Saturday, June 11, 2016

అవేరా కవితలు 201 నుండి 225 వరకు


అవేరా కవితలు 201 నుండి 225 వరకు

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
14/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:201
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ప్రేయసి(సోలో సాంగ్)

ఊహల్లో తేలిపోయానే
నీ ఊహల్లో సోలిపోయానే

నా కనులలో నీ రూపమే
చెరిగిపోనీ శిల్పమే

మౌనంగా నా మనసున నీవే
దీనంగా చూస్తున్నా నిన్నే

అల్లరి కలలలోనా
నాతో ఆడినావే

నీ కనుల వెలుగు కాదా
నా బ్రతుకు కాగడా

తలచాను మదిలో
కొలిచాను ఎదలో

పదపదపదమని
పరుగు తీస్తుంది కాలం

నాలో ఊపిరి నీవే
నీవే దూరమైతే
నా ఊపిరిఆగి పోదా


****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:202
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం

*శీర్శిక: మర మనసు *

మనిషిగా పుట్టావూ
మరమనిషివైపోయావూ

తీయని మనసులన్ని
కనరు దేలుచున్నాయి

స్పందన లేని
మర మనసులౌతున్నాయి

తీయదనం వెనక
చేదు దాగి వుంటుంది

కష్టసుఖాలు
చీకటివెలుగులు

ప్రేమను నీడై
ద్వేషం వెంటాడుతుంటుంది

ప్రతి చెడువెనుక
ఒక మంచి దాగుంటుంది

జీవితం ఓ పుస్తకం
ఎంతచదివినా సశేషముంటుంది

ప్రేమా
గౌరవాలు
బిక్షావస్తువులు కావు
అనుభవాన పొందే
అద్భుత స్పందనలు

ప్రేమను ప్రేమతో సాధించు
గౌరవం ఇచ్చి
గౌరవం పుచ్చుకో
స్పందన ప్రతిస్పందనలవే...!!

****అవేరా***






   

మనసు
అయుత కవితా యజ్ఞం
22/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:203
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్శిక: కల

మనసు
మనసు
ఊసులాడె
కనులు కనులు
బాసలాడె
చేయిచేయి
కలిపి విహరించెదమా
ఈ వెన్నెలరేయి!
ఆకాశ వీధిలో
అందాల చందమామనెక్కి!
చుక్కల లోకంలో
చక్కని చుక్కతో
చేతిలోన చేయి వేసి
చెక్కిలిపై చెక్కిలాన్చి
వెన్నెల చల్లదనం నీవైతే,
వేకువ భానుడి వెచ్చదనం నేనౌతా
మేను తాకు
మబ్బుల గిలిగింతలు
చెలిమేను చక్కిలిగింతలు
కలయో నిజమో???
వైష్ణవ మాయయోో!!!
*****అవేరా*****


అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
22/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:204
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: హోళీ

చెడును తరిమి కొట్టు
పొలిమేర దాటించు
పొలికేక పెట్టించు ...!
హోలికను తగలెట్టు
కాముడిని తగలెట్టు!
బెంగాలున
డోల్ పూర్ణిమ గా
ఏక్ తార
డుబ్రి
వీణియల
శ్రుతి లయలకు
నాట్యాలనలరించినా
ఆనంద్ పూర్ సాహిబ్ లో
హోలా మొహల్లా లాడినా
హోలిక దహనం చేసినా
ఉత్తర్ ప్రదేశ్ లో లాత్ మార్ హోలీ లాడినా
సాంప్రదాయ హోలీ మిలన్లు చేసినా
బీహారులో
డోలక్ మోతలతో
నాట్యాల జోరుతో
పకోరస్
తండై
గంజాయి
మత్తులో
తూలినా
సోలినా
గుజరాత్ లో
చెడును
తరుమనెంచి
భోగిమంటలేసినా
మణిపూర్ లో
యోసంగ్ తో లీనమై
తాబల్ చోంగ్ బా
నృత్యంలో డోలు బజాయించినా
కోచి లో ఉక్కలి పేరుతో
రంగుల కేళీలాడినా
రాధాకృష్ణుల రంగేళీలాడినా
తెలంగాణ లో రంగుల
పండుగ జరిపినా
చెడును పారద్రోలుపండుగలో
చెరుపు చేయకు పర్యావరణం
రసాయనిక రంగులువద్దు
సాంప్రదాయ రంగులు ముద్దు
నిమ్మ కుంకుమ పసుపు
మోదుగ లనుపయోగించే
రంగులు ఆరోగ్య హేతువులు
ఆనంద ధాతువులు
లెడ్ఆక్సైడురసాయనరంగులువాడిన
మూత్రపిండాలుమూలనపడు
అల్యూమినియంబ్రోమైడ్
మెర్క్యురీసల్ఫైడ్ల రంగులు వాడిన
క్యాన్సర్ కబళించునిన్ను
ఇంకా ఇంకా
ఎన్నో ఎన్నోన్నోరసాయనాలు
కానున్నవి
ఆరోగ్యానికి
మహమ్మారీలు
చర్మవ్యాధులు
ఆస్తమాలు
కంటి ఎలర్జీలు
అంధత్వం....
హోలీఆనందానికి
అనుబంధపురుగ్మతలు...
హోలీ ఆటలలో
విష రసాయనాలు
గాలిలో
ధూళిలో
నీటిలో  చేరి
పర్యావరణాన్ని కలుషితం చేయనేల?
అందుకే....
సంప్రదాయరంగులే ముద్దు!!
రసాయనాలసలే వద్దు..!!
కామునిదహనం...
హోలికదహనం..
పేరున పచ్చని చెట్లను
నరకక
ఎండిన చెట్లు కొమ్మలతో
మంటలు వేద్దాం
చెడును పారదోలుదాం
పొలిమేరదాటిద్దాం
పొలికేకపెట్టిద్దాం...!!
సాంప్రదాయరంగుల్లో
సంబరాలు చేద్దాం...!!
****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
22/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:205
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూ ఎస్ ఏ నుండి
అంశం : ప్రకృతి
శీర్శిక: చినుకు ముత్యాలు

సంద్య వెలుగు కోసం
ఎదురుచూస్తున్నాయి
కోట్లాది కళ్ళు....

నల్ల మబ్బు దుప్పటి
కప్పుకుని చలికాగుతున్నాడు
భానుడు...!

చల్లని తెమ్మరేదో తాకి
నల్లమబ్బునేదో అలజడి ...??
మబ్బులోని నీరు
నీటి బొట్టుగ మారి
గాలి తెరగల నీది
పుడమి చేరిన బొట్టు
మంచి ముత్యమైంది.....

చినుకు వేగానికి
ఆకాశానికి చిల్లు పడి
వళ్ళు జల్లెడైనట్లు...
ముత్యాల జల్లు..
చినుకు ...చినుకు..
నేలకు జాలువారింది !!

పుడమి దూకు చినుకు
నేలనే గానక..
వ్రాలెనొయ్యరంగ
పువ్వులాకులపైన...
కొండలైనా నిండె
చిట్టడవితోన...
ఎమరాల్డ్ అందాలు
ప్రణమిల్లి నట్లు

తొలి చినుకు మలిచినుకు
చూరంట బిరబిరా జార
కాంక్రీటు లేని గృహసీమలిచట
పులకించె చల్లగా..!

మబ్బెంత కరిగినా
కనరాడె భానుడు
చీకటింట కురియ
చిగురు వాన....!!
(సియాటెల్ లో ప్రకృతిని పోల్చుచూ)
****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
26/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:206
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్, యూ. ఎస్. ఏ
అంశం : సామాజికం
శీర్శిక: పైశాచిక ప్రేమ

ప్రేమా!..సిగ్గుపడు ...
ప్రేమను జూచి..!
కాలనాగు కోరలై ఆమ్ల సీసాలు
లేకుసుమ కోమలముఖాల కాటు వేస్తున్నాయి
కనురెప్ప కలువలు .....
అగ్నికీలలలోన కాలిపోతున్నాయి..
కలకంటి కలలు
కన్నవారి కలలు
ప్రేమాగ్నిబలిపీఠమెక్కుతున్నాయి..
కన్న పేగులు బాధతో ...
మెలికలు తిరుగుతున్నాయి..
ప్రేమోన్మాదానికి
లేలేత జీవితాలాహుతౌతున్నాయి..
ఉన్మాదానికి...
మరో రూపైనావా..??
ప్రేమా!...సిగ్గుపడు...
ప్రేమను జూచి ..!

****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
26/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:207
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: ప్రేమ

ప్రేమంటే తనువుల రాపిడి కాదు
అగ్ని పుట్టడానికి
రెండు మనసులైక్యమవడం...

మల్లియమనసు భయోత్పాతమొందటంకాదు!
కోమలి కనులు కలువలవ్వాలి
చందమామ మోమును జూచి
వెన్నెల వెలగులు చిందించాలి

ప్రేమంటే అందాల ఆకర్షణకాదు
అపరంజి హృదయాన
విరబూసే అనురాగ సిరులు...
నమ్మకపు విరులు....

తేనెమనసులు
మాటలతేనెలొలికించాలి
బాహ్యదృష్టి మాని
హృదయాంతర్లీనమవ్వాలి..!!

****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
26/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:208
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక:
నీ భవిష్యత్తేంటో
నీవు కనే కలలకు తెలుసు
ఆకలి బాధేంటో
కాలే కడుపుకి తెలుసు
మనసులోని బాధేంటో
కారే కన్నీటికి తెలుసు

****అవేరా***జ






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
27/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:209
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక:మాట్లాడిన నిశ్శబ్దం

రగిలే హృదయానికి తెలుసు
గుండెలోని మంటెంతో
పొగిలే కన్నీటికి తెలుసు
మనసులోని బాధెంతో
తొక్కి పెట్టిన బతుకులే
రేపు విచ్చు కత్తులవ్వచ్చు
నొక్కి పెట్టిన గొంతులే
సింహనాదాలూ చేయొచ్చు
నీరవ నిశీధిలో
వెలుగు కిరణం తాకినపుడు
నిశ్శబ్ధమూ మాటలాడుతుంది.
మౌనాన్ని వీడి....!!

****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
27/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:210
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్శిక: శ్రావణమాసం

శ్రావణ సమీరాలు
ఆవిరోడుతున్న
అవనికి
స్వాంతన కూర్చాయి
గ్రీష్మతాపానికి
పిట్టల్లా రాలుతున్న
మనషులతోపాటూ
జంతువులూ
ఆహ్లాద గాలులను
ఆస్వాదిస్తున్నాయి
ఆహ్వానిస్తున్నాయి
నీలాల గగనాన
నిండిన మేఘాలతో
ఆకాశం
నల్లబడింది
నల్ల మబ్బుల ముసుగేసుకుని
చిటపట
చినుకులు
చిరు జల్లులా మొదలై
జడి వానలా మారింది
ఊరంతా సందడి
రైతులంతా ఆకాశం వైపుచూస్తూ
దణ్ణాలు పెట్టి వానదేవుడికి
కృతజ్ఞతలు తెలుపుతున్నారు
నాగళ్ళు
ట్రాక్టర్లు
స్నానాలు చేసి
పుడమి పూజకు
సిద్దమంటున్నాయి
గోపూజ
భూమిపూజలతో
అరకదున్నిన
చేలు గాలిపోసుకుంటున్నాయి....!

మెట్రోనగరంలో
మెరుపులా జడివాన!!
ఎఫ్ఎమ్
టీవిలలో
వాన కబుర్లమోత
ట్రాఫిక్ జామ్ లో
ఫలానా సెంటరని వార్త
జామ్ లో ఇరుక్కున్న ప్రజలు
ఆకాశం వైపు చూసి
మొక్కుకుంటున్నారు
వాన దేవునికి శాంతించమని
నాలాల కబ్జా నాయాళ్ళు
నీరు చేరిన ఇంటిని
శుభ్రపరుచుకుంటున్నారు
ఆకాశంనుంచి
దూకిన గంగమ్మ
పుడమితల్లికి
తలంటుదామంటే
అమ్మ జాడ కానక
కాంక్రీటు అడవి
క్రింద దాగుందని
తెలియక
కనిపించీ కనిపించని
వాగుదారిని
వెతుకుతూ
రోడ్లనే నాలలనుకుంటూ
దారిలోని
ఆవాసాలను
ముంచుతూ
ఏదారిదొరికితే
ఆదారి నడుస్తూ
వాగును చేరింది...
వర్ష ఋతువు దాటిపోయింది
వానలెన్నిపడినా..
భూగర్భజలశాఖ
మెట్రో నగరాన
నీటిలోతులు
చూసి పెదవివిరిచింది...!!
****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
27/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:211
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: బాలన్స్

మనిషి జీవితం
రెండు చక్రాల సైకిల్ స్వారి
ఆగితే పడిపోతుంది
నిరంతరం సాగిపోతుండాలి
సైకిల్ బాలన్స్ తప్పిందా గోవిందా
మనిషికి బాలన్స్(బ్యాంకుబాలన్స్)లేకుంటే గోవిందా!
****అవేరా***






   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
27/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:212
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: విజయం

విజయం కాదు అదృష్టం
విజయం ఒక క్రమ శిక్షణ
విజయం ఒక సాధన
విజయం ఒక అధ్యయనం
విజయం ఒక అన్వేషణ
విజయం కఠోర పరిశ్రమ
విజయం ఒక త్యాగం
విజయం లక్ష్యాన్ని ప్రేమించటం....
విజయం ఆ లక్ష్యాన్ని అందుకోవటం..!!
****అవేరా****


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
27/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:213
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ఈరోజే పుట్టిన మనవరాలికోసం
శీర్శిక: స్వాగతం సుస్వాగతం
ఆదమరచి నిదురపో
హాయిగా..
అమ్మపొత్తిళ్ళలో...
నిన్ను కనులజూచి
మనసులోన నిండిన ప్రేమ
ముద్దుమురిపెంగా
మదినిమురిపించింది
అమ్మలో
అనురాగపు
అంకురాలు మొలకలెత్తి
పులకించాయి...
నాన్న....
ఆనందం అంబరాన్ని చుంబిస్తే
అనురాగ అర్ణవంలో
లోతులన్వేషిస్తున్నాడు...!
అమ్మమ్మ తాతయ్యలు
నీబోసినవ్వుల
వొలకబోతకు
దోసిళ్ళు పట్టి
ఎదురుచూస్తున్నారు..!!
ముద్దులపాపా..!
నీకిదే స్వాగతం ...
సుస్వాగతం...!!

***అవేరా***
 

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
28/03/2016
సహస్రకవి 101
 ఆవె పద్య కవిత సంఖ్య:214
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
*శీర్శిక: మహిళాభివృద్ధి*
       ********
వేదికలెక్కి వసనోట వదురుతావు
ఓటు కోసము ప్రగతి వల్లె వేసి
మహిళ మహిళయంచు చులకనగ
జూచుచు రిజర్వేషనంటు కదులుతావు
అత్యాచారములను
హత్యాచారములనాపతరముకాదె నీకు
చట్టములు చేయుట తప్ప
నైతికతను మార్చు
సమాజానికి చేర్చు
మహిళయన్న తెగ చులకనేల నీకు??
రాకెట్టునెక్కి అంతరిక్షములోనికెగసినారు
మగవారి సాటియనుచు వివిధరంగాల పోటీకివిలిచినారు
ప్రపంచయవనికపై ఆడపులులై నిలిచినారు
నాయకీమణులై రాజకీయాన చెడుగుడాడినారు
మహిళయన్న తెగ చులకనేల నీకు??
వేరువేరుగజూచి వెరపు పుట్టించగ
నీకు భావ్యమేన నాయక ప్రభుత నడప??
మహిళాభివృద్ధి మించి
అభివృద్ధి పథకమేమున్నది?
దేశప్రగతి నడుప భవిత లోన..??

****అవేరా***

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
28/03/2016
సహస్రకవి 101
 ఆవె పద్య కవిత సంఖ్య:215
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: అక్షరాగ్ని
  ********
పండితుడను గాను
పామరుడనసలేగాను
మామూలు మనిషిని నేను
మదిలోని భావాల
నక్షరశిల్పాలుగ చెక్కే
మామూలు కవిని నేను
గండ పెండేరాలు తొడగలేదెవ్వరూ
కానుకలు కాసులూ
ఇవ్వలేదెవ్వరూ
కవియన్న కపియని
పరిహాసములనోర్చి
కపియేకదా లంకను
గాల్చినదని జెప్ప
కలములో అగ్నిపుష్పాలు రాల్చి
మలినమలినాలనూ
ఏరేరిగాల్చి
అవినీతిమోసాల్ని
వెతికి నిప్పెట్టి
అక్షరమే అగ్నియని
అక్షరమే అజేయమని
చాటాను నేను
గండపండేరాలొద్దు
కాసులూకానుకలసలొద్దు
సమసమాజానికి
నా కవిత
గొడుగైనిలిస్తే చాలు....!!

****అవేరా****


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
26/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:216
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: టీవీ సీరియళ్ళు

బంగారమంటి లిపి
తేనె పలుకుల తెలుగుభాష
విపణిలో తేనె కల్తీ అయినట్లే
తేనెల వూటగా తేట తెలుగు
కల్తీ అవుతుంది
తెలుగు టీవీ నాటకాలలో
టీవీ సీరియళ్ళలో...

కథ ఎంత బాగుందన్నది కాదు
ఎంత సాగదీయ గలమన్నది
వాణిజ్య ముసుగులో
టీవీ ఛానళ్ళ లొసుగు
రకరకాల పాత్రలు
రంగు రంగుల సెట్లు
సంగీత అసంబద్ధ మోతలతో
ఇంటి ప్రేక్షకుల
గుండెలలో...రైళ్ళు
రైళ్ళు పట్టాలు తప్పేలా...
వాణిజ్య బ్రేక్ లు....

సీరియల్ పేరు మారినా
ఛానల్ మారినా
పాత్రమారినా
పలుకు చిలకలు మారవు
పాత్రలమద్య వైరుధ్యమున్నా
అదేమాట
అదే మాడ్యులేషన్
పాత్రలకతికించిన మూతుల మాటలు
తేనె తెలుగు మాట
తొణికి తూగి ఊగి
భాషకు తగిలెను తూటా....

ఇంట్లో మహిళలు
పిల్లలు సీరియళ్ళ
ఉచ్ఛులో విలువైన కాలం వృధా
వద్దనలేని బడుగు జీవులు
భాషను ప్రేమించే
భావుకులకు
టీవీ సీరియల్
ఒక "నైట్ మేర్"
****అవేరా***


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
29/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:217
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: షేర్ మార్కెట్

అది ఒక విషవలయం
అది ఒక అమృత వనం
ఆవనంలో ఫలాలు
క్షణం క్షణం ....
గుణం మార్చుకుంటాయి..
అమృతాన్ని కురిపిస్తూనే
హాలాహలాన్నీ విరజిమ్ముతాయి
బడుగు జీవుల
జూదపు కేళి...
బడా బాబుల
బడాయి హోళి...
బతుకు బట్వాడాలో
దాచుకున్న సిరి
ఆశతో....
అత్యాశతో....
వాటా వాణిజ్య విపణిలో
బక్క చిక్కి పోతుంది...
అప్పుడప్పుడూ వీచే
మలయమారుతాలకు
గాలి బుడగౌతుంది...
ఇంతింతై వటుడంతైనట్లు
పెరిగి పెరిగి..
తుఫాను గాలులకు
సునామీ హోరులకు
అసలు ఉనికినే కోల్పోతుంది...
బడుగు బ్రతుకు
కన్న కలలు
పేక మేడలై
నిలువునా కుప్ప కూల్తాయి...
ఆమేడల పునాదులలో
వారి ప్రాణాలు
ఆత్మలను వెతుక్కుంటాయి....!!

****అవేరా***

   

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
29/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:218
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ఉగాది

నవవసంతాన
లేలేత మావి చిగుళ్ళు
ప్రకృతిని పలుకరిస్తున్నాయి
మీ కోసమే
ఏడాదిగా పడిగాపులు
పడుతున్నాం అంటూ
కోయిలలు మావిచిగుళ్శ
రుచులనాస్వాదిస్తూ
పరవశంతో...
కుహూ...కుహూ..
రాగాలనాలపిస్తున్నాయి
గుత్తుల లేత మామిళ్ళు
లేత ఆకుల నడుమ
దోబూచిలాడుతున్నాయి
పూచిన వేప పూవు
మత్తైన వింత వాసన
వింజామర విసురుతున్నాయి
ప్రకృతికాంతకు....
ముంగిట రంగవల్లులద్ది
మావి తోరణాలు
బంతి పూల తోరణాలు
గృహసీమను ముస్తాబు చేస్తుంటే
నవయుగాదినాహ్వానిస్తుంటే
సాంప్రదాయ దుస్తుల్లో
రంగురంగుల
పట్టుపరికీణీలు
పట్టుచీరెల రెపరెపలు
పడతుల అందాలను ద్విగుణీకృతం
చేస్తుంటే...
అందమైన ఆహ్వానాన్ని
ఆనందంగా అందుకుంటూ
విచ్చేసిందీ..శ్రీ దుర్ముఖి ..

ఉగాది పచ్చడి నైవేద్యంతో
పంచాగానికి
మనసారా ప్రణామాలు చేసి
ఉగాది మొదలు
ఉగాది వరకు
కోరికలచిట్టాలు పరచి
ఇష్ట దైవాలను
మ్రొక్కుచున్నారు జనులు
జీవితం సకల అనుభూతుల సమ్మిశ్రితం
తీపు చేదుల మిశ్రమం
కష్ట సుఖాల సమ్మిశ్రితం
అదే ఉగాది పచ్చడి
షడ్రాగాల మిశ్రమం
షడ్రుచుల సంకేతం
నీ స్థితప్రజ్ఞతే నీకు వివేకం
అనే ఈ ఉగాది సందేశం గ్రహించు
స్వాగతించు..శ్రీ దుర్ముఖిని...
స్వాగతం..
సుస్వాగతం...
శ్రీ దుర్మిఖి నామ ఉగాదికిదే
సహస్రప్రణామ స్వాగతం...!!

****అవేరా***
   

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:219
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ఆశలు

భూమి భారము పెంచి
భూ తాపమును పెంచు
జన విస్ఫోటనము
ఆగవలెనని ...ఆశ

పునరుత్పాదన పెరిగి
ఉత్పాతములు తగ్గ
భూతాపము తగ్గ
గలదని...ఆశ

అడవి విస్తీర్ణము పెరిగి
పర్యావరణ కాలుష్య
భూతము అదుపు
చేయగ ....ఆశ

ఋతువు కాలములన్ని
ఋతు గుణము విడువక
మానవాళికి
మేలుచేయ....ఆశ

వానలెంతో
మెండుగా కురవాలి
రైతన్న కూలన్న
పండగలు చెయ్యాలి
ఆత్మహత్యలన్న
మాటవినలేకుండ
జనజీవనస్రవంతిసాగాలని...ఆశ

ఆడ కూనను చూసి
ఆనందం విరియాలి
ఆడశిశువుల
క్రయవిక్రయాలాగాలి
భ్రూణహత్యలేని
భావాలు వెలగాలి
అత్యాచారములేని
హత్యాచారము కానరాని
సమసమాజాన
ఆడమగ తేడాలు
ఆవిరవ్వాలని...ఆశ

పేదబిక్కిలుకూడ
పీజీలుచదవాలి
పేదగొప్పలగీతలేచెరగాలి
సమవాదమవ్వాలి
సామ్యవాదమని....ఆశ

ప్రతి పల్లె కావాలి
స్వయం సమృద్ధి
ఆలవాలమవ్వాలి
అన్నివసతులకు
పట్టణాలప్రజలు
పల్లెబాటపట్టాలి
గ్రామస్వరాజ్యం
గ్రామాల ముంగిట వాలాలని ....ఆశ

శుష్క వాగ్దానాల
గబ్బిలాయిలను
రెక్కకోసి మూలకేయాలని...ఆశ

****అవేరా***
   

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:220
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్ యుఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: అభివృద్ధి

అంకెల గారడీ అభివృద్ధి
రెండంతస్తులు నాలుగయితే అభివృద్ధి
కోటి టర్నోవర్ రెండుకోట్లయితే అభివృద్ధి
వారానికి రెండు పోయి నాలుగు
సినిమాలు రిలీజ్ అయితే అభివృద్ధి
నగర జనాబా ఐదు లక్షలు పదిలక్షలవుతే అభివృద్ధి
ఆకలి చావులు వందలు వేలయితే
లెక్కలుచూపని అభివృద్ధి
రైతు మరణాలు వందలు వేలయినా
వేలను వందలుగాచూపే అభివృద్ధి
పేదరైతు నాలుగెకరాలు రెండైనా అభివృద్ధే
వాడి పదిపశువులు నాలుగైనా అభివృద్ధే
పంట దిగుబడులు పడిపోయినా
ఇదిగో పారిశ్రామిక అభివృద్ధి
ఆరోగ్య వసతులు లేక
పేదల చావుల సంఖ్యలో అభివృద్ధి
లిక్కరు అమ్మకాలు లక్షల్లో అభివృద్ధి
లివరు కాన్సర్ మరణాలలో అభివృద్ధి
తీవ్రవాద దాడుల సంఖ్యలో అభివృద్ధి
ఆ దాడుల మరణాల సంఖ్యలో అభివృద్ధి
కార్పోరేట్ స్కాముల సంఖ్యలో అభివృద్ధి
రాజకీయ నేతల స్కాముల సంఖ్యలో అభివృద్ధి
రాజకీయ నేతల జీతాల అభివృద్ధి
ఆడపిల్లల శిశు మరణాలు అభివృద్ధి
అత్యాచార నేరాలు అభివృద్ధి
హత్యాచారాల నేరాలు అభివృద్ధి
అక్షరాస్యులలో నిరక్షరాస్యత అభివృద్ధి
అక్షరాస్యులలో నిరుద్యోగ అభివృద్ధి
ఇన్ని రకాల అభివృద్ధులన్నీ
నీకే అంకితమమ్మా.....!
కన్నీటి అభినందనలమ్మా....భారతీ!!

****అవేరా***
   

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
 ఆవె పద్య కవిత సంఖ్య:221
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: స్నేహం

ఆకులు వాడి రాలిపోయినా
మరలా చిగురిస్తాయి నవవసంతాన
పూవులు వాడిపోయినా
తిరిగి కొత్తపూలు వికసిస్తాయి
మొక్కేవాడిపోతే మోడవుతుంది
స్నేహం నమ్మకాన్ని కోల్పోయినా
చిగురించదు
పుష్పించదు
మోడువారిపోతుంది
   ****అవేరా***


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:222
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: స్వార్థం

ఆశపడటంలో తప్పులేదు
నాకు కావలసింది కోరుకుంటే "ఆశ"
నేను కోరింది నాకు మాత్రమే ఉండాలంటే "స్వార్థం"
ప్రక్కవాడికి లేకుండా నాకే వుండాలంటే"అమానుషం"
ప్రక్క వాడిది లాక్కోవటం "రాక్షసత్వం"
నేను అనే అహం
అదే నీ సర్వస్వం
నీవు తప్ప నీతో ఎవరూలేరు
అహం ఒక్కటి నిను వీడితే
అందరూ నీవాళ్ళే
అందరికీ నువ్వే...!!

****అవేరా***


అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:223
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: తూనీగ

తూనీగా
తూనీగా
ఎందాకా
నీపయనం
పూదోటల
అడ్రస్ లన్నీ
నీ ఆంటెన్నా జపిఎస్ లో వుంటాయి
పువ్వు పువ్వు పై వాలతావు
ఆకలి తీర్చుకోవటం కోసమా
రుచుల అన్వేషణ కోసమా
నీకున్న సామ్రాజ్యం మాకెక్కడిది
నీకున్న స్వేచ్ఛమాకెక్కడిది
అనంతమైన పూదోటలన్నీ నీవే
కన్నుల విందు చేస్తావు
పంచరంగుల రెక్కల అందం నీసొంతం
ప్రకృతికందం నీతోనే
వికసించే ప్రతిపువ్వు
నీరెక్కల చప్పుడు కోసం ...
ఎదురుచూస్తుంది
నీ సన్నని సుతిమెత్తని
కాలి స్పర్ష కోసం ......
ఎదురుచూస్తుంటాయి
మీ గుంపుల రంగుల
దృశ్యం పికాసో చిత్రం..!!


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:224
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: విజయం

పదిమంది చేరి
పనులు చేయ
వారు వీరని వంతయేల
ఎవరు చేసిన యది
విజయమొందగా
అందరి ఘనతగ యననొప్పు
పరిస్థితులు మనకనుకూలముగ
లేకున్న పరిస్థితులకనుకూలముగ
మనము మారవలయు
నీవు నీవు గనుండు
నీపైనీకు నమ్మకమ్మంచుము
నీశక్తిని నీవు నమ్ము
నిన్ను వరించు విజయమ్ము
నీ నమ్మకమే నీ విజయానికి
వేకువ సూర్యోదయం...!!
******అవేరా****


అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
30/03/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:225
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్,యూఎస్ఏ
అంశం : సామాజికం
శీర్శిక: ఐక్యత

కలసియున్న వేళ కలదు విజయమ్ము
విడి వడి బతుక
వెతల బతుకు
ఐకమత్యమున్న
ఆనందమంటదా మిన్ను
కలసిసాగ రాద కలల రేడా..!!
    ***అవేరా****

   





   






   

No comments:

Post a Comment