Saturday, June 11, 2016

అవేరా కవితలు 226 నుండి 265 వరకు

అవేరా కవితలు 226 నుండి 265 వరకు

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:226
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: నవ్వులు పంచు

నీవు కష్టాలలో వున్నపుడు
లోకం నిన్ను చూచి నవ్వుతుంది
నీవు సుఖంగా వున్నప్పుడు
లోకాన్ని చూచి నీవు నవ్వుతావు
నీ నవ్వులను నలుగురికీ పంచినపుడు
లోకమే నీకు సెల్యూట్ చేయదా...!
   *****అవేరా****


     

     





     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:227
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక:

విజయమంది నీకు
విరామమేల
సాగు విజయపథము
నిరతము
నిలువలేక
 ***అవేరా***




     

     





     

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
1/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:228
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: సంప్రదాయం

కత్తిరించిన కురచ జుత్తు
రంగు రంగుల షాంపూలు
రకరకాల ఫ్లేవర్లు
కుంకుళ్ళెరుగని కురులు
విద్యుత్ డ్రైయర్లతో
నాజూకు కురుల ఆరబోత
సాంబ్రాణిధూప మెరుగని
ఆధునిక నాగరికత
బన్నుముడుల ముచ్చటేది?
మల్లెకనకాంబరాల
కురుల  సౌందర్యమేది
జఘనాన ఆడేటి
పూలవాల్జడ లేవి
జడగంటలేవి ....??

సొగసు వాడిన మేను
ట్యూనింగ్ కోసం
రకరకాల
రంగురంగుల
హంగుల సబ్బులు
బాడీవాష్ లోషన్లు
నలుగుపిండి నెరుగని
నవ్య స్నానాలు
లోషన్ల పూతలతో
చర్మరోగాలు...

రసాయనాల
రంగులైనర్లు
కంటికే కీడవ్వు
వింతపోకడలు
నేతి దీపాల
సంప్రదాయ కాటుక
కనుమరుగాయెనా
సోగకళ్ళ సొగసు
సోకునిమడ....

నుదుట తిలకము దిద్ద
నరదిష్టి తీయగా
నేడునదియుగూడ
మాయమాయె......

గాజులెరుగని కరము
గడియారమును పెట్టె
పచ్చబొట్లుయు
పడతి పాలబడెను
బంగారుమేనిలో
బొగ్గుమరకలబోలి .....

సెల్లు మోతయె తెలుసు
సొగసు అందెలు
తెలియవు
పాదసొంపు విరియ
చెవుల కింపైన
రవము జేయ.....

రంగు రంగుల
నెయిల్ పెయింట్లు
గోళ్ళ హంగుల
రఖ్ వాలాలు అయ్యె
పచ్చ గోరింట సొగసు
తెలియ లేని యువత.......

వరిపిండి కలపని
పంచరంగుల
రసాయన రంగవల్లులు
చేతికళ తప్పె
మర ముగ్గుతోటి
చీమదండులేమొ
చిరాకుపడగా......

పండగలకైనా
పట్టు పావడాలేవి??
కంచి పట్టు చీరెలేవి??
కురచ గౌనులేసి కులుకుతున్నారు
మెరుపు చీరలందు మెరయుచున్నారు...

ప్లాస్టిక్ మామిడాకులు తప్ప
శుభము గూర్చు మామిడాకు
తోరణమేది?
కృత్రిమ పూలు తప్ప
బంతిపూల
ముస్తాబేది
పరిమళాలు వెదజల్లు
గృహసీమ  ఏది.....??

సంప్రదాయమన్న
మాన్యుల అనుభవాల మేళవింపు
మంచి నెరిగి
తిరిగి పాటించరండు
రంజైన సొగసుంది
మెండైన ఆరోగ్యముంది
హాయిగొలుపు పర్యావరణముంది
కళ్ళకింపు సౌందర్యముంది
పశ్చాత్తపోకడలు
పారద్రోలుము నేడె
పదిలముగనుండుమా
పడతినిలన....!!

*** అవేరా****

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
03/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:229
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ఆహ్వానం(అయుత కవితా యజ్ఞం విజయోత్సవ సభ)

పల్లవి: రండి రండి రండి
           అడుగు అడుగు
           ముందుకేసి దండుగా కదలిరండి
           కవులారా కదలిరండి
           రండి రండి రండి
చ1:    అధునాతన వేదికగా
           వాట్సప్ హైకుల కూడికగా
           కూడినారు వేల కవులు
           కవితా వ్యవసాయము చేయగ
           భవితకు బాటలు వేయగ..........రండి రండి రండి
చ2:     చేవ గలిగి చేష్టలుడిగి
            నిద్రాణలొ చైతన్యం
            నివురు తొలగి
            నిద్రలేచి భగ్గున వెలిగిందీ
            కవితా దివిటీయై నిలచిందీ
             తిమిరాన్నే తరిమిందీ .......రండి రండి రండి
చ3:     ప్రతిభనిండి ప్రభవించెను
            ప్రతి కవనం వెలుగు నిండి
            కవిహృదయం వికసించెను
             కవితా పరిమళమై.............రండి రండి రండి
 చ4:     రవి నీడన కవి తోడుగ
             కదిలెను అయుతా యజ్ఞం
             పదివేల సమిధ దాటి
             జయీభవ విజయీభవ
             విజయోత్సవ సభనేడే.........రండి రండి రండి
           
                       ****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
26/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:230
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: జనగణమన

జనగణమణ
అనగానే అన్నపెదవి పరవశాన వణుకుతుంది
జాతి యావత్తు జాగృతమౌతుంది
వీనుల స్పందనలు
నవనాడులు పాదరసమౌతాయి
కనులలో కోటిసూర్య ప్రభలు వెలుగుతాయి
హృదయములో అంబరాన్ని తాకు పరవశం
వళ్ళుపులకరింత తుళ్ళింత




****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
09/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:231
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్, యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: మేలుకొలుపు
***********
అంతుతెలియని
భువనపు అంచులు
కలియాకలి కేకలతో...
యముని మహిషపు
ఘంటారవములతో....
ప్రతిధ్వనిస్తున్నాయ్...!

కలి కర్కష హవమునకు
జన హననంలో
రక్తకేళీ ప్రహేళికలో
చచ్చేదెవరో?
చచ్చి బ్రతికేదెవరో?
చెవిటిలెందరో?
అవిటిలెందరో?...

క్షణం క్షణం
నరబలుల యజ్ణం లో
ఆహుతవుతున్నాయి
లక్షల సమిధలు....

శాంతికపోతాల
విరిగిన రెక్కల చప్పుడు
అంతేతెలియని
అగాధాలలో
ప్రతిధ్వనిస్తుంటే....

ఆగినగుండెల
శాంతి కపోతాలు
హింసా రాబందుల
ఆకలితీరుస్తున్నాయి...

రగిలే రాక్షస జ్వాలలు
అంబరాన్నిచుంబించి
రక్తాభిషేకం చేసి
సంబరాలు చేస్తున్నయ్....

కాలుష్య సంకెళ్ళలో
గాలి నీరు
నేల నిప్పు
అనంతాకాశం
నదీనదాలు
కొండకోనలు
బందీలయ్యాయి.....

కల్తీ భూతానికి
ఉప్పు పప్పు
ఫలం పుష్పం
క్షీరాన్నపానాలు
మానవ
బాంధవ్యసంబంధాలు
రాగానురాగాలు
మమతానుబంధాలలోని
స్వచ్ఛత బలియౌతున్నది
ప్రాణికోటికి
అనారోగ్యపు హేతువై
ప్రాణాలను హరిస్తున్నాయి

ప్రపంచ దేశాలు
అభివృద్ధి కాంక్షతో
అంగుళం ముందు కెళుతూ
వాతావరణ సమతుల్యాన్ని
ఆరడుగులు వెనక్కి తోస్తున్నాయి

సర్వప్రాణి సంరక్షణ
కలగా మిగిలే రోజు
మానవ మనుగడ
వ్యధగా రగిలేరోజు.....

సమయము దాటి
చేసే సమరాలు
శవ రహదారుల పై
పదఘట్టనలే.....
ప్రకృతినైనా
పర్యావరణాన్నైనా
విజయతీరానికి చేర్చ లేవు....!

మనిషీ మేలుకో!
తిమిరాన్ని వదలి
వేకువ వైపు అడుగులు వెయ్..!
రాగరంజిత
సుందర
సుమధుర
బృందావనాలు
స్వర్గ ధామాలు
నిర్మించుకో..!!
****అవేరా***
(రేపటి సహస్రకవి సమ్మేళనం కోసం)





     

13/04/2016

13/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:232
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు Dy.S.E
Cell:7207289424
సియాటెల్ ,యూఎస్ఏ
అంశం :దాశరథి కృష్ణమాచార్య
శీర్శిక: దాశరథి జయంతి 22/04/2016
(జననం:22/04/1925 మరణం 05/11/1987)

జనంపైన నిరంకుశత్వం
విషంచిమ్ముతుంటే
దండెత్తిన మదం
పదఘట్టనలక్రింద
తెలుగుభాష
నలిగి నుజ్జవుతుంటే
సంప్రదాయంలో
విప్లవమార్గాన్ని
సంలీనం జేసి
పాతబూజు గా
ఎద్దేవా యైన పద్యంతో
కద్దేయంటూ
అభ్యుదయం కలలతో
విజయపథాన సాగిన
వీరసింహము నీవు!
నాటి నైజామునకు
నారసింహమువైనావు!

సాహిత్యాన్ని....
నిర్భంధం
చిత్రహింసలకు
ఎదురుతిరిగి
ఎదురు నిలప
జాతిని జాగృతపరచే
పవిత్ర కర్తవ్యంగా తలంచి
ఒక ఆయుధంగా మలిచావు!
అగ్నిని చైతన్యంగా
మానవ హృదయాల మద్య
ప్రవహించే విద్యుత్ ధారగా
"అగ్నిధార" ప్రవహింపజేశావు!
"రుద్రవీణ"ను మీటి
"మహాంద్రోదయం" కలలతో
పోరాటం"పునర్నవం" గాచాటి
"తిమిరంతో సమరం"చేశావు....

‘నా గమ్యం ప్రపంచశాంతి
నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’  అనే
నీ జీవితమే ఒక పోరాటం
‘తిమిరంతో ఘనసమరం,
జరిపిన బ్రతుకే అమరం’ అన్నావు !
అక్షరసత్యమై నేడు అమరుడైనావు!
‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి,
నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’నన్నావు!

 కార్యాచరణకోసం కటకటాల పాలయ్యావు!
 ‘ఓ నిజాము పిశాచమా!
కానరాడునిన్నుబోలిన రాజు మాకెన్నడేని;
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’యని
కటకటాలలో పళ్ళు
"పటపట"లాడించావు.....

 ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’
 జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటులమద్య ...
తొణికే శృంగారభావంతో వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని ఘనవక్ష మేఘకాంతల వైపు సాగిపోవాలనిపించేదా!
 ఏ శషభిష రాతలు లేని  నీ నిజాయితీ! అన్యులకసాధ్యమే!

"పోతన కవీశానుగంటములోని ఒడుపుల
కొన్నింటిని బడసితివట"
గాలిబ్ గీతానువాదం
నీసత్సాహిత్యాభిలాషకు నిదర్శనం...

 ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి పాటలు రువ్వుతూ’,
‘మా కంటిపాపలో నిలిచి, ఏ లోకాలు గెలువ చనుదెంచితివో’,
‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేస్తున్నవో’...

‘ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి’గా
ఆంధ్రమాత కిరీటమందుకున్నావు!
నా ‘యాత్రాస్మృతి’ లో నీవంటి
స్నేహశీలి, మృదుస్వభావి,
నిరాడంబరుడు లేడు... కానరాడు!
బుడుగువైనా ఆర్తి పొడుగు
మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’!నీది!

‘జీవనయానం’లో ఆఖరి మజిలీ
అక్షర వాచస్పతి నీ అస్తమయం
నీ జీవనవేదం విమలం
నీ కవితా నాదం అమరం
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ
నా మానసవీణ కురియు కోటి జోహార్ల వాన....!

******అవేరా******






     

14/04/2016

14/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:233(గేయం)
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,,యూఎస్ఏ
అంశం : భక్తి
శీర్శిక: శ్రీరామనవమి
*************
పల్లవి:
రాజాధిరాజా రాజరాజేంద్రా
రఘవంశ తిలకా శ్రీరామచంద్రా!

చ1
చైత్ర మాసమునందు
శుక్ల పక్షమునందు
ఇన వంశమునందు
నుదయించినావట...రాజాధి
చ2
నీ నామస్మరణతో.......నీనామ .(2)
పాపపంకిలమొదలి ....
పరిశుద్ధమవ్వదా మా మనఃవనమూ.....రాజాధి
చ3
రామరామయనిన
నీదివ్యనామమ్ము.....రామా
జ్ఞానాగ్నినొసగదా
విష్ణుపదమొందగా......రాజాధి
చ4
జానకీ కాంతుడా
వందనమ్మందుకో.....జానకీ(2)
సర్వలోకోత్తమా
నీ కిదె వందనం...........రాజాధి
చ5
దేవాదిదేవుడవు
శ్రీరఘనాధుడవు........దేవాది(2)
లోక శరణ్యుడవు
శ్రీ జగన్నాధుడవు.........రాజాధి
చ6
ధీరోదాత్త గుణోత్తమా ...........
అనంతసుగుణ గంభీరా...........
ఆదిపురుష పరమపురుషా.........
మహాపురుష పురుషోత్తమ  శ్రీరామా...........రాజాధి
చ7
జానకి వల్లభా
శ్రీ రామభద్రా..........జానకీ (2)
రాజీవలోచనా
శ్రీరామచంద్రా..........రాజాధి
చ8
సత్యాయ రామా
సిద్ధాయ రామా
జ్ఞానాయ రామ
నారాయణా........రాజాధి
చ9
అహల్య శాప శమనాయ
హనుమదాశ్రితాయ
మాయా మరీచహంత్రే
రావణాంచకాయ.....శ్రీరామా.........రాజాధి
చ10
లక్ష్మణాగ్రజా
రఘనందనా
నమోదేవ
శ్రీరామాభి మబోభవా...నమోదేవ(2) .......రాజాధి
*******అవేరా******
(ఈ గేయం శ్రీరామ పాద పద్మములకంకితము)
పాడే సమయం దొరకక పాడలేదు వీలయితే పాడి పోస్ట్ చేస్తాను)
SK101
SK101
కవిత నెం:234
అనుసూరివేంకటేశ్వరరావు
సియాటెల్, యూఎస్ఏ
శీర్షిక:అతఃసౌందర్యం
*************
కనకాంబరాలు
కనకాభరణాలు
మేనిసొగసులు
వస్త్రాడంబరాలు
బాహ్యాడంబరాలెన్నైననేమి?
అంతఃసౌందర్య
గుణసంపదముందు...!!!
*****అవేరా****



అనుసూరివేంకటేశ్వరరావు

అనుసూరివేంకటేశ్వరరావు
కవిత నెం:235
శీర్షిక:కుండ
***అవేరా***
కుండకుండయనేల
తీసి పోవుమాట
తీపికుండే యుగయుగాల
జనులకండ
జలమునిండుగున్న
కుండున్న ఇంట
పండదా
ఆయురారోగ్య
సిరుల పంట...!
జలము మించిన
సిరి జగమునేమున్నది??
***అవేరా***

08/06/2016

08/06/2016 ..
సహస్రకవి 101
కవిత సంఖ్య:236
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: వెట్టిచాకిరీ..!

వీడు నా కొడుకు
పుట్టి బుద్దెరిగి నీ సేవలో వున్నా!
వీడికి దారిచూపించు దొరా...!
పదునారు ప్రాయాన్నే
దొరగారి నీడకు చేర్చాడు
సూరిగాడు కొడుకుని..
జెండా కోసం
నిండు ప్రాణం తీసే
సూరిగాడికి తనే దేవుడు మరి..!

జెండాపట్టి ,
జనంలో నడచి,
బేనర్లు మోసిమోసి,
కాలంతో రోసి రోసి,
జేజేలు కొట్టిన,
చేతిలో చేవచచ్చింది!
యవ్వనమంతా దొరగారికి
ధారపోసినా ..
పార్టీ కోసం పారబోసినా...
ఎక్కడి గొంగళక్కడనే...!
మారని బ్రతుకు చిత్రమే...!

వయసుడిగిన సూరిగాడికి,
మరో ప్రత్యామ్నయం...
వెతక్కుండా కాలికి తగిలిన తీగ!
తనపై తనకు విశ్వాసం లేని,
గుండె నిండా తనపై విశ్వాసం
నిండిన మరో గ్రామససింహం...!

విషపు ఆలోచనలు
మనసు తెరవెనక దాచి..!
కోరమీసం దువ్వి
చిరునవ్వు రువ్వి
అలాగే అన్నట్టు..చూపు విసిరాడు..!
మనసులో కపటానికి
చీకటి ముసుగేసి...
జాలి చూపును
వెలుగులో చూపాడు...
ప్రేమ నటనను ఫ్రేములో తెచ్చాడు..!

వారి అభిమానాన్నే బ్యానర్ గా
వారి విశ్వాసాన్ని స్లోగన్ గా
మార్చగల గుంటనక్కకు..!
కాలి కిందకు
చేరిన మరో చెప్పు వాడు!
ఏళ్ళు గడచినా
అరుగుదలే లేని అరగని చెప్పు!
పల్లకీ మోసే క్రొత్త బోయీ!
తన రక్షణ కవచం!
వెట్టిచాకిరీ బలిపీఠమెక్కే మరో మాంసపు ముద్ద!
తాను నడిచే
మోదుగల ఎర్రతివాచీపై ఓ మోదుగపువ్వు!
వెట్టి చాకిరీ నీడలో
పెరడు చేరిన మరో గడ్డి పువ్వు!
ప్రజా పాలకుడి నీడన చేరిన
తాజా పెంపుడుపులి..!

రేపటి మనసు వాడిన పువ్వు!
నడుము వంగి నిలిచే ఎముకల గూడు!

సంచలనాల తూఫానులు
తిమిరాన్ని తరిమే తిరుగుబాటులు
భీకర ప్రళయప్రభంజనాలు
వికృతి కోటు విప్పి
నిప్పు రగిల్చే రోజు....
వస్తుంది...వస్తుంది....
తానే వస్తుంది....
రానే వస్తుంది....
అప్పుడే......
ప్రభుస్వామ్యం మంటగలిసి
ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది...!!

****అవేరా***






     

17/04/2016

17/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:237
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్ ,యూ ఎస్ ఏ
అంశం : సామాజికం
శీర్శిక: చీకటి నక్షత్రం

చీకట్లోకి విధాత
విసిరిన విత్తనం...
మూలమే తెలియని
విత్తుకు మొలకై
చిగురిస్తుంది....

సమాజంలో మొలకెత్తిన
వృత్తినే ప్రవృత్తిగా
మలచి...
విరిసిన సింగారాలకు
శృంగారంగారాన్నద్దుతుంది

తాను నిత్యం
కాలే నక్షత్రమై
సూర్యునిలా
జగతికి వెలుగునివ్వలేదు
విటుల మనసులలోని
మదన శలభాలను
మాడ్చే అగ్నిశిల...
మనసు తేలిక పరచే
హిమ శిఖ...
ఈ చీకటి నక్షత్రం...??

గుండెల్లో....
కదిలేమేఘంలా
కన్నీటిని మోస్తుంది
అది కరిగి వర్షంచేదెప్పుడో....

నగ్నత్వంభగ్నమైనరోజు
భగ్నహృదయాలను
రంజింపజేసే అపరంజి.....

తనలో ఇమిడిన
సొగసు కొండలను కొరికే
మంచుతుఫానుల తాకిడితో...
బాధల వూటలూరే కోనల్లో
వరద పోటుల దాడులతో......

శరీరం శకలమై
మనసంతా వికలమై
ఎన్నోఋతువులు
చూచినా
చిగురించని బ్రతుకులు
కనిపించని వసంతంలో
కాలుతున్న చితుకులు.......

****అవేరా***
ఈ కవిత నా స్వంతం
దేనికి అనువాదం అనుసరణకాదు
ఇట్లు...
అనుసూరివేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
cell 7207289424






     

17/04/2016

17/04/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:238
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూ ఎస్ ఏ
అంశం : సామాజికం
శీర్శిక: అనామిక

ఏ గ్రహ శకలము
విసిరేసిన ఉల్కవో....
వెలుగుతూ ఏతెంచి
చీకటిలో జిలుగైనావు
భోగానికి నిను
శిలువేసారు...

అలసట సేదదీరే
బాటసారుల
దాహం తీరుస్తావు....

బలుపున మదమెక్కిన
మదగజాల కాహుతివౌతుంటావు....

రాగద్వేశాల దరిచేరనివ్వని
తపస్వివి నువ్వు....

గుండెలలో అర్నవం...
ఆ అర్నవలోతుల్లో
దాగిన బాధలను
తీయని నవ్వుల
దరహాసాలంకారంతో
జీవిత సాగరాన్ని
ఈదేస్తుంటావు....

యుగయుగాలుగా
ఆగని యాగంలో
ఆహుతైన సమిధల్లో
నీ సంఖ్య చెప్ప గలవా
ఓ అనామికా...???

****అవేరా***






     

18/04/2016

18/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:239
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: జారుడు

మగ మహా రాజన్నారు
పుట్టగానే...
విద్యనేర్చినాను
వృత్తి పొందలేని
వింతపశువైనాను...

తీరూతెన్నూ లేని
సమాజపు
అనైతిక తుఫానులో
చిక్కిన
చుక్కానిలేని నావనైనాను.....

జారవృత్తులన్న
మహిళసొత్తు కాదని.....
దారితప్పిన
సమాజంలో
జారమతులున్న
జాణలున్నారని
మదనవేదనలోన
జోగుతున్నారని
బ్రతకనేర్చినాను
నా వెతలుదీర్చ
వెలుగుతున్నాను
మూఢమతుల
కామోద్ధీపనై
కామోద్ధీపమై....!!

****అవేరా***






     

SK101
SK101
18/04/2016
అనుసూరివేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
కవిత సంఖ్య:240
అంశం:సామాజికం
**శీర్షిక: మహా పురుషుడు**

నాలుగక్షరాల
నరజాతి మణిపూస
విధాత సంధించిన బ్రహ్మాస్త్రం
ఎంతటి కార్యానికైనా
అలజడి పుట్టించే వజ్రాయుధం
బరువు బాధ్యతలను
కలనైనా మరువని
నిరంతర పోరాటయోధుడు
ప్రేమాభిమానాల
తరగని నిధి
నిరంతరం వెలిగే ధుని
కట్టుటెరిగిన
పట్టుటెరిగిన
విచక్షణలో
వినుతికెక్కిన
విధినిర్వహణలో
విరించియతడు....
లొంగుట
లొంగదీయుట
శక్తి కాదు
యుక్తియనెరిగిన
తర్క
వితర్కభోక్తయతడు
భార్యను
కుటుంబాన్ని
భుజస్కంధాల
భరించే
బాధ్యతాయుతుండు
కుటుంబంలో
సుఖశాంతులకు
శాసన కర్త
దయాదక్షిణ్యాల
దానకర్త......
అతడే...
పుడమినుదయించిన
మరో పున్నమి చంద్రుడు
ఆడమగ తేడాలెంచక
పున్నాగ నరకాన్ని
బాపు పురుషపుంగవుడు...!!
*****అవేరా*****
20/04/2016

20/04/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:241
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: నీటిచుక్క

గొంతుతడప
నీరు లేకున్నా
బొట్టుబొట్టుగ కారు
నీటిచుక్కను జూడు
కట్టు లేకనె ఎడతెరిపి
పారుచుండు
పేద బతుకుల
కన్నీటి చుక్కలు ....

దాహార్తి తీర్చగ పనికిరావు
ఉప్పుసముద్రాన్ని చేరలేవు....

నీటికరువును దీర్చలేవు
భూమాత దాహాన్ని తీర్చలేవు.....

ప్రజలానందంగా వున్నారనే
అందమైన అబద్దాన్ని
నిజముగ చూపాలంటే.....

వానజల్లు కురవాలి
బాధాతప్తులు
జల్లులో తడవాలి
వానలో తడిస్తే
కన్నీరు కనిపించదు
అబద్దం నిజంలా అగుపిస్తుంది!
*****అవేరా****
(చార్లీ చాప్లిన్ జన్మదిన సందర్భంగా)







     

20/04/2016

20/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:242
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : భక్తి
శీర్శిక: కన్నయ్య

కిర్రుమనకుండ
తలుపు తెరిచాడు
జర్రుమంటూ జారి
లోనకురికాడు
అరపాదములనాన్చి
అడుగుకదిపాడు
అటునిటు పరికించి
చూపువిసిరాడు
హమ్మయ్య
అనుకుంటు
ఎగిరిదూకాడు
అందని వెన్నని
జాలిగా చూచి
కుండబోర్లించాడు
కుండనెక్కాడు
బుల్లి చేతులతోను
వెన్న దోచాడు
చిన్ని పెదవుల నిండ
చిరువెన్నముద్ద
బూరెబగ్గలనిండ
తెల్లమల్లెనుబోలి
తెరలుకట్టెను వెన్న
మెల్లగాకదిలాడు
మెరుపుదొంగను బోలి
చల్లగా చేరాడు
యశోదమ్మ ఒడి
ఎవరయ్య ఆ దొంగ
మా చిట్టి కన్నయ్య

****అవేరా***






     

21/04/2016

21/04/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:243
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: స్వాతంత్ర్యం

స్వాతంత్ర్యమా నీవెక్కడ?
జనులంతా బానిసలై నిక్కనీల్గు చున్నారు
ధనస్వాముల సంకెలలో బంధీవైనావా?
స్వార్థరాజకీయాలకు బలియైనావా?
ఎండు డొక్కల జఠరాగ్నికి ఆహుతియైనావా?
అఢుగు కదిపి ఆడపిల్ల ఆరుబయట తిరుగలేదు
ఇచ్చిన పట్టాలనే గుచ్చి గుచ్చి చూస్తుండ్రు
చేతపట్టి చేవజచ్చి చితిమంటల ఆహుతిలో
కాలుతున్న యువతచూడు
భారతమ్మ భవిత చూడు
తెల్లవాడి శాసనమవి
బానిసలుగ బ్రతుకొద్దని
దశాబ్దాల పోరుసలిపి
పోరాడిన వీరులేరి??
వారసులమని రాజులవ్వ
ప్రజాస్వామ్యమిదియేనా
రాచరికపు రాచపుండు
దేశదేహమొదిలేనా?
తెల్లదొరల పాలనొదలి
నల్లదొరస్వామ్యమొచ్చె..!
దేశభక్తిహీనమయ్యె
దేశద్రోహి రాజకీయ సోపానమయ్యె
ఉరికొయ్యలకెక్కినట్టి దేశభక్తులారా!
ఏకొయ్యలకేద్ధాము దేశద్రోహ తొత్తులను?
రైతురాజ్యమన్నారు
రైతేరాజన్నారు
కణకణమని మండుతున్న
చితిమంటల చలికాగారు
భగభగమండేమనసుల
భుగభుగల సెగలు చూడు
ధగధగల ధనస్వామ్య
దహనసంస్కారమెప్పుడో??

*****అవేరా*****








     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
22/04/2016 ..
సహస్రకవి 101
కవిత సంఖ్య:244
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్ యూఎస్ఏ
అంశం : సామాజికం(ధరిత్రిదినోత్సవం సందర్భంగా)
శీర్శిక: భూమాతా వందనం

భానుడి గ్రహ కూటమిలో
ప్రాణిని నిలిపిన మాతా వందనం
పంచభూతాలతో విరాజిల్లే
భూమాతావందనం...!!
పర్వతాలను శిఖరాయమానంగా భరించావు
పంటపొలాలతో
పచ్చని అడవులతో
పచ్చని పట్టుచీర ధరిస్తావు
చెట్టు చేమ
పుట్ట చీమ
కట్టుపాము
జట్టులేడి...
ఇంకా ఏమని చెప్పను..??
కోటాను ప్రాణులకు
ప్రాణమే నీవు
దాహమంటే
నీరిచ్చావు
ఆకలంటే
ఫలమిచ్చావు
చీకటంటే
వెలుగిచ్చావు
కడుపులో పెట్టి
కాపాడావు...
బ్రతుకు నేర్పే
వేదాన్నిచ్చావు
ఐతిహాసిక పురాణాలిచ్చావు
యుగ యుగాలుగా...
పాపాలను సహించావు
పాపులను భరించావు...
క్షమకే మరోరూపు నీవమ్మా..!!
మరి మనిషిగా పుట్టి
మేము నీకేమిచ్చామమ్మా..??
సంజీవనులైన వృక్షాలను హరించాము
చెట్టునరికి
పుట్ట చెరిపి
జీవజాల
హననానికి
హాలాహలహలంతో
సేద్యం చేస్తున్నాము
వింతైన బ్రతుకు
విన్యాసాలను
విత్తనంగా
విషపు పంటలు తీస్తున్నాము
ఇంధనాల మండించి
మా చితికి
నిప్పు మేమే రగుల్చుకుంటున్నాము
కష్టం నష్టం మాకైనా
కన్నీరు నీదేకదా
నీ కంట ఆనందమొలకక
ఆనందభాష్పాలు కరవై
నీరు దొరకక
అణువణువూ
గుండెలుతాకే దాకా
గునపాలతో
తూట్లు పొడుస్తున్నా
బాధనెలాభరిస్తున్నావమ్మా...??
రానున్న రోజుల్లో అయినా
మనిషిమారతాడన్న
నీ ఆశే మమ్ము బ్రతికిస్తుంది
కమ్ముతున్న చీకటిలో
వెలుగు కిరణాలొస్తాయని
ఎదురుచూస్తున్నావా తల్లీ...!!
చేసిన తప్పు తెలుసుకుని
మనిషి మారకపోతాడా...
నీకు స్వస్తత చేకూర్చక పోతాడా
అని ఎదురు చూస్తున్నావా..!
మేమేం చెయ్యగలం తల్లీ..
నిన్ను ప్రార్థించటం తప్ప..!
 ‘సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే
విష్ణుపత్నీ నమస్తుభ్యమ్ పాపఘాతం క్షమస్వమే...!!
(ధరణీ మంత్రంలో చిన్న మార్పు చేసి వాడడం జరిగింది
పాద ఘాతం బదులు సందర్భానికి సరి పడేలా
పాప ఘాతం అని వాడడం జరిగిందని గమనించ ప్రార్థన!)

****అవేరా***






     

30/04/2016
30/04/2016(శ్రీశ్రీ గారి 116వ జన్మదినం)
SK101
కవి:అనుసూరివేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
cell:7207289424
కవిత సంఖ్య:245
అంశం:సామాజికం
శీర్షిక:వేగుచుక్క(శ్రీశ్రీ)

నేడే ఈనాడే
నూట పదహారు
వత్సరాల వరవడి ముందు
నింగినుండి జారిందొక
దేదీప్యపు తోక చుక్క
తెలుగు కవత్వాకాశంలో
వెలుగు నింపే వేగుచుక్క....

ఆధునిక తెలుగు కవిత్వ నావకు
ఒక దివ్య చుక్కాని దొరికింది
నవకవనంతో సమాజ నగ్నత్వాన్ని
బహిర్గతపరచి ఆనాటి...
‘ఛందస్సుల సర్ప పరిష్వంగం’ కాదని
‘ఛందోబందో బస్తులన్నీ ఛట్‌ఫట్ మని తెంచి తుంచి,
కడుపు దహించుకుపోయే ......
పడుపుగత్తె రాక్షసరతి,
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం,
సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల హాహాకారం’,
కవితా వస్తువులుగా కదంతొక్కిన కలం అది...

‘కదిలేదీ, కదిలించేదీ....
పెనునిద్దర వదిలించేదీ....
పరిపూర్ణపు బతుకిచ్చేదీ....
కావాలోయి నవకవనానికి’,
అని ఎలుగెత్తి కలమెత్తి
అభ్యుదయ కవిత్వానికి
ఆద్యుడయ్యాడు శ్రీ శ్రీ....

స్వస్తి స్వస్తి ...
గణబద్ధ ఛందస్సులకన్నాడు
అతిప్రాచీన మాత్రాబద్ధ ఛందస్సుకి
నవరుధిరంపోసాడు
యమకం...తాళం...తో...
ఎలుగెత్తి గళం విప్పి
పద్యధారవొలికించి
సామాజికస్పృహతో
ఉప్పొంగిన కవితలూ
పాతబూజునొదిలించీ
కొతరక్తమెక్కించీ
నవ్యకవిత బాటవేసి
కొత్తవరవడురికించాడు......

మరువలేము నవ్యసాహిత్యపరిషత్తు వేదిక పై
‘కవితా కవితా’ అని జాలువారిన పాటను,
ఆనందబాష్పాలతో విశ్వనాధ సత్యనారాయణగారి ఆప్యాయపుకౌగిలిని...

పసిపిల్లడు
నవయువకుడు
మహావృద్ధుడున్నాడు
అమాయకత
ఉత్సాహం
జ్ఞానసంపద,
కలగలసిన జ్ఞానఘని
నిరంతరం విప్లవ జ్యోతిగ వెలిగేధుని!...

తెలుగునేల సాక్షిగా
తెలుగుభాషజ్యోతిగా
ప్రపంచ స్థాయి కెదిగాడు
తెలుగుఘనతచాటాడు
భాషల అవధులు దాటిన
మంత్రశక్తి మాటలతో
‘కవితా ఓ కవితా’యని ‘మరోప్రపంచం’,లో
గొంతెత్తి చదివినప్పుడు
ముగ్ధులయి మూగవోయారుఅమెరికన్లు
‘పీడితదేశాల ప్రజల ప్రతినిధి నా గొంతుక,’ అని
అంతర్జాతీయ విప్లవ సమాజానికి
నాగొంతుక మీకోసమే నన్నాడు......

మొదట తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.
ఆ తర్వాతనుంచి నేను దాన్ని నడిపిస్తున్నాను
దిస్ సెంచరీ ఈజ్ మైన్‌’, అని సాహిత్య సార్వభౌమత్వాన్ని
ప్రక టించుకున్న ఆత్మజ్యోతి...
నవకవితకు స్ఫూర్తి....
ఆధునిక చిత్రకళకు పికాసో లాగా
ఆధునిక తెలుగు సాహిత్యానికి
అభినవ పికాసో శ్రీశ్రీ
తెలుగులో నవ్యసాహిత్య ఉద్యమాల
భవ్యనేపథ్యం  శ్రీశ్రీ.

మాత్రా ఛందస్సులలో
మహాప్రస్థానం
కవితా జగత్తులో
‘మరో ప్రపంచం’,
నడుస్తున్న వ్యధచరిత
‘జగన్నాధ రధ చక్రాల్‌’ ....

‘చరమరాత్రి’ సంకలనం
నిరంకుశస్వేచ్ఛ
అధివాస్తవికత తో
అమరమైన కథలు
ఆణిముత్యాలు
శషబిషలే లేని
అక్షరసత్యాలు
పదునెక్కిన చురకత్తుల
చురకలతోవ్యాసాలు....

 తన ఖడ్గ సృష్టి ఖండికలో –
“రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోరు తెరిచే భూమిలో …
అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి” – అన్నాడు

“బలవంతులు దుర్బల జాతిని బానిసలను గావించిరి
నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి
నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?” –
గీతంలోనే చరిత్రకి నిర్వచనం చెప్పాడు.
“జమీందారు రోల్సు కారు
మహారాజు మనీపర్సు
మరఫిరంగి విషవాయువు” –
మాయ కాదుమాయకాదంటూ
మిథ్యావాదులకు చురకలేసాడు .

“పాలికాపు నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు” –
కఠోర సత్యాలని చురకలు పెట్టాడు.

“నిరక్షరాస్యుల మీద అక్షరాస్యులూ,
దరిద్రుల మీద ధనవంతులూ పరిపాలన సాగిస్తున్న వ్యవస్థ
ఇదేమి ప్రజాస్వామ్యం ? అని ఘంటాపదంగా చెప్పి
తన కవిహోదా పై విమర్శలకు సమాధానం ఇచ్చాడు.

విదూషకత్వానికి చిహ్నాలు
సిరిసిరిమువ్వ, రుక్కుటేశ్వరశతకాలు
నవ్వించి, కవ్వించే
అందాల కందాలు

పాల్ ఎల్యుయార్, స్విన్‌బర్న్,
అడ్గార్ ఎలాన్ పో, రాంబో,
వెర్లైన్, మల్లర్మ, బోదలేర్‌,
అపోలనేర్, లూయీ అరాగో … కవితల్నీ
అనువదించినా,
అనుసరించినా
చెక్కుచెదరదు శైలీ,
తొట్రు పోవదు గొంతూ
కృష్ణశాస్త్రి ఛందోలాలిత్యం శ్రీశ్రీలో వుంది

“కవి సంఘానికి మార్గదర్శకుడు కావాలి.
అందుకనే వడివడిగా ప్రజలందర్నీ ముందుకు నడిపించే
విప్లవపంథా; అభ్యుదయ రీతి”
“సినిమానే ఆయుధమని చాటాడు
పాటలలో...
"గాంధిపుట్టిన దేశమా ఇది "యన్నా
"సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్"
అన్నా సామాజిక సుప్రభాతాలే
సినిమాతో ప్రజల హృదయాలను దోచాడు
అందుకే.....
శ్రీశ్రీ.....
తెలుగు సాహితీ సముద్రంలో
వీచిన పెను తుఫాను
పాతబూజు దులిపేసిన సునామీ
ఒక సాహితీ మలయ మారుతం
ఒక ఆరని విప్లవ జ్యోతి...
తాడితపీడిత జనుల కంటివెలుగు...
‘శ్రీశ్రీ మా ఆధునిక కవిత్వానికి ప్రతినిధి’

******అవేరా***
పైకవిత నా స్వంతం దేనికి అనువాదం
అనుకరణకాదు
ఇట్లు...అనుసూరివేంకటేశ్వరరావు
          సియాటెల్,యూఎస్ఏ




1/05/2016(మే డే సందర్భంగా)
1/05/2016(మే డే సందర్భంగా)
SK101
అనుసూరివేంకటేశ్వరరావు
సియాటెల్,యుఎస్ఏ
కవిత సంఖ్య:246
విషయం:సామాజికం
శీర్షిక:తిరగబడిన చైతన్యం
*******************

ఎరుపెక్కిన ఆకాశం
ఎర్రమోదుగయ్యింది....
రక్తం చిందిన గుండెల
పారిన రక్తపు టేరులుతో
పుడమి తల్లీ ఎరుపెక్కింది...!

శ్రమదోపిడి బలిపీఠం
తిరగ బడిన రోజు...
బానిస సంకెళ్ళు
ఫట్...ఫట్ మని తెగినరోజు...
బరిసెలైన
బల్లెమైన
కత్తులైన
కాగడాల వత్తులైన
తొత్తులుగా బ్రతుకలేక
కత్తులుగా మారిన
చైతన్యం చెడుగుడాడి
కట్ట తెగిన
ఓర్పు వరద
చిట్టచివరి
ఊపిరివిలువ.....

జనం జనం ఏకమై
కణంకణం స్తైర్యమై
గుండెగుండె ధైర్యమై
జయంజయం సైన్యమై

కణకణ మని మండే
నిప్పు రవ్వ రగిలింది
పీడిత తాడిత జనుల
చీడపీడ వదిలింది.....

కలకత్తా కాళిక సాక్షిగ
కార్మికుల వేదన దీక్షగ
హౌరాలో రగిలిన నిప్పు
రాజుకున్న కార్చిచ్చు....

సముద్రాలు దాటింది
చికాగోను కాల్చిందీ
ప్రపంచాన్ని వెలిగించిందీ...

బూర్జువాల
భుగభుగ ఆశలు
కార్మికుల
భగభగ సెగలలొ
దహనమైన
శవమైనాయి
సెగలేమో మిన్నంటాయి....

విజయాలసంబరాలు
అంబరాన్ని తాకాయి
నల్లజెండవిరిగింది
ఎర్రజెండఎగిరింది......

ప్రపంచ కార్మికులకు
మేలుకొలుపు ఉషోదయం
చైతన్యపు నవోదయం....మేడే ఈ నాడే...!!
*******అవేరా******
ప్రపంచ కార్మిక సంఘాలకూ కార్మికులకూ
మేడే శుభాకాంక్షలతో...మీ .అవేరా లాల్సలాం..!
2/04/2016

2/04/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:247
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్ యూఎస్ఏ
అంశం : సాహిత్యం
శీర్శిక: అక్షరస్వరం

అక్షరమా....!
నా జీవన స్వరమా...!
నాహృదయ స్పందనరాగమా...!
నవజీవననిత్యనినాదామా...!
సహజీవన కవనప్రమోదమా...!
ప్రణవస్వర సురాగమా...!
ప్రణయస్వర పరాగమా...!
నవచైతన్య ప్రజోత్పతమా...!
యువ కవన నటరాజమా...!
కవిహృదిలోజీవనప్రవాహమా...!
భువిలో వాగ్దేవి వరప్రసాదమా...!
చందస్సులో పట్టు వస్త్రమా...!
కవుల హృదయ తేజమా...!
హృదయంలో కొలువైన దైవమా....!

****అవేరా***






     

05/05/2016

05/05/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:248
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : పర్యావరణం
శీర్శిక: ఆటవిక అభివృద్ధి

కూల్చిన చెట్ల పైన
అభివృద్ధి పునాది
ప్రాణవాయుదాత
సమాధి పైన
ప్రాణం పోసుకున్న
కాంక్రీటువనాలు...

చల్లని నీడ దేవతకు
నల్లని చీడ సమాధి
వెలుగును వెక్కిరించి
చీకటికి కిరీటం.....
వివేకంమత్తులో
అవివేకుల విన్యాసం...

పంచరంగుల
పుష్పకవిమానాలు...
ఆకాశాన విహారపక్షులు...
పరజలు
రామచిలుకలు
ఊరపిచుకలు
వడ్రంగిపిచుకలు
కొంగలు
అడవికాకులు
పాలపిట్టలు
కౌజులు
చకోరాల
సరసాల గుసగుసలు
గీత సంగీతాలు
సుస్వర రాగరంజిత రవాల సాక్షిగా
గరికెల,చితుకుల,
చిగురుల, చిక్కుల,
చిరుగూళ్ళు కూల్చి
వెలసిన ఆకాశహార్మ్యాలు....

చెట్టునీడలేక
చెల్లాచెదురైన
పక్షులు, మయూరాలు,
అడవిజంతువులు....

రేడియేషన్ తో
కూలిన పక్షుల
రెక్కల నీడన
కూర్చిన అభివృద్ధి.....

తవ్వినపుట్టలు
కూలినగుట్టలు
వాసము కూలి
హాసము లేని
సరీసృపాలు.....

పూవులేక
తావిలేక
తేనెలేక
వినలేని
కేకలతో
ఆకలితో
తుమ్మెదల అలజడి......

పెరుగుతున్న
కర్భన ఉద్గారాల ధాటి
పెరుగుతున్న భూతాపం
వడదెబ్బలతాకిడిలో
భూమాత విలవిల....!

తూఫానుల వికటాట్టహాసాలు...
సునామీల వికృతనాట్యాలు...
భూకంపాల ప్రళయవిన్యాసాలు...
మృత్యు వికృత కరాళనృత్యం...


క్రుంగుతున్న దృవమంచు
పొంగుతున్న సముద్రాలు
జంకుతున్న ఆకాశం
వొణుకుతున్న
ఓజోను పొర...

కరిమబ్బులు తెలుపైనాయి
నీరులేక
నింగిన నిలిచాయి
అచ్ఛాదన గొడుగైనాయి
ఋతుగాలుల వెక్కిరింత
ఏరువాక  కలవరింత.....
వరమైన సరోవరాన
వలస పక్షులేమైనాయి?

నీరులేక
భూమి బీటలు
బీటబారిన బ్రతుకు
అన్నదాతకు బరువు......
నదీనదాలను
కాలుష్య భూతానికప్పజెప్పి....

గాలినీ వదలకుండ
కలుషితం చేస్తుంటే...
జనజీవనాన్ని
సమాధిచేస్తుంటే....

పొయ్యిలోని అగ్ని
అడవిలో పొగచూరుతుంటే....

అభివృద్ధిమాటున
మాటువేసిన వినాశనం
కానలేని ఆటవికులు
మనుష్యులైపుట్టిన మృగజాతి
పంచభూతాలనూ
వెలకట్టి అమ్ముతుంటే
పంచభూతాల విలువ
తెలుసుకొనేదెన్నడో....!??
వృక్షపునరోత్పత్తికి పూనుకొనేదెన్నడో...!??

****అవేరా***
మన పూర్వికులు మన జీవన విధానంలో
సప్తసంతానాన్ని మనకప్పజెప్పారు
ఆ సంతానాన్ని ఎంత నిర్లక్ష్యం చేసామో
అదేంటో మీకు తెలియ జేస్తాను....మీ అవేరా..!






     

08/05/2016
08/05/2016
(మదర్స్ డే సందర్భంగా)
సహస్రకవి 101
కవిత సంఖ్య:249
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు బి. టెక్
డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీరు
అంశం : అమ్మ
శీర్శిక: అమ్మప్రేమ

సృష్టిరచనలో స్రష్ట యా బ్రహ్మ
పూజలంద లేక పుట్టించెనమ్మను
సృష్టికర్తగజేసి సృష్టిజేయ.....

ఆత్మ రూపమంది అమ్మ కడుపునబుట్టు
అమ్మ గర్భమేయాత్మ దేవళమ్ము
అండమందుజేరి
ఆత్మ దేహమొందు
రక్తమాంసములముద్దకు
రూపమిచ్చుశిల్పి....
అండపిండమునుధరించి
ప్రాణమొసుగు బ్రహ్మ......అమ్మ!

పేగు పంచి కడుపులోన పెంచునమ్మ
పేగు దెంచి కడుపున గాచునమ్మ
ముర్రుపాలుపంచి
మురిసేటి కల్పవల్లి
కంటిరెప్పై గాచునాతల్లి....

లాలపోసితుడిచి జోలపాడి,
స్తన్యమిచ్చి బిడ్డ కడుపు నింపు,
శైశవాన శిశువు
దైవసమమేయంచు
దైవసేవజేయుచుండు....

అచ్చిబుచ్చికలాడి
ఆటలెన్నొనేర్పు
మాటలాడనేర్పు
మంచి మనసుతోటి

నిదుర రానినాడు
నిదుర లేనినాడు
నిమిరి నిదురబుచ్చు
తీయని పాటపాడి,
జొజోయంటు
జోలపాటతోటి....

ఊయలూపునమ్మ
బాసచేయునమ్మ
ముద్దుమాటనేర్పు
ముద్దుపలుకు లొలికి.....

కోరిందికొనియిచ్చు
మారాముమాన్పించు
బుడిబుడినడకలతొ
నడకనేర్పు......

బడికి పంపునమ్మ
కడుపునింపునమ్మ
ఒడినజేర్చినిన్ను
నిద్రబుచ్చు.......

తప్పుఒప్పుజెప్పి
మంచి చెడులుజెప్పి
బడిన నేర్వని విద్య
ఒడిన నేర్పు.....

నీ మనసులోని బాధ!
చెమ్మగిల్లిన
అమ్మ కంటి నలుసు......!

నీ మనసులోని సంతోషం!
చెమ్మగిల్లిన
అమ్మకంటిలోన
ఆనందబాష్పం......!

అనురాగదేవత.........అమ్మ
మమతలకోవెల........అమ్మ
ప్రేమకు ప్రతిరూపం....అమ్మ
జీవనదాత...............అమ్మ
ప్రాణప్రదాత............. అమ్మ
దేవదూత.................అమ్మ
అందుకే.....
అమరం అమరం
అమ్మజీవనం...
అమ్మకడుపునపుట్టిన
నీజన్మపావనం.....!
(అమ్మలందరికీ మాతృదినోత్సవశుభాకాంక్షలు)

******అవేరా****






     

08/05/2016
08/05/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:250
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : మాతృదినోత్సవం
శీర్శిక: అమ్మావందనం
(పాట సందర్భము:ఒక నిరుపేద వాడి ఆవేదన చనిపోయిన అమ్మకోసం)
పల్లవి:వందనమమ్మా! అమ్మా వందనమమ్మా!
    చ1:అందలమెక్కిన దేవతవమ్మా
           ఆణిముత్యమై వెలగినవమ్మా....వందనమమ్మా
    చ2:పురిటినొప్పుల వేదన మరచి
           ఆకలిదప్పుల తిప్పలు మరచి
           అక్కునజేర్చి కష్టాలకోర్చి
           అలసినావమ్మా
            అలసి సొలసినావమ్మా(2)......వందనమమ్మా(2)
     చ3:కంటికిరెప్పగ చూసినావమ్మా
            కళ్ళల్లో నీవే వున్నావమ్మా......వందనమమ్మా
     చ4:కళ్ళు తెరచినా నీవేనమ్మా
            కళ్ళు మూసినా నీవేనమ్మా
             కలలోకూడా నీవేనమ్మా.
              ఇలలో వెలసిన దేవతమమ్మా......వందనమమ్మా
     చ5:ఏనాడైనా..... నీవేనాడైనా...
           కడుపు నిండా తిన్నావా
           నీ కాలే కడుపును దాచి
           మా కడుపులు నింపావమ్మా.....వందనమమ్మా
     చ6: గుడిసెబతుకులో
             కూడెకరువైపాయె
             నేడు పెడదామంటే
             నీవే లేక పాయె........వందనమమ్మా(2)
       చ7:గుడిసె నించి గుండె గుడిలో కొచ్చినవమ్మా
              గుండెలోనైనా పదిలంగుండు
              నా గుండె నీకు నెలవైవుండు....             నాగుండెనీకునెలవైవుండు....వందనమమ్మా!                                                      
****అవేరా***






     

05/05/2016
సహస్రవాణి శ్రోతలకు నమస్సులు!
అమ్మ పిల్లలకు నడక నేర్పుతుంది
నాన్న నడక నేర్పుతాడు
కవి సమసమాజం కోసం మనుషులకు
భవిష్యత్ మార్గదర్శి అవ్వాలి...ఆనేపథ్యంలో రాసిన ఓ కవిత
స్వీయ గళంలో మీ ముందుకు
09/05/2016 .
సహస్రకవి 101
 కవిత సంఖ్య:251
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ఒకడు

కడుపు కాలి యొకడు కాలిపోతున్నాడు
జేబు చిరిగియొకడు గగ్గోలుపెడుతుండు
గుగ్గిలమ్మై యొకడు రెచ్చిపోతున్నాడు
అన్నాయమై యొకడు చచ్ఛిపోతున్నాడు
భూమినమ్మినవాడు పీనుగౌతున్నాడు
మోసాల రాయడు మీసాలు మెలివేసి
ఏనుగెక్కి నొక్కడిని తొక్కుతున్నాడు
న్యాయాన్ని నమ్మొకడు నాశనమ్మయ్యాడు....

చేతతుపాకీ దాల్చి
తోలుతిత్తుల జీల్చి
జన జీవులను గాల్చి
జనారణ్యాన మృగాలు
మతంమత్తు అర్నవాన
లోతుతెలియని అగాధాలు
అజరామర ఆక్టోపస్ లు......

వినాశనమెంచి
జననాశనమెంచి
స్ఫోటవిస్ఫోటాలు రచించిన
ద్వేష విస్ఫోటనమది
మానవహక్కులు హరించి
ద్వేషవిద్వేశాలు పూనిన
ముష్కరమృగాల వికటనాట్యమది....

మంచినెంచరు జనులు
మాకేల ననుచును...
చననేల పిరికివై
చెడుగుడాడుము చెడును
నాకేల నీకేల మనకేల
యనిన...
మత్తు నిదురను వీడవు
కచ్ఛితమ్ముగ పోగాలమొచ్చెనిపుడు .

****అవేరా***






     

09/05/2016


09/05/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:252
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: స్వశక్తి
లాభమేమిలాభమేమి
ఆశలున్న లాభమేమి
అవినీతిబంధప్రీతి
కుటిలకులరాజనీతి
విభజించిపాలిస్తూ
పాలిచ్చే తల్లిరొమ్ము
రక్తాలేకళ్ళజూస్తె
తిరగబడువిరగబడు
జయనాదంవినిపించు....

పక్షపాతపాలనలో
విపక్షాలగోలలో
వివక్షల ఏలికతో
ఎంతకాలమెంతకాలం...??
ఏలుబడులుఎంతకాలం...??
వ్యక్తి పూజలన్నిమాని
శక్తిపూజు చేసుకో!
చలోక్తుల
ప్రయోక్తలపై
విరక్తితోటిప్రగతిరాదు
రక్తితోటిప్రగతిరాదు
పోరాటం
ఆరాటం
రగిలించు
రక్తాన్నిమరిగించు
కష్టాన్నినమ్ముకో..
స్వశక్తినేనమ్ముకో...!
****అవేరా***
12/05/2016

12/05/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:253
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీరు
అంశం : తెలంగాణ అవతరణ
శీర్శిక: ప్రొ. కోదండరాం

ఉద్ధండుడు
కోదండుడు
ఏదండము లేక
విద్యా విజ్ఞానములే
కోదండముగా దాల్చి
తెలంగాణా అజ్ఞాన తిమిరాలు చీల్చి
కోట్ల ప్రజల
ఆరాటాన్ని
పోరాటంగా మార్చి
ఉస్మానియా ప్రాంగణాన్ని
చైతన్యపు కాగడాగాగా మార్చి
విజ్ఞానవంతుల వేదిక సారథియై
తెలంగాణ జాక్ జాకీయై
తెలంగాణా రాష్ట్రసాధనలో
విజయ బావుటానెగరేసిన
తెలంగాణ ముద్దు బిడ్డ
కోదండ రాముడు...
తెలంగాణ ప్రజల ఆరాధ్య రాముడు..!!
*****అవేరా***






     

ప్రయుతకవితాయజ్ఞం

ప్రయుతకవితాయజ్ఞం
19/05/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:254
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: అభ్యుదయం
****************
నీస్వార్థం...
నాస్వార్థం....
అందరి స్వార్థం...
అభ్యుదయానికి గొడ్డలిపెట్టు...
అందుకే కలం పట్టు!

సమాజ కుళ్ళు కడిగేస్తానని
వళ్ళు దులపరించుకుని బయల్దేరావా?
ఆ కుళ్ళు నిన్నొదిలిందా లేదా చూసుకో?
ఆ కుళ్ళుతో నువ్వు కలంపడితే
నీ కలంలోని సిరా కంపుచూరి
జుగుప్సతో ముక్కు మూసుకుంటుంది
రాసిన ప్రతి అక్షరం కన్నీరు పెడుతుంది
"స్వచ్ఛభారత్ "ఇచ్ఛకు
పుచ్చు పడుతుంది...

సమతాభావం..
సౌభాతృత్వం నొదలి ...
కులమనీ...
మతమనీ...
ప్రాంతమనీ....
లింగమనీ...
అల్పసంఖ్యాకులనీ...
అధిక సంఖ్యాకులనీ..
విభజిస్తూ...
సమాజాన్ని వ్యాకుల పరిచే...
ఏ కులాన్నీ ఉపేక్షించకు..(కులమంటే వ్యక్తులు,రాజకీయాలు)

చరిత్రను మరిచారు జనం...
విద్రోహులకదే బలం....
విభజించి పాలించిన
తెల్లవాడి వ్యూహాలే చిగురు తొడుగుతున్నాయా?
నల్లవాడు రగిలించే నిప్పుకు
స్వార్థచింతనలే ఆజ్యమౌతున్నాయా?
బానిస బ్రతుకును మరచి
"సాని"క బ్రతుకును కొలిచే
మానసిక వ్యభిచారులను
తలకెత్తుకుని....అభ్యుదయమా నీవెక్కడ?
అని వెతుక్కుంటే...
ఆమడదూరంలోవుంటుంది!

జాతీయ దృక్పథాన్ని వదలి
విభజించి పాలించే
స్వార్థ వ్యక్తులతో వ్యవస్థలతో
అభ్యుదయం రాదు!
అరాచకత్వం
అభినవ కిరాతకత్వం
నిద్రలేచి...
మరో బానిసబ్రతుకుకు
తెరలేస్తుంది.....
అప్పుడు....
నిన్ను...నీ కుటుంబాలను
రేపటితరాలను...
ఉద్ధరించటానికి
ఏ గాంధీ రాడు!
రేపటి తరతరాల
బానిసబ్రతుకులకు
పునాదివౌతావా??
అగాధాల లోతులలో
కూరుకు పోతావా?

నీ ఇల్లు ఆనందపు కోవెలయినందుకు
పొరుగువాడి ఆనందానికి తోడ్పడే వేల్పువవ్వు!
స్వార్థచింతనలు
సమాధికాకుండా
అభ్యుదయం రాదు!
దేశంముందుకు పోదు!
మందు మత్తు వదలి
నిద్ర మత్తు వదలి
స్వార్థ తుప్పునొదలి
సమాజాన్ని నీ కవనపుజల్లుతో తడుపు
సమతను పండించు
అహంలేక ఇహంలో జీవించు
అభ్యుదయానికి పూలబాట పరుచు...!

****అవేరా****






     

ప్రయుతకవితాయజ్ఞం
ప్రయుతకవితాయజ్ఞం

22/05/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:255
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : పర్యావరణం&సామాజికం
శీర్శిక: నీ కోసం నీవేనా??
****************
నేను.....
భానుడను!
అగ్నిగోళంలా మండుతున్నా !
నా కొసంకాదు మీకోసమే..!
విరామంలేకుండా
దహించుకుంటున్నా!
దహనమవుతున్నా!
ఎవరికోసం ? మీ కోసమే!
పగలు వెలుగు నింపుతాను
మొక్కలకు
కిరణజన్యమై ఆహారంపంచుతాను
తామరలను ప్రేమగా నిమురుతాను
నాకిరణాలతో వికసించేలా...!
రాత్రుళ్ళు చందమామపై
నాకాంతికిరణచకోరాలు వాలి
చల్లని వెన్నెలతో మీ
ఉల్లము దోచుకుంటాను!
నీరు ఆవిరైనా
మేఘాలుఉరిమినా
ఋతువులు దొరలినా...
సౌరవిద్యుత్తు జనించినా
నేనే కారణం....
నా స్వార్థం కించిత్తు లేదు!
నేను...నేనున్నది నాకోసంకాదు
మీ కోసం...మీ...కోసమే!

నేనొక ....
పరవశ రాసిని!
పరుగుల రాణిని!
వరద పరవళ్ళ వేణిని!
ఎత్తువంపులలో
కొండకోనలలో
రాళ్ళదెబ్బలు తింటూ
పరవళ్ళుతొక్కుతూ
నాప్రాణమైన జలాన్ని
మీ ప్రాణంగా
అందరికీ
అమృతంగా
అందించే..నదీమతల్లిని...!
ఇంత శ్రమ నాకవసరమా!
ఎవరికోసం ఆరాటం?
నా కోసం కాదు
నా స్వార్థం కించిత్తు లేదు...
సాగరాన్ని చేరి
తీయని అమృతజలాన్ని
లవణంగా మార్చటానికా
కాదు..కాదు..నా కోసంకాదు
మీ కోసం...కేవలం మీ కోసం..!

నేనొక
ప్రాణ రాశిని
మానవ దాసిని
నా నీడన
పశువులు
మృగాలు
పక్షులు
మానవులు
కొన్ని లక్షల క్రిమి కీటకాలు
బ్రతుకుతున్నాయి!
ఎండకి గొడుగు పడతాను
చిరు వానకీ గొడుగునౌతాను
రక్షిస్తే రక్షిస్తాను
అంతం చేస్తే ....
కన్నీరు పెడతాను!
నా కోసం కాదు..మీ కోసం!
మానవాళి ఆత్మాహుతి
కృత్యమని నవ్వుకుంటాను!
మీరు వదిలే విషవాయువులను
శుద్ది చేస్తాను...
ప్రాణవాయువునిచ్చి
ప్రాణాలు నిలుపుతాను!
మేఘాలను కరిగిస్తాను!
వర్షాలను కురిపిస్తాను.!
కలియుగ అమృతము!
తేనెల వాన కురిపిస్తాను!
తూనీగల ఆకలినీ,
తేనెటీగల ఆకలినీ,
తీరుస్తాను...ఓదారుస్తాను!
నేను...వృక్షాన్ని!
నేనున్నది...నా కోసం కాదు
మీ కోసం...
నా పుష్పాలను
నా ఫలాలను
నా విత్తన సంతానాన్నీ
మీ కోసం త్యాగం చేస్తున్నా!
నేనున్నది నా కోసం కాదు
మీ కోసం...!
నే జీవిస్తున్నది నా కోసం కాదు మీ కోసం!
కేవలం మీ కోసం!

నేనొక ....
జీవన రాగాన్ని!
పవన పరాగాన్ని!
కోమల మధుర పుష్పాన్ని!
సుమధుర పరిమళ పవన ప్రాణాన్ని!
వికసించగానే
పరిమళాలు
విరజిమ్ముతాను!
సుగంధపవన
వింజామరనౌతాను!
మీ మనసులను
రంజింపచేస్తాను!
ప్రణయరాగ రంజితం చేస్తాను!
దుర్వాసన
దర్గంధాలను
పారద్రోలి...
స్వచ్ఛవాయువుల
నిచ్చగా ఇస్తాను!
నా జీవితం క్షనికమైనా
వికసిస్తున్నా...!
మరణిస్తున్నా!
నా జీవితం నా కోసం కాదు !
నా వికాసానికై వేచివుండే
తుమ్మెదలకోసం...
నా పరిమళాస్వాదనకై వేచివుండే
తుంటరి
తూనీగలకోసం!
మాధవుని
పూజకోసం...
మానవుని
సేవకోసం...
మా జన్మ మీకే అంకితం!
మేము మా కోసం కాదు
మీ కోసమే...కేవలం మీ కోసమే!

నీవు .....
మనిషివి!
కాలేవా...మనీషివి??
జీవులలో ....
ఉత్తమ జన్మనొందావు!
నూరేళ్ళాయుష్షు నీది!
నీవు నీ కోసమే ఎందుకు జీవిస్తున్నావు?
ప్రకృతిలో ఏ ప్రాణికి లేని
స్వార్థం నీకెందుకు?
నిన్ను నీవు తెలుసుకో!
పరుల మేలు తలచుకో!
మనీషిలా మసలుకో..!!

****అవేరా***






     

ప్రయుత కవితా యజ్ఞం
ప్రయుత కవితా యజ్ఞం
29/05/2016
సహస్రకవి 101
సమిధ సంఖ్య:256 .
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : పర్యావరణం
శీర్శిక: చెట్టు-గుట్టు.

చెట్టులోనె వుంది
గుట్టు వెతుకు!
పెరటిలోన వేప
అరటిలోని తీపి
తోటలోని రావి
ప్రాణవాయు తరులు
నరుకుతున్న నరుడా.!

పెంచి బోన్సాయి
పెరటి వేప నరుకు!
సక్కులెంటు పెంచి
సరుగు నరుకు!
శాఖమెక్కి నరుకు
తెలివి తేటలేల?
తెలియ లేవేల నేలకూల?

మట్టి వాసనేల
గిట్ట బోదు నీకు!
మట్టి లేని చోట భుక్తి లేదు!
పెరటిలోన కాంక్రీటు
కాలి శుభ్రత కాదు
పెరటిలోన మట్టి
గోవు పొదుగేనురా!
చూరు రాలు నీరు
పెరడు చేరు నీరు
భూమి పొరల చేరి
నీకు దక్కు!
పాదు చేసి పెంచు !
నీరు పోసి పంచు!
పచ్చ చెట్టు పెంచు!
నీడ పొందు!

చెట్టునీడనపెరిగి
చెట్టునరకనేల?
కాలు కట్టెకు
కాద కట్టె కొరత!
పెరటిలోన చెట్టు నీడ
తల్లి ఒడి తెలియురా!
చల్లగాలి పాలతో,
స్థన్యమిచ్చు అమ్మరా!
చెట్టునీడ ఒడిలోన
సేదదీరు తనువురా!
బొట్టు నీటి తోడ
సేద దీర్చుకొనునురా..!

ఆకు చిమ్మ వస్తుందని(ఆకు రాలే కాలంలో)
అమ్మనే నరుకుతవా?
అమ్మలేక బ్రతుకుతవా?
కుళ్ళికుళ్ళికుములుతవా?
గాలినిచ్చు
నీడనిచ్చు
ఫలపుష్పాలనిచ్చు!
మేఘానికి ఆయువిచ్చు!
పచ్చదనం కరువైతే
వెచ్చదనంపెరుగుతుంది
పుడమితల్లి వణుకుతుంది
దళారుల స్వార్థపు కత్తికి
క్షవరమౌతున్న వనసంపద!
స్వార్థపరుల కబేళాకు
చేరుతున్న పచ్చకురులు!
అసలు సిసలు సిరులు!
అంబరాన్ని అంటుతున్న
కాలుష్యపు ఆవిరులు!
శిరోముండనమున
మోడులైన పచ్చతరులు!

మేలుకోర సోదరా...!
యేలుకోర బ్రతుకును!
పచ్చదనంలేకుంటే
మచ్చదనం బ్రతుకంతా!
అన్నపూర్ణ అమ్మయని
చెట్టుతల్లి దేవతని
తెలుసుకో!
మసలుకో!
సృష్టి తీరు తెలుసుకో...!!

****అవేరా***






     

ప్రయుతకవితాయజ్ఞం
ప్రయుతకవితాయజ్ఞం   .

02/06/2016
సహస్రకవి 101
సంఖ్య:257
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : వ్యవసాయము
శీర్శిక: రైతు

చెరువు నీరు కరువు,
రైతు గుండె చెరువు,
తెచ్చుకున్న అరువు,
రోజూ నెత్తిన బరువు,
పంటలేక కరువు,
ఏదీ బ్రతుకు తెరువు?
కౌలు రైతు కూలీయైనా
కూలేదొరకక ఖాళీ కడుపు
నిత్యం కాలే కడుపు..!

భూమి
నీరు
విత్తు
తప్ప...
ఆలోచనే లేని అమాయక జీవి!
సస్యరక్షణలో
స్వరక్షణ మరచి...
పంటే ప్రాణంగా
ప్రాణమే పణంగా....
పెట్టి బంగారం పండించి...
ఎండిన డొక్కల్లో...
బొక్కపడిన బొక్కసాన్ని...!
చినుకు కారే
గుడిసెలో...పేదరికాన్ని...!
వద్దన్నా వదలననే
దరిద్రాన్ని...
మౌనంగా చూస్తూ...!
వేదనతో రోదిస్తూ...
ఆశలతో భరిస్తూ...
శ్రమనే నమ్మి జీవిస్తూ..నేటిరైతు...!

పరిశ్రమలలోనే కాదు..
పరశ్రమదోపిడీ.....!
సాయంగా సాగలేని
వ్యవసాయం.....
మారె నేడు..
అదే!.."వ్యయ"సాయం!
దళరీల దోపిడంతా
నలుపు రంగు పులుముకొని
సరిహద్దులు దాటుతున్నా.....
కరిమబ్బులు ముసురుతున్నా....
కబళించే కరువు తీరు...
తెలియలేని ప్రభుత తీరు...
మారదేమి మనిషి తీరు...??
పురుగుమందు కాటుతోటి,
ఉరికొయ్యలకేళ్ళాడే
కాలుతున్న కట్టెలెన్ని?
చితి మంటల పొగచూరి..
మానవత...మంటగలిసె...!
అన్నదాత నాదుకొనే
నాథుడెక్కడెక్కడెక్కడా...??

****అవేరా***






     

05/05/2016
05/05/2016

05/06/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:258
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్ బర్గ్,యూఎస్ఏ.
అంశం : పర్యావరణ దినోత్సవం!(world environment day)
శీర్శిక: జీవన రణం!..పర్యావరణం!

ప్రకృతిని నేను!
పంచభూతాత్మ
ప్రణయ రాగాన్ని నేను!
ప్రణవ నాదాన్ని నేను!

నా హృదయరాగం!
ప్రసవ వేదననాలాపిస్తున్నదేమి?

గాలి!
సుమధుర సుగంధ
మలయ సమీరంలా సాగదేమి?
విలయ హోరున జోరున
ప్రళయ మారుతమ్మైనదేమి?

నీరు!
సుజల సుందర
పదగమనమేది?
వీనులవిందగు రవళుల
చెవిజేర్చు ప్రవాహమేది?
బహువర్ణ చినుకుల కినుకేల?
వర్షపు చినుకుల,
హర్షపు పలకరింతలేవి?
పన్నీరు కురిసే,
మేఘాల రక్త కన్నీరేల?

నిప్పు!
హోమ గుండమై వెలిగేనిప్పు!
అగ్ని గుండమై కాల్చేస్తుందే...?
జన జీవనాన్ని వెలిగించే నిప్పు!
కార్చిచ్చై కాల్చేస్తుందే...?
మలినాన్ని కాల్చే నిప్పు!
జీవన చిత్రాన్నే కబళిస్తుందే?

భూమి!
ఓరిమేకూరిమైన పుడమి తల్లి!
బ్రతికేజీవాల మలమలినాన్నే
తలపై దాల్చి మరో జీవానికి
ఆహారంగా అందిస్తుందే!
పాపులను పాపాలను
తనపైమోస్తూ!
తలపై భరిస్తూ!
తరతరాలుగా
యుగయుగాలుగా
భారం భరిస్తూ!
ఓర్పే నేర్పైన యా తల్లి!
తల్లడిల్లుతున్నదేమి?
తల్లిపైన ఇంత దాష్టికమ్మేల?
తలపై వెలిగే చితిమంటల బాధలతో...
తన తలకే చితి వెలిగించే పాపులతో...
కాలుష్య విషాన్ని విరజిమ్మే సర్పాలతో....
సాధువుగా వుండలేక.....
క్రోధాన్నే కురిపిస్తూ!
స్పందిస్తూ!
బాధను సంధిస్తూ!
గుండెను కంపిస్తూ!
ప్రాణులను వేధిస్తూ!
..................బాధిస్తూ!
సౌమ్య స్వభావం,...
విలయ నిలయంగా మారెనేమి?

ఆకాశం!
నిర్మల
నిశ్చలాకాశం!
వర్ణసంకరమైనదేమి?
చీకటి విరి చుక్కలు
రంగుమారుచున్నవేమి?
మేఘాల గొంతు నొక్కెనేమొ?
నల్లని మేఘసందేశాల జాడలేవి?
తెల్లని మేఘాల వెక్కిరింతలేల?
మేను ఝల్లనిపించే జల్లులేవి?
జనుల ఘొల్లనిపించే జల్లులేల?
వాయుగుండాల వాతలేల?
తూఫానుల తాకిడేల?
మెరుపుల వెరపులేల?
పిడుగుల విధ్యుధ్ఘాతమేల?
నిర్మలాకాశాన ప్రళయ ఘర్జనలేల?

యజుర్వేద సాక్షిగా
పంచభూతాల
పంచి నేను....
పరిపరి వేదనలో...
భారమైన రోదనలో...
ఎన్నాళ్ళు.....
మరెన్నేళ్ళు భరించాలి నిన్ను??
నీ పతనానికి పథకరచనలేల?

నేను...!
అవసరాలనే తీరుస్తాను!
అత్యాశలను కాదు...!


గాలే స్థంభిస్తే..!
నీరే క్షీణిస్తే...!
నిప్పే నివురైతే..!
ఆకాశం కూల్చేస్తే...!
భూమాతను చీల్చేస్తే...!!
నీవెక్కడ....???
నీ మనుగడెక్కడ.....????

నేనే వేదం..!
నేనే జీవం...!
నేనే ప్రణవం...!
నేనే ప్రణయం...!
నేనే ప్రళయం....!

నీ జీవన రణ భేరి మ్రోగింది!
పర్యావరణ ప్రణయ రాగంతో...,
విజయగీతం రచించు.....!
ఆలాపించు....!
తరించు..!!!

*********అవేరా*****





     

07/06/2016


07/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:259
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
అంశం : ప్రేమ
శీర్శిక:భగ్నప్రేమికుడు..

హృదియర్ణవలోతులలో
కదిలే ఇసుముల జ్ఞాపకాలలో
దాగిన మధుర స్మృతులు
ఆటుపోటు
అలలకు కదులుతూ
అనుక్షణం హృదివీణ
తంతృలను స్పర్షిస్తూ
ఆర్తిని....స్ఫూర్తిని
ఆనందభైరవిగా పలికిస్తుంటే...!
నీరూపాన్ని నిత్యం దర్శిస్తూ
నిత్యం అలజడిగా
చెలరేగే సమస్యల అలలను
ఎదిరిస్తూ బ్రతుకు నావన
పయనిస్తూ.....
తీరం చేరే క్షణంకోసం...
నిరీక్షించే..నిత్యనావికుడను..!
భగ్నప్రేమికుడను...!!

*****అవేరా***





07/06/2016


07/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:260
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: రూపాయి

రూపాయీ రూపాయీ!
నీ గొప్పేంటీ...!అంటే!

నేను లేకుంటే నీవెక్కడ??
నేను లేకుంటే జగత్తెక్కడ?

పాపాయికి చాక్లెట్ కావాలన్నా
డైపర్ కొనాలన్నా నేనే కావాలి!

నీకు నీడ కావాలన్నా
గూడు కావాలన్నా నేనే కావాలి!

కూడు దక్కాలన్నా
జోడు కుదరాలన్నా నేనే కావాలి!

చుక్కలాంటి పెళ్ళాం దక్కాలన్నా
చక్కనైన సుఖం దక్కాలన్నా...నేనే కావాలి!

సతి కోర్కెలు తీరాలన్నా
పతి ఆశలు నెరవేరాలన్నా నేనే కావాలి!

షాపింగ్ కు వెళ్ళాలన్నా
బోటింగ్ చేయాలన్నా నేనే కావాలి!

సినిమాకి వెళ్ళాలన్నా
షికారు చేయాలన్నా నేనేకావాలి!

నోటి జిహ్వ తీరాలన్నా!
వోటు బ్యాంకు పొందాలన్నా నేనే కావాలి!

దండ కొనాలన్నా
దండు కావాలన్నా నేనే కావాలి!

ఎలక్షన్ గెలవాలన్నా
సెలెక్షన్ కావాలన్నా నేనే కావాలి!

సంతతిని పొందాలన్నా
సంతానం చదవాలన్నా నేనే కావాలి!

పొలం దున్నాలన్నా
హలం కదలాలన్నా నేనే కావాలి!

విత్తు విత్తాలన్నా
పంట పండాలన్నా నేనే కావాలి!

వ్యాపారం చేయాలన్నా
వ్యవహారం నడపాలన్నా నేనే కావాలి!

పొత్తు పొందాలన్నా
పొద్దుగడవాలన్నా నేనే కావాలి!

పన్ను పోటుకైనా
పన్ను కట్టుట కైనా నేనే కావాలి!

రోగానికైనా
భోగానికైనా నేనే కావాలి!

పూజకైనా
రోజాకైనా నేనే కావాలి!

పెళ్ళికైనా
చావుకైనా నేనే కావాలి!

ప్రగతికైనా
ప్రభుత్వానికైనా నేనే కావాలి!

ఇంతెందుకు
నా పుట్టుక కోసం కూడా నేనే కావాలి!

"ధనమూలం ఇదం జగత్"అని!
ఊరికే అంటారా......!!!

****అవేరా***






     

07/06/2016

07/06/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:261
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
అంశం : సామాజికం
శీర్శిక: విశ్వాసం

అమృతభాండంలో
తొణికిన అమృత బిందువు
అవనిన వెలసిన సింధువు,
వేదమనే స్వేదంలో....
ఒలికిన జ్ఞానం హిందుత్వం!..
సమతకు
మమతకు
మానవతకు
సాంత్వనకు
జ్ఞానానికి
విజ్ఞానానికి
సాధనకూ
బోధనకూ
వేదసారమే
అమృతపానం..!

విశ్వాసాలకు
విఘాతాలు కల్పించనేల
ప్రశాంత సాగరాన
ప్రళయం సృష్టించనేల??

హేతువనిన
నిజమంటే?
పుట్టుక నేల రచింపలేవు?
చావునేల నిర్ధారించలేవు?

సకల చరాచర
సృష్టి రహస్యాల నేల ఛేదించలేవు?
ప్రాణ రహస్యమేమి?
విశ్వ రహస్యమేమి?

చరాచర
సృష్టి స్థితి లయల గురించి
సాగరాన నీటిబిందువు కాదు నీ జ్ఞానం!

బుడిబుడి జ్ఞానంతో
వాదనలేల?
రోదనలేల?
శుష్కబోధనలేల?

సంపూర్ణ జ్ఞానము
పొందినపుడు
బోధించు!
సాధించు!
అర్థజ్ఞానమెప్పడూ
అజ్ఞానమే...!!
అజ్ఞానివెంట నడవటం అవివేకమే...!

*****అవేరా****








08/06/2016
08/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:262
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: కలలు నిజాలు

ఊహల వుయ్యాలలూగుతూ,
కలల ప్రపంచంలో కదలాడుతూ,
కలలే నిజమౌతాయని కలలు కంటూ నిదురబోతే,
కలల సాధన కలగానే మిగులుతుంది
నిజాలన్నీ పీడకలలే అవుతాయి!

కనండి కమనీయమైన కలలు
వినండి కఠోరమైనా, నిజాల్ని
కఠోరశ్రమ,
అవిశ్రాంత పోరు,
అకుంఠిత దీక్ష ,
నీకు తోడైతే,
కలలన్నీ నిజాలుగా
నీ పాదాక్రాంతమవుతాయి!

లేకుంటే..!
కలలే కల్లలుగా
నిజాలు ముల్లులుగా
నీ నిరర్థక జీవిత
చరమాంకం వరకూ
నిన్ను వెంటాడి
వేటాడుతూనే వుంటాయి!

****అవేరా***






     

08/06/2016


08/06/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:263
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
అంశం : పర్యావరణం
శీర్శిక: వానచినుకు

మంచు మబ్బులో దాగిన
మంచి ముత్యమా
శీతలపవనాన్ని తాకి
తుళ్ళింతతో...
నింగి నుండి నేల రాలేవా?

ఆకాశం పంపిన దేవదూతలా
ఆనందంలో తడిపే వానచినుకులా
మంచిముత్యంలా మెరిసిపోతూ
నీలాకాశంలో
అందాల హరివిల్లు ముగ్గులేస్తూ
నేలపైకి చిటపట రాగంతో
చిందు నాట్యం చేస్తూ...
చెట్టుపుట్టలకు తలంటుపోస్తూ
పరవశాన తరులు
తలలూపేలా శీతల పవనాలను
వెంటనిడుకొని వస్తావు!

చక్కని చిక్కని పచ్చని
ముగ్గుచుక్కల రంగవల్లులలో
పురివిప్పినాట్యమాడే మయూరాలు
ప్రియురాలి వలపుదోపిడికి
ప్రణయ వలలు విసిరేలా
పురిగొల్పుతావు!

నీ పలకరింపుకు
మృత్తిక సుగంధ
పవన వీచికలకు
ప్రకృతి పులకరిస్తుంది
నీ చినుకుల చిరుగంతులు
మా మనసుల తుళ్ళింత!
ఆనందం మా హృదయ
అర్నవ లోతులు చేరే లోపే
మళ్ళీ వస్తానంటూ
వయ్యారంగా వెళ్ళిపోతావు!

****అవేరా***






     

08/06/2016
08/06/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:264
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.
శీర్శిక: అగ్గిపుల్ల.

నాడు...
నేనొక వింతను..!
నిప్పు వెలిగించే
కట్టెపుల్లను...!
అడవిలో పుట్టిన
చెట్టు కొమ్మలోని
చిట్టి ముక్కను నేను
అమ్మోనియం ఫాస్ఫేటులోఈదులాడి
మైనంలో స్నాన మాడతాను
జంతు క్రొవ్వు తలకు రాసుకుని
గాజుపొడిని శిరస్త్రాణంగా
సింగారించుకుంటాను
భాస్వరం,
గంధకం,
పొటాసియమ్ క్లోరేట్,
మిశ్రమాలతో మేకప్
ఎరుపు నలుపు రంగులతో టచప్
చేసుకుని
కురులార బెట్టుకుని
తలలో అగ్గిని దాచి
చిన్న పెట్టెలో దూరి
ఇంటింటికి చేరుతాను
జల్సా రాయుళ్ళసిగరెట్ దమ్ముకైనా,
పగవాడి గడ్డి వాము దహనానికైనా,
పగవాడి గుడిసె మసి చేయటానికైనా,
చీకటిపారద్రోలే కాగడాను వెలిగించడానికైనా,
వంటింటిలో వంటకైనా,
పూజగదిలో దీపానికైనా,
స్మశానంలో శవ దహనానికైనా,
నేనే నీకు నేస్తాన్ని...!
ఇంటిలోన ఆరిన దీపం
ఊరుబయట వెలిగిస్తా
స్మశానంలో రగిలిస్తా..!
చితిమంటగా కపాల మోక్షం కలిగిస్తా!
189 ఏండ్ల ముదిమిన
కూడా నిత్య యవ్వనంతో వున్నాను!
ముట్టుకుంటే భగ్గుమంటాను
ఇన్ని నాళ్ళూ నీ ఇంటి దీపాన్ని
వంటింటిలో పొయ్యినీ
వెలిగించి వెలిగించి అలసి పోయాను
గ్యాస్ లైటర్లు
విద్యుత్ బల్బులు
విద్యుత్ పొయ్యిల పుణ్యమాని
కొంత విశ్రాంతి దొరికింది...!!
****అవేరా***






     

08/06/2016
08/06/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:265
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హారిస్బర్గ్,యూఎస్ఏ.

శీర్శిక: కుక్కపిల్ల.

నేను ....మీనేస్తాన్ని !
కుక్కపిల్లను...!
నేను పుట్టాకే
విశ్వాసం పుట్టిందట!
వీధి చెట్టుక్రింద పుట్టినా
మేడలోని కుక్కపిల్లలా
ముద్దులొలుకుతుంటాను
ఆకలేస్తే అమ్మపాలే దిక్కు!
ఆకలేసి గుక్కెడు పాలు త్రాగుదామంటే
డోక్కెండిన అమ్మ స్తన్యంలో
మా నలుగురికి మిగిలేది అర్దాకలే!
పుట్టినప్పుడు బుద్దిగా ముద్దుగా వున్న మేము
అర్ధాకలితో డొక్కలెండిపోయి
కళావిహీనంగా మారాము
మాతో పాటుగా ఎదురింటి మేడలో
పుట్టిన పప్పీలు(వారు పిలుచుకుంటే విన్నాలే)
రోజూ బొజ్జనిండా అమ్మపాలు త్రాగి
పెడిగ్రీ,తింటూ డొక్కబలిసి బొద్దుగా
సువాసనల శాంపూ స్నానాలతో
మత్తెక్కించే పరిమళాలతో
ముద్దొచ్చే బొచ్చుతో
మరబొమ్మల్లా మా ముందే
చంటిపిల్లల్లా స్ట్రాలర్ లో
తిరుగుతుంటే
అందమైన బెడ్డు మీద
దొరసానిని అంటిపెట్టి పడుకుంటుంటే
కొంచెం అసూయ
కొంచెం బాధ వేసింది!
ఆ ఇంటి వాళ్ళు మమ్మల్ని
కుక్కల్లా అసహ్యంగా
నీచంగా చూసే చూపులకు
ఛీ...ఛీ.....అనే ఈసడింపులకు
బాధేసింది..!
మనుషుల్లో లా
పేద ధనిక వర్గ బేధాన్ని
జంతువుల్లోనూ వదల్లేదా విధాత.!
పుడితే అలాంటి ఇంట్లో పుట్టాలి
నా బతుకు చెడ
నీకడుపున పుట్టించావేంటమ్మా..!
అనుకుంటూ నీరసంగా రోడ్డు దాటుతుంటే
అదేదో వాహనం కిర్...ర్...మంటూ వచ్చి నన్ను తాకింది,
జివ్వున చిమ్మింది రక్తం...!
ఆతరువాతేమైందో నాకు తెలియదు...!

****అవేరా***






     

No comments:

Post a Comment