Thursday, December 31, 2015

నవ ఉషస్సు

అయుత కవితాయజ్ఞం
అయుత కవితాయజ్ఞం
29/12/2015
SK101
కవిత నం: 101
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: న్యూ ఇయర్
శీర్షిక: నవ ఉషస్సు

నయా సాల్ నవీ సాల్
హ్యాపీ న్యూ ఇయర్
ఏడాదేడాదీ ఇవే సంబురాలు
ఆనంద హేలలంటే అంబరాన్ని
నిజమే .....
ఈ సంబురాలు అందని ద్రాక్షలు పేదలకు
కడుపు నిండిన చాలు
కాలు ముడుచుకు ముసుగు తన్నుతాడు
అదే వాడి సంబురం
నిత్య నూతనం ప్రతిదినం
పేదకాని వాడికి ఏడాదికొక సంబురమైతే
పేద వాడికి ఏడాదిలో ఎన్నెన్నో సంబురాలు
బ్రతుకు బాగున్నోడు
చేస్తాడు సంబురం
కాసుల కణకణలు
గ్లాసుల గలగలలు
డిజే హోరులో
పాశ్చాత్య నృత్య జోరులో
కేరింతల సవ్వడి
వసంతోత్సవ పూ జడి
కాలచక్ర భ్రమణంలో
కరిగిన మంచు పాత వత్సరం
వీడ్కోలు చెబుదాం .....!
నవ స్వర గీతికను
స్వీట్ సిక్స్ టీన్ ను
నవ ఉషస్సు లా స్వాగతిద్దాం...!!

          ****అవేరా****

శుభాకాంక్షలు

అయుత కవితాయజ్ఞం
అయుత కవితాయజ్ఞం
31/12/2015
సహస్రకవి 101
కవిత నెం: 100
నా నూరు కవితల యజ్ఞం లో  ఈ 75 రోజుల ప్రస్థానంలో
సహాయ సహకారాలందించి
స్పూర్తి రగిలించిన సహస్ర కవిమిత్రులకు రవీంద్ర గారికి
ధన్యవాదాలు తెలుపుకుంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
కవి:అనుసూరి వెంకటేశ్వర రావు
అంశం: ఆశ

శీర్షిక: శుభాకాంక్షలు

సంధ్య చీకట్లు ముసిరే వేళ
ఆకాశం ఎర్రబడింది
ఆకాశంలో పాశవిక హత్యలు జరిగినట్లు
గత సంవత్సర పారిస్ హత్యల రక్తం
ఆకాశానికి చిమ్మి అతుక్కున్నట్లు
గిట్టుబాటు ధరలేక అప్పుల పాలై
విరజిమ్మిన రైతు రక్తంలా
కామాంధుల కరకు రక్కసి కోరల చిక్కిన
చిన్నారి నిర్ఙయల నిర్జీవ రక్తంలా
తీవ్రవాద రాకాసి మబ్బు
అవకాశ రాజకీయ మబ్బు
కామపిశాచి కరాళ మబ్బు
ఎర్రరంగు పూసుకుని వికటాట్టహాసం చేస్తున్నాయి
మబ్బు కపాలంలో కరాళనాదం వినిపిస్తుంది
మానవ విలయాలను చూడలేక
పడమరన క్రుంగుతున్నాడు సూర్యుడు
కమ్మిన చీకట్లో ఎరుపు మరక కలిసిపోయింది
కరాళ మబ్బులు కరిగి
పాపాల వానై వైతరిణి వరదై
ప్రపంచాన్ని ముంచేస్తుంది
గతం మంచు చలిలో ఘనీభవిస్తుంది
వర్తమానం వెలుగు చీకట్లు కలిసే వేళ
రేపటి నూతన వత్సరం
మత్సరం లేని సూర్యోదయం కావాలి
శుభవత్సరం కావాలి
నూతన 2016 సంవత్సర శుభాకాంక్షలు ...!!!
        *****అవేరా****

తెలుగు భాష

అయుత కవితాయజ్ఞం

అయుత కవితాయజ్ఞం
31/12/2015
సహస్రకవి 101
కవిత నెం: 99
కవి:అనుసూరి వెంకటేశ్వర రావు
అంశం: తెలుగు భాష

శీర్షిక: తెలుగు

తేనియల మూట నా తెలుగు
వెన్నెల తేట నా తెలుగు
వెన్నంత మృదువు నా తెలుగు
వసంతకోయిల పాట నా తెలుగు
మల్లెల పరిమళం నా తెలుగు
ఇంద్ర వజ్రాయుధం నా తెలుగు
కృష్ణ చైతన్య శంఖారావం నా తెలుగు
ధనుష్టంకార సింహనాదం నా తెలుగు
వాగ్దేవి సుమధుర వీణానాదం నా తెలుగు
కొండ కోనల గలగల ల జీవన గంగారవం నా తెలుగు
హిమపాతం నా తెలుగు
అగ్ని పాతం నా తెలుగు
ఆనందమే అక్షరమైతే అదే నా తెలుగు
     *****అవేరా****

విరహం

అయుత కవితాయజ్ఞం
31/12/2015
సహస్రకవి 101
కవిత నెం: 98
కవి:అనుసూరి వెంకటేశ్వర రావు
అంశం: విరహం

శీర్షిక: ప్రేమ సరాగాలు

వగలమారి జాబిల్లీ
ఓరచూపులెందకే
నినుమించిన చెలికాడు
ననుచేరగ వచ్చునులే
నీ వెన్నెల చల్లగాలి
నన్నేమి చేయునే
నా నెచ్చెలి నులి వెచ్చని కౌగిలిలో??

నీ వెండి వెన్నల కిరణాలే
మన్మధ విరి తూపులై
మనసున గుచ్చిన
వాడి సుమ బాణాల
గాయానికి స్రవించిన
ప్రేమ సరాగాలు
మధుర రాగాలు
నా నరనరాలను శృతి చేస్తున్నాయి
చెలికాడిని చేరమంటున్నాయి
నా చెలికాడి కౌగిలిలో
ఈ రేయి ఇలాగే ఉండి పోనీ...!!!
*******అవేరా*****

నేలతల్లి భిక్ష భూసారం

అయుత కవితాయజ్ఞం
31/12/2015
సహస్ర కవి  101
కవిత నెం: 97
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: వ్యవసాయం

శీర్షిక: నేలతల్లి బిక్ష భూసారం

 పంటభూమి బాగే మానవుల బాగు
పుడమితల్లి ఆరోగ్యమె మన మహాభాగ్యం
ఆరోగ్యానికి అష్టాదశ పోషకాలు
మనకైనా మనం పండించే పంటకైనా
తల్లి ఆరోగ్యమే బిడ్డఆరోగ్యం
కన్నభూమి ఆరోగ్యం జీవరాసుల ఆరోగ్యం
స్వతహా నేలతల్లి పోషకాలఘని
మానవ తప్పిదాలే పోషకాల వెలి
కరకు సేద్యానికి కఠిన రసాయనాలు
తాళలేని జీవరాశుల హరీ
సూక్ష్మ భూసారం బలీ
ఈ నాటి పంటలలో సూక్ష్మపోషకాలేవి
సేద్యంలో సూక్ష్మ రహస్యాలెన్నో
సూక్ష్మక్రిములు వానపాముల మేలు లేక
లోపించు పోషకాలు పంటలలో
భూసార పరిరక్షణ ఆహారభద్రతకు ప్రాణం ఇలలో
పంటభూమి జీవరాసుల ఇల్లు
అవి లేకుంటే మానవారోగ్యం చెల్లు
సూక్ష్మ పోషకాలు మానవారోగ్యానికి రక్షణ కవచం
భూములు మనుషులు
పశువులు మొక్కలు
ప్రాణమేదయినా
ఆరోగ్య సమగ్ర దృష్టి ప్రాధాన్యం ఉండాలి
ఆహారంలో సూక్ష్మపోషకాలుండాలి
అందించు వాటిని పంట భూమికి
అందించు వాటిని పంట పంటకు
జీవశక్తితో నేలతల్లి పునర్జీవి కావాలి
పర్యావరణానుకూల సేధ్యమే
మానవారోగ్యానికి మార్గము
జీవ ఎరువుల వాడకం
పచ్చిరొట్టను వేయటం
నీటికోతను ఆపటం
పంటమార్పిడి చేయటం
పశువ్యర్ధాల ఎరువులు
వానపాములాది జీవుల రక్షణ
సేద్యంలో పాటిద్దాం
జీవుల సేద్యం చేద్దాం
నిస్సార భూముల్లో
స్థూల సూక్ష్మ పోషకాలలోపం పూరిద్దాం
పోషకాల పంటభూమిలో
సంపూర్ణపోషక పంటల దిగుబడి సాధిద్దాం
పోషకాహారంతో మానవ సంపూర్ణారోగ్యం
పచ్చని పర్యావరణంలో పుడమి తల్లి సంపూర్ణారోగ్యం సాధిద్దాం
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆనందమే మహా భోగం..!!!!

తిమిర నీడలు

అయుత కవితాయజ్ఞం
29/12/2015
SK101
కవిత నం: 96
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: నిర్లిప్తత
శీర్షిక: తిమిర నీడలు

కష్టము ను కన్నీరు పంచుకొని
ఇష్టమును ఇరువురము ఎంచుకొని
భాధ్యతలు బరువనక నెరవేర్చి
తోడునీడగనుండి తొంబదేళ్ళు
తోడువీడగ మండె గుండె
జ్ణాపకాలు అనుభూతులు
మనసులోన   మరువలేక
చిటుకు చిటుకు పొడుచు వడ్రంగి పిట్టలై
తిమిరనీడలు తీరైన వరుసన
బారులు తీరు నీకు భారముగనూ...!!
బంధువులు రాబందులగుదురు
కొడుకు కోడళ్ళు కొరివి యగుదురు
కూతుండ్రు అమ్మలేదని ఇంట జేరు
రాజువే నువ్వంచు రాజ్యమడుగుదురందరు
రాజ్యమనిన నీ రాజ్యమేదియు కాదు
నీదు బొక్కసమె నీరాజ్యమెరుగు
నీదు బొక్కసము బుక్కి
నిను వృద్దాశ్రమము తొక్కి
నవ్వుకుందురు తెరచాటు నిన్ను చూచి ...!!
          ****అవేరా****
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
29/12/2015
సహస్రకవి-101
కవి:  అనుసూరి వేంకటేశ్వరరావు
కవిత నం-95
అంశం: ఆధునికం
శీర్షిక: హైటెక్

మాంగల్యం తంతునా ....
మంత్రాలు చదువుతూ
పంతులు గారు డైరెక్షన్ లు
ఇస్తున్నారు స్మార్ట్ టివీ లో
పంతుళ్ళ కొరత మరేంచేస్తాం
వేదాలు చదివిన పంతుళ్ళేరీ ?
ఆన్ లైన్ లోనే ఆరు పెళ్ళిల్లు
చేస్తున్నాడు  ఒకే ముహూర్తంలో
ఆన్ లైన్ శతశర్మ బిరుదాంకితుడు ....
నవ వధువుకి జిలకర బెల్లం
తాళి తలంబ్రాలు మామూలే
ఆధునికానికి అతకని సంప్రదాయమైనా
అమెరికాలో ఉండి ఆన్ లైన్ లో
అక్షింతలు వేసే వరుడి నానమ్మకోసం ....
నవవధువు మిక్ సాఫ్ట్ కు ఓర చూపుల సీన్ లేదు
వరుడుని కోరచూపుల్తో తినేస్తుంది
పులిముందు పిల్లిలా వరుడు ....
మరి మామూల్ది కాదు నాయాల్ది
రెండు డిగ్రీలు రెండు పిజీలు పిహెచ్ డి
చాకొలెట్ లా నమిలేసింది చదువును
పక్కనే రోబో గాడొకడు
అన్నీ అందిస్తున్నాడు పెళ్ళి పేరంటాళ్ళా
టకా..టకా చప్పుడు చేస్తూ
మికీ .... మికీ..అని
వధువుని ముద్దుగా పిలుస్తూ
నేనేం తక్కువ తిన్నానా అని
మౌసీ...మౌసీ (దాని పేరు మౌసీ)అంటూ
ముధ్దు చేస్తుంది నవవధువు
మిక్ సాఫ్ట్ అని పిలవచ్చుగా అన్నట్లు
తన వేటను షేర్ చేసుకోటానికి
వచ్చిన నక్కను చూసే పులిలా
చూస్తున్నాడు వరుడు సింప్యూటర్
కొన్నాళ్ళ కాపురం ...
మనసుల్లేని రెండు మర మనుషుల కాపురం..
సరసాలు లేవు స్పందనల్లేవు
అంతా మెకానికల్ ..!
సాఫ్ట్ వేర్ లాభాల్లా
బ్రతుకు బోనస్ ...
ఇద్దరు పిల్లలు ..
కొత్త సాఫ్ట్ సొల్యూషన్లలాగా
జావా21 ,ఫోర్ ట్రాన్ 21లు
ఆ కొత్త సొల్యూషన్లు
ఎన్నో వైరస్ లను ఎదుర్కొంటూ
తమ జీవన అంతర్జాలవిశ్వంలో
అనంత అన్వేశణలో మమేకమయ్యారు
అక్క జావా ఆపిల్ ను వెతుక్కుంటూ
తమ్ముడు ఫోర్ ట్రాన్ డెల్ ను వెతుక్కుంటూ
మరో కొత్త జంటల కలయిక పంట కోసం..
      ******అవేరా*****

హైటెక్ (ఆధునికత)

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
29/12/2015
సహస్రకవి-101
కవి:  అనుసూరి వేంకటేశ్వరరావు
కవిత నం-95
అంశం: ఆధునికం
శీర్షిక: హైటెక్

మాంగల్యం తంతునా ....
మంత్రాలు చదువుతూ
పంతులు గారు డైరెక్షన్ లు
ఇస్తున్నారు స్మార్ట్ టివీ లో
పంతుళ్ళ కొరత మరేంచేస్తాం
వేదాలు చదివిన పంతుళ్ళేరీ ?
ఆన్ లైన్ లోనే ఆరు పెళ్ళిల్లు
చేస్తున్నాడు  ఒకే ముహూర్తంలో
ఆన్ లైన్ శతశర్మ బిరుదాంకితుడు ....
నవ వధువుకి జిలకర బెల్లం
తాళి తలంబ్రాలు మామూలే
ఆధునికానికి అతకని సంప్రదాయమైనా
అమెరికాలో ఉండి ఆన్ లైన్ లో
అక్షింతలు వేసే వరుడి నానమ్మకోసం ....
నవవధువు మిక్ సాఫ్ట్ కు ఓర చూపుల సీన్ లేదు
వరుడుని కోరచూపుల్తో తినేస్తుంది
పులిముందు పిల్లిలా వరుడు ....
మరి మామూల్ది కాదు నాయాల్ది
రెండు డిగ్రీలు రెండు పిజీలు పిహెచ్ డి
చాకొలెట్ లా నమిలేసింది చదువును
పక్కనే రోబో గాడొకడు
అన్నీ అందిస్తున్నాడు పెళ్ళి పేరంటాళ్ళా
టకా..టకా చప్పుడు చేస్తూ
మికీ .... మికీ..అని
వధువుని ముద్దుగా పిలుస్తూ
నేనేం తక్కువ తిన్నానా అని
మౌసీ...మౌసీ (దాని పేరు మౌసీ)అంటూ
ముధ్దు చేస్తుంది నవవధువు
మిక్ సాఫ్ట్ అని పిలవచ్చుగా అన్నట్లు
తన వేటను షేర్ చేసుకోటానికి
వచ్చిన నక్కను చూసే పులిలా
చూస్తున్నాడు వరుడు సింప్యూటర్
కొన్నాళ్ళ కాపురం ...
మనసుల్లేని రెండు మర మనుషుల కాపురం..
సరసాలు లేవు స్పందనల్లేవు
అంతా మెకానికల్ ..!
సాఫ్ట్ వేర్ లాభాల్లా
బ్రతుకు బోనస్ ...
ఇద్దరు పిల్లలు ..
కొత్త సాఫ్ట్ సొల్యూషన్లలాగా
జావా21 ,ఫోర్ ట్రాన్ 21లు
ఆ కొత్త సొల్యూషన్లు
ఎన్నో వైరస్ లను ఎదుర్కొంటూ
తమ జీవన అంతర్జాలవిశ్వంలో
అనంత అన్వేశణలో మమేకమయ్యారు
అక్క జావా ఆపిల్ ను వెతుక్కుంటూ
తమ్ముడు ఫోర్ ట్రాన్ డెల్ ను వెతుక్కుంటూ
మరో కొత్త జంటల కలయిక పంట కోసం..
      ******అవేరా*****

Monday, December 28, 2015

పల్లె పట్నం పోయింది...

అయిత కవితాయజ్ఞం
27/12/2015
SK101
కవిత సంఖ్య :94
కవి:అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: పల్లె
శీర్షిక: పల్లె పట్నం బోయింది
సందర్బము:హైదరాబాద్ హైటెక్ సిటీలో కిడ్స్ ఫెయిర్

పల్లె పట్నం బోయింది ....
మూలాలు మరచిన
మూల విరాట్టుల కోసం
భావి బాలల పల్లె పట్టుకోసం
హైటెక్కు సిటీలో
పిల్లల పండుగ కోసం
పల్లె పట్నం బోయింది ...
ఎలక్ట్రానిక్ గాడ్జెట్ దాటి
పట్నం బాలబాలికలు
దేశానికి పట్టుకొమ్మల
కోతి కొమ్మచ్చి లాడ
పల్లె పట్నంబోయింది
మట్టిపిసికి
చక్రం తిప్పి
కుండజేసి
కుండమోసి
పల్లెలో కుమ్మరి కష్టం
తెలియజేయ
పల్లెపట్నం బోయింది .....
చెట్టు కొమ్మలు విల్లంబులయ్యాయి
టైరు కర్ర దొర్లింతలు
బాలల మనసుకు  కవ్వింతలయ్యాయి
ప్లేస్టేషన్ ఆటకన్న
పల్లె ఆటలేమిన్నంటూ
పల్లె పట్నంబోయింది ....
పిడక చేసి
చాన్పు చల్లి
పేడ కంపు కాదు
గుభాళింపని
మొక్కలునాటి
ఉట్టికొట్టి
పల్లె జీవనంలో లీనమవ్వ
పల్లె పట్నంబోయింది .....
గడ్డివామున దాగుడుమూతలు
గడ్డి మేపెను ఆవులు దూడలు
ఎగిరి దూకుతూ
అన్నానికి మూలం వడ్లనీ
వడ్లు కాసే గడ్డిదేనని
కొత్తజ్ఞానం వికసించేలా
పల్లె పట్నంబోయింది ....
ఇరుకు బాటలు
రాళ్ళు రప్పలు
కట్టెపుల్లలు
పల్లె బాట ...పట్నమొచ్చె
కాంక్రీటు రోడ్డు మరచి
మట్టి ముళ్ళబాట నడిచి
బాలబాలికలకు
పల్లె పరిమళాన్ని
పల్లె కష్టాన్ని తెలుప
పల్లె పట్నం బోయింది ....!!!
   ****అవేరా****

రైతుల ఆత్మాహుతి

అయుత కవితాయజ్ఞం
27/12/2015
సహస్రకవి 101
కవిత సంఖ్య   93
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: రైతుల ఆత్మహత్యలు
శీర్షిక: రైతుల ఆత్మాహుతి

ఆతృత కాదు
ఆచరణ కావాలి
మరణంకాదు
జననం కావాలి
(కొత్తగా వ్యవసాయం చేపట్టే వారు)
కష్టం నష్టం కాదు
ఇష్టం లాభం కావాలి
విశ్లేశించు
అన్వేశించు
గుర్తించు కారణం
కారణం తెలియని చర్యలు
గుడ్డెద్దు చలనమే
రుణమాఫీ మందు కాదు
తాత్కాలిక ఉపశమనం
అర్హులకందనిది
అనర్హులకందలమది
కోర్టుల ముంగిట్లో
ప్రభుత్వ లెక్కలకది
పెట్టుబడులు తగ్గాలి
లాభం పెరగాలి
గిట్టుబాటు కావాలి
వ్యవసాయం  కారాదు వ్యయసాయం
రైతుకి అందాలి ఫలసాయం
రైతుకి వ్యసాయం తోడు
పాడి ప్రత్యామ్నయముండాలి
పాడి ..పంట
రైతు ముంగిట నిలవాలి
ప్రకృతి పరవశించి
ఆకాశం దీవించి
వరుణుడై ఏతెంచి
లక్ష్మి కరుణించి
రైతే రాజవ్వాలి
*****అవేరా****

తోడూ నీడ

అయుత కవితా యజ్ఞం
27/12/2015
సహస్రకవి  101
కవిత సంఖ్య :92
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: వివాహ బంధం

శీర్షిక: తోడు-నీడ

మనిషి జీవన ప్రయాణంలో ఎన్నోమలుపులు
శైశవంనుండి బాల్యమొక మలుపు
బాల్యంనుండి కౌమార్యమొక మలుపు
కౌమారంనుండి సంసారమొకమలుపు
బిడ్డలు వ్యక్తులుగా మారే మలుపు

ఈ జీవనయానం ఇరువురి వ్యక్తుల ఉమ్మడి భాగస్వామ్యం
ఈజీవిత నౌకకు ఇరువురూ సరంగులే
అనంత జీవనయానంలో తెరచాప ఒకరు
సుదూర లక్ష్యఛేధనలో చుక్కాని ఒకరు

ఉచ్ఛనీఛాల భావం నిరంకుశవాదం
పరిణామాల ఫలం చెరిసగమైతే
ఖేదమైనా మోదమైనా
మంచైనా చెడైనా
భాద్యత చెరిసగం

ప్రతి అపజయం గుణపాటమవ్వాలి
ప్రతి విజయం సోపానమవ్వాలి
రెండు శరీరాల్లో ఒకే ఆత్మలా
పొందే ఆనందం అంతరాత్మలా
అనుభూతులు సగం సగంగా

ఆశించకపొతేనే ఆనందం
ఆశించిన వాటిలో వెలితి దుఃఖం
చాలా చిన్నది జీవితం
ప్రేమించు
అనుభవించు
ఆస్వాదించు

ఆవేశకావేశాలు
అసూయా ద్వేశాలు .... నిప్పులు ...
రాజేయకండి

భాగస్వామి కలకాలం
నీతో ఉండాలంటే
నీలో ఉండాలంటే
నీవు తినేముందు పెట్టు
కరకుమాటనే ముందు
గాయం బాధ ఊహించు
మాటనేముందు చెప్పేది విను
ఖర్చుకు ముందు సంపాదించు
అసహ్యించుకునే ముందు ప్రేమించు
ప్రార్థనకు ముందు క్షమించు

పంచితే తరిగేది ధనం
పంచితే పెరిగేది ప్రేమ
ప్రేమిస్తే పోయేదేముంది?
మహా అయితే తిరిగి ప్రేమిస్తారు
ప్రేమించకపోయినా
నీకు మిగులుతుంది ఆత్మ సంతృప్తి
అందుకే జీవనంలో ప్రేమించు
మరణంలో జీవించు !
ఇవే  నూరేళ్ళ మీ జీవన ప్రయాణానికి
నా మంత్రాక్షితలు !
 ****అవేరా****

ఎర్రవల్లి - యాగవల్లి

అయుత కవితాయజ్ఞం
26/12/2015
సహస్రకవి  101
కవితసంఖ్య 91
కవి : అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: అయుత ఛండీయాగం

శీర్షిక: ఎర్రవల్లి యాగవల్లి

నైమిశ లో శౌనకాది  మునుల సత్రయాగమును
తలపించినది అయుత ఛండీ యాగం
యజ్ఞాల నిలయము ఎర్రవల్లి
చరిత్రలో నిలుచును యాగవల్లై

వేల మంది ఋత్వికుల
వేద మంత్ర పఠనం
లయబద్ధమైన మంత్రోచ్ఛారణ
దిక్క దిక్కున వెదజల్లె వేదఘోష

దేవ దైవాలకు కైంకర్యాలు
బీజాక్షరాల సాక్షిగా
అనుదాత్త ఉదాత్త స్వరాలు
లయబద్దమైన సుస్వరాలాపనలు

ప్రముఖల ప్రణామాలు
సభికుల విజయ నాదాలు
మీడియా విన్యాసాలు
హేతువాదుల విమర్శలు

మిన్నంటిన సమిధల హోమ ధూపపరిమళం
కోట్ల మనసులు చేరిన వైదిక  పరిభాష
మన్ను మిన్నును ఏకం చేసిన వేద ఘోష
    *****అవేరా****

ఆకాశాన పప్పుల జాడ

అయుత కవితా యజ్ఞం
26/12/2015
సహస్రకవి-101
కవిత నం-90
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం:సామాజికం
శీర్షిక: ఆకాశాన పప్పుల జాడ

రాకెట్లో చంద్రయానమెళుతున్నావా నేస్తం !
దారిలోన జాడకోసం వెతుకుతావా నేస్తం !
కంది పప్పు పెసరపప్పు మినప్పప్పు కోసం ...!!

పాతాళానికి రిగ్గులతో
బావి తోడుతున్నావా నేస్తం?
మానవత,నైతికతలు జాడ వెతుకుతావా  నేస్తం!

     ******అవేరా*****

బాల్యమే నేరమా?

అయిత కవితాయజ్ఞం
25/12/2015
sk101
కవిత సంఖ్య: 89
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం
శీర్షిక: బాల్యమే నేరమా?

జువనైల్ జస్టిస్ బిల్లు
పాల బాలల వికాసం చెల్లు
సంరక్షణ పరిరక్షణ బిల్లు
......కానీ అయినది
సంశిక్ష- పరిభక్షణ బిల్లు
చిల్లు పడింది
బాలలన్యాయానికి ...
నీటి మీద  రాతలయ్యాయి
అంతర్జాతీయ ఒప్పందాలు ....
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు
ఇష్టంగా కలసినా
కష్టం బాలుడికేనా ?
16 ఏళ్ళ పసితనంలోనా ?
విరిసీ విరియని పసిమొగ్గలపై
కసాయి విచ్చు కత్తులా?
వాడనున్నవి పసిమొగ్గలు కావా?
ఇప్పుడున్న చట్టాలు
స్వార్థపరుల చేతిలో చుట్టాలవ్వలేదా ?
బ్లాక్ మెయిలర్ల దోపిడీ కాయుధాలు కాలేదా ?
అమాయకులు బలి కాలేదా?
సవరణలు చేసినా దోపిడీ ఆగిందా?
ఆగ్రహ తరంగానికి
ఆనకట్ట కాదు
అంతర్గత యుద్దాలకు ఆయుధం
శాసన కర్తల ముందుచూపు లేమి
రేపటి పౌరుల పాలిటి శాపము
బాలలే దేశ భవిత
బాలల సంరక్షణ కావాలి చరిత
ఇది న్యాయమా ?రాజకీయమా? రాచకీయమా?
ఆడ మగల మద్య కట్టిన అడ్డు గోడ
సరస సౌబ్రాతృత్వాన్ని చెరచు గోడ
యువతీ యువకుల మద్య గోడ
ఆత్మన్యూనత గోతిలో యువత
మరెక్కడుంటుందీ భవిత?
ప్రేమికుల పాలిటి శాపం
ప్రేమకు సమాధి  పాపం
మనసులకు లింగమురికి
స్నేహానికి నిశీధి రాత్రి
పెద్దల ఆగ్రహానికి
కిడ్నాపుకు తోడైన అత్యాచార ఆయుధం
బాలురు బలి
అమ్మాయిలకు అబ్బాయిలు ఆమడ దూరం
సంఘజీవనము కల్ల
సహజీవనము మిధ్య
సహజ్ఞానార్జన సున్న
మేధపాటవం దూరం
యువతదేమినేరం??
చట్టాలతో ..శిక్షలతో.. మారదు లోకం..!
సంస్కృతితో...శిక్షణలతో ..మారును లోకం..!!
       ******అవేరా*****

రాతిగుండె

అయిత కవితా యజ్ఞం
25/12/2015
SKno: 101
కవిత నెం:88
కవి:అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం: సామాజికం
శీర్షిక :రాతి గుండె

చంద్రుని చేరిన ధరలు
అందగలేని నిత్యావసరాలు
కడుపు నిండక రోడ్డక్కిన మహిళ
పల్లె "అంగనాన""వాడుతున్న"మహిళ
కన్నీటి కడగండ్లతో చెలగాటం
నిత్య "కరవు"తో పోరాటం
గత గుర్రపు డెక్కల గాయాలు మానకుండానే
నేటి మెమోరెక్కల సుడిగాలికి కకావికలం
కడుపులోన తిమిరాన్నోపలేక
ప్రజాస్వామ్య పద్దతిలో
జీతం పెంపుకోరుట క్రమశిక్షణ లోపమైతే
మాట ఇచ్చి ఓటు దొబ్బి
గద్దెనెక్కి మాట తప్పి
కడుపుకొట్టుట రాజకీయ క్రమశిక్షణా?
కనిపించదా ఆనాటి వీరి ఓటు కట్ట విలువ??
వలదు వలదు నీకింత రాతి గుండె
ఇవ్వండి వారికి మానవత చలువ..!
******అవేరా*****
అంగన్ వాడీ మహిళల జీతాల పోరు సందర్బంగా

** శీర్షిక: క్రిస్మస్ -టెన్ కమాండ్ మెంట్స్**


అయుత కవితాయజ్ఞం    
25/12/2015
SKno: 101
కవిత సంఖ్య:87
కవి: అనుసూరి వేంకటేశ్వర రావు
అంశం: క్రిస్ మస్ పండుగ
** శీర్షిక: క్రిస్మస్ -టెన్ కమాండ్ మెంట్స్ **

సుఖ జీవనానికి
బంగారు ఆభరణాలేల
వజ్ర వైఢూర్యాలేల
నీవే ఒక ప్రకాశ  కాంతివైతే ..!

నీలో ఆ కాంతి వుంది
మలినంతో మసకబారింది
పది జీవన సూత్రాలు ఆచరించు
నీవే ఒక పండుగవై చరించు

ఉప్పై లోకానికి జీవనరుచులందించు
సోడియమ్ సత్యముగా
 క్లోరైడ్ ప్రేమగా
ప్రేమలేని సత్యము నిరంకుశము
సత్యము లేని ప్రేమ నిరర్థకము

మాట కావాలి జీవన బాట
మాట విషాన్ని చిమ్మగలదు
మాట తీపిని పంచగలదు
మాటే మహోన్నతానికి సోపానం
మాటే అధఃపాతాళానికి పాషాణం

దానగుణంలో ధన్యత
దానగుణంలో పుణ్యత
ప్రతిఫలం పాపం
ప్రతిఫలాపేక్ష లేకుంటే పరిపూర్ణత
సూర్యుడు వెలుగును
మేఘాలు వర్షాన్ని
భూమి పంటను
గాలి ప్రాణాన్ని
ఇస్తున్నాయి అలాగే

మనసు...  పవిత్రత ...పరిశుద్ధత
దోంగిలించటమే కాదు దొంగిలించే ఆలోచనే పాపము
వ్యభిచరించుటే కాదు మనసున మోహమే పాపము
మనిషిలోని చీకటే మహాపాపవృక్షము
కూకటి వేళ్ళతో పెకలించుటే వెలుగు బాట

చెంపదెబ్బకు మరో చెంప
పశ్చాత్తాపానికి పరాకాష్ట
శత్రువు చేసే ప్రతీదాడి
నీకు దేవుని ఆశీర్వచనమే
శత్రువుకు శాపమే
నీ క్షమా గుణమే నీకు రక్ష

ఎక్కు తక్కులెంచకు
కొలచి తప్పులెంచకు
తరచి తరచి
నీ తప్పులెంచుకో
నిలచి నిలచి

పశుపక్షులకు లేదు రేపు చింత
గుండె నిబ్బరత కావాలి నీకు నిశ్చింత
దైవ విశ్వాసమే నీకు రక్ష

మెరుపువేగం నేర్చావు
నీలోని వెలుగు " నేమార్చావు "
పగ, ద్వేషం, అమానుషత్వం
చీకట్లను పారదోలే " ప్రేమ" వెలుగవ్వాలి

పరులకు శాంతి  ప్రేమ పంచు
స్వార్థ వక్రమార్గాలను త్యజించు
నిన్ను దేవుని దరినుంచు

మంచి మార్గమెపుడూ ఇరుకే (కష్టమే)
నీ మనసు కాకూడదు ఇరుకు
చెడుమార్గమెపుడూ విశాలమే(సుఖమే)
ఇరుకు మార్గమే నీకు రక్ష

పది సూత్రాలను ఆచరించు
నీలో సంతోష వెలుగు పూలు పూస్తాయి
అపుడు నీవే ఒక ....పండుగ
నీవే ఒక .....వేడుక
నీవే ఒక ....ఉత్సవం
నీవే ఒక ......క్రిస్మస్..!!!

*****అవేరా****

స్వర్గసీమ

sk101-86 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
*శీర్షిక: స్వర్గ సీమ *

తొలి సంధ్య
బంగారు వర్ణాన కాంతికిరణాలు
పక్షుల కిల కిలా రావాలు
కోయిల కుహూ కుహూ రాగాలు
ఊరొడ్డున పారే సెలయేరు గలగలలు
ఊరిచివరన చెరువు అలుగు సవ్వడులు

పచ్చతివాచీ పరచినట్లు పొలాలు
అక్కడక్కడ పసుపు పరికిణీలా పొద్దు తిరుగుళ్ళు
బంగారు పళ్ళేరంలో
కడిగిన ముత్యాల తలంబ్రాల్లా
మల్లె తోటలు
చెట్టేక్కుతున్న బార్బీ బొమ్మల్లా
మక్క చేలో చిన్నజుత్తుతో  మక్క కంకులు

కురిసి కురిసి
జడివాన అలసిందేమో
చెట్టు ఆకు చిగురులు
అప్పుడే స్నానమాడిన చెలుల్లా ఉన్నాయి నీరోడుతూ
అరచి అరచి
ఆకాశం అలసిందేమో
మేఘాలన్నీ ఎచటికో పయనమైపోయాయి
ప్రేమికుల మేఘసందేశాన్ని మోసుకుని

ప్రకృతి ప్రశాంతంగా వుంది
ఆకాశం నిర్మలంగా వుంది
ఆ నిర్మల ఆకాశ సంద్రాన
తేలియాడే నావల్లా తెల్లని కొంగల గుంపు
సముద్రాన చేపల వేటకు వెళ్ళే
తెల్లని తెరచాప పడవల్లా తేలియాడుచున్నాయి

ఘల్లు ఘల్లు గంటల చప్పుడు
హయ్..హయ్..అదిలింపుల సందడి
ఏమి  సంగీతమో అది
మోహనరాగమో..!

మధ్యాహ్నం ఇంటికి చేరితె
కమ్మని అంబలి
రాగి ముద్ద
జొన్నగట్క
జొన్నరొట్టె
ముద్దపప్పు
గడ్డపెరుగు
కమ్మని గుమ్ము పాలు
సుష్టుగా భోంచేసి
పెరటి వేపచెట్టు క్రింద
నులకమంచమేస్తే
నా సామిరంగా!
పల్లే కదా స్వర్గ సీమ !
   ****అవేరా***

మహా నివాళి

sk101-85
24-02-2010నాడు తెలుగు పీపుల్.కామ్ లో
ప్రచురించిన కవిత (హాస్యనటుడు పద్మనాభం గారి జ్ఞాపకార్థం)

*శీర్షిక: మహా నివాళి
  ఆనాడు... వెండి తెరపైన రంగుల్లేవు!
 కానీ ప్రేక్షక మనసుల్లో...
రంగుల పూలు పూయించిన మహా నటులున్నారు...
నవరసాల మేళవింపు ఆనాడు సినిమా..
ఆ రసాలకే.. రారాజు.. హాస్య రసం..
ఆ హాస్యానికే.. మహా లాస్యం... నీవు..
 రాజ్యం లేని రారాజువి..
నవ్వుల మహా సమ్రాట్టువి!
ఎవరు పూయిస్తారు నవ్వుల పువ్వులు మాలో?
ఎవరు ఓదారుస్తారు 'పెళ్ళి కాని తండ్రులను'?
నీ జాతకమేంటో తెలియకపోయినా...
'జాతకరత్న మిడతంభొట్లు'ని రాశావు!
నీవొక నవ్వుల పూతోట...
నీవొక మహా కళా మేరువు..
ఆహార్యం నీ ఆభరణం...
భాషణం నీ భూషణం...
ఏమని పొగడాలి...
ఏమని తలచాలి..
మా సినీ పూతోటలో ఒక మహావృక్షం కూలింది
అందుకోవయ్యా... హాస్య బ్రహ్మ!
బరువెక్కిన గుండెతో అర్పిస్తున్నా..
................. నా కన్నీటి వీడ్కోలు!
       *****అవేరా****

కోయిల

sk101-84
* శీర్షిక: కోయిల *

నీ తుపాకి గుండుకి వెరచి
దాగుంది గండు కోయిల
కొమ్మల చాటున రెమ్మల మాటున
శబ్దభేది విద్య నీకిష్టమైతే
శబ్దాన్నే వినసొంపు పాటగా
మలిచింది నీ కోసం
నీ తుపాకీ గుండు
తాకిన మరుక్షణం
ఆగిన గడియారపు చప్పుడులా
ఆగింది తన గుండె చప్పుడు
ఆగుతూ అడిగింది .......
నేను నీకేం అపకారం చేశాను?
కమ్మి నైన పాట తప్ప పలుకైనా రాని దాన్ని
అందమైన పాటలతో మీ హృదయాలను
రంజింప చేసినందుకా?
ప్రకృతిని పరవశింప చేసినందుకా
మీ ప్రకృతిని వృక్షాలను
నాశనం చేసే క్రిమి కీటకాలను తిన్నందుకా?
నా గొంతే వినిపించింది నీకు
నాతో ఊసులాడే ప్రకృతి గుస గుస విన్నావా ?
సీతాకోక చిలుక రెక్కల రెపరెప విన్నావా?
చెట్టు చెట్టు చెబుతుంది నాకు కృతజ్ఞత
మరి నీకెందుకింత కృతఘ్నత?
నీవెందుకు చేశావీ పాపం?
       *****అవేరా******

ప్రేమాగ్ని

sk101-83
22/12/2015

* శీర్షిక : ప్రేమాగ్ని *

కలలో ఊహించని కమ్మని కలవైనావు
ప్రేమ మాధుర్యమును  తెలిపినావు
కలయోనిజమో తెలిసే లోగా
మాయమై నాలో  ప్రేమాగ్ని రగిల్చినావు
నీ పునరాగమనం లేక ఈ అగ్ని చల్లారదు
చితిమంటై దహించి వేస్తుంది
నాలో నీవు నీలో నేను
తనువులు వేరైనా ఆత్మలు ఒకటే
ప్రియతమా! అందించవా నీ ఆపన్న హస్తం !
తాళలేకున్నా ఈ ప్రేమాగ్ని తాపం..!!
     *****అవేరా*******

కలం బలం

sk 101 -82
 22/12/2015
* శీర్శిక: కలం బలం*

పల్లవి:: కలమంటే కాదురా
           కత్తిపీట వేటకత్తి
           కలమంటే ఆధిశక్తి
            చైతన్య పరాశక్తి

చ1      నిత్య జీవితంలో
           స్వచ్ఛ అక్షరానికి
           అమ్మై నిలుస్తుంది
          గుమ్మంలో  నిలుస్తుంది .....కలమంటే
చ2     వేధింపుల రాజ్యంలో
           సాధించే కుట్రలలో
           జనజీవన గమనానికి
           కంటికి కాగడా అవుతుంది........కలమంటే
చ3     కత్తి పోటు కాదు మిన్న
           కలంపోటు కన్న
           రక్తం చిందుంచునది
           రుధిరం  పొంగించునిది ...........కలమంటే
చ4     అరుదైనది ఆడజన్మ
          అచ్చమైన స్వచ్చ అమ్మ
          గర్బంలో తుంచొద్దని
          పొత్తిళ్ళలో తెంచొద్దని   చెప్పే ..కలమంటే
చ5     సమాజ పీడల చెట్టును
           రుగ్మతల ఊడల చెట్టును
           పదునెక్కిన అక్షర కత్తులతో
           వేరు వేరు తెగనరికి
           ఊడ ఊడ పెకలించే ..........కలమంటే
               ******అవేరా*****

వెండి వెన్నెల

sk101-81
21/12/2015

** శీర్షిక: వెండి వెన్నెల **

అల్లంత దూరాన ....
వెండి వెన్నెల జల్లులు కురిపిస్తూ నువ్వు
ఆడుకుంటున్నావు నక్షత్ర పువ్వుల మధ్య
తేలియాడే సముద్ర తెరగుల మబ్బులతో
దోబూచిలాడుతూ మబ్బు దొంతరల మధ్యలో ...
ఆకాశానికే అందం నువ్వు

వెండి వెన్నెల జల్లులలో చెలి సందియలలో
నేనిట మన్మధ విరితూపుల బాధితుడనై
కేళీ వినోదము లాడుచుంటిని
ప్రణయ క్రీడకు ప్రమోదము నీవు
అచ్చాదన లేని నగ్నఆకాశం క్రింద
హృదయ ప్రణయ వేదనలో
రాసక్రీడా ప్రాంగణములో
మొగలి పారిజాత సంపెంగల
మల్లెల పరిమళాల మత్తులో
పున్నమి రాతిరి మిన్నాగుల వలె
గెలుపోటముల ఆరాటంలో
ప్రకృతినాస్వాదిస్తూ సంగమిస్తూ
అతిశయానందం ఆర్నవమై
అంబరాన్ని తాకింది నీ దరి చేరింది !
    ***********అవేరా******

సత్యం అహింస

sk101-80
18/12/2015

శీర్షిక: సత్యం-అహింస

పంచ నియమాలలో
ఉత్తమం సత్యం-అహింస
అహింస ప్రతీ జీవిలో ఉంది
క్రూర జంతువులోనూ ఉంది
ఆకలేస్తేనే వేటాడుతుంది పులి
మనిషిలోనూ ఉంది నిద్రావస్తలో
వినోదం కోసం వేట
అడవిలో అటవీ జంతువుల వేట
హింసలో ఆట
కోడి పందాల ఆట
ప్రేమ కోసం హింస
ప్రేయసి ముద్దు మోము పై ఆసిడ్ దాడి
మృదువైన మెడపై వేటకత్తుల దాడి
దేశం కోసం హింస
మతం కోసం హింస
రాజ్యం కోసం హింస
రాజకీయ సీటు కోసం హింస
జిహ్వ కోసం జంతు హింస
ఖండిచిన వారికి రాజకీయ ముండనం
మేల్కొనాలి మనిషిలోని
మహా మనీషి జ్ఞానోదయమై .....

నిత్యము సత్యము పలుకగ
నిశ్చయము విజయము
అపజయమందిన అనుమానము నీ సత్యనిష్ఠ
ఉన్నది ఉన్నట్టు
మాటలో
బుద్ధిలో
ఉనికిలో
హృదయంలో
సంకల్పంలో
సత్యమై నిలువ
సత్యవాది రుజు చిత్తము
చైతన్యము సత్యవాది
అసత్యమాడితినని  సత్యము బలుక
సత్యమే నిత్య శక్తియై
అపజయాలు రావిక
అంతిమ విజయం నీదే...!
         *** అవేరా ****

ఆధ్యాత్మిక గురువు

sk101-79
 18/12/2015

* శీర్షిక:ఆధ్యాత్మిక గురువు*

మౌలిక తత్వమే బ్రహ్మ జ్ఞానం
బ్రహ్మ వ్యక్తి కాదు శుద్ధ చైతన్య శక్తి
దృష్టి కోణమార్పు
బ్రహ్మ జ్ఞానం నేర్పు
ఆలోచనలు నిర్మలం
ఇంద్రియాల నిగ్రహం
ఇహపర వైరాగ్యం
కర్మ ధ్యాన యోగం
ఆ పై భక్తితో తత్వజ్ఞాన ప్రాప్తి
ఆధ్యాత్మిక గురువంటే
బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు
బ్రహ్మ నిష్ఢుడు
తత్వ జ్ఞాని
శమ,దమ వైరాగ్య భూతుండు
శిశ్యులలో
రాగ ద్వేశాల మాయపొరలు తొలగించి
శమము దమము
వైరాగ్యమను ఔషధములు నింపి
విశ్వాసం
వినయం
ఓపికలే అష్టైశ్వర్యాలుగ
అలరారే శిష్యులకు
బ్రహ్మ జ్ఞానంతో ఆధ్యాత్మిక ఉన్నతి సంభవం
      * ***అవేరా ******

శ్రద్ధ - సబూరి

sk101-78
18/12/2015

* శీర్షిక: శ్రద్ధ-సబూరి *

రెండక్షరాల  దివ్య పథమిది
మూడక్షరాల పరమ పథమిది
రెండక్షరాల కోసం మూడక్షరాల తపమిది
ఓపిక లేక గురు సాక్షాత్కారము కల్ల
అను సత్యము తెలుపు అక్షరసత్యమిది
భావ సంఘర్షణలు అడ్డు కాదు సబూరి ఉంటే
తలచిననే గురువౌను
తలవకనే తండ్రౌను
పిలిచిన స్నేహితుడౌను
దీక్షలెందుకు నీకు
ఆత్మ సాక్షాత్కారముండగా అంటాడు
దీక్ష ససేమిరా అంటాడు
కంటి చూపులో ప్రేమ పంచుతాడు
భక్తుని గుండెలో నిండుతాడు
పలకరింపులో ప్రేమ దొరలుతుండు
పలవరింతలో భక్తులు తరలుతుండు
కరస్పర్షలోన అనునయింపు
కడదాకా భక్తుల అనుసరింపు
సాయి తత్వంలో ప్రేమ భౌతికం కాదు
అలౌకికమూ  కాదు
అనిర్వచన భావనా కాదు
ప్రోది చేస్తే పెరిగేది ప్రేమ
ప్రతి విషయంలో అన్వేషించు ప్రేమకై
కాలమానపరిస్థితులకతీతమై
హింసలోనూ ప్రేమించు
అహింస లోనూ ప్రేమించు
సబూరిలేక  సాధ్యం కాదు ప్రేమ
ప్రేమ లేక సాధ్యం కాదు ఆత్మ సాక్షాత్కారం
అదే "శ్రద్ధ-సబూరి" మహత్యం.....!!!
         *****అవేరా*****

నీ ఆడంబరమే నీ మృత్యువు

sk101-77
 18/12/2015

* శీర్శిక:  నీ ఆడంబరమే నీ మృత్యువు *

అప్పు అందల మెక్కిస్తుంది... ఆ క్షణం
నిప్పు లా కాలుస్తుంది ... మరుక్షణం
అందుకే అప్పు చేసి "పప్పు"కూడేల?
అప్పు లేని సప్ప కూడే మేలు
అప్పు చేసి తెల్ల ఏనుగు కొననేల ?
తప్పనట్లు నల్ల ముఖం వేయనేల??
అందని ద్రాక్షలకు అర్రులేల పులుపని సర్దుకో
అందమైన జీవితాన్ని దిద్దుకో
ఆ"డంభ"రాలు అందలం ఎక్కితే
అప్పులూ అంబరం ఎక్కుతాయి
తీర్చ లేక తిరుగుతావు బొంగరమై
తప్పవు తీర్చలేక తిప్పలు
తప్పుకు తిరుగుటె మేలని
తప్పుకు వేసుకుంటావు శిక్ష
అప్పు తీర్చ లేక చేస్తావు మరో అప్పు తప్పు
అదీ తీర్చలేక రాజుకుంటుంది అవమానాల నిప్పు
ఏ నాడూ ఆడంభరమాదుకోదు నిన్ను
ఆనాడే కానలేదు కన్ను
అత్యాశ అంటింది మిన్ను
చేయి దాటిన తప్పు
దహించే  నిప్పు
వత్తిడి తాళలేక
అవమానాన్నోపలేక
ఆత్మాహుతి అంటావు!
నీవు చేసిన తప్పుకు
కుటుంబాన్ని బలి చేస్తావు !
నీ ఆడంభరమే నీ శత్రువు!
నీ అత్యాశే నీ మృత్యువు !
     *****అవేరా ****

చెట్లు

sk101-76
 17/12/2015

* శీర్షిక: చెట్టు *

అందమైన పచ్చని చెట్టు
అభివృద్ధికి మొదటి మెట్టు
స్వర్గ సుఖాలకు నిచ్చెన మెట్టు
ప్రాణవాయువుకు ఆయువు పట్టు
వన్యమృగాల ఉనికే చెట్టు
పశుపక్ష్యాదుల కులుకే చెట్టు
అందుకే ప్రతి మనిషీ ! ఒక చెట్టు పెట్టు !
పర్యావరణాన్ని ఒడ్డున పెట్టు !
నీవే మరో కార్చిచ్చైతే నీ చితి నిశ్చయం పట్టు!

        ****అవేరా****

అధ్యాపకులు

sk101-75
  17/12/2015
* శీర్షిక: అధ్యాపకులు *

బాల భారత  దిశా నిర్దేశకులు
భావి భారత నిర్మాతలు
నిత్య జ్ఞానప్రధాతలు
సత్య శోధకులు
నిత్య శ్రామికులు
విద్యార్థుల బంధువులు
వారి ఆశలు కలలను పండించ
వరాలిచ్చే దైవాలు
వారి భోధనలే ఉలి దెబ్బలు
అందమైన ఆకృతి శిల్పాలే
రేపటి భావి భారత పౌరులు
అక్షరాస్యతను అందల మెక్కించి
నిరక్షరాస్యతను సమాధి చేసే
సమసమాజ నిర్మాతలు
ఎవరు ఎవరికి ఎవరో?
ఎవరికి ఎవరు ఎవరు కాకున్నా
అంతా నా వాళ్ళే అనే
విశాల హృదయమున్న  బందువులు ..
.....ఆత్మ బందువులు....
********అవేరా ********... 

తెలుగు తేజము

సహస్రకవి101-74
  16/12/2015

* శీర్షిక : తెలుగు తేజము *

మాత  శారదాంబ
ముద్దుబిడ్డలార
ముదితలార
మత్తైదువలార
మంగళకరమగు
మీ కవితా నాదము
మీ హేతు వాదము
శ్రావ్య గానమై
దిగ్దిగంతముల
తెలుగు తేజమ్ము
జగమ్మున విరజిమ్ము
నయాగరా నయగారమ్ము వోలె
గాన కోకిల వోలె
శిరమున మానవ సేవను దాల్చిన
మాత థెరసా వోలె
ఆధ్యాత్మికాంశకుండు పరమహంసవోలె
రవీంద్రుని గీతాంజలి వోలె
అహింసాత్మకుండు మహాత్ముని వోలె......!!
         *******అవేరా *****

జలగలు

సహస్రకవి101-72
 16/12/2015

* శీర్షిక: జలగలు *

కూటి కోసం ఒకరు
కూలీ దొరకక ఒకరు
కూతురి పెళ్ళికి ఒకరు
వ్యాపారానికి ఒకరు
సమాజ కాసారంలో
జలగలనాశ్రయించారు అప్పు కోసం
హద్ధులు లేని ఆశ అత్యాశై
"కాల్ మనీ'"పేరుతో
అత్యధిక వడ్డీకి అప్పులిచ్చాయి
ఋణ గ్రహీతల రక్తమాంసాలను
పీల్చి పిప్పి చేస్తున్నాయి
ఈ జలగల ఆగడాలను ఆపమని
రక్షకులకు పెట్టుకున్న అర్జీలు భక్షణతో
నీరుగారిపోయాయి
ప్రజా ప్రతినిధులే ప్రజా భక్షకులయ్యారు
"కాల్"నాగులయ్యారు
"కాల్" కేయులయ్యారు
వడ్డీ చెల్లింపులకు
నడ్డి విరుస్తున్నారు
పేదలు,
మద్యతరగతి వారు,
మహిళలు
తాళలేక తనువులు చాలిస్తున్నారు
తనువులు అర్పిస్తున్నారు....?
మహిళలే తోటిమహిళలను వేధిస్తున్నారు
" వంటి" తో వ్యాపారం చేయమని
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు
బతుకు భారమై
చావలేక బ్రతకలేక
ఆదుకునే దిక్కులేక
వారికి.....
మీడియానే దిక్కయింది
మీడియా శంఖనాదానికి
చెవులు దులుపుకుని
బద్దకంతో కుంభకర్ణ నిద్ర వీడింది ప్రభుత
విసిరే వలలకు చిక్కక
జారిపోతున్నాయి
జలగలు సుదూర తీరాలకు
కొత్త " ఆహారం" అన్వేషణలో......!!!
          ******అవేరా****

బౌద్దం

సహస్రకవి101 -71
14/12/2015
ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో బయల్పడిన బౌద్దారామం సందర్బంగా

* శీర్షిక:  బౌద్ధం *

చిత్రాడలో సిత్రాలు
బౌద్ధమత చిహ్నాలు
బౌద్దం హీనయానమహా యాన సంహితం
వజ్రయానం పూజితం
బుద్ద పాద పద్మం
పాదాలమ్మగా విరాజితం
గొల్లప్రోలు మల్లవరం
పిఠాపురం చిత్రాడ
విలసిల్లెను బౌద్దారామాలై
విష్ణుకుండినులు ఇక్ష్వాకుల
రాజధాని పిఠాపురం
బౌద్ధారామాలకు నిలయం
చరిత్ర నిలిచిన బోది వృక్షం
       ****అవేరా****

కమత విలాపం

సహస్రకవి101-70
11/12/2015

* శీర్షిక: కమత విలాపం *

బిడ్డా!
ఏ పొద్దాయె నీ ముఖం జూచి
ఎన్ని పొద్దులు పోయె
నీ పొద్దు పొడవక పోయె
ఎద్దులొచ్చినా అరక లేదు
అరక తొక్క నువు లేవు
గట్టు మీద వేపచెట్టు
అడిగింది నీజాడ
చెట్టు మీద కోయిలమ్మ
కూసింది నీ కోసం
జామ చెట్టుపైన జంటపావురాళ్ళు నూకల్లేక
చూశాయి నీకోసం
మట్టిలోన వానపాము ఆకలేసి
చూసింది నీ కోసం
ఎండిన పత్తి చేను తల వాల్చి
వేచింది నీకోసం
మిర్చి చేలో ఆకుచాటున ఆకుపురుగు
నిక్కినిక్కి చూసింది నీకోసం
వానచినుకు లేక
దాహంతో నోరెండి
ఒక్కతడైనా పెడతావని
ఎదరు చూస్తూ వున్నా నీ కోసం
కళ్ళు కాయలు కాచె
గుండె బీటలు వాసె
గాలినడిగా
ఎండనడిగా
వెన్నెలనడిగా
చెట్టునడిగా
పుట్టనడిగా
నీ జాడ తెలియదాయె
ఎన్ని పొద్దులు పోయినా
నీ పొద్దు పొడవక పోయె......!!
      ****అవేరా ****

విజయం

సహస్రకవి101-69
హైదరాబాదు 13/12/2015 ఇందిరాపార్క్ లో బాసరస్థలవేదికపై
సహస్రకవుల విజయం కవిసమ్మేళన సందర్భంగా

* శీర్షిక: విజయం *

ఈవిజయం మన విజయం
సహస్రకవుల విజయం
ఆనాటి జిలుగు వెలుగు
అష్టదిగ్గజముల తెలుగు
రాయల నేతృత్వంలో
రాచరికపు గొడుగు క్రింద
రాచఠీవి తేటతెలుగు
ఆనాటి విజయం భువన విజయం
రవీంద్రుని నేతృత్వంలో
ప్రకృతి వొడిలో
సేదతీరు తెలుగుకవిత నేడు
దిగ్గజకవులు సహస్రకవుల కవితామాలికలు
నవవసంత కోయిల పాటలు
స్వచ్ఛ సమాజానికి నిత్య దిక్సూచికలు
ఈనాటి సహస్రకవుల విజయం
సమాజ విజయానికి ఢంకానాదం
సమాజ రుగ్మతలకు సింహనాదం
విజయిాభవ సహస్రకవులారా
దిగ్విజయిాభవ సహస్రకవివిజయం !!
          *****అవేరా*****

జననం

సహస్రకవి101-68అనుసూరివేంకటేశ్వరరావు
11/12/2015

* శీర్షిక: జననం *

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం ....
జాతస్య హి ధ్రువోమృత్యర్థృవం జన్మమృతస్యచ
తస్మాదపరిహార్యేర్థే నత్వం శోబితు దుర్హసి ....
ఆదిశంకరుడు చెప్పినా
కృష్ణభగవానుడు చెప్పినా
పుట్టుక చావులు బ్రమణ చక్రాలు
మరణానంతరం మళ్ళీ
తల్లి కడుపున శయనం ...
శయనం తధ్యం పాడెన మళ్ళీ
త్యజించ ఖాయం జర్జర దేహం

ఐన్ స్టీన్ శక్తి సిద్ధాంతం(  E:::mc2 )
సృష్టికి శిరో దార్యం
శక్తి పుట్టుక నాశనము మిధ్య
జనన మరణాలు పరస్పర సయోద్య
నిరంతర విశ్వాంతర ప్రక్రియ

పదార్థ ఉద్భవం
అణు పరమాణు సంభవం
విశ్వచైతన్యశక్తే కారణం
అణుపరమాణు నిర్మితం
జీవులు సమస్తం
కాలుడి కదలికతో లయమై
జనన మరణ బ్రమణ చక్రమై
నిరంతర నియమ బద్దమై
శూన్యంలో తిరుగాడే జీవమై
విశ్వశక్తి నియంత్రణలో
శూన్యంలో ప్రాణశక్తిగ
ఈదులాడుతుంటాయి

వేదప్రవచితానుసారం సమస్తజీవులు
అరువది  నాలుగు వేలకోట్ల
యోనులంజీవ మరణాలు సంభవం
జీవమన్న జీవులన్న సమస్త ప్రాణికోటికనునయం

అండము పిండమై
స్తూల శరీర నిర్మాణమై
సూక్ష్మ శరీరము చైతన్యమై
తనువు ఆత్మల సంగమంతో
ప్రాణము జనియించి జననమవ్వు
జ్ఞానేంద్రియ జ్ఞానం సూక్ష్మ శరీరం
పంచభూతాంశ పరమాణు నిర్మితం స్తూల శరీరం
సూక్ష్మశరీరం విశ్వ చైతన్య శక్తియుక్తం
రూపరహితం
దేహం జర్జరమై మరణం తధ్యమైనపుడు
స్తూల శరీరాన్ని త్యజించి
సూక్ష్మశరీరం విశ్వచైతన్య శక్తిలో లీనమౌను
మరో తనువును వెతుకుతూ
కరిమబ్బులు తాకుతూ
ఆకాశంలో తేలియాడుతూ
కృష్ణ బిలాలు దాటుతూ
నక్షత్రలోకాన విహరిస్తూ
అనంత విశ్వంలో ఆత్మప్రయాణం
శూన్యంలోంచి సుదూర గ్రహాలు విశ్వాలు దాటి
మరో తనువుతో సంగమం ....
మరో జననం .....

జననం మరణం
మానవులకే కాదు
సమస్త వేలకోట్ల జీవులకు
బ్రమణ చక్రం సృష్టి క్రమం
సకల చరాచర సృష్టి  స్థితి  లయ లందు
ఆది జననము అంత్యము   మరణము  
           *****అవేరా*****

అమ్మ

సహస్రకవి101-67
 10/12/2015
* శీర్షిక: అమ్మ *

సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమంటారే
సృష్టికి మూలం అమ్మంటారే
అమ్మ దేవతా స్వరూపమంటారే
మమకార మూర్తి అంటారే
అనురాగ దేవతంటారే
త్యాగానికి ప్రతిరూపమంటారే
లాల పాడి జోలపాడి
గుండెల్లో దాచుకుంటుందంటారే
మరి "ఆ" అమ్మతనాన్ని అబద్దం చేశావెందుకు అమ్మా ?

ఈచెత్తకుప్పను పరుపుగా చేసావెందుకు ?
నీడలేని ఆకాశం కిందికి చేర్చావెందుకు ?
చుక్కలను లెక్కించమనా?
చల్లని మంచుకు వర్షానికి బలి చేశావెందుకు ?
దుర్గంధంలో దొర్లించావెందుకు ?
క్రిమి కీటకాలకు కుక్కలకు ఆహారంగా వేశావెందుకు ?
ఆడ పిల్లగా పుట్టినందుకింత శిక్షా ?
మానవతనూ అమ్మతనాన్నీ హత్య చేస్తావా?
నీవూ ఆడపిల్లగా పుట్టావన్నది మరిచావా అమ్మా??
             ******అవేరా********

అమ్మా నాన్న

సహస్రకవి101-66
* శీర్షిక: అమ్మ-నాన్న *

నాన్నా!
నా చిరునవ్వులు చూసి మురిసావు
యెదపై ఆడించావు ఎత్తుకుని లాలించావు
నాకు  చేయూతనిచ్చావు
తొలి అడుగులు వేయించావు
నీ కష్టాన్ని గుండెలో దాచుకొని
నా కోరికలన్నీ తీర్చావు
నీ సంపాదన నీకోసం కాకుండా
మాకోసమే నన్నావు
బతకటానికి తినాలి
తినటానికి బతకొద్దన్నావు
నాకు తోడు ఆసరా ధైర్యం నువ్వే నాన్నా
నాగెలుపును నీ విజయంగా చెప్పుకుంటావు గర్వంగా
నా ఓటమిలో నేనున్నానని భుజంతట్టి ధైర్యాన్నిస్తావు
విద్య బుద్దులు నేర్పించావు
నా గెలుపుకి పూల  బాటను పరిచావు
అమ్మా !
సృష్టికి మూలపుటమ్మవు నీవు
నవమాసాలు బరువనుకోకుండా మోసావు
రక్తమాంసాలతో రూపమిచ్చావు
నీ ఊపిరి సాక్షిగ నాలో ఊపిరిలూదావు
కన్ను తెరవలేదు  కనలేదు లోకం
నీ వెచ్చని స్పర్షే నాకు ఇంద్రలోకం
పురిటికందుగ నన్నుహత్తుకున్న
నీ గుండియల స్పర్శ
సృష్టిలో మరేప్రాణికీ
దొరకని ఆత్మీయ స్పర్శ
లాలి పాడి జోలపాడి
కమ్మనైన చనుబాలు త్రాపి
అందు ప్రేమానురాగాలు మేళవించి
సుఖనిద్రనిచ్చావు
నే బాధ కలిగి "అమ్మా"అంటే
చెమర్చునమ్మా నీ కళ్ళు
ఆ కన్నీటిలో దాగున్న అనురాగ
బంధం ఎవరికి తెలియదు
నీచేతిచలువన నీ కంటివెలుగయ్యాను
భువికి దేవుడిచ్చిన పెన్నిధి నీవు
నీవు పంచిన ప్రేమ సుమాలు
నా బ్రతుకును పూలబాట చేశాయి
నా కంట నీరు నిండినప్పుడు
నీ గుండె చెరువయ్యేనా
అనురాగానికి అద్దం నువ్వు
మమతకు భూదేవి సమమవ్వు
ప్రేమకు ఆకాశం నువ్వు
తొలి నమ్మకం నీవే
తొలి ప్రేమ నీదే
తొలిగురువు నీవే
తొలి స్నేహం నీదే
తొలి విమర్షనీదే
అందుకే అమ్మా నువ్వు "అమ్మ"వు!!
          *****అవేరా*****

తల్లిదండ్రులు

సహస్రకవి101-65
** శీర్షిక: తల్లిదండ్రులు **

తండ్రి కోపం తల్లి ప్రేమ
లక్ష్మన రేఖలు కారాదు
పిల్లలతో లాలనతో
కబుర్ల కాలక్షేపం
రోజువారీ చర్చల్లో
సాధక బాధకాలు
జయాపజయాలు
సంస్కార కుసంస్కారాలు
భాధ్యత గలపౌరునిగా
వికసించే భవిష్యత్తుకు సోపానాలు
ఆలు మగలు
పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలి
పిల్లముందు ఒకరినొకరు
దూషణ కు దిగరాదు
ఇద్దరిపై పూజ్యభావం
కలిగిచాలి శిక్షణతో
బాల్యం బంగారు భవితకు పునాది
పనులు నేర్పాలి ఓర్పుగా
బరువు భాధ్యత విలువల వలువలు తొడగాలి
వ్యక్తిత్వ నిర్మాణ విలువలు తెలపాలి
సంస్కృతి ఆచార వ్యవహారాలు
ఆచరణలో నేర్పాలి
సమాజ సంఘ జీవన ఔన్నత్య విలువలు నేర్పాలి
అందమైన ఊహా ప్రపంచాన్ని
భవిష్యత్తుని కలగనమనాలి
నచ్చినవి నచ్చనివి అన్ని విషయాలు
నేర్పుతో ఓర్పుతో నేర్పాలి
స్త్రీలను గౌరవించటం
మంచి స్నేహం బాలురకు
బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి
అతిగారం అతి దండనం
విపరీత పోకడలకు అసహనానికి ఇంధనాలు
తల్లి దండ్రుల అనునయ సమన్వయాలే రక్షణ కవచాలు
క్రమశిక్షణ లోపంతో నిండుతున్న
కౌన్సిలింగ్ కేంద్రాలు
తల్లిదండ్రుల ఉద్యోగ వత్తిడి
 సమన్వయ లోపం
పిల్లలకు అనురాగ ఆప్యాయతల లోటు
పిల్లల పట్ల లింగవివక్ష కూడదు
సెల్ ఫోన్ల వినియోగం
అంతర్జాల అప్రమత్త నేర్పాలి
బాలల బంగారు బాల్యానికి  భవితకు
అమ్మానాన్నలే పూల బాట వెయ్యాలి
పిల్లల భవిష్య నిర్మాణంలో నిత్యకార్మికులు
ప్రేమ అనురాగం ఆప్యాయతలే ఇటుకలుగా
విద్యవిజ్ఞానాలే సిమెంటుగా
బంగారు భవిష్యత్ భవన నిర్మాణంలో
నిత్య శ్రామికులు నిత్య కార్మికులు
కూలి ప్రతిఫలాపేక్ష లేని త్యాగధనులు

        ******అవేరా*******

మేమేం పాపం చేశాము

సహస్రకవి101-64

* శీర్షిక:మేమేం పాపం చేశాం *

విధాతా!
మేమేం పాపం చేశాం మూగజీవులగా పుట్టించావు?
ఆకలేస్తే అర్థంకాని భాషలో అరవటం తప్ప ఏం చేయగలం
దాహమేసినా అదే భాషమాది
వానల్లేక పచ్చిమేత కంటిచూపుకానక పాయే
రైతుకు పంటలేక అసువులు బాసుతుండె
మరి ఎండు గడ్డి ఎక్కడిది
నీరు లేక బీడువారింది అదిలాబాదు
పాలమూరులో దుర్బిక్షంతో గడ్డికరువు
మెతుకుసీమ మెదక్ లో క్షామం కరాళ నాట్యం
గుప్పెడు గడ్డి కరవైన నిజామాబాదు
ఓరుగల్లులో కరువు కాటకం
ఖమ్మం లో కరువైన పశుగ్రాసం
నల్లగొండలో తీరని పశువుల ఆకలి
రంగారెడ్డిలో గండమైన పశుపోషణ
కరీంనగర్లో కనుమరుగైన పశుగ్రాసం
ఆకలితో అల్లాడుతున్న మూగ జీవాలం
మనుషుల్లా రోడ్లెక్కి రాస్తా రోకో చెయ్యలేము
నీరసించటం తప్ప నినాదాలివ్వలేము
పోరాటం చెయ్యలేము
మా కడుపు నింపలేని అన్నదాత
మా తల రాతను ఏకబేలాకో రాస్తాడు
కడుపులు కాలే మేము మీ
కడుపులు నింప కళ్యాణి బిర్యానీలవుతాం
కళ్యాణాల్లో ఢంకాలమవుతం
కాళ్ళకి చెప్పులమవుతాం
విధాతా! మేమేంపాపం చేశాం ??
        ******అవేరా*****

బాల్యం

సహస్రకవి101-63
* శీర్షిక: బాాల్యం *  

బాల్యమెక్కడమొదలయ్యెనో యాదిలేదు
బండెన్కబండి కట్టి రజాకార్లపై పోరాడిన పోరుగడ్డ
నల్లగొండ లో పోలీసులైన్ బడిల
నాల్గు పుస్తకాల్ మోస్క పోయిన
తర్గతి గదులున్నా సల్లని చెట్టుకింద చెప్పెటోల్లు పంతుల్లు
మా పంతుల్లు గిప్పట్లక్కగాదు
గోలచేస్తె తోడ్కదీసెటోల్లు
అసల్ అమ్మఅయ్యలు
పంతుల్తొపంచాయితికి స్కూల్ కొస్తె ఒట్టు
డిక్టేసన్ రాస్తి కాంపోసిషన్ బీ రాసినట్లు యాదికుంది
నెెలనెల వచ్చే చందమామ
బాలమిత్ర బొమ్మరిల్లు సదవటాన్కి
అమ్మ అక్క అన్నలిద్దరు తమ్మి
మస్తు కొట్లాడినమ్
నేనైతే
వడ్డాది పాపయ్య శాస్త్రి ముఖచిత్రం  
మొదలు ప్రతిపేజి సదిగేది
గయ్యే మాకు పెద్దబాలచిచ్చ కన్న పెద్దబాలచిచ్చలైనయ్
కాలిదొరికిందంటే తమ్మి నేను
అమ్మ ఇచ్చిన పావలాతో
గోలీలు తెచ్చి మస్త్ గోలీలాడి
లాగుజేబునిండ గోలీల్ గెలిచిన
అక్కఅమ్మ తెల్లార్సరికి అన్నిగోలీల్
ఇంటెన్కబాయిపాల్జేస్తే మస్త్ఏడ్చిన
ఏడ్వకుబిడ్డా అని అమ్మ అయిదురూపాయలిత్తే
సిన్మాకు బోయిన కత్తిఫైట్ల కాంతారావు
ఎన్టివోడు నాగ్గోడు కిట్టిగోడు  శోబన్ బాబు సిన్మాల్ మస్త్ జూసిన
పండంటికాపురంల ఎస్వీఆర్ మస్త్ ఘోసపెట్టిండు
రమణారెడ్డి రేలంగి రాజబాబు పద్మనాభం
జోకులకు కడుపు పగల నగినా
గాడికెల్లి మా అయ్యకి తబాదలైతే
చౌటుప్పల్ జడ్పి స్కూల్లజేరిన
గాడ అరకిలోమీటర్ బోయి
ఈడ మూడుకిలోమీటర్ల నడకాయె
గిక్కడ గూడ గదే సీను
అందరు బెత్తంసార్లు
దెబ్బలుతిన్న ఎండలనిలబడ్డ గోడకుర్చీలు ఏసిన
టెన్నీకయిట్ వాలీబాల్ కబడీలు బీ ఆడిన
గీ సదువులకు ఆటలకు ఇస్కూల్ల కట్టిన ఫీజు ఐదు రూపాయలే
బడి పక్కన చెల్కల్ల రేగుపండ్లు తిన్న
ఇంటి దగ్గర పతంగులు వామనగుంటలు
అష్టచెమ్మ  అక్కతో తొక్కుడు బిల్ల దాగుడుమూతలు
ఆరుద్ర పురుగులతో ఆటలు తూనీగల వెంట పరుగులు
పండగలకు పిండివంటలు పంచుక తిన్నం
మామిడి పళ్ళు పిండుకు తిన్నం
అమ్మకు కళ్ళాపికి పేడ కూడ తెచ్చిచ్చినం
ఇంటిపక్క తంగడు కొమ్మ నా టూత్ బ్రష్
7 వ తరగతి అని భయపెట్టిన్రు అవలీలగ రాసినా
డెబ్బయి పైన వచ్చి నయ్ మార్కులు
గాడ్కెల్లి మల్లీతబాదల సికింద్రబాద్ కి
సెంట్ థామస్ ఇస్కూల్
స్కూల్ల మా సైన్స్ టీచర్లు హిందీ సార్
పెద్ద గ్రౌండ్ తప్ప ఏంనచ్చలే
కొత్తదోస్తులు కొత్త ఆటలు
గోలీలు బేస్ బాల్ ఫుట్ బాల్ కిరికిట్
ఏడాదిలనే స్కూల్ టీంల తీస్కున్నర్
ఒకటే మ్యాచ్ ఆడి టాప్ స్కోర్ తో స్కూల్ టాప్ లేపిన
గిదీ బాల్యం అంటే
కిలోల్ కిలోల్ పుస్తకాలు మొయ్యలే
కిలోల్ కిలోల్ సదువు మేసిన
వేలకు వేల్ పైసల్ కట్టలే
వందల లోపు ఫీజుల్ కట్టినా
ఏడ్చిన నవ్విన ఆడిన పాడిన
ఎదిగినా  బుద్దిలో......
.....ఆ తలపులే ఆనంద ఆర్నవాలు
గిలిగింతల సుమ తలంబ్రాలు !
         *****అవేరా****

బుద్ద ఉవాచ

సహస్రకవి101-62
 7/12/2015

* శీర్షిక: బుద్ద ఉవాచ *

తన్నుట తిట్టుట మాత్రమే కాదు హింస
మందలించుట మాత్రమే కాదు హింస
మనసు గాయపరిచే మాట కూడా హింసే

ఇష్టం పడేట్లు చెబితే
కష్టం లేకుండా గ్రహిస్తాడు
అదే"మనసెరిగి చెప్పటం"

మనషి పై మనిషి అధికారం
బానిస యజమానుల లక్షణం
అదిలించి చెప్పనేల
అనునయ భాషఉండగా
      *****అవేరా ****

వలస పక్షులు

సహస్రకవి101-61
 7/12/2015

* శీర్షిక: వలస పక్షులు *

కొన్ని వేలకిలో మీటర్ల ఆవల మా ఊరు
ఊరు వదలి దేశం వదలి ప్రకృతి ప్రేమలో
మైమరచి పోదామని వచ్చాము
వలస పక్షులం ఫ్లెమింగోలం మేము
ఇల్లూ వాకిలి లేని సంచార పక్షులం
ఆకాశం అంచును తాకగలం
మేఘాలను చుంబించగలం
శరదృతువులో మాకనుకూల వాతావరణంలో
పిక్నిక్ కని వచ్చాము సొంత గూడువదలి
అత్తగారింటికి వచ్చే పెళ్ళి కొడుకుల్లా
ప్రతీ ఏడు వస్తున్నాం ప్రకృతిలో పరవశించి వెళుతున్నాం
కానీ ఈ ఏడు ఆనంద ఉత్సాహలతో
ఇక్కడికి చేరుకున్న మాకు నిరాశే
ఆనాటి మెదక్ అడవుల పచ్చదనం ఏది??
వాగుల  వంకల ఎగిరి దూకే జలపాతములేవి?
మంజీరా వయ్యారాల వంపుల్లో
జలజల పారే జలసిరులేవి?
మంజీరా ప్రాజక్టు
ఆకలితో అలమటించే
పేదవాని ముఖము వలే
కళావిహీనమైనది జలములేక
ఋతుపవనాలు ముఖం చాటు చేసెనో ?
ఎల్నినో ప్రభావమో ?
గ్రీన్ హౌస్ వాయు ప్రభావమో ?
వర్షాలు లేక ఎండెను మా అభిమాన సరస్సు
కళకళలాడే పచ్చని
అడవి తల్లి వెలవెల బోయింది
నీరులేని సరస్సులో మాకాహారమేది .?
మాకు జలకాలాటల ఆనందమేది?
వేలలో వచ్చే మేము రేడియేషన్ మృత్యుపాశానికి
కొందరు బలి కాగా వందలలో మిగిలాము
ఎండిన సరస్సును జూచి
మరలిపోయారు సహచరులు కొందరు
నిరాశా నిస్పృహతో !
ఆందోలు చెరువులో నీరు తక్కువున్నా
తిప్పలు తప్పవనీ అక్కడ చేరాము
కరుణిస్తే ప్రకృతి వస్తాయి వానలని
ఆశతో కాలం వెళ్ళబోస్తున్నాం బిక్కు బిక్కంటూ
             *******అవేరా ********

సరస్వతి మాత

సహస్రకవి101-60
సహస్రకవుల రెండవ సంకలనం దీ 6/12/2015
విషయము : సరస్వతి

** శీర్షిక: సరస్వతి మాత **

ఓం జై సరస్వతి మాతా జైజై సరస్వతి మాతా
శరణాగతులను ఉద్దరించే మహిమాన్విత మాతా
                                            ఓం జై సరస్వతి.....
జ్ఞాన నేత్ర ప్రధాతా
మహాభాగ్యవిధాతా
నిను కొలిచే మనుజల సిరులిచ్చే మాతా
                                             ఓం జై సరస్వతిమాతా  ...
నీ దయ మించన  సిరి ఉందా
నావాక్కుననిలిచే దయవుందా
మనసా వాచా కొలిచేవారికి నీ దయ చూపు మాతా      
                                              ఓం జై సరస్వతిమాతా .....                                                                                                                                                               మనుజుల నేలే మహాదేవీ
మా వాక్కున నిలిచే వాగ్దేవీ
అంబ వాగీశ్వర మాతా ......
                                              ఓం జై సరస్వతిమాతా ......
సర్వ జ్ఞాన ప్రధాతా
సర్వ వేద విధాతా
నాలోసుస్వరమై నను గావుము మాతా
                                             ఓం జై సరస్వతి మాతా .....
ఓం నమో మహా మాయా
ఓం నమో  కమాలాసనా
నా మనసున నిలిచిన  మనోరంజని మాతా
                                             ఓం జై సరస్వతి మాతా  ....
భారతి నీవే అక్షరమై
నా జీవన రాగ సుస్వరమై
నా కవనంలో జీవమై నిలువుము మాతా
                                                       ఓం జై సరస్వతిమాతా ..
శాస్త్రరూపిణి మాతా త్రికాలజ్ఞమాతా
బ్రహ్మవిష్ణు శివాత్మికమాతా
భువనము నేలగ రావా  మాతా
                                                         ఓం జై సరస్వతి మాతా
కరుణను జూపవె కమలాక్షి
మూఢ మతులకు మతినిమ్ము
నిజనీరాజన మిదే  మాతా మము కరుణించుము మాతా
                                                        ఓం జై సరస్వతి మాతా
             ********అవేరా********

                                                         

Wednesday, December 23, 2015

ప్రకృతి విలయము కాదు మానవ హత్యలు

సహస్రకవి101-59
* శీర్షిక: ప్రకృతి విలయము కాదు మానవ హత్యలు *

పొలమున జలము నిండిన
నీటికి దారి చేయు
మురుగు కాల్వలో.... కర్షకుండు
జలము నిండిన మురుగున
పారనతొలగింతురు పూడిక
నిండుగ దిగువకు దిగగ నీరు
చెన్నపట్టణాన  మురుగు దిగగ
దారి వెతుకుచు గంగమ్మ
దారి గానక పట్టణమ్మున జొచ్చె
మురుగు కాలువల పూడిక
ముప్పది శాతమట
చెరువులన్ని ఆక్రమణల వరములయ్యె
కాలువలందు కాలనీలు వెలసె
నదుల ఒడ్లు నడ్డివిరిగె
ప్రభుత చేతగాదు
చట్టమిచట లేదు
ఆక్రమణపూడికను
తొలగించె నాధుండెవ్వడు?
నాకే చేస్తారా "రాస్తారోకో" అని
ఆగ్రహాన గంగ జనహననమొందించె
ప్రళయ రాణి వోలె ప్రజ్వలించే
నిలుప ప్రాణము నిలిచె వైద్యాలయాలు
మందు మాకు లేక
విద్యుత్తు లేక
వెంటిలేటరు లేక
వెంటిలేషన్ లేక
కుళ్ళుతున్న శవాల
దుర్గంధ " భూతమై"
నిలిచినవి మిధ్యాలయాలై
చెన్నపట్టణము స్మశానము చేసినయట్టి
మానవాక్రమణలు శిక్షార్హమైన తప్పిదములే
ప్రకృతి విలయము కాదు
తరచి చూడ మానవ హత్యలివి
మరి నిలదీయగ లేడిచట "అపరిచితుండు"
        ******అవేరా *******

సంస్కృతి

సహస్రకవి101-58
* శీర్షిక: సంస్కృతి *

సహనమే సంస్కృతి
ద్విసిద్దాంత సంస్కృతి
ఆదర్శవాద సిద్దాంతం
బౌతికవాద సిద్దాంతం
ఆదర్శవాద సిద్దాంతం
ఆర్య సంస్కృతి
వేదసంస్కృతి
బౌతికవాద సిద్దాంతం
బౌతిక పరిసరాలు అవసరాలు
జీవితానుభవ సిద్దాంతాల
విశ్వాస భావాల సంస్కృతి
"సమ్యక్ కృతి సంస్కృతి"
అంటే చక్కగా తీర్చిదిద్దినది
సంస్కరించునది సంస్కృతి
నాగరికత పరంగా
ఆచారవ్యవహారాలు
సంప్రదాయాలు
కట్టు బొట్టూ
కళలు
సాహిత్యం
జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి
సంపూర్ణవికాస చిత్రం సంస్కృతి
సమదృష్టి సమ దృక్పధం  సంస్కృతి
జాతీయ మనస్తత్వం మేధోసంపత్తి
జాతీయ సంస్కృతి
ప్రజలు ఏసమాజానికి చెందినా
సమ్మిళిత సమ్మిశ్రిత సంస్కృతి జాతీయ సంస్కృతి
           *********అవేరా********

ప్రేమ

సహస్రకవి101-57
* శీర్శిక: ప్రేమ *

 మాటలతోపుట్టి మాటలతోపెరిగి
మాట్లాడకుంటే పోయేదికాదు ప్రేమంటే
పోట్లాడుకుంటే పోయేది కాదు ప్రేమంటే
కంటి చూపుల్తో మాట్లాడు కోవటం కాదు ప్రేమంటే
సినిమాలకు "షి"కారు" ల కెల్లడం కాదు ప్రేమంటే
పబ్బుల నాట్యం కాదు ప్రేమంటే
ఆకర్షణలతో " అందు"కోవటం కాదు ప్రేమంటే
తిరస్కారానికి మరణశాసనం కాదు ప్రేమంటే
నమస్కారానికి ఆసిడ్ శాసనం కాదు ప్రేమంటే
ప్రేమించిన మనిషి సుఖాన్ని కోరేదే ప్రేమ
మనసులోపుట్టి మరణంవరకూ తోడు ఉండేదే ప్రేమ
         *******అవేరా*******

గుండె చెరువు

సహస్రకవి101-54
* శీర్షిక:  గుండె చెరువు *

కాంక్రీటు జంగల్
మెట్రోపాలిటన్
చెరువైన చెన్నపట్నం
వరుణుడి కోపమో?
కర్బన ఉద్గారాల పాపమో ?
మనిషి సుఖజీవన వ్యమోహమో?
భారీ వర్షాలు భారమైనాయి
వరదలు వణికిస్తున్నాయి
గూడు చెదిరి  గుండె చెరువై
అన్నపానీయాల కోసం
అలో లక్ష్మణా  అంటూ
ఆదుకునే ఆపన్నహస్తం కోసం
కాలుకదపలేక
ఎటూకదలలేక
ఆహారంకోసం ఎదురు చూసే
గువ్వ పిల్లల్లాఎదురు చూస్తున్నాయి
చెరువైన చెన్నైలో
చెరువైన గుండెలెన్నో
త్రాగునీరు లేక
తడారిన గొంతుకలు
ఎడారిలో ఒయాసిస్సుల కోసం దీనంగా
ఎదురు చూస్తున్నవి
గొంతు తడిపే నీటి బొట్టుకోసం
కకావికలం జనజీవనం
ప్రభుత్వాల నిర్లక్ష్యం
ప్రజల స్వార్ధపరత్వం
మాయమైన చెరువులు
మాయమైన కాలువలు
ఆక్రమణలో నదులు
అడయార్ కూవం కశస్ధలి
పెరుగుతున్న విజ్ఞానం
తరుగుతున్న ఆచరణ
నీరు పల్లమెరుగు
నిజమే.......
మరి పల్లమెవరు ఎరుగు???
ప్రకృతి విలయం ప్రమాదమయితే
ప్రభుత్వాలది ఏమోదం??
మానవసేవే మాధవసేవంటూ
నాన్ ఉంగలోడు ఇరిక్కేన్ అంటూ
అందరం అందిద్దాం
అవసరానికి ఆపదలో
ఆపన్నహస్తం...!
  *******అవేరా*******

Tuesday, December 22, 2015

జండా -- ఎజెండా

సహస్రకవి101-55
  7/12/2015
 * శీర్షిక: జండా--ఎజెండా *

వలసలు రాజకీయ రంగు మార్పిడులు
వలసలు ఊసరవెల్లుల విన్యాసాలు
నీతిమాలిన రాజకీయాలకు అద్దాలు
నిజాయితీని సమాధి చేసే నిశిక్రీడలు
ఒకరోజు త్రివర్ణం
ఒకరోజు కాషాయం
ఒకరోజు పసుపు
ఒకరోజు గులాబీ
ఒకరోజు ఎరుపు
ఒకరోజుపచ్చ
మరొక రోజు మరొక రంగు
ఒక్కొక్క రంగుకు
ఒక్కొక్క జండా
ఒక్కొక్క ఎజెండా వున్నా
ఒకే ఎజెండా తప్ప
ఏ ఎజెండా లేని వాళ్ళు ( వి) నాయకులు
ఆ ఒక్కటే పదవి ఎజెండా
ఒక జండాతో గెలుస్తారు
మరో జండా ధరిస్తారు
గెలవక ముందు నాయకుణ్ణి పొగుడుతారు
గెలిచాక కండువా మార్చి మరీ తెగుడుతారు
సిద్దాంతం  బద్దతకు ప్రమాణాలు చేసి
ఓటరు దేవుళ్ళంటూ ప్రణామాలు చేసి
జవాబు దారి లేని ప్రజా దేవుళ్ళీ (వి)నాయకులు
సిద్దాతం రాద్దాంతమైనపుడు
ప్రమాణాలను  ప్రణామాలనూ  తుంగలోతొక్కే
మారాజుల ఎన్నిక
కాదా ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం ??
(ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు)
          ********అవేరా*****

అన్నదాత

సహస్రకవి101-56
* శీర్షిక :అన్నదాత *

పురుగుమందుకు నేలకొరిగిరి ఒకరు
కరంటుతీగకు బలి అయ్యి ఒకరు
రైలుకు ఎదురెల్లి ఒకరు
ఉరికొయ్యకేళ్ళాడి ఒకరు
రైతుకాదని ఒకరు
రచ్చ చేయబూని ఒకరు
అన్నదాత అనాధఅయ్యెనా....అయ్యో......!
చావు లెక్కలు తేల్చక
బడ్జట్టు లెక్కలేస్తారు
సంబురాలు చేస్తారు
గిట్టు బాటు ధర అంటె
ముఖం చాటేస్తారు
ఖాళీ జేబూల్తో
కాలేకడుపుల్తో
కూలీదొరక్క
తన కడుపు నింపక
తనవాళ్ళ కడుపు నింపలేక
అభద్రతాభావంతో
అన్నదాత అసువులు బాసెనా...
అయ్యో అన్నదాతా !
మాకు అన్నం పెట్టే దిక్కెవరు?
దేశ ఆహారభద్రతకు దిక్కెవరు??
         *****అవేరా*****

పోరాటం

సహస్రకవి101-53
3/12/2015 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా

* శీర్షిక:పోరాటం *

అమ్మా
ఆకలేస్తుందని అడుగలేనమ్మా !
నోరులేని లేగలా నేనున్నా
నా పేగు ఆకలి కేక నీకెలా వినిపించిందమ్మా !
అవిటినైనా అక్కున చేర్చుకుంటావు
అందరి లానే నన్ను చూస్తావు
మరెందుకమ్మా అందరూ నన్ను అవిటి అంటారు?
చదువులో ఆటలో ముందున్నా
అదోలా చూస్తారెందుకు?
ఆటపట్టిస్తారెందుకు?
వేరుచేస్తారెందుకు?
గేలిచేస్తారెందుకు?
నీవిచ్చే ప్రేమను వాళ్ళెందుకివ్వరు?
నీవిచ్చే ధైర్యం వాళ్ళెందుకివ్వరు?
ఎవరేమన్నా
ఎవరేమనుకున్నా
నాకూ కలలున్నాయి
నాకూ ఆశలున్నాయి
నాకూ ఆశయాలున్నాయి
నీవిచ్చే ధైర్యంతో
సమాజ దృక్పద వైకల్యాన్ని జయిస్తాను
నా కలలు ఆశలు ఆశయాలుా సాధిస్తాను...
               *****అవేరా******


మరణం

సహస్రకవి101-52
3/12/2005

* శీర్షిక: మరణం*

పుట్టిన ప్రతి ప్రాణి గీట్టక తప్పదు
జీవితకాలాలే తేడా
పుట్టిన ప్రతిచెట్టూ
పుష్పిస్తుంది ఫలిస్తుంది
ప్రతిఫలాపేక్ష లేేకుండా
మానవునకందిస్తుంది
ప్రకృతితో మమైకమై
పర్యావరణాన్ని వాతావరణాన్నికాపాడి
ధన్యతనొంది కాలం చేస్తాయి
సర్వోత్తమ మనిషి జన్మ పొంది
స్వార్ధంతో పరోపకారము మరచి
జీవజంతు ప్రేమ మరచి
చెట్టు నరికి పుట్ట కూల్చి
చచ్చి శవమై చెరువు గట్టుకు చేరతాడు
చనిపోవడమే మరణంకాదు
ఏ పని చేయక పోవడమూ మరణమే
చేసే మంచిపనితో కాగలడు అమరుడే..
       *******అవేరా*******

ప్రకృతి ప్రకోపమా!

సహస్రకవి 101-51
3/12/2015
* శీర్షిక: ప్రకృతి ప్రకోపమా!*

ప్రకృతి ప్రకోపమా?
వరుణుడి కోపమా ?
పారిస్ సదస్సుకు
పర్యావరణ హెచ్చరికా?
కుండపోత వర్షం తో
కుదేలైన చెన్నపట్నం
కుదురు లేక
పెచ్చరిల్లె గ్రీన్ హౌస్ వాయువులు
పెరిగెను భూతాపము
విరిగెను ప్రకృతి నడుము
ఫలియించని చర్చలతో
దశాబ్దాలు దొర్లాయి
పెరిగిన ఉష్ణోగ్రతతో
మంచు ఫలకాలు ద్రవమై దొర్లాయి
కర్బన ఉద్గారాలతో అభివృద్దికి సోపానం
మానవ మనుగడనే చేస్తాయి భూస్ధాపనం
కళ్ళు తెరిచి ప్రభుతలన్ని
చర్యలు చేపట్టాలి
పారిస్ పర్యావరణ సదస్సు సాక్షిగా...
            ******అవేరా******


గంగమ్మ

sk101-50
*శీర్షిక: గంగమ్మ*

ఆడ
ఈడ
యాడ
వెతికినా
కానరాదె
నీ జాడ
మనుజ లోకమ్ము వీడి
కైలాసమునకేగి
పతి సిగన
చలికాగుచుంటివా
చలికాలమైనా
చల్లగాలులు  లేవిట
అన్నదాతల కాష్టాలు భోగిమంటై...
   ****అవేరా****

దృక్పధ వైకల్యం

సహస్రకవి 101-49

3-12-2015 ప్రపంచవికలాంగుల సంక్షేమదినోత్సవం

* శీర్షిక: దృక్పధ వైకల్యం *

మిత్రమా!
వైకల్యజీవివి కావు నీవు
వైఫల్యం అంతకన్నా కాదునీది
కళ్ళు లేవని కలత చెందకు
నా కళ్ళతో  కళ్ళుండీ  కబోదియైన ఈ లోకాన్ని చూడు
చేయిలేదని చింత చెందకు
నా చేయూత ఉంటుంది నీ చెంతన
కాలు లేదని నీవు బాధ పడకు
కాలంతో  నీవు పరుగులెట్టు
చెవులు లేవన్న వ్యధ నీకేల
చెవులుండీ వ్యధల ఘోష వినలేకున్నా !
నోరు లేదని నీరసం నీకెందుకయ్యా
అరచి అసత్యాలు పలుకని అదృష్టం నీదయ్యా!
ఆసక్తి ఉంది నీలో
అర్హత ఉంది నీలో
చేవ ఉంది నీలో
చేష్ట ఉంది నీలో
వైకల్యం నీకు సమస్య కాదు
సాఫల్యం నీ పాదక్రాంత
నిన్ను చూసి అయ్యో అనే
సమాజం ప్రభుత్వాల దృక్పధ వైకల్యం
పేదవారి కోసం
దళితుల కోసం
మైనారిటీలకోసం
పోరడే ప్రజాసంఘాలకు
స్వచ్చంద సంస్ధలకు
పాటు పడే ప్రభుత్వాలకు
కనపడవు మీ కన్నీటి చారికలు
వినపడవు మీ ఆకలి కేకలు
తెలియగ లేరు సామాజిక సంక్షోభం
చేయగ లేరు సమ్మిళితాభివృద్ధి
       *******అవేరా********

ప్రియా!!

sk101-48
dt 2/12/2015
* శీర్షిక: ప్రియా!! *

గ్రీష్మం లో
ఈ హిమ వీచికలేమి?
నిను తాకిన మలయసమీరము
మంచు బిందువాయనా??

హేమంతంలో
ఈ ఉష్ణతాపమేమి ??
నినుతాకిన మంచుబిందువు
ఆవిరై నీలిమబ్బును చేరెనా??

ప్రియా! నీ ముందు
ఏ ఋతు ప్రభావమైనా శూన్యము..!
        *******అవేరా*******

అమీరు - గరీబు

sk101-47
*శీర్షిక: అమీరు--గరీబు *

ఆకలేసి ఒకడు
కడుపు కాలి ఒకడు
కేకలేసినాడు పుడమి పైన
వాడు గరీబు గాడు
పొట్టపగల ఒకడు
నట్టపొట్టనింపె నొకడు
పొట్ట పుట్టము నిండ
రోగ గ్రస్తమయ్యి పుండులుండ
కేకలేసినాడు పుడమిపైన
వాడు అమీరు గాడు
*******అవేరా *********

ఎయిడ్స్

sk101-46
ఎయిడ్స్ డే సందర్భంగా
శీర్షిక:  ఎయిడ్స్

రోగములనాపేటి నిరోధక శక్తి
నీకిచ్చె ప్రకృతి నిజముగాను
ప్రకృతిని ప్రశ్నించె వికృత వైరస్సు ఒకటిబుట్టె
తిరుగు బోతుల తిక్క తిరిగి ఆలోచింప
జాగ్రతల నేర్పెను ప్రభుతలిచట
మందు మాకులేదు మాయదారి రోగమ్ము
మరణమొక్కటే మందుగాన
అంటి ఆగమకుకుట కన్న
అంటకుండుట జేయ
సచ్చీలతయే నీకు సరిబాట
  *******అవేరా******

రక్తకన్నీరు

sk101-45

* శీర్షక: రక్తకన్నీరు *

మగడు చచ్చిన నేను మరియొక్కసారి
అరక దున్నితిని ఆశతోడ
విత్తు జల్లి నీరు పెట్టిజూడ
మొలకలొచ్చిన లేదు  పచ్చ జూడ
ఎరుపు రంగున నారు తిలక వర్ణమునుండె
సగటు రైతు రక్త కన్నీరు బోలి
    ******అవేరా*****

వేదనలో లాలన

sk101-44

* శీర్శిక: వేదనలో లాలన *

మనసు మనసులో లేదు మనసున నినుతలచి
నీవు దూరమైనా నీ మది నాకు చేరువయ్యే
ఎడబాటు మనుషులకే కాని మనసులకు కాదహో
నిజము తెలియుము నిదే నిక్కుటముగా !!
      ********అవేరా*******

కూడిక

sk101-43
* శీర్శిక: కూడిక *

నేను నేనను అహము నిన్ను నిన్నుగ నిలుపు
మేము మేమను ఇహము మనముగ నిలుపు
ఏక గరిక ఏ పాటి బలము
కూడితే గనుక గజము నిల్పగ నిజము
   ****అవేరా****

వందనం

sk101-42
cell 7207289424
తే దీ: 29/11/2015 సహస్ర కవుల ప్రధమ సంకలనం సందర్బంగా
విషయము;వినాయకుడు /విఘ్నేశ్వరుడు

* శీర్షిక : వందనం*

వందనం వందనం వక్రతుండ మహాకాయ వందనం
వందనం ఏకదంతాయ వందనం  
వందనమని నిను మ్రొక్కెద మెల్లని చూపుల దయకనగా
వందనమని నిను వేడెద నవిఘ్నమస్తని ధూర్జటినందనా

వందనం వందనం శూర్పకర్ణం దేవం వందనం
వందనం పాశాంకుశ ధరం దేవం వందనం
వందనమని నిను ప్రార్ధింతును ఆసరసవిద్యలనొసగమనీ
వందనమని నిను పూజింతును సద్బుద్దినివ్వమనీ

వందనం వందనం పార్వతీ నందనాయ  వందనం
వందనం శంకరప్రియనందనాయ వందనం
వందనమని నీకిత్తును ధూపదీపనైవేద్యం
వందనమని నీకిత్తును ధవళహారతులూ

వందనం వందనం మూషిక వాహనా వందనం
వందనం కోటిసూర్య ప్రభాయ వందనం
వందనమని నిను కొలిచెద పత్ర ఫల పుష్పాలతో
వందనమని నిను కొలిచెద దూర్వారయుగ్మపూజలతో

వందనం వందనం శ్రీ మహాగణపతిం వందనం
వందనం శ్రీ గణనాధాయ వందనం
వందనమని నిను వేడెద కష్టాలను బాపుమనీ
వందనమని నిను వేడెద శుభములనొసగమనీ

వందనం వందనం శ్రీ కాణిపాక నాయకా వందనం
వందనమని శరణంటిని కోటి ఆశలతో
వందనమని శరణంటిని శతకోటి ఆశయాలతో
వందనం జయకర శుభకర సర్వపరాత్పర  వందనం
వందనం సర్వవరప్రధాతకు  వందనం...
         ********అవేరా *********

జయహో గణనాధ

sk101-41 అనుసూరివేంకటేశ్వరరావు
* శీర్షిక: జయహో గణనాధ*

జయజయజయ విఘ్నరాజ
జయహో జయ జగద్రక్షక
జయజయజయ జయకరా
జయహో జయ పార్వతినందన
జయజయజయ శుభకరా
జయహోజయ పరాత్పరా
జయజయజయ ఏకదంత
జయహో జయ శ్రీకరా
జయజయజయ గణనాధా
జయములన్ని నీకయ్యా
వరములన్ని మాకయ్యా
కరుణజూపి మము కావుము
సహస్రకవుల మొరవినుము
విఘ్నాలు తొలగించు
వైభవమొసగు దీవెనలందించు!
      ****అవేరా****


ఋతు రాగాలు


sk101-40
( ఒక స్త్రీ జీవితాన్ని ఋతు చక్రంతో పోల్చుతూ రాసిన కవిత
 వసంతంతో మొదలై శిశిరంతో ముగుస్తుంది )
*శీర్షిక : ఋతు రాగాలు*

నవవసంతంలో తరులతల చిగురింతల  క్రొత్త అందాలు
వసుధకు పచ్చ తోరణాలు తొడిగాయి
ఆడశిశువైై అమ్మ ఒడిలో ఒదిగాను
బాల్యంలో జ్ఞానమనే కొత్త చిగురులు తొడిగి
యవ్వనంలో అరవిచ్చిన లేలేత
క్రొంగొత్త అందాలు విరిసాయి
16ప్రాయంలోవికసించే కోరికలే  వీచేే  మలయ సమీరలై  అణువణువూ  తడిమి సాయంత్రపు సంధ్య వెలుగులు
నిండిన కలల కాసార   సాక్షిగా స్వర్ణ  వర్ణ  రంజితమై
ముగ్ధ సుకుమార సోయగ కుసుమాలపై
వ్రాలిన బ్రమరంలా అల్లరి చేస్తే
జలకాలాడుతూ చల్లని వెన్నెల  రేయి పరవశించే వేళ
సుముహూర్త కళ్యాణ వేళ
నవ వధువుగామంగళవాయిద్యాల నడుమ
ఏడడుగులు నడిిచాను వరుడి తోడ
పుట్టినిల్లు వదలి  మెట్టినింటికి

కాలం గ్రీష్మం లోకి నడిపించింది
యవ్వన మధువనిలో వన్నెచిన్నెల వికాసం
మండువేసవిలో పండువెన్నెలలో
విరిసిన సంపెంగ మల్లియల పరిమళ మలయ సమీరమై
కోయుల కుహూ కుహూ రాగాలు నా దరిచేరి
రతీమన్మదీయమై వీణియతంత్రిని తాకే అంగుళియై
నాలోని అణువణువూ మదిలో రాగాలను మీటుచున్నవి
అలసి వాలిన తనువు " ఆవిర" వుతున్నది
నాలోని  వీణాతంత్రులు  సుతిమెత్తని శ్రీరేడు అంగుళి
స్పర్ష కోసం నెలరేడు కోసం ఎదురు చూసే కలువల్లా
సంగమించే క్షణం
ప్రణవించే క్షణం
నను వయ్యారి వలపు తారను జేసి
జలతారు మేలిమబ్బు పరదాలు తీసి
నను చందమామను చేసి
సయ్యాటకు నను శృతి చేసి
నా హృదయ వీణఝమ్మనిపించే
ఆచిలిపి చూపుల రేడు నను చేరరాగా
చల్లని వెన్నల జల్లులు కురిసిన జాబిల్లి
మబ్బులతో దోబూచిలాడుతూ
సిగ్గుతో మబ్బును పరదా చేసుకుంది
నా సంసారమొక శృంగార నైషధమైనది
నవవసంత రాగమైనది ... గ్రీష్మ సరాగమైనది

గ్రీ ష్మం తరువాత ....
వర్షఋతువు రానే వచ్చింది
ఆకాశాన తేలియాడే మబ్బులు
చెలులకు మేఘ సందేశాలు మోస్తున్నవి
నల్ల మబ్బులు.. చల్లగాలులు...
చిరుజల్లులు ....చిరుతలై
గ్రీష్మతాపజింకను  తరుముతున్నవి
కడుపుపండి ముద్దులొలికే చిన్న కలల పంట
పాపాయి బోసినవ్వులు జల్లుల వానై
ఆనందపు వరదలు తెచ్చింది నాలో
మమతల ఊటలు నింపింది
నా మనస్సుకి  ఊరట నిచ్చింది  .....

నీ  వెనకే నేనున్నానంటూ
శరదృతువు చల్లని వెన్నెల తెచ్చింది
భర్త ప్రేమానురాగాలు  సరాగాలు
రాగ రంజితాలైనాయి
సంసార సాగరం పై కురిసే చల్లని వెన్నెల జల్లుల
కాంతులు తిమిరాంధకారాన్ని తరిమి వేసాయి
అందరి మనస్సులలో కార్తీక దీపాలు వెలిగాయి ......

కాలం ఆగితే వయసుతో పనేముంది
నేనూ ఉన్నానంటూ హేమంతం వచ్చింది
ఎదిగిన పిల్లల అల్లరి ఆనందం
హిమస్వేదంలా  గిలిగింతలు పెట్టింది
ఎదిగిన ఆర్దక పరిపుష్టి
హేమంతపు చల్లగాలిలా
మనసుకు స్వాంతన కలిగించింది
భవిష్యత్ ముగ్గులు పరిచింది
బ్రతుకున సంక్రాంతిని నింపింది
ముగ్దత్వంతో హుందా తనమే నిండింది......

ఇహలోక  వాంచల దీపం కొడిగట్టే  వేళ
శిశిరం రానే వచ్చింది
ఆరుపదులుదాటి వడలినమేనితో జీవంలేని మోముతో
వంగిన నడుముతో  తడబడు మాటతో
కాల చక్రమున శిశిరంలో
రాలే పండుటాకులా ఆద్యాత్మిక లోకంలో
పరమాత్ముని పిలుపు కోసం ఎదురుచూస్తూ నేను  .....
మరో నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ .......
      ******** అవేరా*********

టిక్...ఇక్...టిక్

sk101-39
* శీర్షిక: టిక్..టిక్..టిక్ *

ఏ ఆర్ రహమాన్ శృతి లయ
నీ నడకలో వుంది
వయ్యారంగా నడుస్తావు
వలయాలే చుడుతుంటావు
అలుపనేదే లేకుండా
మరాధన్ పరుగుతో
చేరిన గమ్యాన్నే చేరుతుంటావు  
మళ్ళీ మళ్ళీ.....
నీకు తోడుగా మరో ఇద్దరు పరుగెడుతున్నా
పరుగులో నీకు లేరెవరూ సాటి
నిదుర లేచినది మొదలు
నిద్ర పోయే వరకు
నిను చూడని వారుండరు
మానవుల సమయపాలనకు
దిక్సూచివి నీవు
జి.ఎమ్.టి తో అనుసంధానమౌతావు
ప్రపంచ కార్యాలకు సమయ నిర్దేశ్యం చేస్తావు
నిన్ను లెక్కచెయ్యని ఆలస్యపు రైళ్ళకు
ఆలస్య పట్టికలో మొట్టికాయ వేస్తావు
ఇంద్రధనుస్సు రంగులలో
ఇంటికి సొగసు తెస్తావు
పెండులమ్ కదలికతో
లయ బద్దుడవౌతావు
ప్రపంచకప్ అయినా
ఓలంపిక్స్ అయినా
ఎన్ని ఆటలున్నా
ఎందరాటగాళ్ళున్నాసరిరారు నీకు
పరుగపపందెంలో
*****అవేరా*****

సుభాషితాలు

sk101-38
* శీర్షిక:   సుభాషితాలు*

పేరులో ఏమున్నది  అక్షర కూర్పు
నోటిలో ఉండాలి మాటలనేర్పు  
కార్య సాధనమున కావాలి ఓర్పు
పొరుగువాడిని చూసి ఏడ్పు
నీఆశల దీపాలనే  ఆర్పు
మనసున మంచి ఆలోచన చేర్పు
నీ వైపే అనుకూల తీర్పు
ఆపై అభిరుచుల వంటావార్పు
   ****అవేరా**** 

స్త్రీ

sk101-37
ది : 20-11-2015

* శీర్షిక:   స్త్రీ*

రూపులేని నెత్తుటి ముద్దకు
ఊపిరులూదింది ఒక మాతృమూర్తి
మరో అమ్మకు జన్మనిచ్చింది
మహాలక్ష్మి పుట్టిందన్నారెవరో
అమ్మో ఆడపిల్లా ! అన్నారింకొకరు

హు..లోకో భిన్న రుచి  !
అమ్మతనానికి ఆ బేధం లేదు
ఆడైనా మగైనా తను మాత్రం అమ్మే
ముర్రిపాలు పట్టి ముద్దుచేస్తుంది
ముద్దులొలికే మాటలకు మురిసిపోతుంది
బుడిబుడి నడకలకు వడి నేర్పుతుంది
వణికించే చలిలో తాను వణికినా
ఒడి వెచ్చదనం పంచుతుంది

బారసాల సంబరాలు మొదలు
శైశవాన అమ్మను మురిపిస్తుంది
బాల్యంలో సోదరులను ఆటలతో మరిపిస్తుంది
కన్యగా కవుల కలలలో కలంలో
 సౌందర్య సొబగులద్దుతుంది
అందాల హరివిల్లై సిరిమల్లెల నవ్వై
మందారంలా విరబూస్తుంది

అన్నదమ్ములకు ప్రేమానురాగాల  రక్షాబంధనమౌతుంది
అక్కాచెల్లెళ్ళ కు అనురాగ సాగరమౌతుంది
కట్టుకున్నవాడి కోసం కన్నప్రేమకు దూరమౌతుంది
మెట్టినింటి గౌరవాన్ని దీపంగా తలదాల్చుతుంది

అత్తమామల ఆరళ్ళు
ఆడపడుచు వెక్కిరింతలను
పిల్లచేష్టలుగ భరిస్తుంది
మెట్టినింట కటిక నేలనే
పుట్టింటి ఫోమ్ బెడ్ లా భావిస్తుంది

ఆదర్శఇల్లాలై భర్తకు సేవలు చేస్తుంది
కష్టసుఖాలలో తోడునీడైనిలుస్తుంది
వేణ్నీళ్ళకు చన్నీళ్ళా
సంపాదనలోభర్తకుచేదోడువాదోడౌతుంది

ఇంటిపనులు ఉద్యోగం జోడుగుర్రాల స్వారీ
అలసట ఆందోళన ఆవేశాలు దరిచేరకుండా
భూదేవంత ఓర్పుతో నిర్వహించే శాంతమూర్తి

వంటా వార్పుతో
రుచుల చేర్పుతో
మాటల నేర్పుతో
వండి వడ్డించి తినిపించి
కుటుంబంలో ఆనందమే తన ఆనందమై

శ్రమ ...వత్తిడికి అందం ఆవిరైపోయినా
ఆరోగ్యం కొవ్వొత్తిలా కరిగిపోయినా
భాద్యత మరువని త్యాగశీలి
భేషజమ్ముల విచ్చిన్నమౌ సంసారం
భేషజాలకు పోని సంస్కారము నీది
సహజీవనంలో సరిగమల సాక్షిగా
మమతానురాగాలకు మారు పేరు స్త్రీ
అమ్మా! నీవే లేకుంటే ఈసృష్టి ఎక్కడిది

అందుకే
అమ్మను పూజించు
భార్యను ప్రేమించు
సోదరిని దీవించు
కూతురిని లాలించు
స్త్రీని గౌరవంచు
కలకంటి కంట కన్నీరొలికించకు!

మన సంస్కృతి మను సంస్కృతి
"యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్రదేవతాఃl
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాఃతత్రా ఫలాః క్రియాః
       ****అవేరా *****

హిజ్రా

sk101-36
ది; 20/11/2015
* శీర్షిక: హిజ్రా*

సమాజం అనంతాకాశం అయితే
ఆకాశపు  చివరి అంచున జీవిస్తున్నాం
విశ్వాంతరాల్లో కృష్ణబిలం అంచున
హక్కుల  రెక్కలు విరిగిన పక్షులమై జీవిస్తున్నాం
హక్కులు అందరికీ ఉన్నాయి
అడవిలోని కలుపు మొక్కకైనా
వర్షపు నీటిపై హక్కుంటుంది
కలుపు మొక్కల పాటి కావా మా బ్రతుకులు
కులం..మతం..లింగ భేదాలు హక్కులకాధారమా ?
మా హక్కులు కృష్ణబిలంలోకి
మీ హక్కులు మీ ఇంటి ముంగిట్లోకా??

మా హక్కులు కాలరాసినప్పుడు
పోరాటమే మా ఆయుధం
పురుషుడు స్త్రీలై నందుకు
వివక్ష ... వేదన ....హేళన లతో
నిత్యజీవన పోరాటం మాది
అర్ధనారీశ్వరులకు పొర్లు దండాలు
మాకు అవమాన దండలా??

సహనం సంతోషాలు మా  సంస్కృతి
యాచక వ్యభిచారాలు కాదు మా వృత్తి
వంచన మోసాలు కాదు మా ప్రవృత్తి
మా దీవెనలు దేవతాంశయుక్తం
మేము లేక ఏశుభకార్యము లేదు
దైవ వరప్రసాదులం మేము
మంచిపనులు చేసే సామర్ధ్యం మాకూ ఉంది
మేమూ నాయకు(రాళ్ళ)లమవుతాం
మేమూ పాలకు(రాళ్ళ)ల మవుతాం

వసంతం వాకిట్లొ మావిచిగురు రుచి ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో కోయిల కూస్తుంది తీయగా
ఆ కోయిల రాగాన్ని మేమూ ఆస్వాదిస్తాం మీ లాగానే
కలలూ కోరికలూ మాలోనూ చిగురిస్తాయి నవవసంతంలా

స్పందన ప్రతిస్పందవలు మాలోను ఉన్నాయి
మాలోనూ రక్తమాంసాలున్నాయి
మాలోనూ కోపతాపాలున్నాయి
మాలోనూ సుఖదుఃఖాలున్నాయి
మాలోనూ బాధ సంతోషాలున్నాయి
మాలోనూ పంచేంద్రియాలున్నాయి
మరి మాకెందుకీ వివక్ష??

మాకు కావల్సింది మీ దయా దాక్షిణ్యాలు కావు
మా అస్తిత్వానికి గుర్తింపు
అన్ని హక్కులూ మాకు వర్తింపు
         ****అవేరా****

పురుషుడు

sk101-35
19 నవంబర్ అంతర్జాతీయ   పురుషుల దినోత్సవం  సందర్బంగా

* శీర్షిక: పురుషుడు*

పుట్టి పుట్టగానే
ఇంట్లో ఆనందపు పూలజల్లు కురుస్తుంది
వారసుడొచ్చాడని వంశోద్దారకుడొచ్చాడని
బాల్యదశలోనే బండెడుపుస్తకాల బరువు బాధ్యతగా మోస్తాడు
మెదడు పుస్తకంలో అక్షర విషయాలనెన్నో
పొందికగా రాసుకుంటాడు
యుక్తవయసులో కాలేజీ చదువులు
పరుగు పందెంతోమొదలెట్టి
మరాధన్ తోముగిస్తాడు
చదివినంతకాలం చదువే తన బాధ్యతగాభావిస్తాడు
ఉద్యోగం పురుషలక్షణం అన్నారు పెద్దలు
ఇందులోపురుషస్వార్ధం వీసంతలేదు
పురుష పక్షపాతమూ లేదు
ఆమాటకు అర్ధం
కుటుంబ బరువు భాద్యత పోషణ
పురుషునికి ఆపాదించటం
పూర్తిఅయినచదువుతో
ఉద్యోగ వేట బాధ్యతల సయ్యాట
ఎన్నో కలలతో మరోచేయి తోడందుకుని
తనచేయి తోడందించి
మరో నవ్యవసంతాన అడుగిడతాడు
నిజమే వసంతమే !
నవ వసంతం అందాలు
ప్రకృతి సరిగమలు
కోయిల మధుర రాగాలు
సుమపరిమళాల మలయ సమీరాలై
పచ్చని వెచ్చని "ఆ"వరణంలో
ఆనందం అంబరమంటే వేళ
అమ్మ అయ్య
 "పెళ్ళామే బెల్లమా" నిరసనలతో
ద్విపాత్రాభినయం తప్పదు
అలీనవిధానంలో అల్లుకు పోతాడు
ఉలికిపడి మానసిక ఒత్తిడితో
వసంతం నుండి గ్రీష్మంలో  అడుగుపెడతాడు
కుటుంబంకోసం భర్యాబిడ్డలకోసం
తన జీవితాన్నే కొవ్వొత్తిని చే్స్తాడు
జీవితభాగస్వామికి ప్రేమానురాగాలు
బిడ్డలకు  మమతానుబంధాలు
సమాజానికి సౌబ్రాతృత్త్వాన్ని పంచుతాడు
సంసారమంటే సమస్యల తోరణం
సమస్యలతో.....రణం
ఇంటాబయటా వత్తిళ్ళను
పిల్లల చదువు పెళ్ళిళ్ళుకు
ఆర్ధిక వత్తిళ్ళను తానొక్కడే భరిస్తూ
తీవ్రమానసిక వత్తిళ్ళతో
వాడిన వృక్షమై  అనారోగ్యం పాలవుతాడు  
రక్తపోటు మధుమేహంపక్షవాతం
మైగ్రేన్ హెమరేజ్ గుండెపోటు
అన్నీకాకపోయినా కొన్నయినా
వృక్షానికి పూసిన  పుష్పాలై
కూలిన వృక్షంతో కలిసి రాలిపోతాయి
అందుకే పురుషుడు త్యాగజీవి ...ధన్యజీవి !
          ************
(ఆరోగ్య సర్వేల ప్రకారం పైన చెప్పిన వ్యాధులు ఎక్కువగా మగవారికే వస్తున్నాయి)
       ********అవేరా********

స్నేహం

sk 101-34

* శీర్షిక: స్నేహం *

తోడులేని మనిషి  జీవితం
 ఒంటిపిల్లి రాకాసి  జీవితం
ఒంటికి చేటు ఇంటికి కీడు
చిత్ర విచిత్రాలు మానవ సంబంధాలు
విరుద్దమైన మనసైనా
నీటమునిగిన సేతువులా కలుపుతుంది స్నేహం
మనిషి సంఘజీవి
ఓర్వలేడు వంటరితనాన్ని
ఆత్మీయతానురాగ కేంద్రం
మానవ హృదయం
తోటి మానవుడి  పట్ల సానుభూతి
ఏజంతువుకూ లేని
రసస్పందనలు మనిషివి
కరుణారస సింధువు హృదయాన ఉన్నవాడే
మహనీయుడౌతాడు
సలహాలమైత్రి హితుడు
భుజం తట్టేది  సన్నిహితుడు
కర్తవ్యాన్ని గుర్తు చేేస్తాడు
కష్ట సుఖాల్లో  తోడు నీడగ
నిలుస్తాడు స్నేహితుడు
స్నేహం అంటే ప్రేమ
ప్రేమ అంటే త్యాగం
ప్రేమించెే మనసే త్యాగం చెయ్యగలదు
ఇద్దరు వ్యక్తులను మానసికంగా ఆత్మికంగా
దరిచేర్చే దివ్యరసాయనం స్నేహం
దుఃఖంలోమునిగిన వ్యక్తి
బుజాన్ని స్నేహహస్తం తాకగానే
గుండెలోదాగిన కన్నీరు
పొంగిపొర్లుతుంది ఆత్మీయంగా అద్వితీయంగా
బాధాతప్త హృదయానికి
ఊరటకలిగించే ఆస్పర్శ
ఆర్ద్రమైన సానుభూతికి సంకేతం
ఘనవిజయానికి భుజం తట్టి
మెచ్చుకుంటే ఆనందపులకితమౌతుంది మనస్సు
ఆ భుజం తట్టే హస్తమే స్నేహానికి నేస్తం
స్త్రీపురుష హృదయపూర్వక చెలిమి బలిమికి
పరస్పర ఆకర్షణ ప్రధానమైనా
వారిని జీవితాంతం కలిపి వుంచేది స్నేహమే
ఇద్దరు ఒకటై చెరిసగమై ఒకరికొకరై
జీవించటానికి అంతరంగాన పాదుకున్న
స్నే హలతే పందిరివేయాలి పూవులు  పూయాలి
కళ్ళ కిటికీలనుండి ఆత్మలు పరస్పరం స్పందించాయి
వారి స్నేహలత నుంచి వెల్లివిరిసిన ప్రేమ  పారిజాాతం
మధురపరిమళాలు వెదజల్లింది
స్నేహసంబంధ మనోహరమూర్తిలు
ప్రేమనే స్ఫూర్తిగా మలచుకున్న ధన్యచరితలు
స్నేహమే ఆర్తిగా అలుముకున్న పుణ్యజీవులు
వారి జీవితం స్నహరాగ రంజితం
ఆధునిక జీవితాన ఒంటరి బతుకులు
ఆనందం లేని జీవనయానానికి స్నేహరాహిత్యమేహేతువు
ధనమే దైవంగాకొనసాగేవిచిత్రజీవనయాత్ర
ప్రేమ లేక మనసులు దూరమౌతున్నాయి
ఆలుమగలమద్య అంతరాలు
ఎడారిబాటనపయనిస్తువ్న
అధునాతన జీవితాాలకు
సరికొత్త స్నేహ ఒయాసిస్సులు  నిర్మించాలి
జీవన వనంలో స్నేహ చకోరాలను పెంచుకోవాలి
జీవనగమనంలో స్నేహరాగబంధాన్ని పంచుకోవాలి...!
         *********అవేరా *********

స్వాగతం సుస్వాగతం

sk101-33
* శీర్షిక: స్వాగతం సుస్వాగతం *

పల్లవి: స్వాగతం సుస్వాగతం!
           సహస్రకవీంద్రులకు స్వాగతం!ఘనస్వాగతం!
           కవితాంజలి ఘటియించగ
            హృదయాంజలి గైకొనుమా!.....llస్వాగతంll    
చ1  :   పారిజాత పరిమళాలతో  
            మరువం మల్లెల మాలలతో....llస్వాగతంll
చ2 :     కవనమధువులొలికే  వేళ
            రస కావ్యం చిలికే  వేళ
            భావామృతమొలికే  వేళ.....llస్వాగతంll
 చ3  :   రసాభావ సంగమం
             కవిచేత సంభవం
             ఈనాటి సంబరం
             తాకేను అంబరం ....llస్వాగతంll
చ4  :     రసహృదయులకు
             ఆత్మీయులకు
             కవిపుంగవులకు  ..... ll స్వాగతంll
చ5 :      కవులంతా కలం పట్టి  
             కవనంతో జత  కట్టిన
             మరో భువన విజయమిది  
             సహస్రకవి సమ్మేళనమిది
             తెలుగు కవుల విజయోత్సవమిది...llస్వాగతంll
                 ********అవేరా********
               

అనాధ

sk101-32
* శీర్షిక: అనాధ *

నేనొక అనాధను
అందరూ వున్నా  అనాధను
అమ్మ ఉన్నా  అమ్మ ప్రేమ లేదు
ఆప్యాయత అనురాగాలకు ప్రతిరూపమంటారు "అమ్మ"
ప్రేమకు అక్షయ పాత్రంటారు
పేదరికం ఆర్ధిక చికాకుల సుడిగుండంలో
అక్షయ పాత్ర ఎండిపోయింది
చిక్కి శల్యమై   అస్తిపంజర మైంది

అలాంటి అమ్మనుండి ఏమి ఆశించను
ఎండిన అక్షయ పాత్రలో ఎండుటాకులు తప్ప
నాన్న ఉన్నా నాకు ఆసరా లేదు
సంపాదన లేకున్నా సారామత్తులో జోగుతుంటాడు

కాలేకడుపుతో  బడికెల్తే
కడపునిండిన ఆకలి
మనస్సుని పాఠంపై నిలువనీయదు
చిరిగిన అతుకుల బట్టలను
అదోరకంగాచూసే చూపుల భావం
తోటివిద్యార్ధుల విశాల హృదయాలకు అద్దం పడితే
స్నేహ హస్తం చాచే నేస్తం లేక...నేను అనాధనే !

ఉచితచదువుకు నీవొక అతిధివి
అన్నట్లు చూసే నా గురువుల చూపుల్లో
ఉత్సాహ ప్రోత్సాహకాలెక్కడివి?

తోటిపిల్లలు ఆటవిడుపులో
ఆనందకేరింతల్లో మనిగి వుంటే
ఆత్మన్యూనతలో నేను వారితో కలువలేక
ఎంత మధనపడి పోయానో
ఎవరికి చెప్పుకోను??

ఆకలి ఉదృతమై అన్నం బెల్లు కోసం
ఆత్మారాముడెదురు చూస్తుండగా
పండగ చేస్కో ! అన్నట్లు బెల్లు మ్రోగింది  
పరుగున వెళ్ళి చాచిన పళ్ళెంలో
వడ్డించిన అన్నం పప్పులు చూసి
ఆకలి చచ్చిపోయింది
రెండు ముద్దలు కష్టంగా మ్రింగి  
కడుపు నిండా నీళ్ళు త్రాగా !

కోట్లలో ఖజానాకు చిల్లు పెట్టి
పేద విద్యార్ధి కడుపు నింపలేని
పధకాలు వృధా అని గొంతు చించుకు అరవాలనిపించింది
నిన్న రాత్రి అమ్మపెట్టిన రెండు ముద్దలే అయినా
పరమాన్నంలా అనిపించింది

నా లాంటి పేద విద్యార్ధులకు
ప్రభుత్వాలు ఎన్ని పధకాలు పెట్టినా వృధా
మా జీవన ప్రమాణాలు పెరిగితే తప్ప
మా చదువులు సాగవు ముందుకు
మాకు చేయూత ఇవ్వలేని సమాజం ఎందుకు?
దశాబ్దాలు గడచినా దయనీయం మా బ్రతుకులు
         *******అవేరా********

ఎదురుచూపులు

sk 101-31
*శీర్షిక: ఎదురు చూపులు *

తొలకకరి వర్షం కోసం
ఎదురు చూపులు
విత్తనం కోసం
ఎదురు చూపులు  
దుక్కి దున్ని విత్తు నాటాక
మొలకలకోసం ఎదురు చూపులు
మొలకలొచ్చాక  మరోజల్లు కోసం ..
మబ్బు కోసం ఎదురుచూపులు  
చీడపీడ సోకినపుడు
 ఏంచెయ్యాలో తోచక
తికమకలో నువ్వు
సలహా కోసం ఎదురు చూపులు
నీటిగండం చీడ  గండం
అప్పుగండం దాటి హమ్మయ్య
అనుకునే లోపు  వాన లేక చేను ఎండ
పక్క కామందు  కాల్చేతులుపట్టి ఒక్కతడి  పెట్టి  
పంటకోసం ఎదురు చూపులు
అదను చూసి కోతకు కూలీల కోసం ఎదురు చూపులు
కూలీల బ్రతిమాలి బామాలి
అడిగినంత ఇచ్చి
పంట ఇంటికి తెచ్చి
మంచిరోజు చూసి మార్కెటుకు పోయి సరకు అమ్మ బోతే
సర్కారు ధర లోన సగం పలికే  
తూకం చిక్కి తేమ బలిసి
బారెడు ధర మూరెడాయే
నిలువెయ్య  సొమ్ము లేక
నీరసించి ఇంటికి పోలేక
దిక్కుతోచని దీనావస్తలో
అప్పుభూతం భయపెడుతుంటే
కంట కన్నీరొలక  మసక చూపుల్లో
మనసున మెసిలిన ఆలు బిడ్డల రూపు
అసహాయత  అధైర్యం మనసుని
ముసిరేస్తుంటే.....చావు వైపు లాగుతుంటే
మంచిరోజులొస్తాయన్న చిన్ని ఆశ
దీపంలా దారి చూపె
చావు బ్రతుకుల యుద్దంలో
బ్రతుకు విజయం !!!??
       *****అవేరా ****

ఓ ప్రియా!

sk101-30
పాట
*శీర్షిక : ఓ ప్రియా !
 పల్లవి: నా తలపును నీ వూహలే  వెంటాడునా
           నా మనసును నీ రూపమే వేటాడునా
            ఓప్రియా! ప్రియా! ప్రియా!
చ1: అతడు:దొండపండు పెదవులు
                    కలువలాంటికన్నులు
                    కందిరీగనడుమును
                    హంసలాంటి నడకను
                    మరుపురాక మరువలేక
                     కంటిమీద కునుకు లేక
                    వేటాడే చూపుల్తో
                    వెంటాడే అందంతో
                   మతి పోతోందే .....ఓప్రియా...ప్రియా   ...   ll   నా ll
చ2:ఆమె:నా కళ్ళల్లో నీ  రూపం పదిలం...పదిలం....
               నీ  మనస్సులో నా రూపం పదిలం..పదిలం...
               అందమైన జ్ణాపకాలు నా తోడుంటే
               నాతో నీవున్నట్లే నీతో నేనున్నట్లే
                ఓ ప్రియా...ప్రియా            ....               ...    llనాll
చ3:అతడు: పని లేకున్నా నీ ధ్యాసే
                   పని చేస్తున్నా నీ ధ్యాసే
                  నిద్దురలోనా నీ రూపం
                  వెంటాడిందే... కలలో
                   నీవే నా జాబిలి ఈ ఇలలో             ........    llనాll
                  *****అవేరా****

బాలల్లారా రండి

sk101-29 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
* శీర్షిక: బాలల్లారా రండి  !*

 పల్లవి: బాలల్లారా రండి
           భావిభారత పౌరుల్లారా  రండి
           పిల్లల పండుగ వచ్చింది
           మనకు ఆనందం తెచ్చింది
చ1:     మన చాచాజీ పుట్టిన రోజు
            మనకు ఆనందం పంచినరోజు
            మాతా పితలను దైవంగా కొలిచి
            బ్రతుకునే  బంగారంగా మలచి  
            కన్నవారి  కలలనే సాకారం చేద్దాము
            ఉన్న  ఊరినే మనం స్వర్గం చేద్దాాము ...ll బాలల్లారాll
చ2:      పేద  గొప్ప  తేడా లేదు  మన బడిలో
            తెలుపు నలుపు బేధం లేదు
            మన మదిలో  ఖేదం లేదు
            కులమేదైనా మతమేదైనా
            అందరము ఒక్కటై ఆన్నదమ్ములమౌదాం
            చాచాజీ కలలకు వారసులమవుదాం ....llబాలల్లారాll
చ3:      ఉజ్వలంగ చదువుదాం ఉవ్వెత్తున ఎగురుదాం
             ఆకాశమె హద్దుగా  మన భవితే ముద్దురా ...
             నిరాశా నిస్పృహలకు  నీళ్ళొదిలేయండీ
             పట్టుదలే  ఉంటే పట్టుబడును విధ్య
             కృషి తోడౌతే దానికి విజయం  నీ స్వంతం  ...llబాలల్లారాl
               ****అవేరా****

ఆధునిక బానిసలా ? అంగడిబొమ్మలా?

sk101-28
సహస్రకవి సమ్మేళనం
తేది:18-11-2015
వేదిక:వాట్సప్

* శీర్షిక: ఆధునిక బానిసలా ? అంగడిబొమ్మలా? *

విశ్వవ్యాప్త నేరం
మహిళల పట్ల ఘోరం
మానవ అక్రమ రవాణా !
మానవత దివాళా!

మాఫియాల మాయాజాలంలో
వలలోచిక్కిన చేప పిల్లల్లా
విలవిలలాడుతున్నారు మహిళలు,బాలికలు

తేనె పూసిన కత్తుల  మాయ మాటలకొకరు
రుణభార విముక్తి కోసం ఒకరు
పెళ్ళి పేర వంచనకు గురై ఒకరు
ఉపాది ప్రలోభాలను  నమ్మి ఒకరు
నిర్బంధ వ్యభిచారులౌతున్నారు
వెట్టిచాకిరి కార్మికులౌతున్నారు
ఆధునిక బానిసలౌతున్నారు
నీడ ఇచ్చిన ఇల్లే చరసాల ఔతుంది
పాలు పోసిన చేేతులే విషనాగులై
కాటు వేస్తున్నాయి

స్త్రీత్వపు ఔన్నత్యానికి ద్రోహం
మాఫియా పద్మ వ్యూహం
ఈపద్మవ్యూహాన్ని ఛేధించటానికి
అభిమన్యులు కాదు అర్జునులు కావాలి

పాతచట్టాలకు చిట్టి   చిట్టాలు జేర్చి
సంస్కరణల కూర్చితే కాలం వృధా  
కనిపించుట లేదా ప్రభుతా !  మహిళల వ్యధ !

అందుకే
సమగ్ర నూతనచట్టం కావాలి
సామాజిక దృక్పధాన మార్పు రావాలి
అమాయకత్వానికి --- నిరక్షరాస్యత
ఆర్ధిక భారానికి ---  పేదరికం మూలం  
మహిళలకు అక్షరాస్యత-ఆర్దిక పరిపుష్టికావాలి
సమస్యకు శాశ్వతపరిష్కారం  తేవాలి
చిరిగిన అరిటాకుని అతుక తరమా
పగిలిన అద్దాన్ని జోడించ తరమా
దెబ్బ తగిలాక గాయనికి కాయకల్ప  చికిత్స మాని
గాయాలే లేని గాయాలేకాని వ్యవస్ధ నిర్మాణం కావాలి

మొదటి స్ధానంలో మాదక ద్రవ్యాల రవాణా
ద్వితీయస్ధానంలో మహిళల అక్రమ రవాణా
ఇదీ నేర ప్రపంచం గతి ...ప్రగతి
ఎటు పోతుందీలోకం  ? ఏమౌతుందీ దేశం?

ఆధునిక బానిసత్వ రొంపిలోచిక్కిన
అమాయక బాలికలకు మహిళలకు
పునరావాసం కల్పన కల్పవల్లి కావాలి
విద్య,వైద్యం ,ఉపాధి, కల్పనలతో
మానసిక  స్ధైర్యం రావాలి
గాఢనిద్రలో ఉన్న స్త్రీ శిశు సంక్షమ శాఖ
కళ్ళు తెరవాలి అన్యధా ఆ శాఖ నిరర్ధకం  
ఆ శాఖకు  అమాత్య పదవి ప్రశ్నార్ధకం ????
           ******అవేరా*****

మన్నించు

sk101-27
*శీర్శిక: మన్నించు!*

మనసా మన్నించవే నన్నిలా !
నీ తోడైన మనసును దూరం చేస్తున్నందుకు
మనసా.... మన్నించవే
కలలు కన్న ప్రపంచం కనుమరుగై పోయింది
ఆకాశానికి ఎగిరిన  ఆశలే అడియాసలై
భూమ్మీద వ్రాలాయి
కోరికలే కొడిగట్టిన దీపమై
తప్పనైన తరుణాన
ప్రాణమైన నీ తోడును దూరం చేస్తున్నానూ
మనసా మన్నించవే నన్నిలా !
    *****అవేరా**** 

సుఖ దుఃఖాలు

sk101-26
*శీర్షిక: సుఖదుఃఖాలు *

పగలు రాతిరి వోలె సుఖదుఃఖాలు
వెలుగు నీడలు బోలు సుఖదుఃఖాలు
శీతోష్ణాలు రాగద్వేషాలు
సుఖ దుఃఖాల  సమన్వయ సాధనే
మానవ జీవన పోరాటం

నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిర్మలం
అయితే మన మనస్సు
బాధనే  సౌఖ్యం గా పొంది
దుఃఖ బాధలేని జీవన సాఫల్యం పొందుతాము

భీష్మఉవాచ "నిందాస్తుతులను సరి సమానంగా భావించటం
నిర్వికారంగా ఉండడమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం "
ఆచరణయోగ్యము

తనగొప్పను చెప్పని వాడు
ప్రతీకారేచ్చ లేని వాడు
ధర్మ మార్గాన్ని  వీడని వాడు  
నిజ  సుఖ భోగి

సుఖదుః ఖాలు కలిమి లేములు ఆకాశాన మబ్బులు
కాలయానంలో ఋతువులు
ఏవీ శాశ్వతం కాదు
అత్యాశ అహంకారాలే  గ్రహణాలు
కామ క్రోధ మద మాత్సర్యాలు
ఆవహించిన మాయా మత్తు  
మత్తు గ్రహణం వీడి మనిషవ్వాలి

పాపపుణ్య ప్రవృత్తి రాగద్వేష మూలం
రాగద్వేశదోషం "మిధ్యా జ్ఞానం"

మానవ జన్మ శాశ్వతం కాదు  
ఐశ్వర్యం దారిద్రం నీవెంటరావు
   ****అవేరా****

పాణిగ్రహణం

sk 101-25
ముందు మాట:ధర్మార్ధ  కామేషు త్వయైషా నాతి చరితవ్యా
అనే కన్యాదాత అభ్యర్ధనకు వరుడు"  నాతి చరామి"  అని
చేసే ప్రణామాన్ని మరిచి మద్యలోనే భార్య చేయి విడిచి
వెళ్ళే సందర్భంలో ఓ సతి  విలాపమీ తీరునుండు

* శీర్షిక: పాణిగ్రహణం *

నా  పాణి నీ పాణి గ్రహియింప
అర్ధంగినైతి భరియింప నను నీవు భర్తవైతివి
సర్వస్వమ్మర్పించి సతినైతి జీవన కృతినైతి
అర్ధంతరంబుగా పాణివీడుట పాడియే పతిగ నీకు
           ****అవేరా****

ఆధారం

sk101-24
10/11/2015

* శీర్షిక: ఆధారం  *

నీట మునిగే వానికాధార మగును
గడ్డిపోచ గరికె గాఢముగాను
సాహితీ నదినీద నీకేల గడ్డి గరిక
"సహస్ర కవుల" నావ నీకు తోడుండగ
       
 ***అవేరా***

దీపావళి

sk101-23
*శీర్షిక: దీపావళి *

ఆశ్వయుజమాసాంత మప మృత్యవారంభం
మూడు నాళ్ళ ముచ్చటైన పండుగ
"బలిత్రయోదశి"నాడు  యమదీపదానంతో మొదలై
" నరకచతుర్దశి "  ప్రాతఃకాల నదీ స్నానం
నక్షత్ర కాంతి శక్తి ,
ఉషఃకాంతి శక్తి ,
నీటి అధిష్టాత వరుణశక్తి
సప్తఋషుల అనుగ్రహ శక్తి
అంగీరాది మహర్షుల తపఃశక్తి
నదీ ఔషదశక్తి
నదీమృత్తిక శక్తి
సర్వ శక్తి మయం నదీీ స్నానం
లోక కంటకుడు  నరకుని వధతో  
మరునాడు మహా  పండుగ "దీపావళి"
దిగంతాల వ్యాపించేలా దీపాల ఆవళి
మనుజ లోకాన ఆనంద హేళ
ముంగిట రంగవల్లులు  మామిడాకు తోరణాలు
ద్వారాలకు పూదండ మాలలు
తలంటు స్నానాలు సాంబ్రాణి ధూపాలు
బాలికల పూలజడల జడగంటలు
నూతన వస్త్రాల ముస్తాబు సంబరాలు
ఆధ్యాత్మికానందంలో భక్తి ప్రపత్తులతో లక్ష్మీ పూజ
పూజగది మంగళారతుల గుడి గంటలు
నోరూరించే మిఠాయిలు
పచ్చిపులుసు అత్తెసరు
పొంగలి .. పులిహోర
ఆహా! పండగంటే ఇదేనా !
సూర్యాస్తమయం తో  చీకట్లు ముసిరే వేళ
బారులు తీరిన దివ్వెల వరుసలు  
ప్రపంచానికి ప్రేమను పంచే వెలుగులు
చీకటిని (చెడును)పారద్రోలే వెలుగుల జిలుగులు
రంగుల వస్త్రాల్లో పొంగే ఆనందంలో  పిల్లలకేరింతలు
మదినిండా సంతోషపు వెలుగులు నింపే చిచ్చుబుడ్లు  
విషాదాలు కష్టం కన్నీళ్ళు పారిపోయేలా మతాబాల పేలుళ్ళు  
ఐశ్వర్యం ఎదుగుదలకు హద్దులు చూపేలా రాకెట్ల విన్యాసాలు  
పండగేదైనా పరిమితుల్లో ఉండి పర్యావరణాన్ని కాపాడాలి
వెలుగుల పండుగ అందరి జీవితాల్లో వెలుగు(సంతోషం) నింపాలి
ఈవెలుగులే రేపటి సహస్ర కవి సమ్మేళనంలో
ప్రతి కవి ముఖాన ప్రతిబింబించాలి
      ****అవేరా****

జాతీయ విద్యా దినోత్సవం

sk101-22
నవంబరు 11న "  జాతీయ విద్యా దినోత్సవం "
 భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్
జన్మదినం సందర్బంగా
*శీర్షిక: విద్య*  
ప్రాధమికంలో చిన్న నీటి జాలు లా మొదలై
 ఉన్నతంలో ప్రవాహమై  ఆఖరుకు అలలా  ఎగసి పడేదే విద్య
భవిష్య భారత నిర్మాణానికి పునాది రాళ్ళు నేటి బాలలే  
నేటి బాలలే రేపటి పౌరులు
ఉత్తమ విలువల విద్యా బుద్ధలు  
ఉత్తమ విద్యా విధానం  నెలవైన
పాఠశాలలు విద్యాలయాలు భవిష్య భారత నిర్మాణ దేవాలయాలు
విద్య  బహుముఖ లక్ష్య ఫలప్రదాయని
ఉద్యోగమొక్కటే కాదు  దేశభక్తి, దేశరక్షణ,
ప్రేమ ,కరుణలు పెంపొందించటం
మానవత్వం నింపటం విజ్ణానం పెంపాదించటం
సామాజిక అంశాల అవగాహన,  స్పందనలు  
ఒక  జాతి గౌరవం విద్య
ఒక దేశగౌరవం విద్య
విద్య లక్ష్యం  ఉత్తమ పౌర సమాజనిర్మాణం
విద్య సమస్త సమస్యలకు పరిష్కారం
విద్య సమాజంలోని అసమానతలను రూపుమాపేది
విద్యకు కుల మతాలు లేవు
నాడు ....విద్య కొందరికే పరిమితం
కులాల పేరిట ధనిక పేద భేధాల పేరిట
అడ్డుగోడలు ప్రగతికి ప్రతిబంధకాలు
విప్లవించిన విద్యా వేత్తలు ఆగోడలను కూల్చి
కేకలు అరుపులు రక్తం చిందని నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు
విద్యాధికుల వివేకానికి విజయనాదమిదే
విద్యలేని వాడు వింత పశువు
విద్య నేర్చిన వాడు విద్వాంసుడు  సామాజిక మార్గదర్శకుడు
విద్యతో మనిషి కొత్త జన్మ ఎత్తుతాడు
సామాజికంగా ఆర్ధిక ప్రగతికి తొలిమెట్టు విద్య
నేడు  ... సమాజంలో కొన్ని చదువుకున్న మృగాలున్నవి
 అక్షరాస్యత అందలమెక్కిస్తుంది
మహిళలందరూ సరస్వతీ పుత్రికలవ్వాలి
 ఆ మృగాల కోరలు పీకాలి
నాణ్యత లేని విద్య నాటు విద్య  ,  చేటు విద్య
పరిపక్వత లేని విద్య పనికిరాని విద్య
సర్వశిక్షఅభియాన్ పాఠశాల విద్యకు బలం  
బడులకూ నాణ్యత శ్రేణులు కావాలి
విశాలమైన గదులు ఆటస్ధలం గ్రంధాలయం  
ప్రయోగశాలలు  బట్టి గ్రేడింగ్ కావాలి
రాష్ట్రవిద్యా పరిశోధన శిక్షణ మండలి నేతృత్వాన
పాఠశాల విద్యా  ప్రమాణాలు అంబరాన్ని తాకాలి
ఉన్నత భారత్ అభియాన్ కాలేజి విద్యకు బలం  
విద్యార్ధిని తీర్చి దిద్దే భాద్యత ఉపాధ్యాయుడిదే  
గురుః భ్రహ్మ గురుఃవిష్ణు గురు దేవో మహేశ్వరః
భావిసమాజ నిర్మాణ గురుతర భాధ్యత  గరువులదే
ప్రపంచం మొత్తం  భారత్ వైపు చూస్తుంది
యువభారత్ నైపుణ్యాన్ని పెంచుకుని
" నవయువ నైపుణ్య మహా భారత్"  ను నిర్మించి
" మేరాభారత్ మహాన్ " అని చాటాలి  
             ******అవేరా ******

సీసా

sk 101_ 21
*శీర్షిక: సీసా! *

ఔను!
సీ...........సా...... త్రా(చు)
సీను చేయరా సారా త్రాగి
స్రీ..ను... ఏం.... ది స్సారూ! ..
స్రీసా.....ఇ...స్త...రా!
ఏ పల్లె చూసినా ఇదే సీను
ఏ పట్నం  చూసినా ఇదే సీను
మందే వారికి జీవామృతం
మత్తే వారికి జీవనం
మరి ఈ జీవామృతంతో
ఆత్మారాముడు శాంతించేనా?  

మందు మత్తులో ఆలి బిడ్డల తేడా తెలియని
కామాంధుల కళ్ళు పీకాలి
కామానికి  కళ్ళుండవు..  గుడ్డిది !
మందు మత్తులో వాహనాలను
మృత్యు శకటాలుగ మార్చే ముష్కరులను
ఇవ్వాలి  బలి ఉరికొయ్యలకు
మందు మత్తులో రహదారులపై
అల్లరిచేసే చిల్లర నాయాళ్ళదుమ్ము దులపాలి

మత్తు కోసం బ్రతుకు చిత్తు చేసుకునే అమాయకు లారా!
కనిపించుట లేదా మీకు చిద్రమైన సంసారం
కనిపించక కన్న ప్రేమ దారితప్పిన సంతానం
కనిపించుట   లేదా చితికిన ఆర్థిక పరిస్థితి
అప్పు చేసి త్రాగితే మీకు చిప్పే గతి
ఆపై పేరుస్తారు చితి

సంసార భాద్యత నీ విధి
ఆలుబిడ్డలే నీ నిధి
" నాతిచరామి" అన్న పెళ్ళి  నాటి ప్రమాణం మరచి
మద్యానికి బానిసై  అప్పుల పాలై
మగువసొమ్ములకాశపడి
అప్పు తీర్చటానికి అదనపు కట్నం అడిగితే
కష్టం సుఖం  నీతోనే అని నీతో ఏడడుగులు నడిచిన పాపానికి  
చేయివీడి   అనాధను చేస్తావా?

అమ్మకాలు నూరు శాతం  దాటిన వేడుక
నెలకు 1400 కోట్లు ఖజానా కానుక
అని సంబుర పడే ప్రభుతా !
నీ మనుగడ కోసం విషసంస్కృతి నాటి
అది వేళ్ళూని ఊడలు తొడిగి
విషజ్వాలలు విరజిమ్ముతుంటే
కరాళుడి వికృత నాట్యాలతో
కుటుంబాలు కకావికలమౌతుంటే
"మధ్య పానం ఆరోగ్యానికి హాని కరం"
అని శ్రీరంగ నీతులు చెప్తూ  
మల్లెల మనసులపై
విషాన్ని విరజిమ్ముతావా
వల్లకాటి "విజయ సంబరాలు "చేస్తావా?
మానవ శవాల పైన ప్రగతి బాట వేస్తావా???
ఎవరి కోసం?? సమాజంలో
మిగిలే  జీవచ్చవాల కో సమా?  
        *****అవేరా***