాయె ఉయ్యాల
ఎండలే యేడెక్కి ఉయ్యాల
వర్షాలు కురవక ఉయ్యాల
చెరువులెండిపాయె ఉయ్యాల  .....బతుకమ్మ
దుక్కిదున్నలేదు ఉయ్యాల
మునుపుచేసినప్పు ఉయ్యాల
మూడురెట్లాయెను ఉయ్యాల
ముప్పూటబోజనం ఉయ్యాల
కలలోనె తింటుంటముయ్యాల  .....బతుకమ్మ
ఇన్నిబాధలున్న ఉయ్యాల
బతుకమ్మపూజకు ఉయ్యాల
గునుగు పూలుతెచ్చి ఉయ్యాల
ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాల
వరుసపేర్చి నీకు ఉయ్యాల
బతుకమ్మ చేస్తమే ఉయ్యాల  .....  బతుకమ్మ
తంగేడు  పూలు  తెచ్చి ఉయ్యాల
తరచిపేరుస్తమే ఉయ్యాల ...........బతుకమ్మ
బంతిపూలు   తెచ్చి ఉయ్యాల
బొద్దుగాపేరుస్తముయ్యాల ...........బతుకమ్మ
చామంతిపూలు తెచ్చి  ఉయ్యాల
చక్కగా  పేరుస్తముయ్యాల ........బతుకమ్మ
తామర పువ్వు తెచ్చి ఉయ్యాాల
తీరుగా పేరుస్తముయ్యాల  ........బతుకమ్మ
గుమ్మడిపువ్వుతెచ్చి  ఉయ్యాల
ముద్దుగుమ్మలాపేరుస్తముయ్యాల ...బతుకమ్మ
దోసపువ్వు తెచ్చి  ఉయ్యాల
దోసిట్లపేరుస్తముయ్యాల..........బతుకమ్మ
కట్లపువ్వుతెచ్చి ఉయ్యాల
కట్లుగాపేరుస్తముయ్యాల ........బతుకమ్మ
బీరపువ్వు తెచ్చి ఉయ్యాల
నారతోపేరుస్త  ము య్యాల  .....బతుకమ్మ
గడ్డిపువ్వు తెచ్చి ఉయ్యాల
గుంపుగాపెరుస్తముయ్యాల........బతుకమ్మ
వాముపువ్వుతెచ్చి  ఉయ్యాల
వాటంగపేరుస్తముయ్యాల........బతుకమ్మ
ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాల
వరుసపేరుస్తాము ఉయ్యాల
పసుపుగౌరమ్మను ఉయ్యాల
పొందిగ్గచేస్తాము  ఉయ్యాల .....బతుకమ్మ
 కష్టాలు తొలగించు  ఉయ్యాల
వర్షాలు కురిపించు ఉయ్యాల
పంటలేపండించు ఉయ్యాల
గాదెలన్నినిండి ఉయ్యాల
కాసులేకురవాలి ఉయ్యాల
అప్పులేతీరాలి ఉయ్యాల
రైతులందరు కూడ ఉయ్యాల
చల్లంగ ఉండాలి ఉయ్యాల.......బతుకమ్మ
*******అవేరా******
sk101_03
* శీర్షిక: బంగారు బతుకమ్మ  *

తెలంగాణ పల్లె రంగులద్దుకున్నది
తెలంగాణ పట్నంలో పూలజాతర
ప్రపంచంలో  అరుదైన  వేదిక
మనదైన  సాంస్కృతిక  వేడుక
బడీడు ఆడపిల్ల బడిబాటమరిచింది
చెల్కల్ల గుట్టల్ల తిరిగింది
కాలు ముల్లు  గుచ్చినా
రాళ్ళు  తగిలినా
అన్వేషణ  ఆపలేదు
ఈపువ్వు ఆపువ్వు అని లేదు
అన్ని పువ్వులు ఏరుకుంది
ఇల్లుచేరి  ఈవాడ  ఆ వాడ
అందరిని పిలిచింది
తంగేడు,పట్టుకుచ్చులు
గునుగుపూలు,గుమ్మడిపూలు
బీరపూలు,కట్లపూలు,
దోసపూలు,గడ్డిపూలు
గుమ్మడిపూలు,వాముపూలు
బంతిపూలు, చామంతిపూలు
అన్నిపూలు అందరు కలిసి
అందంగా పేర్చారు బతుకమ్మలను
సాయంకాలం......
అన్ని బతుకమ్మలు  చెరువు  దగ్గర చేరాయి
గుడిగోపురం లా రంగురంగుల బతుకమ్మలు
స్తీత్వాన్ని  పూజించే పండుగ
సప్తవర్ణాల పండుగ
రంగురంగుల పట్టు వస్తాలలో
మహిళ ల జాతర
చప్పట్లు కోలల లయతప్పని బాణి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల
ఒక్కేసి పువ్వేసి చంద మామ..
పాటలతో మొదలై
పోయిరావమ్మా గౌరమ్మా...పొద్దుపోయే గౌరమ్మా
మల్లెప్పుడత్తవే గౌరమ్మా
అని గౌరమ్మను సాగనంపారు.
*********అవేరా********
sk101_04      
 
**శీర్షిక: వానపాము **

వర్షఋతువు వచ్చింది
తొలకరిఝల్లు తెచ్చింది
నేలతల్లి పులకించింది
తడిసిన మట్టి పరిమళం
ఆస్వాదిస్తున్నారు జనం
కానీ......
ఒక చిన్నప్రాణిలో
ఆనందం..ఆందోళన...కలకలం
 "తడిసిన మట్టి మృత్తికా పరిమళం
నాసిక తాకగానే
ఎక్కడో లోతట్టు మట్టి పొరలో
సకుటుంబంగా దాగున్న నాకు
ప్రాణం లేచి వచ్చింది
ఆహా! ఏమి పరిమళం !
ఏమి అనుభూతి....ఏమి ఆనందం
ఈరోజుతో కష్టాలు తీరాయి
భూమి పైపొరలు తేమ నిండాయి
ఆహారం లేక అలమటిస్తున్నాము
పైపొరలకెళ్ళి ఆనందంగా ఉందాము
అని చెప్పాలనుకున్నా
కానీ..........ఆగిపోయాను
గతం..... ఓ పీడకల
నా సోదరి వానొచ్చిన ఆనందంతో
సకుటుంబంతో భూమి పై పొరలకు వెళ్ళనపుడు
అమ్మో !  తలచుకుంటే  భయమేస్తుంది
ఒక రాకాసి బండి
కత్తుల చట్రానికి
ముక్కలుముక్కలై
కుటుంబమంతా బలి అయ్యింది
అమ్మో! ..ఎలా?....ఏది దారి?
నాడు.....
నాగలి దున్నినపుడు
కొర్రుల మద్యకి...కిందకి వెళ్ళి
ప్రాణాలు నిలుపుకొంటిమే
నేడు.....
అవకాశం ఆవగింజంత లేదు
పైకెళ్తే ప్రాణాలు హరీ
దేవుడా ఏది దారి?
మాజాతి ఇలా అంతరించాల్సిందేనా ?
మమ్మల్ని కాపాడేవారు లేరా?
జీవ కారు ణ్య సంఘాలు ఎక్కడ?
కళ్ళముందు కనిపించేవే జీవాలా?
మేము జీవులం కాదా?
ఇన్ని నాళ్ళూ మా జీవ ఎరువుతో
బంగారు పంటలు పండించినారు
ఇప్పుడు మా మృత జీవాలపై పండిస్తున్నారు !*
ఇంత దయ లేని వారా మానవులు?
భగవంతుడా మాకు నీవే దిక్కు! "
********అవేరా*******
sk101_05
* శీర్షిక: మనుషులంతా ఒక్కటే *

లౌకికమే అభిమతం
 కావాలి  మనమతం
కులమేదయినా
మతమేదయినా
మానవత మించిన మతముందా
మనిషి మనిషిగా   బ్రతకాలి
మానవతకు ప్రతీక కావాలి
కుల"గజ్జి"అని ఎప్పుడో ...చదివిన గుర్తు
నవ్వుకున్నానప్పుడు పదప్రయోగానికి
"గజ్జి " పదం సరైందేనని
అంటువ్యాధి లా వ్యాపిస్తుందని
తెలిసిందీనాడు కులం పేరుతోవిచ్చిన్నమవుతున్న
సంఘజీవనం చూసి
పతనమవుతున్న మానవ విలువలు చూసి
సొంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడవోయ్
ఆనాటి మాట
సొంత లాభం కోసమని పొరుగు వాడిని దోచుకోవోయ్
ఈనాటి బాట
హద్దూ అదుపూ లేని సమాజ విచ్చిన్నతలో
చివరికి మిగిలేది నువ్వూ నేనే
అదే మనిషి స్వార్దానికి  పరాకాష్ఠ
ఏమతమైనా
మారణహోమం  కో రుకోదు
అన్ని మతాలు కోరేది
సర్వ మానవ కళ్యాాణము
సర్వ మానవ సౌబ్రాతృత్వం
మనుషులను ఇన్ని విధాలుగా
విడగొట్టే వారికి  సవాల్
ప్రాణికోటికి పంచభూతాలే
అనుబంధం  ప్రాణం
మీరు విడగొట్టే ప్రతి ముక్క సంఘానికి ,కులానికి  లేదా  మతానికి
పంచభూతాలను విడగొట్టి  సమంగా పంచగలరా?
అసాధ్యం !
అందుకే  సమాజ విచ్చి న్నం వద్దు  
మనుషులంతా ఒక్కటే  అంటే ముద్దు
***********అవేరా********
sk101_6
* శీర్షిక: బంగారం *

ఒక మంచి సందేశం
నీలో అలజడి రేపితే
తెరచి చూసుకో నీ హృదయాన్ని
మలినాలన్నాయని
మలినం లేని మనసే
24 క్యారట్ బంగారం
చైన్ స్నాచింగులకు చిక్కనిది
దోపిడికి దొరకనిది
దొం గలకు అందనిది
అందుకే  నీ మనసు  శుద్ది చేసుకో
బంగారం గా మలచుకో
అంతకు మించిన ఆభరణం లేదు
నీ మనసే శాంతికి నిలయం
దాన్ని మించ లేదు ఏ దేవాలయం
*******అవేరా******
sk 101 - 07

* శీర్షిక:  వెలుగుతున్న భారతం! *

వెలుగుతోంది భారతం
కోటి దీపాల వెలుగు కాదది
కోటి అగ్ని శిఖల ప్రజ్వలిత కాంతి
నూరు కోట్ల ప్రజా హృదయ క్రాంతి
జాతి పిత గాంధీ కలలు కన్న పల్లె స్వరాజ్యం ఏది ?
స్వరాజ్య సమయానికే పల్లెలు వెలుగుతున్నాయ్
బాటలు లేకున్నా పాడి  పంటలతో వెలిగాయి
గ్రామీణఉత్పత్తుల గిరాకీతో వెలిగాయి
మనసు నిండా బంగరు భవిష్యత్ ఆశలతో వెలిగాయి
జై జవాన్! జై కిసాన్ ! నినాదం
ప్రభుత్వ కార్య శూరత్వానికి వివాదం
ఏడు దశాబ్దాల ప్రగతి
ఏమున్నది గర్వకారణం
ఎక్కడున్నది భారతీయత
కులాల పేరిట మతాల పేరిట
ముక్కలు చెక్కలయ్యె భారతీయులు
విభజించు పాలించు నాటి తెల్లవాడి  రాజకీయం
విభజనలను  విభజించు పాలించు నేటి రాజకీయం
అన్నపూర్ణ భరతావనిలో
పల్లె ఎలా వెలుగుతుంది ?  చూడండి!
పేదరైతు జోలె  పట్టాడు
భిక్షకోసం  కాదు
అప్పుకోసం
కాలే కడుపు నింప కాడి పట్టి
దుక్కి దున్ని నాట్లు  పెట్టి
చేస్తే వ్యవసాయం
ఏదీ ఫలసాయం  ?
ఏదీ గిట్టుబాటుధర?
అప్పు అంతితై కొండంతై
బూచిలా భయపెడుతుంటే
నిద్ర లేని రాత్రులు
నిశా రాత్రులు..  నిశాచరాల్లా భయాందోళనలతో
బ్రతుకే ఒక పీడకలలా పీడిస్తుంటే
బ్రతుకు భారమై.. భార్యా పిల్లల కనులార చూసుకొని
కంటి  నీటితో  మసకైన చూపుతో
పెరటిలోనికి వెళ్ళి గోమాతను కౌగలించుకొని బోరున ఏడ్చి
లేగదూడ చెంతచేరి ముద్దాడి
తల్లి  చెంతకు చేర్చి కన్నీటి పర్యంతమై
తెల్లవారి  కనిపించె ఉరికొయ్యకు   ఉసురు కోల్పోయి
అవును ! కాదని ఎవరన్నారు? వెలుగుతుంది భారతం
పేదరైతుల చితిమంటల వెలగుతో!
జైకిసాన్ శ్రధ్ధాంజలి దీపాలతో!
********అవేరా*****

sk101 -08
* శీర్షిక: వెలుగుతున్న భారతి *

వెలుగుతుంది భారతం
పల్లెలు వెలుగుతున్నయ్
ఆత్మాహుతి రైతుల చితి మంటల కాంతిలో
శ్రధ్ధాంజలి దీపాల వెలుగులో
వెలుగుతుంది పల్లె భారతం
మరి పట్టణాలూ వెలుగుతున్నయ్
ఎలా??
బాలానందాన్ని అటకెక్కించి
"బరువైన"చదవులతో చమురులేనిదీపాలతో
వెలుగుతుంది పట్టణభారతం
కౌమారంలో భాధ్యతలెరుగని
భావి భారత పౌరులు
హుక్కా మత్తులో చిత్తై
మందు విందు చిందుల తో
పబ్బుల డిస్కో క్లబ్బుల కాంతులతో
వెలుగుతుంది పట్టణ భారతం
పల్లెరైతు విద్యుత్తు పణంగా  
నవరత్న కాంతులతో
కాంక్రీటు అరణ్యాన పూసిన
నక్షత్రపూవుల వెలుగులతో
వెలుగుతుంది వట్టణభారతం  
నిత్యకర్మల  కోతలతో
ఉరుకు  పరుగుల బ్రతుకులతో
మమత ప్రేమానురాగాల
పరిమిత పంపిణి తో
వెలవెల బోతున్న కుటుంబ విలువలతో  
వెలుగుతుంది పట్టణభారతం
కాంక్రీటు కంబళి క్రింద భూమాత నోరెండ
అంతర్వాహినికై ఎదురు చూడ
నాలాల ఆక్రమణతో దారి  లేని గంగ
రహదారులం బారి
చెట్టును పుట్టను లేక
పట్టణ పౌరులకు
జీవనము నరకప్రాయమై
వెలుగుతుంది పట్టణ భారతం
అఛ్చాదన సంస్కృతి అటకె క్కి
కురచదుస్తుల పాశ్చాత్య కుసంస్కృతి అందలమెక్కి
మహిళల పట్ల నేరాల చిట్టా
ఎవరెస్టుకు పోటీ పడుతూ
తోడు నీడ భావన  లేక
చిరు కట్న వరకట్న  బాధల పీఢలతో
ఛిద్ర మౌతున్న సంసారాలతో
కన్న పేగు కడతేర్చే కసాయి తండ్రులతో
వెలుగుతుంది పట్టణభారతం
కని విని ఎరుగని కలకంటి
కంటిదీపాల కన్నీటి కాంతులతో!!!
*******అవేరా*******



sk 101 -09
  * శీర్శిక: ఎల్ నినో   *
   ************
పారిశ్రామికీకరణ మత్తులో జోగుతున్నది ప్రపంచం
టెక్నాలజి టెక్కుతో విర్రవీగుతున్నది
పర్యావరణపరిరక్షణ  తుంగలో తొక్కిన
పర్యవసానం?? "ఎల్ నినో"
తరుముకొస్తున్నది "ఎల్ నినొ"  
భూమద్య రేఖాంశ హారమున
ప్రపంచవ్యాప్త అసాధారణ వాతావరణం అనివార్యం
ఆరంభంలోనే దాల్చెను తీవ్రరూపం
అడుగంటెను జలం  జలాశయాలకు అభిశాపం
ఏమౌనో జలచరాలు పాపం
సాగుకు అనుకూలించని వాతావరణం
ప్రతికూలించే ఫలసాయం  
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు
రైతుల బతుకులు పై మరో ప్రకృతి దాడి
పొగమంచున  సిరుల సింగపూర్  
ఫసిఫిక్  లో తూఫాన్లు
వియత్నాంలో ఎండనున్న జలాశయాలు
నీటి కటకటతో  కన్నీటి బొటబొట
కోకో పంటల ఆఫ్రికా
దిగుబడి కోతలు తో రైతుల వెతలు
పశుపక్షాదులపై ప్రభావం ...పర్యవసానం?
పాడి పంటల అర్జంటినా క్షీర పంట క్షీణత
కరవు రక్కసి కోరల్లో చిక్కనున్న ఆస్ట్రేలియా
కాలిఫోర్నియాలో
నాలుగేళ్ళ అనావృష్టి అతివృష్టిగా రూపాంతరం
ప్రకృతి విలయాలనాప తరమా మానవులకు
తుఫానులు........ వాయు  విలయాలు
సునామీలు ........జల విలయాలు
భూకంపాలు........భూమాత విలయం
కార్చిచ్చులు.........అగ్ని  విలయం
ఊల్కాపాతం.......ఆకాశ విలయం
పంచభూతమయమైన ప్రకృతిని జయించ మానవతరమా
అందుకే ఈ విశ్వ సృష్టి స్తితిలయలు
మానవుల నియంత్రణలో లేవు.....రావు  !
రానున్న విలయ ప్రళయాల నుంచి రక్షణకు
పంచభూతాలను పూజించి ప్రసన్నం చేసుకుందాం!
       *********అవేరా******



sk  101_ 10
* శీర్షిక: కెరటం *

ఆనాడు... మనసుతాకిన కెరటం నువ్వు
ఆ కెరటానికి ఎగసి పడిన మనసు తుళ్ళింత లో
ఆనందం ఆర్నవమైన వేళ
నీ చూపులు మన్మధబాణాలై నను తాకిన వేళ
నీ మోమున విరిసిన నవ్వు నా గుండెలో పదిలమైనది
ఆనవ్వులే నా పై కురిసాయి సిరి మల్లెల జల్లుగా
ఆ సిరిమల్లెల జల్లులో విరిసింది ఓ హరివిల్లు నీ  ప్రేమగ
ఒంటరినైన  వేళ నీ తలపుల తోడుగా సహజీవనం
నన్ను నిత్యశక్తివంతుడిగ చేస్తే
నిను చూడాలన్న తపన నన్ను నిత్యం వేధిస్తుంది
నా ఎడారి జీవితంలో ఒయాసిస్సువయ్యావు
ప్రేమ దాహం తీర్చి కనుమరుగై ...
నా మనసున దేవతవై నిలిచావు !  
********అవేరా*******


sk 101-11

ముందుమాట: తెలుగు భాష ఘనత చాటగ తెలుగు కవుల
సహస్ర కవి సమ్మేళనం 18నవంబరు2015 సహస్ర కవుల విజయ దినోత్సవం నాడు వాట్సప్ వేదిక గా ఆవిష్కృతం కానుంది కవులందరికి  హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఈకవితా స్వాగత మాల
               **************
*శీర్షిక: కదలిరండి  ! **

కదలి  రండి ! కదలి రండి ! కవులారా! కదలిరండి
పదం కదిపి కలం దులిపి
కవితా మాలికలల్లగ...   కదలిరండి...కదలి
శారదాంబ బిడ్డలమై
తెలుగు భాష ద్రష్టలమై .....
కలం గళం వినిపించగ
కవితామాలికలల్లగ.....కదలిరండి
దండుగా కదలిరండి ఉద్దండ పండితులై .....దండుగా కదలి
సమాజాన వెదజల్లిన విషబీజాలెన్నెన్నో
ఏరివేసి పారబోసి ప్రక్షాలన జేయబూని
కలం దూసి కవిత రాసి ......కదలిరండి ..రండి......
భావజాల వర్షంలో  తడిసి పావనమవ గా.....కదలిరండి ..
పదం కదిపి కలం దులిపి కవితామాలికలల్లగ
కదలి రండి ! కదలిరండి!  కవులారా కదలిరండి
తెలుగుభాష విజయోత్సవం
తెలుగుకవుల నేత్రోత్సవం
కనులారా వీక్షించగ ........కదలిరండి  .......కదలిరండి
తెలుగు కవుల కలలన్నీ
సాకారం  చేయగా..
మీకోసమె  ఈవేదిక  కవితా అభిలాశిక   ....కదలిరండి
తెలుగు కవిత  కమనీయం
తెలుగు భాష తేనీయం
 కన్న భాష తెలుగు భాష
అన్న మాట మరువకండి .......కదలిరండి  ........కదలిరండి
కలం బూజు దులపండి
కుళ్ళును కడిగేయండి ....కదలిరండి ... ........కదలిరండి
వాట్సప్ వేదికగా
వేడిగా...... వాడిగా ....వడివడిగా ....... కదలిరండి........
 నిరవధిక కవితలతో తెలుగు భాషకభిశేకం ....
జిలుగు వెలుగు కవితలతో
తెెలుగు మాతకభిశేకం  చేద్దాం.. రారండి  ...రండి...రండి
కదలిరండి ! .కదలిరండి!  కవులారా..! .కదలిరండి !!
పదంకదిపి కలం దులిపి కవితామాలికలల్లగ
కదలిరండి!  కదలిరండి ! కవులారా కదలిరండి!
     ******అవేరా*****





sk101-12
*శీర్షిక: పుష్ప విలాసము *

అందమైన పూ తోటలో
ప్రభాత కిరణాల వెలుగులో
రంగురంగులతో మీ కనువిందు చేస్తాము
మా జీవితం చిన్నదయినా
ముగ్ద సుకుమార సుగంధ మకరంద మధుర జీవితం మాది
విరించి ప్రకృతి  రచనలో మధుర పాత్ర మాది
మానవులకు దేవతలకు సేవకోసం
జన్మంచిన పుణ్య జీవులం మేము
ఉద్యాన వనాల్లో విరగబూసి
మధుర సుగంధాలు వెదజల్లుతాము
మీ పాపల మోమున విరిసే  ఆనందపు నవ్వులు చూసి
మీ మోములు వికసిస్తే మా మనసున ఆనందం అతిశయమౌతుంది
" పుష్పాంజలి" నాట్యం
అమృతవర్షిణి రాగం....ఆదితాళంతో
సంపూర్ణం కాదు మేములేకుండా
నాట్యకత్తెలు దోసిట మమ్ము  నటరాజుకర్పించ
మా జన్మ ధన్యమగును
పూజకోసం పుట్టిన పువ్వులం మేము
పూదోట విరిసేటి నవ్వులం మేము
బతుకమ్మల చేరి  కనువిందు చేస్తాము
అమ్మవారి పాదాల చేరి పావనమౌతాము
మీ మానవుల తొలిప్రేమపూజకు (శోభనం)
పూల పాన్పు అవుతాం
అంతిమ యాత్రలో పూలదండ అవుతాం
పూసే ప్రతి పువ్వు వాడుతుంది
వాడిన పూవులు పూజకు పనికిరావు !
    ******అవేరా****










sk101-13
*శీర్షిక: తొలిపొద్దు *

దున్న భూమి ఉన్నా దూర ప్రయాణమెందుకు?
పట్నం పోయి పార పడతావెందుకు  ?
గల్్ఫ కి పోయి శవమౌతావెందుకు?
దుక్కి దున్న నాగలి పట్టవెందుకు ?

మూడెకరాల నీ కల సాకారం చేసింది ప్రభుత్వం
బంగారు తెలంగాణ కల సాకారం చేయవా ?
పొడిచే తొలి పొద్దువి నువ్వే !
ఆకాశమె హద్దుగా అభివృద్దిని సాధించు

ఎవరో వస్తారని కలలెందుకు నీకు ?
ఏదోచేస్తారని ఎదురు చూపులెందుకు నీకు?
నీ భుజ శక్తిని నమ్ముకో అదే శ్రీరామ రక్ష నీకు !

రాజకీయ నాయకులారా!
మీరు గతికే ప్రతి మెతుకు వెనక
పేదరైతు స్వేదం ఉందని మరువకండి !
లక్ష్మీ పుత్రులు మీరయితే
జేష్టా దేవి పుత్రులు వీరు
దరిద్ర దేవత కనుసన్నల్లో
దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు

అందరికి అన్నం పెట్టే రైతే అన్నమో రామచంద్రా అంటే?
రేపటి కరువుకి మీరే బాధ్యులు  !
అందుకే రైతుల్లో స్ధైర్యం నింపండి !
శవాలు సేద్యం చేయలేవు
కనుక ఆత్మహత్యలాపండి !

చచ్చిన శవాల పై పూదండలతో లాభమేమి?
ఋణ మాఫీలతో లాభమేమి?
ఋణమేమి అవసరం లాభదాయకత ఉంటే
గిట్టుబాటు ధర కల్పించి
వ్యవసాయమూ లభదాయకమని చాటండి!
మొద్దునిద్ర వీడి మేల్కనండి!
ఆలస్యం బీడునేల మరుభూమి!!!
   ****అవేరా****

sk 101-14
5/11/15 కిరణ్మయి గారిచే పాడించి సహస్రకవుల గ్రూపు లో పోస్ట్ చెయ్యబడినది

*శీర్షిక: నవవసంతం *

పల్లవి: నవవసంతం వికసించింది
           కవులతోట పులకించింది
           ప్రతీచెట్టూ కొత్త కాంతులు విరజిమ్మింది

చరణం: చిగురు తొడుగతున్న కొత్త ఆకులూ
              కోటి సూర్య ప్రభల కాంతి దీపాలూ
              అల్లంత దూరాన అందాల  తోట
             ఇంకెెంత  దూరాన   చైతన్య  బాట
             ఇంద్రధనుస్సు అందాలు చిందులేసి పాడగా
                                                                           ...నవవసంతం

చరణం: సాహితీలోకాన వెలసిన కవుల తోట ఇది
             వర్ధమాన కవులకు పూలబాట ఇది
            " రవి" కిరణం సోకి తరులు పులకించి
             ఆకలి తీర్చుకుంటున్న తరుణమిది
             ఫలించి ఆకలి తీరుస్తున్న కవనమిది
                                                                        ....నవవసంతం

 చరణం: కవులతోటలో కవితావృక్షాలు ఊడలేసి
              అంతింతై వటుడంతై అన్న చందంగా
              కొత్త మొలకలకు ప్రాణం పోస్తున్నవీ
              కొత్తమొలకలు దిన దినప్రవర్ధమానమై
               క్రొంగొత్త ఫల పుష్పాలనిస్తున్నవీ  
వేయికవులసంగమానికిస్ఫూర్తినిస్తున్నవీ                                                                                            
                                                            నవవసంతం వికసించింది
                                                             కవులతోట పులకించింది
                                            ప్రతిచెట్టూ కొత్తకాంతులు విరజిమ్మింది
                                           ****అవేరా****






SK101-15   ది 5/11/15

* శీర్షిక: తొలిపొద్దు...మలిపొద్దు *

ప్రభాత వేళ ........
తొలిపొద్దు పొడిచింది
చీకటిని వెలుగు రేఖలు తరుముతున్న వేళ
తూరుపు దిక్కున మంచు తెరలను చీల్చుకుంటూ
ఉదయ భానుడి ఉషోదయ కిరణం పలకరించినా
నీ ప్రేమ పలుకరింత లేకుండా తెల్లవారదు నాకు

 నీ తీయని పిలుపుతో
కమ్మని కాఫీతో
వెచ్చని ముద్దుతో
నన్ను నిద్రలేపుతావు
పెరటి మామిడి చెట్టు పైనున్న కోయిల
కిటికీలోంచి తొంగి చూసి కుహూ..కుహూ అని
తీయనిగొంతుకతో తన ప్రియుడిని పిలిచింది
ఆ కోయిల పాటకు పరవశించే లోపే
దినచర్యకు కార్యోన్ముఖుడను చేసి పంపుతావు

సాయం సంధ్య వేళ ........
మలి పొద్దు పొడిచింది
వెలుగును చీకట్లు కబళించే వేళ
పడమర దిక్కున కొండలనడుమకు
ఎర్రబడిన సూరీడు  చల్లగా జారుకుంటున్నాడు
ఎర్రని  కిరణకాంతులు నల్లని కొండపై పగడపు కాంతులీనుచున్నవి
ఆ కాంతికి ఆకాశం ఎర్రసముద్రమైంది
ఆకాశంలో.....
అలసి సొలసి ఇంటిదారి పట్టిన కపోతాలు
ఎర్రసముద్రంలో నావికావిన్యాసాలను తలపిస్తున్నాయ్

అలసిన ఒడలుతో బడలికతో
ఇంటికి చేరే నాకు
వెన్నెల నిండిన కన్నులతో  తలలో మల్లెలతో
గంధ సుగంధాలతో  దేవేరిలా ఎదురౌతావు
నల్లని కురుల మద్య నీ మోము
నల్లమబ్బులోంచి తొంగిచూసే చందమామలా ఉంది

నిన్ను  చూసిన క్షణం ...
నా అలసట ఆవిరైపోతుంది
నీ నల్లని కురులలో తురిమిన
తెల్లని మల్లెల మధుర సుగంధ పరిమళాలు
మదిని గిలిగింతలు  పెట్టే  మన్మధబాణాలవుతాయి  

ప్రేమానురాగాలు రంగరించిన గోరుముద్దలు
నా హృదయ తంత్రులను మీటగా
అమ్మ ప్రేమను మరపించే అమృతభాండాలయ్యాయి

పూలపానుపు    .... ఆపానుపు పై
పవళించిన మరో క్లియోపాత్రలా నువ్వు
నా  స్పర్షకు అత్తిపత్తివౌతావు
నీ ముఖారవిందాన విరిసిన సిగ్గు దొంతరలు
కందిన నీ చెంపల కెంపులు చూసి
అతిశయమౌతుంది  నాలో ఆనందం అంబరానికెగసి
అందమైన మరో అనుభూతికి
సోపానమౌతుంది నీ  నులివెచ్చనిముద్దు
అందుకే
ప్రతి ఉదయం నాలో నూతన ఆశయాలు ఉదయిస్తాయి
ప్రతి సాయం సంధ్య నాకు నూతన అనుభూతులను అందిస్తాయి
*******************అవేరా*************************



sk 101-16

  *శీర్షిక:  మరో దీపావళి *

ఎక్కడోపుట్టాము ఎక్కడోపెరిగాము
సరస్వతీ మాత సేవలో
 సాహితీ వనంలో కలిసాము

గ్రామాలుదాటి జిల్లాలు దాటి
రాష్ట్రాలు దాటి దేశాలుదాటి
ఖండాలు దాటి వాట్సప్ వేదికగా
జగదైక తెలుగు కుటుంబం అయ్యాము

ఈ సాహీతీ వనంలో  ఎన్నెన్నో వృక్షాలు
కొలువుతీరి ఉన్నాయి
ఎన్నో ఎన్నెన్నో పుష్పిస్తున్నాయి
సుగంధ సుమధుర  సాహితీ పరిమళాలు
విశ్వంలో వెదజల్లుతున్నాయి
సమున్నత మధుర భావ ఫలాలనిస్తున్నాయి  

పాటలు, పద కవితలు, పద్య కవితలు
గజల్లు, చందోబద్ద కవితలు
చంపక మాలలు, కంద,సీసాలు
ఆటవెలది  ,మత్తేభ,శార్దూలాలు
రూపమేదైనా తెలుగు  సాహితీ
సౌరభాలను ఖండాతరాలలో వెదజల్లుతున్నాయి
 తేనెలొలుకు తెలుగు భాష మాధుర్యాన్ని
జగత్తులో వ్యాపింప జేస్తున్నాయి

18 నవంబరు నాడు వాట్సప్ వేదికగా
మరో దీపావళి పండుగ జరుగనుంది
ప్రపంచ వ్యాప్త సహస్ర  కవులు
కవితల దీపాలతో  తెలుగు కళామతల్లికి
నీరాజనాలు అర్పించనున్నారు  

ఆ దీపాల వెలుగు సమాజానికి ప్రగతి బాట చూపనున్నది
చెడు పై మంచికి విజయ బాట వేయనున్నది  
విజయ బావుటా ఎగురవేయనున్నది
మరోదీపావళికి నాంది కానున్నది
     *****అవేరా **** 7/11/2015

sk101-17
* శీర్షిక: పత్తిరైతు *

తెల్ల బంగారం
ఔను తెల్ల బంగారమే!
అది ఒకప్పుడు
పత్తి పండిందంటే రైతు "పంట" పండినట్లే
బంగారం చేతికందినట్లే

పంట పండక పోతే?
ఆ ఊహే రైతుని వణికిస్తుంది
చేసిన అప్పులు కొండంతై
తీర్చే మార్గం కానరాక దిక్కు తోచక
పురుగును చంపిన మందే దిక్కవుతుంది
ఉరితాడే యమపాశమౌతుంది

పంట పండినా!
పత్తి రైతులు చిత్తవుతున్నారు వ్యాపారుల చేతుల్లో
వీరి అమాయకత్వమే వారి మోసానికి ఆసరా
బురిడీ కొట్టించి బుట్టలో వేస్తారు
నాణ్య త పేరిట  ఒకమోసం
తూకం పేరిట ఒక మోసం
అధికారులు వ్యాపారులు
చేయి చేయి కలిపి భాయి భాయి అనుకుంటారంటారు
కాటన్ సిండి"కేటు"గాళ్ళంటారు

ప్రకటించిన ధర చూసి మిల్లుకి వెళితే రైతుకి శఠగోపం
సౌకర్యాలు లేని మార్కెట్లలో  బహిరంగదోపిడికి  గాలం
అన్నిసౌకర్యాలు కల్పిస్తామన్న
అధికారుల మాటలు నీటిమీద రాతలే
రైతులకు, నోరులేని పశువులకు
మంచి నీటి సౌకర్యాలు లేవు
అస్తవ్యస్తమైన రోడ్లు వెరసి
అస్తవ్యస్తమైన పత్తి రైతు బ్రతుకు

అందుకే ...... కావాలి కావాలి ఆసరా
ఋణమాఫీలు కాదు గిట్టుబాటుధర కావాలి
హామీలు కాదు మంచి విత్తన పంపిణీ కావాలి
కధలు చెప్పటం కాదు కనీస విద్యుత్తు  కావాలి
కావాలి కావాలి మౌలిక సదుపాయాలు

 వ్యాపారులారా  ........ అధికారులారా ....
నీతి ... నిజాయితి లు పాటించండి  
రైతుని నట్టేట ముంచకండి
ఫ్రకృతిని మీరు శాసించలేరు
ప్రకృతి వైఫల్యాలనుండి రైతును మీరు కాపాడలేరు
మీరు చేయగలిగే సాయం మీరు చేయండి చేయూతనివ్వండి
పేద రైతుల ఉసురు తీయకండి ఊరడించండి
రైతు ఆత్మహత్యలు దేశప్రగతికి గొడ్డలి పెట్టు

రైతన్నా!
నీ చుట్టూ అల్లుకున్న సమస్యల వలయంలో
నీవున్నావని తెలుసుకో
నీ కష్టాన్ని దోచుకునే గుంటనక్కలున్నాయి
అనుక్షణం  నిన్ను పీక్కు తినే తోడేళ్ళున్నాయి
నీ నోటి కూడు తన్నుకు పోయే రాబందులున్నాయి
లే ! నిద్ర మత్తు విడిచి జూలు విదిల్చి సిద్దంకా!  సింహం లా !
అలుపులేని పోరాటానికి నీవు చేసే సింహ నాదం
తోటి రైతులకు పిలుపు  ప్రభుత్వానికి మేలుకొలుపు
పోరాడితే పోయేదేమీలేదు రైతుల ఆత్మహత్యలు తప్ప
ఆత్మహత్యలతో వచ్చేదేమీ లేదు మరో ఆత్మ హత్య తప్ప
ఆత్మీయుల ఆత్మఘోషతప్ప!!

సమస్యేదైనా కాదు పరిష్కారం ఆత్మహత్య
నిలదీసి అడుగు అప్పుకాదు !
అప్పు మాఫీ కాదు !
 సమస్యకు పరిష్కారం !
అలుపెరుగని పోరాటంతో సమస్యలన్నీ
తెల్లమబ్బులా తేలిపోతాయి
అంతిమవిజయం నీదే !
******అవేరా***** 10/11/2015

sk101-18
* శీర్షక: శిల్పం *

వర్షంలో తడిసిన  నీ  మేను
పున్నమి వెన్నెల కాంతిలో
నీటి బిందువు ముత్యమై
ముత్యాలు పొదిగిన శిల్పమైంది

ఎర్రని పెదవుల పై నిలిచిన వర్షపు చుక్కలు
పగడాలను వెక్కిరించాయి
నాసికాగ్రాాన జాలువారిన
నీటి బిందువొక్కటి  నీ  పెదవులను చుంబించి
చుబుకాన్ని  స్పృషించింది

నింగినీ నేలనీ కలిపింది హరివిల్లు
మన్మధ చాపమై
గుండెలవిసేలా పిడుగుపాటుకు
భయంతో  కళ్ళు మూసుకున్నావు
చటుక్కున చెవులు మూసుకున్నావు

నీ  ముగ్ద  మోహన
సౌందర్యాన్ని దరిచేరి చూడాలని
ఓ  విద్యుత్ తరంగం  ....
నింగి నుండి నేల పైకి దూకింది మెరుపై

ఆ మెరుపు కాంతిలో
నీ రూపు బంగారు శిల్పమైనది
ఆ శిల్పం నా గుండెలో పదిలమైనది  
నా కవితా శిల్పానికి ప్రాణమైనది

అప్పుడనిపించింది  నాకు
మెరుపునైనా కాక పోతినె నీ మేను తాకగ
నీటిబిందువునైనా కాక పోతినే నీ పెదవి తాకగ
                    *****అవేరా***** 5/11/2015
 sk101-19
10/11/2015
* శీర్షిక: సింధూ నాగరికత *  

నాడే సాక్షాత్కారం  నాగరిక  జీవనం
కుమ్మరి  చక్రంతో కమనీయమైన కుండలు
కాల్చిన ఇటుకలతో శతాబ్దాలు నిలిచిన కట్టడాలు
ప్రణాలిక బద్దమై సిద్దమైన భవనాలు

రమ్యమైన రహదారులు
లంబకోణ కూడళ్ళు
మురుగు నీటి పారు దలకు ముచ్చటైన  వ్యవస్ధలు
ఇటుక రాయి తాటించిన ఇంపుగ రాణించిన
బావులు చెరువులు
స్మశానానికైనా  తీరైన నిర్వహణ

అరక దున్నే ఎద్దు ఒండ్రు భూములు దున్నగా
పసిడి పంట పొలాలు బారులు తీరగా
అటునిటు పచ్చతివాచీతో గంగమ్మకు స్వాగతం పలుకగా
యమునమ్మ  కరుణతో
తృణధాన్యాలు, చిరుధాన్యాలు,
బీన్స్ బార్లీ, అవిసె ఆవాలు
ఆశతీరగ పండించి  మిగులు దిగుబడి సాధించి
ధాన్యాగారాలు నింపినారు పట్టణాలకు పంపినారు

పల్లెజీవనమీవిధము అలరార
పట్టణాల ప్రగతి పరిఢవిల్లే
చేతిపనివారు, నేతపనివారు
వృత్తి పనివారు వర్తకులును
రాతి పరికరాలు రాగి పరికరాలు
రమ్యమైన సరకుల రచన జరిగే
రమణీయ కుండలు నిల్వకు వంటకు  కాగా
విలాసాల సరసరసభావుకులకు
పూసలు బిళ్ళలు
బంగారు  వెండి నవరత్నాలు

ఆనాటి హరప్ప మహంజదారో
సింధు నాగరికత కౌశలమే
చరిత్ర అందించిన నేటి ప్రగతి
ఇ.హచ్.కార్ అభిభాషణకు నిదర్షనం

(చరిత్ర:
ఇ.హెచ్.కార్ అభిభాషణప్రకారం
ఒకతరం తాను సంపాదించినృకౌశలాన్ని
నేర్పుని ముందు తరాని కి అందివ్వడం వల్ల వచ్చే ప్రగతే చరిత్ర )
*****అవేరా****

  sk101-20
*శీర్షిక: కళ్ళు*

చూస్తే ఆ "కళ్ళు"
తిప్పలేము మన కళ్ళు
ఆయన కనిపించే సీను
కురిపిస్తుంది హాస్యపుజల్లు
మొక్కవోని దీక్షాపట్టుదలలకు  తార్కాణం
నాటకాల మోజు అప్పుల పాల్జేస్తే
సినిమా సి"తార" ను చేసింది
తొలి చిత్రం లోనే నంది పురస్కారం
"కళ్ళు" నటనే దానికి తార్కాణం
" కళ్ళు"  చిదంబరమయ్యాడానాడే
త్రిశత చిత్రాల హాస్యవినోదం
తెలుగు ప్రేక్షకులకు అతిశయ ఆనందం
1600 మంది కళాకారుల  సకల కళల సమాఖ్య స్థాపన
ఆయన కళా  తృష్ణకు తార్కాణం  
ఆ  కళ్ళు... ఇక కనిపించవు  అన్నభావన
హాస్య రసాస్వాదికులకు  వేదన
కనరాని లోకాలకేగిన ఓకళాత్మజ !
అందుకోవయ్యా మా హార్దిక నివాళి !
          *********అవేరా********
(1/11/2015 తెలుగువేదిక.నెట్  7 వ
సంచిక లో ప్రచురిత మైన కవిత)
sk 101_ 21
*శీర్షిక: సీసా! *

ఔను!
సీ...........సా...... త్రా(చు)
సీను చేయరా సారా త్రాగి
స్రీ..ను... ఏం.... ది స్సారూ! ..
స్రీసా.....ఇ...స్త...రా!
ఏ పల్లె చూసినా ఇదే సీను
ఏ పట్నం  చూసినా ఇదే సీను
మందే వారికి జీవామృతం
మత్తే వారికి జీవనం
మరి ఈ జీవామృతంతో
ఆత్మారాముడు శాంతించేనా?

మందు మత్తులో ఆలి బిడ్డల తేడా తెలియని
కామాంధుల కళ్ళు పీకాలి
కామానికి  కళ్ళుండవు..  గుడ్డిది !
మందు మత్తులో వాహనాలను
మృత్యు శకటాలుగ మార్చే ముష్కరులను
ఇవ్వాలి  బలి ఉరికొయ్యలకు
మందు మత్తులో రహదారులపై
అల్లరిచేసే చిల్లర నాయాళ్ళదుమ్ము దులపాలి

మత్తు కోసం బ్రతుకు చిత్తు చేసుకునే అమాయకు లారా!
కనిపించుట లేదా మీకు చిద్రమైన సంసారం
కనిపించక కన్న ప్రేమ దారితప్పిన సంతానం
కనిపించుట   లేదా చితికిన ఆర్థిక పరిస్థితి
అప్పు చేసి త్రాగితే మీకు చిప్పే గతి
ఆపై పేరుస్తారు చితి

సంసార భాద్యత నీ విధి
ఆలుబిడ్డలే నీ నిధి
" నాతిచరామి" అన్న పెళ్ళి  నాటి ప్రమాణం మరచి
మద్యానికి బానిసై  అప్పుల పాలై
మగువసొమ్ములకాశపడి
అప్పు తీర్చటానికి అదనపు కట్నం అడిగితే
కష్టం సుఖం  నీతోనే అని నీతో ఏడడుగులు నడిచిన పాపానికి
చేయివీడి   అనాధను చేస్తావా?

అమ్మకాలు నూరు శాతం  దాటిన వేడుక
నెలకు 1400 కోట్లు ఖజానా కానుక
అని సంబుర పడే ప్రభుతా !
నీ మనుగడ కోసం విషసంస్కృతి నాటి
అది వేళ్ళూని ఊడలు తొడిగి
విషజ్వాలలు విరజిమ్ముతుంటే
కరాళుడి వికృత నాట్యాలతో
కుటుంబాలు కకావికలమౌతుంటే
"మధ్య పానం ఆరోగ్యానికి హాని కరం"
అని శ్రీరంగ నీతులు చెప్తూ
మల్లెల మనసులపై
విషాన్ని విరజిమ్ముతావా
వల్లకాటి "విజయ సంబరాలు "చేస్తావా?
మానవ శవాల పైన ప్రగతి బాట వేస్తావా???
ఎవరి కోసం?? సమాజంలో
మిగిలే  జీవచ్చవాల కో సమా?
        *****అవేరా***


sk101-22
నవంబరు 11న "  జాతీయ విద్యా దినోత్సవం "
 భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్
జన్మదినం సందర్బంగా
*శీర్షిక: విద్య*
ప్రాధమికంలో చిన్న నీటి జాలు లా మొదలై
 ఉన్నతంలో ప్రవాహమై  ఆఖరుకు అలలా  ఎగసి పడేదే విద్య
భవిష్య భారత నిర్మాణానికి పునాది రాళ్ళు నేటి బాలలే
నేటి బాలలే రేపటి పౌరులు
ఉత్తమ విలువల విద్యా బుద్ధలు
ఉత్తమ విద్యా విధానం  నెలవైన
పాఠశాలలు విద్యాలయాలు భవిష్య భారత నిర్మాణ దేవాలయాలు
విద్య  బహుముఖ లక్ష్య ఫలప్రదాయని
ఉద్యోగమొక్కటే కాదు  దేశభక్తి, దేశరక్షణ,
ప్రేమ ,కరుణలు పెంపొందించటం
మానవత్వం నింపటం విజ్ణానం పెంపాదించటం
సామాజిక అంశాల అవగాహన,  స్పందనలు
ఒక  జాతి గౌరవం విద్య
ఒక దేశగౌరవం విద్య
విద్య లక్ష్యం  ఉత్తమ పౌర సమాజనిర్మాణం
విద్య సమస్త సమస్యలకు పరిష్కారం
విద్య సమాజంలోని అసమానతలను రూపుమాపేది
విద్యకు కుల మతాలు లేవు
నాడు ....విద్య కొందరికే పరిమితం
కులాల పేరిట ధనిక పేద భేధాల పేరిట
అడ్డుగోడలు ప్రగతికి ప్రతిబంధకాలు
విప్లవించిన విద్యా వేత్తలు ఆగోడలను కూల్చి
కేకలు అరుపులు రక్తం చిందని నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు
విద్యాధికుల వివేకానికి విజయనాదమిదే
విద్యలేని వాడు వింత పశువు
విద్య నేర్చిన వాడు విద్వాంసుడు  సామాజిక మార్గదర్శకుడు
విద్యతో మనిషి కొత్త జన్మ ఎత్తుతాడు
సామాజికంగా ఆర్ధిక ప్రగతికి తొలిమెట్టు విద్య
నేడు  ... సమాజంలో కొన్ని చదువుకున్న మృగాలున్నవి
 అక్షరాస్యత అందలమెక్కిస్తుంది
మహిళలందరూ సరస్వతీ పుత్రికలవ్వాలి
 ఆ మృగాల కోరలు పీకాలి
నాణ్యత లేని విద్య నాటు విద్య  ,  చేటు విద్య
పరిపక్వత లేని విద్య పనికిరాని విద్య
సర్వశిక్షఅభియాన్ పాఠశాల విద్యకు బలం
బడులకూ నాణ్యత శ్రేణులు కావాలి
విశాలమైన గదులు ఆటస్ధలం గ్రంధాలయం
ప్రయోగశాలలు  బట్టి గ్రేడింగ్ కావాలి
రాష్ట్రవిద్యా పరిశోధన శిక్షణ మండలి నేతృత్వాన
పాఠశాల విద్యా  ప్రమాణాలు అంబరాన్ని తాకాలి
ఉన్నత భారత్ అభియాన్ కాలేజి విద్యకు బలం
విద్యార్ధిని తీర్చి దిద్దే భాద్యత ఉపాధ్యాయుడిదే  
గురుః భ్రహ్మ గురుఃవిష్ణు గురు దేవో మహేశ్వరః
భావిసమాజ నిర్మాణ గురుతర భాధ్యత  గరువులదే
ప్రపంచం మొత్తం  భారత్ వైపు చూస్తుంది
యువభారత్ నైపుణ్యాన్ని పెంచుకుని
" నవయువ నైపుణ్య మహా భారత్"  ను నిర్మించి
" మేరాభారత్ మహాన్ " అని చాటాలి  
             ******అవేరా ******
sk101-23
*శీర్షిక: దీపావళి *

ఆశ్వయుజమాసాంత మప మృత్యవారంభం
మూడు నాళ్ళ ముచ్చటైన పండుగ
"బలిత్రయోదశి"నాడు  యమదీపదానంతో మొదలై
" నరకచతుర్దశి "  ప్రాతఃకాల నదీ స్నానం
నక్షత్ర కాంతి శక్తి ,
ఉషఃకాంతి శక్తి ,
నీటి అధిష్టాత వరుణశక్తి
సప్తఋషుల అనుగ్రహ శక్తి
అంగీరాది మహర్షుల తపఃశక్తి
నదీ ఔషదశక్తి
నదీమృత్తిక శక్తి
సర్వ శక్తి మయం నదీీ స్నానం
లోక కంటకుడు  నరకుని వధతో  
మరునాడు మహా  పండుగ "దీపావళి"
దిగంతాల వ్యాపించేలా దీపాల ఆవళి
మనుజ లోకాన ఆనంద హేళ
ముంగిట రంగవల్లులు  మామిడాకు తోరణాలు
ద్వారాలకు పూదండ మాలలు
తలంటు స్నానాలు సాంబ్రాణి ధూపాలు
బాలికల పూలజడల జడగంటలు
నూతన వస్త్రాల ముస్తాబు సంబరాలు
ఆధ్యాత్మికానందంలో భక్తి ప్రపత్తులతో లక్ష్మీ పూజ
పూజగది మంగళారతుల గుడి గంటలు
నోరూరించే మిఠాయిలు
పచ్చిపులుసు అత్తెసరు
పొంగలి .. పులిహోర
ఆహా! పండగంటే ఇదేనా !
సూర్యాస్తమయం తో  చీకట్లు ముసిరే వేళ
బారులు తీరిన దివ్వెల వరుసలు
ప్రపంచానికి ప్రేమను పంచే వెలుగులు
చీకటిని (చెడును)పారద్రోలే వెలుగుల జిలుగులు
రంగుల వస్త్రాల్లో పొంగే ఆనందంలో  పిల్లలకేరింతలు
మదినిండా సంతోషపు వెలుగులు నింపే చిచ్చుబుడ్లు  
విషాదాలు కష్టం కన్నీళ్ళు పారిపోయేలా మతాబాల పేలుళ్ళు
ఐశ్వర్యం ఎదుగుదలకు హద్దులు చూపేలా రాకెట్ల విన్యాసాలు
పండగేదైనా పరిమితుల్లో ఉండి పర్యావరణాన్ని కాపాడాలి
వెలుగుల పండుగ అందరి జీవితాల్లో వెలుగు(సంతోషం) నింపాలి
ఈవెలుగులే రేపటి సహస్ర కవి సమ్మేళనంలో
ప్రతి కవి ముఖాన ప్రతిబింబించాలి
      ****అవేరా****


sk101-24
10/11/2015

* శీర్షిక: ఆధారం  *

నీట మునిగే వానికాధార మగును
గడ్డిపోచ గరికె గాఢముగాను
సాహితీ నదినీద నీకేల గడ్డి గరిక
"సహస్ర కవుల" నావ నీకు తోడుండగ
          ***అవేరా***

sk 101-25
ముందు మాట:ధర్మార్ధ  కామేషు త్వయైషా నాతి చరితవ్యా
అనే కన్యాదాత అభ్యర్ధనకు వరుడు"  నాతి చరామి"  అని
చేసే ప్రణామాన్ని మరిచి మద్యలోనే భార్య చేయి విడిచి
వెళ్ళే సందర్భంలో ఓ సతి  విలాపమీ తీరునుండు

* శీర్షిక: పాణిగ్రహణం *

నా  పాణి నీ పాణి గ్రహియింప
అర్ధంగినైతి భరియింప నను నీవు భర్తవైతివి
సర్వస్వమ్మర్పించి సతినైతి జీవన కృతినైతి
అర్ధంతరంబుగా పాణివీడుట పాడియే పతిగ నీకు
           ****అవేరా****
sk101-26
*శీర్షిక: సుఖదుఃఖాలు *

పగలు రాతిరి వోలె సుఖదుఃఖాలు
వెలుగు నీడలు బోలు సుఖదుఃఖాలు
శీతోష్ణాలు రాగద్వేషాలు
సుఖ దుఃఖాల  సమన్వయ సాధనే
మానవ జీవన పోరాటం

నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిర్మలం
అయితే మన మనస్సు
బాధనే  సౌఖ్యం గా పొంది
దుఃఖ బాధలేని జీవన సాఫల్యం పొందుతాము

భీష్మఉవాచ "నిందాస్తుతులను సరి సమానంగా భావించటం
నిర్వికారంగా ఉండడమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం "
ఆచరణయోగ్యము

తనగొప్పను చెప్పని వాడు
ప్రతీకారేచ్చ లేని వాడు
ధర్మ మార్గాన్ని  వీడని వాడు
నిజ  సుఖ భోగి

సుఖదుః ఖాలు కలిమి లేములు ఆకాశాన మబ్బులు
కాలయానంలో ఋతువులు
ఏవీ శాశ్వతం కాదు
అత్యాశ అహంకారాలే  గ్రహణాలు
కామ క్రోధ మద మాత్సర్యాలు
ఆవహించిన మాయా మత్తు
మత్తు గ్రహణం వీడి మనిషవ్వాలి

పాపపుణ్య ప్రవృత్తి రాగద్వేష మూలం
రాగద్వేశదోషం "మిధ్యా జ్ఞానం"

మానవ జన్మ శాశ్వతం కాదు
ఐశ్వర్యం దారిద్రం నీవెంటరావు
   ****అవేరా****


sk101-27
*శీర్శిక: మన్నించు!*

మనసా మన్నించవే నన్నిలా !
నీ తోడైన మనసును దూరం చేస్తున్నందుకు
మనసా.... మన్నించవే
కలలు కన్న ప్రపంచం కనుమరుగై పోయింది
ఆకాశానికి ఎగిరిన  ఆశలే అడియాసలై
భూమ్మీద వ్రాలాయి
కోరికలే కొడిగట్టిన దీపమై
తప్పనైన తరుణాన
ప్రాణమైన నీ తోడును దూరం చేస్తున్నానూ
మనసా మన్నించవే నన్నిలా !
    *****అవేరా****
sk101-28
సహస్రకవి సమ్మేళనం
తేది:18-11-2015
వేదిక:వాట్సప్

* శీర్షిక: ఆధునిక బానిసలా ? అంగడిబొమ్మలా? *

విశ్వవ్యాప్త నేరం
మహిళల పట్ల ఘోరం
మానవ అక్రమ రవాణా !
మానవత దివాళా!

మాఫియాల మాయాజాలంలో
వలలోచిక్కిన చేప పిల్లల్లా
విలవిలలాడుతున్నారు మహిళలు,బాలికలు

తేనె పూసిన కత్తుల  మాయ మాటలకొకరు
రుణభార విముక్తి కోసం ఒకరు
పెళ్ళి పేర వంచనకు గురై ఒకరు
ఉపాది ప్రలోభాలను  నమ్మి ఒకరు
నిర్బంధ వ్యభిచారులౌతున్నారు
వెట్టిచాకిరి కార్మికులౌతున్నారు
ఆధునిక బానిసలౌతున్నారు
నీడ ఇచ్చిన ఇల్లే చరసాల ఔతుంది
పాలు పోసిన చేేతులే విషనాగులై
కాటు వేస్తున్నాయి

స్త్రీత్వపు ఔన్నత్యానికి ద్రోహం
మాఫియా పద్మ వ్యూహం
ఈపద్మవ్యూహాన్ని ఛేధించటానికి
అభిమన్యులు కాదు అర్జునులు కావాలి

పాతచట్టాలకు చిట్టి   చిట్టాలు జేర్చి
సంస్కరణల కూర్చితే కాలం వృధా  
కనిపించుట లేదా ప్రభుతా !  మహిళల వ్యధ !

అందుకే
సమగ్ర నూతనచట్టం కావాలి
సామాజిక దృక్పధాన మార్పు రావాలి
అమాయకత్వానికి --- నిరక్షరాస్యత
ఆర్ధిక భారానికి ---  పేదరికం మూలం
మహిళలకు అక్షరాస్యత-ఆర్దిక పరిపుష్టికావాలి
సమస్యకు శాశ్వతపరిష్కారం  తేవాలి
చిరిగిన అరిటాకుని అతుక తరమా
పగిలిన అద్దాన్ని జోడించ తరమా
దెబ్బ తగిలాక గాయనికి కాయకల్ప  చికిత్స మాని
గాయాలే లేని గాయాలేకాని వ్యవస్ధ నిర్మాణం కావాలి

మొదటి స్ధానంలో మాదక ద్రవ్యాల రవాణా
ద్వితీయస్ధానంలో మహిళల అక్రమ రవాణా
ఇదీ నేర ప్రపంచం గతి ...ప్రగతి
ఎటు పోతుందీలోకం  ? ఏమౌతుందీ దేశం?

ఆధునిక బానిసత్వ రొంపిలోచిక్కిన
అమాయక బాలికలకు మహిళలకు
పునరావాసం కల్పన కల్పవల్లి కావాలి
విద్య,వైద్యం ,ఉపాధి, కల్పనలతో
మానసిక  స్ధైర్యం రావాలి
గాఢనిద్రలో ఉన్న స్త్రీ శిశు సంక్షమ శాఖ
కళ్ళు తెరవాలి అన్యధా ఆ శాఖ నిరర్ధకం
ఆ శాఖకు  అమాత్య పదవి ప్రశ్నార్ధకం ????
           ******అవేరా*****



sk101-29 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
* శీర్షిక: బాలల్లారా రండి  !*

 పల్లవి: బాలల్లారా రండి
           భావిభారత పౌరుల్లారా  రండి
           పిల్లల పండుగ వచ్చింది
           మనకు ఆనందం తెచ్చింది
చ1:     మన చాచాజీ పుట్టిన రోజు
            మనకు ఆనందం పంచినరోజు
            మాతా పితలను దైవంగా కొలిచి
            బ్రతుకునే  బంగారంగా మలచి  
            కన్నవారి  కలలనే సాకారం చేద్దాము
            ఉన్న  ఊరినే మనం స్వర్గం చేద్దాాము ...ll బాలల్లారాll
చ2:      పేద  గొప్ప  తేడా లేదు  మన బడిలో
            తెలుపు నలుపు బేధం లేదు
            మన మదిలో  ఖేదం లేదు
            కులమేదైనా మతమేదైనా
            అందరము ఒక్కటై ఆన్నదమ్ములమౌదాం
            చాచాజీ కలలకు వారసులమవుదాం ....llబాలల్లారాll
చ3:      ఉజ్వలంగ చదువుదాం ఉవ్వెత్తున ఎగురుదాం
             ఆకాశమె హద్దుగా  మన భవితే ముద్దురా ...
             నిరాశా నిస్పృహలకు  నీళ్ళొదిలేయండీ
             పట్టుదలే  ఉంటే పట్టుబడును విధ్య
             కృషి తోడౌతే దానికి విజయం  నీ స్వంతం  ...llబాలల్లారాl
               ****అవేరా****

sk101-30
పాట
*శీర్షిక : ఓ ప్రియా !
 పల్లవి: నా తలపును నీ వూహలే  వెంటాడునా
           నా మనసును నీ రూపమే వేటాడునా
            ఓప్రియా! ప్రియా! ప్రియా!
చ1: అతడు:దొండపండు పెదవులు
                    కలువలాంటికన్నులు
                    కందిరీగనడుమును
                    హంసలాంటి నడకను
                    మరుపురాక మరువలేక
                     కంటిమీద కునుకు లేక
                    వేటాడే చూపుల్తో
                    వెంటాడే అందంతో
                   మతి పోతోందే .....ఓప్రియా...ప్రియా   ...   ll   నా ll
చ2:ఆమె:నా కళ్ళల్లో నీ  రూపం పదిలం...పదిలం....
               నీ  మనస్సులో నా రూపం పదిలం..పదిలం...
               అందమైన జ్ణాపకాలు నా తోడుంటే
               నాతో నీవున్నట్లే నీతో నేనున్నట్లే
                ఓ ప్రియా...ప్రియా            ....               ...    llనాll
చ3:అతడు: పని లేకున్నా నీ ధ్యాసే
                   పని చేస్తున్నా నీ ధ్యాసే
                  నిద్దురలోనా నీ రూపం
                  వెంటాడిందే... కలలో
                   నీవే నా జాబిలి ఈ ఇలలో             ........    llనాll
                  *****అవేరా****
sk 101-31
*శీర్షిక: ఎదురు చూపులు *

తొలకకరి వర్షం కోసం
ఎదురు చూపులు
విత్తనం కోసం
ఎదురు చూపులు
దుక్కి దున్ని విత్తు నాటాక
మొలకలకోసం ఎదురు చూపులు
మొలకలొచ్చాక  మరోజల్లు కోసం ..
మబ్బు కోసం ఎదురుచూపులు
చీడపీడ సోకినపుడు
 ఏంచెయ్యాలో తోచక
తికమకలో నువ్వు
సలహా కోసం ఎదురు చూపులు
నీటిగండం చీడ  గండం
అప్పుగండం దాటి హమ్మయ్య
అనుకునే లోపు  వాన లేక చేను ఎండ
పక్క కామందు  కాల్చేతులుపట్టి ఒక్కతడి  పెట్టి
పంటకోసం ఎదురు చూపులు
అదను చూసి కోతకు కూలీల కోసం ఎదురు చూపులు
కూలీల బ్రతిమాలి బామాలి
అడిగినంత ఇచ్చి
పంట ఇంటికి తెచ్చి
మంచిరోజు చూసి మార్కెటుకు పోయి సరకు అమ్మ బోతే
సర్కారు ధర లోన సగం పలికే
తూకం చిక్కి తేమ బలిసి
బారెడు ధర మూరెడాయే
నిలువెయ్య  సొమ్ము లేక
నీరసించి ఇంటికి పోలేక
దిక్కుతోచని దీనావస్తలో
అప్పుభూతం భయపెడుతుంటే
కంట కన్నీరొలక  మసక చూపుల్లో
మనసున మెసిలిన ఆలు బిడ్డల రూపు
అసహాయత  అధైర్యం మనసుని
ముసిరేస్తుంటే.....చావు వైపు లాగుతుంటే
మంచిరోజులొస్తాయన్న చిన్ని ఆశ
దీపంలా దారి చూపె
చావు బ్రతుకుల యుద్దంలో
బ్రతుకు విజయం !!!??
       *****అవేరా ****


sk101-32
* శీర్షిక: అనాధ *

నేనొక అనాధను
అందరూ వున్నా  అనాధను
అమ్మ ఉన్నా  అమ్మ ప్రేమ లేదు
ఆప్యాయత అనురాగాలకు ప్రతిరూపమంటారు "అమ్మ"
ప్రేమకు అక్షయ పాత్రంటారు
పేదరికం ఆర్ధిక చికాకుల సుడిగుండంలో
అక్షయ పాత్ర ఎండిపోయింది
చిక్కి శల్యమై   అస్తిపంజర మైంది

అలాంటి అమ్మనుండి ఏమి ఆశించను
ఎండిన అక్షయ పాత్రలో ఎండుటాకులు తప్ప
నాన్న ఉన్నా నాకు ఆసరా లేదు
సంపాదన లేకున్నా సారామత్తులో జోగుతుంటాడు

కాలేకడుపుతో  బడికెల్తే
కడపునిండిన ఆకలి
మనస్సుని పాఠంపై నిలువనీయదు
చిరిగిన అతుకుల బట్టలను
అదోరకంగాచూసే చూపుల భావం
తోటివిద్యార్ధుల విశాల హృదయాలకు అద్దం పడితే
స్నేహ హస్తం చాచే నేస్తం లేక...నేను అనాధనే !

ఉచితచదువుకు నీవొక అతిధివి
అన్నట్లు చూసే నా గురువుల చూపుల్లో
ఉత్సాహ ప్రోత్సాహకాలెక్కడివి?

తోటిపిల్లలు ఆటవిడుపులో
ఆనందకేరింతల్లో మనిగి వుంటే
ఆత్మన్యూనతలో నేను వారితో కలువలేక
ఎంత మధనపడి పోయానో
ఎవరికి చెప్పుకోను??

ఆకలి ఉదృతమై అన్నం బెల్లు కోసం
ఆత్మారాముడెదురు చూస్తుండగా
పండగ చేస్కో ! అన్నట్లు బెల్లు మ్రోగింది  
పరుగున వెళ్ళి చాచిన పళ్ళెంలో
వడ్డించిన అన్నం పప్పులు చూసి
ఆకలి చచ్చిపోయింది
రెండు ముద్దలు కష్టంగా మ్రింగి
కడుపు నిండా నీళ్ళు త్రాగా !

కోట్లలో ఖజానాకు చిల్లు పెట్టి
పేద విద్యార్ధి కడుపు నింపలేని
పధకాలు వృధా అని గొంతు చించుకు అరవాలనిపించింది
నిన్న రాత్రి అమ్మపెట్టిన రెండు ముద్దలే అయినా
పరమాన్నంలా అనిపించింది

నా లాంటి పేద విద్యార్ధులకు
ప్రభుత్వాలు ఎన్ని పధకాలు పెట్టినా వృధా
మా జీవన ప్రమాణాలు పెరిగితే తప్ప
మా చదువులు సాగవు ముందుకు
మాకు చేయూత ఇవ్వలేని సమాజం ఎందుకు?
దశాబ్దాలు గడచినా దయనీయం మా బ్రతుకులు
         *******అవేరా********

sk101-33
* శీర్షిక: స్వాగతం సుస్వాగతం *

పల్లవి: స్వాగతం సుస్వాగతం!
           సహస్రకవీంద్రులకు స్వాగతం!ఘనస్వాగతం!
           కవితాంజలి ఘటియించగ
            హృదయాంజలి గైకొనుమా!.....llస్వాగతంll  
చ1  :   పారిజాత పరిమళాలతో
            మరువం మల్లెల మాలలతో....llస్వాగతంll
చ2 :     కవనమధువులొలికే  వేళ
            రస కావ్యం చిలికే  వేళ
            భావామృతమొలికే  వేళ.....llస్వాగతంll
 చ3  :   రసాభావ సంగమం
             కవిచేత సంభవం
             ఈనాటి సంబరం
             తాకేను అంబరం ....llస్వాగతంll
చ4  :     రసహృదయులకు
             ఆత్మీయులకు
             కవిపుంగవులకు  ..... ll స్వాగతంll
చ5 :      కవులంతా కలం పట్టి
             కవనంతో జత  కట్టిన
             మరో భువన విజయమిది
             సహస్రకవి సమ్మేళనమిది
             తెలుగు కవుల విజయోత్సవమిది...llస్వాగతంll
                 ********అవేరా********

sk 101-34

* శీర్షిక: స్నేహం *

తోడులేని మనిషి  జీవితం
 ఒంటిపిల్లి రాకాసి  జీవితం
ఒంటికి చేటు ఇంటికి కీడు
చిత్ర విచిత్రాలు మానవ సంబంధాలు
విరుద్దమైన మనసైనా
నీటమునిగిన సేతువులా కలుపుతుంది స్నేహం
మనిషి సంఘజీవి
ఓర్వలేడు వంటరితనాన్ని
ఆత్మీయతానురాగ కేంద్రం
మానవ హృదయం
తోటి మానవుడి  పట్ల సానుభూతి
ఏజంతువుకూ లేని
రసస్పందనలు మనిషివి
కరుణారస సింధువు హృదయాన ఉన్నవాడే
మహనీయుడౌతాడు
సలహాలమైత్రి హితుడు
భుజం తట్టేది  సన్నిహితుడు
కర్తవ్యాన్ని గుర్తు చేేస్తాడు
కష్ట సుఖాల్లో  తోడు నీడగ
నిలుస్తాడు స్నేహితుడు
స్నేహం అంటే ప్రేమ
ప్రేమ అంటే త్యాగం
ప్రేమించెే మనసే త్యాగం చెయ్యగలదు
ఇద్దరు వ్యక్తులను మానసికంగా ఆత్మికంగా
దరిచేర్చే దివ్యరసాయనం స్నేహం
దుఃఖంలోమునిగిన వ్యక్తి
బుజాన్ని స్నేహహస్తం తాకగానే
గుండెలోదాగిన కన్నీరు
పొంగిపొర్లుతుంది ఆత్మీయంగా అద్వితీయంగా
బాధాతప్త హృదయానికి
ఊరటకలిగించే ఆస్పర్శ
ఆర్ద్రమైన సానుభూతికి సంకేతం
ఘనవిజయానికి భుజం తట్టి
మెచ్చుకుంటే ఆనందపులకితమౌతుంది మనస్సు
ఆ భుజం తట్టే హస్తమే స్నేహానికి నేస్తం
స్త్రీపురుష హృదయపూర్వక చెలిమి బలిమికి
పరస్పర ఆకర్షణ ప్రధానమైనా
వారిని జీవితాంతం కలిపి వుంచేది స్నేహమే
ఇద్దరు ఒకటై చెరిసగమై ఒకరికొకరై
జీవించటానికి అంతరంగాన పాదుకున్న
స్నే హలతే పందిరివేయాలి పూవులు  పూయాలి
కళ్ళ కిటికీలనుండి ఆత్మలు పరస్పరం స్పందించాయి
వారి స్నేహలత నుంచి వెల్లివిరిసిన ప్రేమ  పారిజాాతం
మధురపరిమళాలు వెదజల్లింది
స్నేహసంబంధ మనోహరమూర్తిలు
ప్రేమనే స్ఫూర్తిగా మలచుకున్న ధన్యచరితలు
స్నేహమే ఆర్తిగా అలుముకున్న పుణ్యజీవులు
వారి జీవితం స్నహరాగ రంజితం
ఆధునిక జీవితాన ఒంటరి బతుకులు
ఆనందం లేని జీవనయానానికి స్నేహరాహిత్యమేహేతువు
ధనమే దైవంగాకొనసాగేవిచిత్రజీవనయాత్ర
ప్రేమ లేక మనసులు దూరమౌతున్నాయి
ఆలుమగలమద్య అంతరాలు
ఎడారిబాటనపయనిస్తువ్న
అధునాతన జీవితాాలకు
సరికొత్త స్నేహ ఒయాసిస్సులు  నిర్మించాలి
జీవన వనంలో స్నేహ చకోరాలను పెంచుకోవాలి
జీవనగమనంలో స్నేహరాగబంధాన్ని పంచుకోవాలి...!
         *********అవేరా *********
sk101-35
19 నవంబర్ అంతర్జాతీయ   పురుషుల దినోత్సవం  సందర్బంగా

* శీర్షిక: పురుషుడు*

పుట్టి పుట్టగానే
ఇంట్లో ఆనందపు పూలజల్లు కురుస్తుంది
వారసుడొచ్చాడని వంశోద్దారకుడొచ్చాడని
బాల్యదశలోనే బండెడుపుస్తకాల బరువు బాధ్యతగా మోస్తాడు
మెదడు పుస్తకంలో అక్షర విషయాలనెన్నో
పొందికగా రాసుకుంటాడు
యుక్తవయసులో కాలేజీ చదువులు
పరుగు పందెంతోమొదలెట్టి
మరాధన్ తోముగిస్తాడు
చదివినంతకాలం చదువే తన బాధ్యతగాభావిస్తాడు
ఉద్యోగం పురుషలక్షణం అన్నారు పెద్దలు
ఇందులోపురుషస్వార్ధం వీసంతలేదు
పురుష పక్షపాతమూ లేదు
ఆమాటకు అర్ధం
కుటుంబ బరువు భాద్యత పోషణ
పురుషునికి ఆపాదించటం
పూర్తిఅయినచదువుతో
ఉద్యోగ వేట బాధ్యతల సయ్యాట
ఎన్నో కలలతో మరోచేయి తోడందుకుని
తనచేయి తోడందించి
మరో నవ్యవసంతాన అడుగిడతాడు
నిజమే వసంతమే !
నవ వసంతం అందాలు
ప్రకృతి సరిగమలు
కోయిల మధుర రాగాలు
సుమపరిమళాల మలయ సమీరాలై
పచ్చని వెచ్చని "ఆ"వరణంలో
ఆనందం అంబరమంటే వేళ
అమ్మ అయ్య
 "పెళ్ళామే బెల్లమా" నిరసనలతో
ద్విపాత్రాభినయం తప్పదు
అలీనవిధానంలో అల్లుకు పోతాడు
ఉలికిపడి మానసిక ఒత్తిడితో
వసంతం నుండి గ్రీష్మంలో  అడుగుపెడతాడు
కుటుంబంకోసం భర్యాబిడ్డలకోసం
తన జీవితాన్నే కొవ్వొత్తిని చే్స్తాడు
జీవితభాగస్వామికి ప్రేమానురాగాలు
బిడ్డలకు  మమతానుబంధాలు
సమాజానికి సౌబ్రాతృత్త్వాన్ని పంచుతాడు
సంసారమంటే సమస్యల తోరణం
సమస్యలతో.....రణం
ఇంటాబయటా వత్తిళ్ళను
పిల్లల చదువు పెళ్ళిళ్ళుకు
ఆర్ధిక వత్తిళ్ళను తానొక్కడే భరిస్తూ
తీవ్రమానసిక వత్తిళ్ళతో
వాడిన వృక్షమై  అనారోగ్యం పాలవుతాడు
రక్తపోటు మధుమేహంపక్షవాతం
మైగ్రేన్ హెమరేజ్ గుండెపోటు
అన్నీకాకపోయినా కొన్నయినా
వృక్షానికి పూసిన  పుష్పాలై
కూలిన వృక్షంతో కలిసి రాలిపోతాయి
అందుకే పురుషుడు త్యాగజీవి ...ధన్యజీవి !
          ************
(ఆరోగ్య సర్వేల ప్రకారం పైన చెప్పిన వ్యాధులు ఎక్కువగా మగవారికే వస్తున్నాయి)
       ********అవేరా********


sk101-36
ది; 20/11/2015
* శీర్షిక: హిజ్రా*

సమాజం అనంతాకాశం అయితే
ఆకాశపు  చివరి అంచున జీవిస్తున్నాం
విశ్వాంతరాల్లో కృష్ణబిలం అంచున
హక్కుల  రెక్కలు విరిగిన పక్షులమై జీవిస్తున్నాం
హక్కులు అందరికీ ఉన్నాయి
అడవిలోని కలుపు మొక్కకైనా
వర్షపు నీటిపై హక్కుంటుంది
కలుపు మొక్కల పాటి కావా మా బ్రతుకులు
కులం..మతం..లింగ భేదాలు హక్కులకాధారమా ?
మా హక్కులు కృష్ణబిలంలోకి
మీ హక్కులు మీ ఇంటి ముంగిట్లోకా??

మా హక్కులు కాలరాసినప్పుడు
పోరాటమే మా ఆయుధం
పురుషుడు స్త్రీలై నందుకు
వివక్ష ... వేదన ....హేళన లతో
నిత్యజీవన పోరాటం మాది
అర్ధనారీశ్వరులకు పొర్లు దండాలు
మాకు అవమాన దండలా??

సహనం సంతోషాలు మా  సంస్కృతి
యాచక వ్యభిచారాలు కాదు మా వృత్తి
వంచన మోసాలు కాదు మా ప్రవృత్తి
మా దీవెనలు దేవతాంశయుక్తం
మేము లేక ఏశుభకార్యము లేదు
దైవ వరప్రసాదులం మేము
మంచిపనులు చేసే సామర్ధ్యం మాకూ ఉంది
మేమూ నాయకు(రాళ్ళ)లమవుతాం
మేమూ పాలకు(రాళ్ళ)ల మవుతాం

వసంతం వాకిట్లొ మావిచిగురు రుచి ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో కోయిల కూస్తుంది తీయగా
ఆ కోయిల రాగాన్ని మేమూ ఆస్వాదిస్తాం మీ లాగానే
కలలూ కోరికలూ మాలోనూ చిగురిస్తాయి నవవసంతంలా

స్పందన ప్రతిస్పందవలు మాలోను ఉన్నాయి
మాలోనూ రక్తమాంసాలున్నాయి
మాలోనూ కోపతాపాలున్నాయి
మాలోనూ సుఖదుఃఖాలున్నాయి
మాలోనూ బాధ సంతోషాలున్నాయి
మాలోనూ పంచేంద్రియాలున్నాయి
మరి మాకెందుకీ వివక్ష??

మాకు కావల్సింది మీ దయా దాక్షిణ్యాలు కావు
మా అస్తిత్వానికి గుర్తింపు
అన్ని హక్కులూ మాకు వర్తింపు
         ****అవేరా****

sk101-37
ది : 20-11-2015

* శీర్షిక:   స్త్రీ*

రూపులేని నెత్తుటి ముద్దకు
ఊపిరులూదింది ఒక మాతృమూర్తి
మరో అమ్మకు జన్మనిచ్చింది
మహాలక్ష్మి పుట్టిందన్నారెవరో
అమ్మో ఆడపిల్లా ! అన్నారింకొకరు

హు..లోకో భిన్న రుచి  !
అమ్మతనానికి ఆ బేధం లేదు
ఆడైనా మగైనా తను మాత్రం అమ్మే
ముర్రిపాలు పట్టి ముద్దుచేస్తుంది
ముద్దులొలికే మాటలకు మురిసిపోతుంది
బుడిబుడి నడకలకు వడి నేర్పుతుంది
వణికించే చలిలో తాను వణికినా
ఒడి వెచ్చదనం పంచుతుంది

బారసాల సంబరాలు మొదలు
శైశవాన అమ్మను మురిపిస్తుంది
బాల్యంలో సోదరులను ఆటలతో మరిపిస్తుంది
కన్యగా కవుల కలలలో కలంలో
 సౌందర్య సొబగులద్దుతుంది
అందాల హరివిల్లై సిరిమల్లెల నవ్వై
మందారంలా విరబూస్తుంది

అన్నదమ్ములకు ప్రేమానురాగాల  రక్షాబంధనమౌతుంది
అక్కాచెల్లెళ్ళ కు అనురాగ సాగరమౌతుంది
కట్టుకున్నవాడి కోసం కన్నప్రేమకు దూరమౌతుంది
మెట్టినింటి గౌరవాన్ని దీపంగా తలదాల్చుతుంది

అత్తమామల ఆరళ్ళు
ఆడపడుచు వెక్కిరింతలను
పిల్లచేష్టలుగ భరిస్తుంది
మెట్టినింట కటిక నేలనే
పుట్టింటి ఫోమ్ బెడ్ లా భావిస్తుంది

ఆదర్శఇల్లాలై భర్తకు సేవలు చేస్తుంది
కష్టసుఖాలలో తోడునీడైనిలుస్తుంది
వేణ్నీళ్ళకు చన్నీళ్ళా
సంపాదనలోభర్తకుచేదోడువాదోడౌతుంది

ఇంటిపనులు ఉద్యోగం జోడుగుర్రాల స్వారీ
అలసట ఆందోళన ఆవేశాలు దరిచేరకుండా
భూదేవంత ఓర్పుతో నిర్వహించే శాంతమూర్తి

వంటా వార్పుతో
రుచుల చేర్పుతో
మాటల నేర్పుతో
వండి వడ్డించి తినిపించి
కుటుంబంలో ఆనందమే తన ఆనందమై

శ్రమ ...వత్తిడికి అందం ఆవిరైపోయినా
ఆరోగ్యం కొవ్వొత్తిలా కరిగిపోయినా
భాద్యత మరువని త్యాగశీలి
భేషజమ్ముల విచ్చిన్నమౌ సంసారం
భేషజాలకు పోని సంస్కారము నీది
సహజీవనంలో సరిగమల సాక్షిగా
మమతానురాగాలకు మారు పేరు స్త్రీ
అమ్మా! నీవే లేకుంటే ఈసృష్టి ఎక్కడిది

అందుకే
అమ్మను పూజించు
భార్యను ప్రేమించు
సోదరిని దీవించు
కూతురిని లాలించు
స్త్రీని గౌరవంచు
కలకంటి కంట కన్నీరొలికించకు!

మన సంస్కృతి మను సంస్కృతి
"యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్రదేవతాఃl
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాఃతత్రా ఫలాః క్రియాః
       ****అవేరా *****

sk101-38
* శీర్షిక:   సుభాషితాలు*

పేరులో ఏమున్నది  అక్షర కూర్పు
నోటిలో ఉండాలి మాటలనేర్పు  
కార్య సాధనమున కావాలి ఓర్పు
పొరుగువాడిని చూసి ఏడ్పు
నీఆశల దీపాలనే  ఆర్పు
మనసున మంచి ఆలోచన చేర్పు
నీ వైపే అనుకూల తీర్పు
ఆపై అభిరుచుల వంటావార్పు
   ****అవేరా****








sk101-39
* శీర్షిక: టిక్..టిక్..టిక్ *

ఏ ఆర్ రహమాన్ శృతి లయ
నీ నడకలో వుంది
వయ్యారంగా నడుస్తావు
వలయాలే చుడుతుంటావు
అలుపనేదే లేకుండా
మరాధన్ పరుగుతో
చేరిన గమ్యాన్నే చేరుతుంటావు
మళ్ళీ మళ్ళీ.....
నీకు తోడుగా మరో ఇద్దరు పరుగెడుతున్నా
పరుగులో నీకు లేరెవరూ సాటి
నిదుర లేచినది మొదలు
నిద్ర పోయే వరకు
నిను చూడని వారుండరు
మానవుల సమయపాలనకు
దిక్సూచివి నీవు
జి.ఎమ్.టి తో అనుసంధానమౌతావు
ప్రపంచ కార్యాలకు సమయ నిర్దేశ్యం చేస్తావు
నిన్ను లెక్కచెయ్యని ఆలస్యపు రైళ్ళకు
ఆలస్య పట్టికలో మొట్టికాయ వేస్తావు
ఇంద్రధనుస్సు రంగులలో
ఇంటికి సొగసు తెస్తావు
పెండులమ్ కదలికతో
లయ బద్దుడవౌతావు
ప్రపంచకప్ అయినా
ఓలంపిక్స్ అయినా
ఎన్ని ఆటలున్నా
ఎందరాటగాళ్ళున్నాసరిరారు నీకు
పరుగపపందెంలో
*****అవేరా*****


sk101-40
*శీర్షిక: ఋతు రాగాలు*

నవవసంతంలో తరులతల చిగురింతల  క్రొత్త అందాలు
వసుధకు పచ్చ తోరణాలు తొడిగాయి
ఆడశిశువైై అమ్మ ఒడిలో ఒదిగాను
బాల్యంలో జ్ఞానమనే కొత్త చిగురులు తొడిగి
యవ్వనంలో అరవిచ్చిన లేలేత
క్రొంగొత్త అందాలు విరిసాయి
16ప్రాయంలోవికసించే కోరికలే  వీచేే  మలయ సమీరలై  అణువణువూ  తడిమి సాయంత్రపు సంధ్య వెలుగులు నిండిన కలల కాసార   సాక్షిగా స్వర్ణ  వర్ణ  రంజితమై
ముగ్ధ సుకుమార సోయగ కుసుమాలపై
వ్రాలిన బ్రమరంలా అల్లరి చేస్తే
జలకాలాడుతూ చల్లని వెన్నెల  రేయి పరవశించే వేళ
ముగ్ద వధువుగా
మంగళవాయిద్యాల నడుమ ఏడడుగులు నడిిచాను వరుడి తోడ
పుట్టినిల్లు వదలి  మెట్టినింటికి
కాలం గ్రీష్మం లోకి నడిపించింది
యవ్వన మధువనిలో వన్నెచిన్నెల వికాసం
మండువేసవిలో పండువెన్నెలలో
విరిసిన మల్లియల పరిమళసమ్మిళితమై
కోయుల కుహూ కుహూ రాగాలను నా దరిచేర్చె
రతీమన్మదీయమై నాలోని అణువణువు వీణియతంతృలై
నా మదిలో రాగాలను మీటుచున్నవి చల్లని మలయసమీరాలు
అలసి వాలిన తనువు " ఆవిర" వుతున్నది
నాలోని  వీణాతంత్రులు  సుతిమెత్తని శ్రీరేడు అంగుళి
స్పర్ష కోసం నెలరేడు కోసం ఎదురు చూసే కలువల్లా
సంగమించే క్షణం
ప్రణవించే క్షణం
నను వయ్యారి తారను జేసి
జలతారు మేలిమబ్బు పరదాలు తీసి
నను చందమామ చేసి
 సయ్యాటకు నను శృతి చేసి
నా హృదయ వీణఝమ్మనిపించే
ఆచిలిపి చూపుల రేడు నను చేరరాగా
చల్లని వెన్నల జల్లులు కురిసిన జాబిల్లి
మబ్బులతో దోబూచిలాడుతూ
సిగ్గుతో మబ్బును పరదా చేసుకుంది
నా సంసారమోక శృంగార నైషధమైనది
గ్రీ ష్మం తరువాత ....
వర్షఋతువు రానే వచ్చింది
చల్లగాలులు... చిరుజల్లులు ....
కడుపుపండి ముద్దులొలికే చిన్న కలల పంట
పాపాయి బోసినవ్వులు జల్లుల వానై
ఆనందపు వరదలు తెచ్చింది
మమతల ఊటలు నింపింది
నా మనస్సుకి  ఊరట నిచ్చింది
నా వెనకే నేనున్నానంటూ
శరదృతువు చల్లని వెన్నెల తెచ్చింది
భర్త ప్రేమానురాగాలు  సరాగాలు
రాగ రంజితాలైనాయి
సంసార సాగరం పై కురిసే చల్లని వెన్నెల జల్లుల
కాంతులు తిమిరాంధకారాన్ని తరిమి వేసాయి
అందరి మనస్సులలో కార్తీక దీపాలు వెలిగాయి
కాలం ఆగితే వయసుతో పనేముంది
నేనూ ఉన్నానంటూ హేమంతం వచ్చింది
ఎదిగిన పిల్లల అల్లరి ఆనందం
హిమస్వేదంలా  గిలిగింతలు పెట్టింది
ఎదిగిన ఆర్దక పరిపుష్టి
హేమంతపు చల్లగాలిలా మనసుకు స్వాంతన కలిగించింది  భవిష్యత్ ముగ్గులు పరిచింది
ముగ్దత్వంతో హుందా తనమే నింపింది
ఇహలోక  వాంచల దీపం కొడిగట్టే  వేళ
శిశిరం రానే వచ్చింది
ఆరుపదులుదాటి వడలినమేనితో జీవంలేని మోముతో
వంగిన నడుముతో  తడబడు మాటతో
కాల చక్రమున శిశిరంలో
రాలే ఆకులా ఆద్యాత్మిక లోకంలో పరమాత్ముని
పిలుపు కోసం ఎదురుచూస్తూ నేను  .....
మరో నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ .......
      *****************



అలసి వాలిన తనువు ఆవిరవుతుంది
మంచు తెరల్లో ముత్యంలా కనిపిస్తావు
ముద్దబంతిపువ్వులా ముద్దస్తావు
మౌనంగాఉందామంటే రాగమైవస్తావు
వలపుసు పంచే దేవత
సాయంసంద్య వేళవీచే గాలితెమ్మర
నువ్వొస్తావు మలయ సమీరం తో మంద్రంగా
కోటి ఊసులు మోసుకొస్తూ
మండు వేసవిలో పండువెన్నల
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహూ కుహూలకు శ్రుతి చేస్తూరతీమన్మధంలాగా

నువ్వూ నేను సంగమించే క్షణంనువ్వూ నేను
ప్రణలించే క్షణం
నువ్వూ నేనూ ఊసులల్లుకునే క్షణం
దూరంగా నిలబడినా నీడగ ఉన్నాకదా
గుండెలో
నిను దాచుకోన
యవ్వన మధువనిలో వన్నెల పూవుల వికాసం
బ్రతుకే ఇల మావి తోట మదిలో మకరందపు తేట
అడుగడుగున పూవుల బాట ననుతాకెను కోయిలపాట
నామదిలోన పలికే బంగారు వీణ
సుతిమెత్తని అంగుళి నాది
నీ వీణను మీటెను
వడెవ్నెల ఎందుకింత చల్లగ ఉంటుంది...వంట్లో వేడి తగ్గించటానికి
ఆకాశవీదిలో అందాల జాబిలి
ఒయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
జలతారు మేలి మబ్బు పరదాలునేసి తెరచాటుచేసి
అందాలచందమామ దొంగాటలాడెనే దొబూచిలాడెనే
పైరగాలి ఘమఘమలు చెంగనిచెంగు రిమరిమలు
మనసే మరుమల్లెల  దొంతర మన వూసే విరజాజు లదొంతర
పాలవెన్నెలలో మురిపాల వెన్నెలలో

కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు
చూపుతోనె హృదయ వీణఝమ్మనిపంచేవెందుకు
విరిసీ విరియని పరువము మరులు గొల్పుతున్నందుకు
సడిసవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది
జవరాలిని చెలికాడిని జంటగూడిరమ్మన్నది
వరజాజులు పరిమళించు లిరిపానుపులేమన్నవి
అదుపించని ఆనందం బిగికౌగిట కలదన్నది
పూవైవిరిసినపున్నమివేళ
బిడియము నీకేలా బేలా
చల్లనిగాలులు సందడిచేసే
తొలితొలివలపులు తొందరచేసే
జలతారంచున మేనిముసుగులో తలనుదాచు
మొదటమూగినవి మొలకనవ్వులు
పిదప సాగినవి బెదరుచూపుల
వలపులపాయసమాని
మాయని మమతల వూయలలూగి
ఇరువురమొకటై పరవశించగా
నాలో నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో
తెలియలేనిరాగమేదో తీగసాగెనెందుకో

పూచినప్రతితరు వ్వొక వధువు
పువుపువున
 పొంగెనుమధువు
తెలినురుగులు నవ్వులుకాగా
సెలయేరులుకులుకుతురాగాకనిపించని
వీణలేవో కదలి మ్రోగెనే
పసిడి అంచు పైటజార
పయ నించే మేఘబాల
అరుణకాంతి సోకగానే పరవశించెనెందుకో
సడిసేయకు ఓగాలి సడిసేయబోకే
సడలి ఒడిలోరాజు
పండువెన్నలనడిగి పాన్పు తేరాదే
అనంత నీరవ నిశీధిలోన  కలువ నిరీక్షణ
నీకొరకే రాజా వెన్నెలరాజా
కలనైనా నీవలపే కలవరమందైన నీతలపే
   ****అవేరా****

No comments:

Post a Comment