Wednesday, April 13, 2016

అవేరా కవితలు 176 నుండి 200


అయుత కవితా యజ్ఞం
27/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:176
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: కన్నీళ్ళు

నేను పుట్టానని
కన్నీరు పెట్టావా అమ్మా!
అత్త మామ భర్తల
సూటి పోటి మాటలకెంత
బాధ పడ్డావో!
ఆడపిల్లనై పుట్టి
అందరినీ బాధపెట్టానా అమ్మా!
అక్కపుట్టినప్పుడూ
ఇలాగే బాధపడ్డావుట
అప్పుడూ కన్నీరు పెట్టావట
నీవు పడిన బాధ
నా మనసును
కలచివేసి కన్నీరై
ఉబికింది....
ఆడపిల్లగా పుట్టి
కళ్ళలో కన్నీటికుండలు
దాచాను
నీవూ ఆడవైపుట్టి
కన్నీటి బతుకులో
సగం కుండ ఖాళీ చేసావు
అమ్మ కడుపున పుట్టి
రేపటి అమ్మ లను
అసహ్యించుకునే
అమ్మలనేమనాలి?
నాన్నైనా అమ్మైనా
ఓ అమ్మ కడుపునే పుట్టాలి కదా అమ్మా .!
ఆడపిల్లే లేకుంటే
రేపు నిన్ను కనేదెవరు??
****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
27/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:177
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ఆద్యాత్మికం

శీర్శిక: బ్రహ్మానందం

జీవితమంటే??
జీవించడం కోసం.....
తినుట తిరుగుట
పడుకొనుట
పనులు చేసుకొనుట
చేసిన పనులే పదేపదే చేయుట
ఇంతేనా జీవితం?
నీకేనాడైనా
స్ఫురించిందా
ఈ ప్రశ్న.....??

జీవించు ...
జీవిస్తూనే....
నీ జీవితం పై
అవగాహన ఏర్పరచుకో
నీ జీవిత పరమావధి ఏమిటి?
పెళ్ళి పిల్లలు
ఆస్తులూ
అంతస్తులూ
సుఖభోగాలూ
ఇవేగా??
వీటి కోసం
ఉరుకులు
పరుగులతో
అలసిపోతున్నావు
ఆశల విష సర్పాన్ని
మెడలో వేసుకున్నావు
నిజ జీవిత సంగీతాన్ని
వినలేని బధిరుడవైనావు
ఆశల కోసం
నిత్య సంఘర్షణలలో
సుఖ శాంతులు
దూరమై
మానసిక ఆందోళనలతో
కాపురం చేస్తున్నావు.....

జీవిత ప్రవాహ
గమనం అగమ్య గోచరం
జీవితగమనాన్ని గ్రహించి
ఆశలు ఆందోళనలను
విడిచి బ్రహ్మానందాన్ని
పొందవచ్చు...

జీవితం
జీవించటానికే
ఎవరికోసం?
దేనికోసం?
ఎందు కోసం?
జీవిత సత్యాన్ని
గ్రహించిన వాడే
లక్ష్యాన్ని సాధిస్తాడు....

పరిపూర్ణ జ్ఞానసాగరంలోకి
నీ జీవిత నావలో
ప్రయాణం ప్రారంభించు
కోరికల గొలుసులను
"ఆశ" తాడుల ముడులను
భవబంధాలను
అరిషడ్వర్గాలనే
తీరపు బంధాలనుతొలగించిన
తీరంతో బంధం
తెగి నీ నావ
తెరచాప రెపరెపలతో
అనుకూల పవనాల
దిశానిర్దేశ్యంతో
నీ జీవితాన్ని నడిపిస్తాయి....

జీవితమంటే..
ఎత్తైన పర్వత సాణువుల
మద్యన కొండల కోనల నడుమ
పరవళ్ళు తొక్కుతూ
నదిలా
సాగిపోతుంది
సాగరంవైపు....

రాత్రిపూట
ఆకాశంలో నక్షత్రాలు
వెండి పూవులై
నిండినపుడు
తదేకంగా వాటినే చూడు..

అనంతమైన
కడలి కెరటాలు
ఆనంద నాట్యం చేస్తున్నప్పుడు
తదేకంగా వాటినేచూడు....

ఒక మొగ్గ విరియు నప్పుడు
పూవై పరిమళాలు
వెదజల్లేటప్పుడు
తదేకంగా ...
దృష్టి మరల్చకుండా
నాసికతో....
పరిమళాణ్ణి ఆఘ్రాణించినపుడు
దివ్య మర్మము అవగతమౌతుంది
జీవిత సత్యం పరిచయమౌతుంది

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
28/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:178
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్శిక: నయనానందం

అడవిలోన
ఆకాశానికి నిచ్చెన
వేసే మహావృక్షాలను
చూసినపుడు...

అడవి మోదుగలు
గుంపుగ పూచినపుడు...

మయూరాలు
పురి విప్పియాడినపుడు....

చిరుఝల్లులలో
ఆకాశాన....
హరివిల్లు విరిసినపుడు...

తడిసిన రెక్కల
నారబోయు
పావురాల రెక్కల రెపరెపలాడినపుడు...

తొలకరి వానకు
కప్పలు బెకబెకలాడుచు
నాట్యం చేయునపుడు...

గలగల పారే సెలయేరు
నిరంతరం నదీనదాలతో
మమేకమవుతున్నప్పుడు...
నదీనదాలు బిరబిరా
సాగరం వైపు
సాగి పోతున్నప్పుడు....

ఆకుపచ్చని తివాచీ
సోయగాలు పరచిన
ప్రకృతిని తిలకించినప్పుడు....

ఆ నయనానందకర
దృష్యాలను
మనసున అనుభూతి చెంది
నిలుపుటకు
రెండు కనులు చాలవు
ఆ ప్రకృతికి
ఓ ఆకృతిని
ఏర్పరచిన
విరించీ నీకు వందనం!!!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
29/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:179
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్షిిక: మానవమృగం
(28/02/2016 నాడు ఠానే ,మహారాష్ట్ర
లో జరిగిన యదార్థ గాధ)

మానవత చచ్చిపోయింది
మమకారం తల వాల్చేసింది
మమత సమాధి అయింది
భవిత మంటకలిసింది....

మనవ మృగాల
పాశవికతకు
ఏ పాశమూ
పాశము కాలేదని
మరో ఋజువీ
దుష్టాంతం....

రక్తం పంచి
కని పెంచి
ప్రేమను పంచిన
తల్లిదండ్రి ....

తన చేయి పట్టి
తనవాళ్ళనొదలి
సర్వస్వం అర్పించి
సర్వస్వంగా భావించిన
కట్టుకున్న భార్య....

తనరక్తం పంచుకుని
తన భుజాలపై ఆడుకున్న
పిల్లలు....

మామయ్యా అన్న
పిలుపులోని మాధుర్యాన్ని
పంచిన మేన కోడళ్ళు
మేనళ్ళుల్లు....

ఆ మానవ మృగం
మృగతృష్ణ కు
బలియైనారు
కృూరంగా
గొంతులు కోసి
రక్తపు మడుగులో
రక్తకాలాడిన(జలకాలాడి)...
ఆ మానవమృగం
మృగతృష్ణకు
బలియైనారు....

ముద్దులొలుకు
బోసినవ్వులకు
కరగలేదా ఉన్మాది హృదయం
పసివాళ్ళనీ
పాశవికంగా
కత్తితో లేత గొంతులు కోసి
రక్తకేళి యాడి
తృష్ణ తీరాక
తన గొంతుకు
ఉచ్చు వేసికొని
వేలాడిన
నిలువెత్తు పిశాచి...
మృగ మనిషి....
హుస్సేన్ అన్వర్ పరేకర్
పైశాచిక గాధ ఇది...!!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
29/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:180
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: భయం

కంట కునుకు రాదు
కునుకేయగ
భయము పోదు
భయమున వణుకు పోదు
దొంగల కలకలలు
దోపిడీల విలవిలలు
స్నాచింగుల వలవలలు
వీధులెంట నడచినా....
బైకు పైన వెళ్ళినా.....
బస్సులెక్కినా....
ఇంటిపట్టునున్నా....
భయం....భయం
రెచ్చిపోతున్న దొంగలు
పుచ్చిపోతున్న స్నాచర్లు
కేసులలో...
అతీ గతీ లేని
పురోగతి.....
భయం గుప్పిటలో
భాగ్య నగరం
బిక్కు బిక్కుమంటున్నది....

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
29/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:181
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: పరీక్ష

పరీక్షల కాలమిది
వత్తిడి లేక
ఆరోగ్యంగా
భయం లేక
విశ్వాసంగా
ఆందోళన లేక
ఆత్మవిశ్వాసంతో
తొట్రుపాటులేక
విజయ దృక్పథంతో....

సన్నద్ధమవ్వండి
జ్ఞాన యుద్దానికి
సన్నద్ధమవ్వండి
జ్ఞాన యజ్ఞానికి......

ఇష్టపడి చదవండి
దివ్యంగా రాయండి
ప్రతిభకు మార్కులు
కొలమానం....
మార్కులు కాదు
ప్రతిభకు కొలమానం....

అతి విశ్వాసం వద్దు
నిరాశానిస్పృహలూ వద్దు ...

నిద్ర.....
ఆహారం....
ఆరోగ్యం....
నిర్లక్ష్యం వద్దు.....

పరీక్షల ముందు
అలసట వద్దు
ప్రశాంతత ముద్దు...

ప్రణాలికతో చదవండి
ప్రశాంతంగా వుండండి
అనివార్యత నడుమ
ఎన్నో ఆశలు
ఎన్నో ఆకాంక్షలు
స్వేచ్ఛగా
స్వచ్ఛంగా
మందుకెళ్ళండి
విజయం మీదే....!!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
29/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:182
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: సామాజిక సంతాన వ్యవస్థ
(మన పూర్వీకులు ముందుచూపుతో
ఏర్పరచిన సప్త సంతాన కవచం)

సమాజం
సప్త సంతాన యుక్తం
ఈ సంతాన పోషణ
సామాజి కావసరం...అనివార్యం...

నీరు లేక జీవమే లేదు
నీరే మనిషికి ప్రాణాధారం
అందుకే...
"తటాకము "
ప్రథమ సంతానం...

"దేవాలయం"....
దైవారాధన నిలయం
నాట్య, సంగీత,
సాహిత్యాది
కళల నెలవు
రెండవ సంతానం....

వారసుల భవిష్యత్
అవసరాలకు
నిధినిక్షేపాలను
కాపాడుటకు
పుడమి ధనము దాచు
నిధి నిక్షేపములుగా....
ఆనాటి "నిధి నిక్షేపాలు"
ఈనాడు వివిధ రూపాలు
రేపటి అవసర నిధియే
"భవిష్యనిధియే"
మూడవ సంతానం...

ఆనాడు
ప్రభవించిన
కవిపండితులకు...
కళాకారులకు...
పురోహితులకు....
ఇచ్చినదానమే
గ్రామాలు
అవే "అగ్రహారాలు"
చతుర్థ సంతానము....

సమాజిక సేవ
ధర్మనిబద్దత
ఉపదేశాత్మక
కావ్యాలు
కవి ప్రసాదాలు
నైతిక భాండాగారాలు
ఈ గ్రంధాలు
"ప్రబంధాలు "
పంచమ సంతానం....

పర్యావరణ స్పృహతో
పుడమిన పచ్చదనం
వర్థిల్లగ వనసంరక్షణకు
"వనము"
ఆరవ సంతానమైంది...

వంశాన్ని నిలుపు వాడు
పున్నాగ నరకము నుండి గాచువాడు
వంశగౌరవం నిలుపు వాడు
సృష్టి ధర్మాన్ని గాచు వాడు
పుత్రుడు సప్తమ సంతానం.....

సప్త సంతానాల రక్ష
భాద్యత మరచి
చెరువుల నాశనం
దేవాలయ
కుంబకోణాలు
ధార్మిక కార్యాల
పట్ల నిర్లక్ష్యం
కవిపండిత
కళాకారుల
ప్రోత్సాహలేమి
అవమానం
పుత్రులకు
కొరవడిన మార్గదర్శనం
సప్త సంతాన వ్యవస్థ
నిర్వీర్యమై
మానవ మనుగడ
అస్తవ్యస్తమౌతుందీనాడు....!!
మనిషీ మేలుకో...
నీ సంతానాన్ని రక్షించుకో...!!

****అవేరా***


     

అయుత కవితా యజ్ఞం
29/02/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:183
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: వ్యవసాయం

సాగులేక కూడులేదు
భూమిలేని కౌలురైతుకు
ఎంతకష్టం....
ఎంత నష్టం....
అన్న దాతకు కన్నీళ్ళే...
అన్నదాతకు కష్టాలే...

పంటేదైన పాట్లు తప్పవు
ఉసూరుమంటూ
వానచినుకు కోసం
ఆకాశాన్ని చూస్తున్నాడు
మబ్బు కోసం ఆశగా చూస్తున్నాడు
ఉసురు తీసుకుంటున్నాడు....

పత్తి కష్టాల నిప్పు
అన్నిపంటలకూ అంటుకుంది
కాష్టాల నిప్పుకు
ఆజ్యమయ్యింది
శవాల కమురు
నింగికెగిసింది....

కూరగాయల సాగూ
కుదేలయింది
నష్టాల సుడిగుండాల్లో చిక్కి
అసువులు తీసుకుంటున్నాడు
బక్కరైతు
అనాథలైన కుటుంబం
ఆవేదన
కన్నీటి
వరదైంది
పంటకు పనికి రాని
ఉప్పునీటి
సంద్రమైంది...!!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
04/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:185
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: పెళ్ళి-పెటాకులు

నడకలో నడకై...
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసీ...
మనసుతో మనసు కలిపి ...
పెళ్ళికాని ప్రేమ పక్షులు
రయ్...రయ్..న
ప్రేమ లోకంలో విహరించి
బోర్ కొట్టి
మనసులు విరిగి
బై...బై ...ని చెప్పుకుంటే .....బ్రేకప్..!

చేయీ చేయీ కలిపి
మాంగల్యధారణతో
ఒక్కటై...

చేతి రింగులు
మార్చుకుని
దంపతులై...

కుబూల్ హై..
కుబూల్ హై..
కుబూల్ హై
అని షాదీ తో
ఒక్కటై...

మనువాడి....
మనసులు కలవక
తనువులు విడివడి
విడాకుల పెడాకులైతే...
తలాక్....డైవోర్స్...!!

సంప్రదాయాలను
తుంగలో తొక్కుతూ
అపనమ్మకం
తిమిరమై
మనసున
ముసరగా
తిమిరాంధకారంలో...
మిణుగురుల
వెలుగుకోసం..
అన్వేషిస్తూ...
భరోసా కోసం..
షరతులతో...
ఒప్పందాలతో...
వివాహం చేసుకుంటే...
....ప్రినప్స్...!!!

సంప్రదాయం..
విడిపోవటానికి
కాదు ..పెళ్ళి..
కలిసుండటానికంటుంది...
ఇద్దరు మనుషులను
కలిపి...
ఒకటిగా బ్రతుకమంటుంది...

ప్రేమ...
అనురాగం...
ఆప్యాయత..
అంకితభావం...
ఇద్దరు మనుషుల
మద్యన
పెనవేసే
బంధాలు....
జీవితాంతం
కలిసుండే
అనుబంధాలు...
ఈ బంధాలకు
పునాదే
 నమ్మకం....

నమ్మకమే..
కాపురానికి పునాది...
ఆనమ్మకమే
లేనప్పుడు..
ఆ కాపురం
పునాది లేని
మేడే కదా??

పునాది లేకుండా
మేడను కట్టాలనుకోవటం
మూర్ఖత్వం...
ఆ మూర్ఖత్వం పేరే
ప్రినప్స్...!!!

****అవేరా***






     

04/03/2016

04/03/2016
సహస్రకవి 101
కవితసంఖ్య:186
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాద్
అంశం : సామాజికం
శీర్శిక: క్షమించు జీవించు

తప్పులు...
పొరపాటులు....
తెలిసి చేయటం
అనుకోకుండా జరగటం
తప్పులెలా జరిగినా..
నష్టం నిశ్చయం...
నష్టం జరిగినా...
కష్టం కలిగినా...
తప్పు తెలుసుకుని
సారీ చెప్పిన
పశ్చాత్తాప పడిన వారిని
క్షమించాలంటే
ఆకాశమంత
హృదయం కావాలి...

క్షమించి విసిరే
ఒక చిరునవ్వు
ఇరువురి
స్నేహానికి
విరిజల్లు...
విభేధాల
నిప్పునార్పే
వానచినుకు...
ఆచిరునవ్వు...
మనసున పూసిన
కళాత్మక పువ్వు!

వాద ప్రతివాదనలు
కోప తాపాలూ
ప్రతీకారేచ్చలతో....
మానసిక రుగ్మతలకన్నా..
క్షమా గుణంతో....
మానసిక స్వాంతన పొందాలి...
మేలు జరుగుతుంది...
ఆరోగ్యానికి...
సమాజానికి...

****అవేరా***
ఈ రచన నా స్వంతం దేనికి
అనువాదం అనుకరణ కాదని
హామీ ఇస్తున్నాను
అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాద్




     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
06/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:187
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: మహిళ(కథ)

భానుని ప్రత్యూష
కిరణాల వెలుగు సోకగానే
పక్షులు కిలకిలారావాలు
సుప్రభాతమైంది తనకి

లేచి తన
నిత్యకృత్యాలకాయుక్తమైంది
భారమైనా
భాద్యతను
బుజానికెత్తుకుంది

ఫ్రిడ్జ్ తెరచి
పాల పాకెట్
తీసింది
నిద్రచాలక
కళ్ళు మూతలు పడుతున్నాయ్
మత్తుగా...
తెల్ల కలువలు
ఎర్ర కలువలయ్యాయి...
స్టౌ వెలిగించి
పాలు పెట్టింది

కొడుకు గదికెళ్ళింది
నిద్రాదేవి ఒడిలో
మరోలోకంలో
తేలిపోతున్నాడు...
దగ్గరికి వెళ్ళి
నుదుటి పై
తన గులాబీ
అధరాలనాన్చి
చుంబించింది ఆర్తిగా
"లే నాన్నా స్కూల్ కెళ్ళాలి"
అంతలో...
సు...య్...య్ మన్న
చప్పుడు విని
వంటింటి వైపు
పరుగు..
చూస్తే...
సగం పాలు నేల పాలు
బాధపడకూడదనేమో
పెద్దలు చెప్పారు
పాలు పొంగితే శుభమని.....
పాలు దించి
ఇడ్లీ పాత్రనుంచింది
స్టౌ పైన



***అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
06/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:188
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: మహిళ1
(08/03/2016 మహిళాదినోత్సవం కోసం)
ప: వేకువకే మేలుకొలుపు
     మేలుకున్న మహిళమ్మా...
     అందుకోమ్మ చందనమిదె
     అందుకోమ్మ వందనం...

చ1: మరపు రాని రోజు నేడు
       మహిళా దినోత్సవం...
       మీ సేవల సాక్షిగా
       ఎగిరె విజయ బావుటా.....వేకువకే*
 చ2:ఆధునికత ఆలంబన
        బిందు సేద్య బంధంతో
        బంగరు వ్యవసాయం
        బాగు బాగు ఎల్లవ్వ.
         వందనమిదెనీకమ్మా !!.........వేకువకే*
చ3:తెలంగాణ ఉద్యమాన
       తెగువతోటి పోరుసలిపి
       ధూంధాం అంటూ
       దుమ్ము దులిపి నిలిచావు
       మందుల విజయమ్మా
       వందనమిదె నీకమ్మా!!..........వేకువకే*
 చ4:తెలంగాణ రైతాంగ
        సాయుధ పోరాటానా
        వీరనారి యోధురాలు
        చెన్నబోయిన కమలమ్మా
        వందనమిదె నీకమ్మా!!............వేకువకే*
చ5:బాలల వికాసానికై
       సేవా సంస్థల స్థాపన
       బాలథెరిసా గ నీవు
       సార్థకనామము నీది
      వందనమిదె నీకమ్మా!!..............వేకువకే*
చ6:నాజిల్లా వరంగల్లని
      కదంతొక్కి
      పదంపాడి
      తెలంగాణ
     ఉద్యమంలో
     ఊపిరియైనావమ్మా
    కూనమల్ల సంధ్యమ్మ
     వందనమిదెనీకమ్మా!!..............వేకువకే*
చ7:చైతన్యపు
      వెలుగు జిలుగు
      గ్రామానికి పాకెననుట
      నీవె..నీవె..నిదర్శనం
      చైతన్యమె సుదర్శనం
      కుంర మన్కూబాయి
      వందనమిదె నీకమ్మా............వేకువకే*
చ8:ఆధునిక
       వ్యవసాయం
       ప్రకృతితో
       ఫలసాయం
       దిక్సూచిగ
       నిలిచావు
       రైతు భుజం తట్టావు
       మన్నెం సరితా రెడ్డమ్మా
       వందనమిదె నీకమ్మా!!.............వేకువకే*
చ9:సాహితీసేవలోన
       తెలంగాణ బిడ్డవై
       మహిళా అద్యయనంలో
       మహిళకు చుక్కానివై
       ఉద్యమ చైతన్యానికి
       ఊపిరిలూదావు
       గోగుశ్యామలమ్మ
       వందనమిదెనీకమ్మా!!.............వేకువకే*
చ10:సాహసమే చేయదా
          సెల్యూట్ నీకమ్మా!.....
          స్వయం ఉపాది ఏదైనా
          బ్రతుకు బండిలాగాలని
          ఆటోడ్రైవరై
          ఆత్మస్తైర్యానికే
          ఆదర్శమైనావు
          తారాబాయమ్మా
           వందనమిదె నీకమ్మా!!............వేకువకే*

             (ఇంకావుంది)
రచన:అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
పై కవితను ఎవరైనా రచయిత పేరు లేకుండా
ఇతర గ్రూపులలో  పోస్ట్ చేయుట నేరము శిక్షార్హులని
గమనించగలరు...అనుసూరి వేంకటేశ్వరరావు

          ****అవేరా***






     

'అయుత కవితా యజ్ఞం
06/03/2016   *
సహస్రకవి 101
 కవిత సంఖ్య:189
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: మహిళ2
(08/03/2016 మహిళాదినోత్సవం కోసం)
ప: వేకువకే మేలుకొలుపు
     మేలుకున్న మహిళ
     అందుకొనుము చందనమిదె
     అందుకొనుము వందనం...
చ1:బాక్సింగ్ బరిలో
      ఎదురు లేదు నీకు
      లేతవయసులోనె
      నీవు చాంపియనుగ
      నిలిచావు
      ప్రపంచమే తలవంచి
      సెల్యూట్
      అంటుంది
       నిఖత్ జరీన్
       అందుకోమ్మ వందనం!.....వేకువకే
చ2:నీకాలియందెల
       సవ్వడి
       నాట్య ప్రేమికుల
       హృదయ స్పందన
       నాట్యకళకు
       నీ సేవలు
       అద్వితీయమానందం
       డా.  సువర్చల
       అందుకోమ్మా వందనం!......వేకువకే
చ3:గాంధీజీ కలలుకన్న
      గ్రామ స్వరాజ్యం
      సాకారం చేశావు
      రాజీవుని
      స్వశక్తీకరణ్
      పురస్కారగ్రహీతా
      మరుగుదొడ్లు
       నిర్మించి
       స్వచ్చంగానిలిపావు
       నేనావత్ దేవి
       అందుకోమ్మ వందనం!.....వేకువకే
చ4:ప్రకృతి సేద్యానికి
      స్పూర్తవి నీవమ్మా
      పర్యావరణానికి
      ప్రగతివి నీవమ్మా
      నీవిజయమె మానవాళికి
      మహోపకారం...
      కె. లావణ్యరెడ్డి
      అందుకోమ్మ వందనం!.......వేకువకే
చ5:వికలత్వం
      కకావికలమని
      విశ్వాసం
      గుండెనిండ
       ఉండేలా...
       చాటావూ
       లోకానికి
        వికలాంగుల సేవలో...
        మొగులమ్మా
        అందుకోమ్మవందనం!......వేకువకే
చ6:జర్నలిస్ట్
       జీవితాన
       జయపథాన నిలిచావు
       జరినలిస్ట్ లకే
       స్ఫూర్తివైనిలిచావు
       ఆవులసరితాయాదవ్
       అందుకోమ్మా వందనం!....వేకువకే
చ7:ఆకాశమె హద్దుగా
       ఎగిరేవు గగనాన
       పైలెట్ గా పైకిపైకి
       ఎదిగావు
       బొమ్మ మూగదీప్తి
       అందుకోమ్మావందనం!......వేకువకే
చ8:గ్రామమే ప్రపంచమని
      కలలే చిత్రాలై
       కనులముందునిలిచాయి
       నీచేతి కుంచెలో
       ఎన్నెన్నోభావాలు
       గ్రామ సౌందర్యమే
       విరబూసిన సుమవనం
       సురభివాణీదేవి
        అందుకోమ్మావందనం!.......వేకువనే
చ9:విద్యారంగసేవలో
       పునీతమైనావు
       విశిష్టమహిళవై
       స్ఫూర్తివైనావు
       డా. రమామేల్కొటే
        అందుకోమ్మా వందనం!......వేకువకే
       ******అవేరా******
మహిళ గేయాలు రెండింటిద్వారా
తెలంగాణారాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళలుగా ప్రకటించిన
18మంది మహిళామణుల గురించి చెప్పటం జరిగింది
వారందరికీ అభినందనలతో...ఈ ..గేయాలు
రచన:అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
పై గేయాన్ని ఎవరైనా రచయితపేరులేకుండా
ఇతరగ్రూపులలోపోస్ట్ చేయడం నేరము శిక్షార్హమని
గమనించగలరు..రచయిత:అనుసూరి వేంకటేశ్వరరావు
             ****అవేరా***
29/02/2016
190
29/02/2016
సహస్రకవి 101
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
శీర్శిక: ప్రకృతి ప్రణయ రాగం

ఓ చల్లని సాయంత్రం
పచ్చని వనం...
చెట్లు ఆకాశానికి
చేతులు చాస్తున్నాయి
మబ్బులోని నీళ్ళ
నందుకుంటాయా అన్నట్లు
ఆ నల్లమబ్బు కింద
తెల్లని మేఘాలా
అన్నట్లు గాలిలో ఈదుతూ
కొంగల గుంపులు.....

ఆకాశంలో అప్పుడే
పొడుస్తున్న
తళతళ మెరిసే నక్షత్రాలు....

మరోవైపు
తొంగి చూస్తున్న
అందాల కలువరేడు....

చందమామ
అందాలు చూసి
కొలనున...
రేకువిప్పి
వయ్యారింపు
సొగసు విప్పి
సిగ్గున కలువలు...
...చూసి ఫక్కున
నవ్వెను
అల్లరి మీనమొకటి...

చల్లని గాలులలో
అలలు అలలుగా
తలలూపుతూ
ఆనందాహ్లాదానుభూతిని
పొందుతున్నాయి...
పచ్చని చెట్లు
స్వార్థంలేని చెట్లు
పూలను పండ్లను
భ్రమరాలకు
మనిషికి
దైవానికి
జంతువులకు
అందించి
తరిస్తాయి
త్యాగజీవులైనా
పుణ్యజీవులైనా
పాపం పుణ్యం తెలియదు
మోక్షం అడగవు...

పచ్చని చెట్టును చేరిన
పక్షులు ఉన్నదాంతో
తృప్తి చెంది
హాయిగా ఆనందంతో
కిలకిలారావాలు చేస్తాయి
ఆనందంలోను
విషాదంలోను
అదే
రవము...
హంసద్వనిరాగంలా
కిల..కిల..కిల...

ప్రత్యూష
కెంజాయ వెలుగులు
విరబూయకముందే
మేల్కొని
కిలకిలల
కలకలంలో
ఆ రోజు కార్యక్రమాల
చర్చా గోష్టి...
కిల...కిల...కిల..
సామూహిక
జీవన ప్రదీక....

పిదప ఆహార వేటలో
చితుకుల వేటలో
రోజంతామౌనవ్రతం...
సాయం సంద్యలో...
ముసిరే చీకట్లతో
పరుగు పందెమేసుకుని
గూటికి చేరి
కిల కిలలతో
మౌనవ్రతం విడుస్తాయి
సహచరులతో
ప్రేమగా ఆ నాటి
వింతలు విశేషాలు
చెబుతాయి...
కిల...కిల...కిల.....
ప్రకృతి పరవశిస్తుంది
సహజీవన సమాహారంలో

పచ్చని చెట్టే లేకుంటే??
ప్రకృతికి ప్రణయ రాగాలెక్కడివి??
మనిషికి జీవనరాగమెక్కడిది???
****అవేరా***
ఈ రచన నా స్వంతం దేనికి
అనువాదం అనుసరణ కాదు
కాపీ చేసిన వారు శిక్షార్హులు....
.....అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు
cell   : 7207289424
Valid  for publication up  to 31stMarch 2016

అయుతకవితాయజ్ఞం
కవితసంఖ్య191
రచన:అనుసూరి వేంకటేశ్వరరావు
07/03./2016

*శీర్శిక:ప్రణయ నాదం"*

సాయం సంద్యవేళ వీచే
సుమధుర పరిమళ
మలయసమీరంలా
కోటి ఊసులు మనసులో కూడి
మంద్రంగా మధుర గానమై
నా వీనుల సోకి
మండు వేసవి పండు వెన్నెల సాక్షిగా
అలసి వాలిన తనువు ఆవిరవుతుంది
వెన్నెల మంచు తెరల్లో
కడిగిన ముత్యంలా కనిపిస్తావు
ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
మౌనంగా ఉందామంటే రాగమైవస్తావు
వలపును పంచే దేవతవౌతావు
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహూ కుహూలకు
శ్రుతి చేస్తూ రతీమన్మధం లాగా
నువ్వూ నేను సంగమించే క్షణం
నువ్వూ నేను ప్రణయించే క్షణం
నువ్వూ నేనూ ఊసులాకునే క్షణం
నా సుతిమెత్తని అంగుళి
నీ వీణాతంత్రిని మీటగా
పాటై పలికెను శృంగార నైషధం
యవ్వన మధువనిలో
పూవులు విరిసే క్షణం
వెన్నెలలో ఆవిరులు స్వేదపు విరులౌతుంటే
విరుల మకరందపు తేటలు జాలువారుతుంటే
అనంతాకాశం సిగ్గున చీకటిలో దాగుంది
తారల జలతారు చీరగ చుట్టుకుంది
మేనును కప్పుకుంది
మేలుమబ్బు పరదాల చాటున చేరి
నెలరాజు దోబూచులాడగా
పైరగాలి ఘమఘమలలో
సంపెంగల రిమరిమలు
మల్లియల గుసగుసలు
మనసే జాజుల దొంతర కాగా
విరిసే విరజాజుల పరిమళంలో
పాలవెన్నెలలో మురిపాల జల్లులలో
 ఆనందపు సంద్రపు అలలపై తేలెను
మనసు మల్లెపూవై ......
      *****అవేరా****
రచన:అనుసూరివేంకటేశ్వరరావు
హైదరాబాదుcell:7207289424
పై రచన నా స్వంతం దేనికి
అనువాదం అనుకరణకాదు
ప్రచురణకుపంపలేదు
అనుసూరి వేంకటేశ్వరరావు
మీ పత్రిక కు ప్రచురణార్హత 10/04/2016
వరకు మాత్రమే....
****అవేరా****


09/03/2016
192
09/03/2016
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
మంచిర్యాల cell:7207289424
అంశం : సామాజికం
శీర్శిక: గల్ఫ్ కార్మికుడు

ఇంటికి పోదా మంటే
అప్పులోల్ల గోల
పొలము పోదామంటే
పురుగుమందు లేదు
కాయ కష్టమంత
కరువు పాలాయెరా!
బతుకు జూడ
అప్పు పాలాయెరా!
ఏమిసేతు? నేనేమి సేతు?....

గల్ఫ్ పోదామంటే
ఏజెంటు దొంగల
నమ్మి మునిగె
నా తమ్ముడొకడు.
నమ్మునేల
వారిని మోసపోవ??...
సొమ్ము...సొమ్ములని
సొమ్మసిల్ల బోవ..??

ఓరన్న! వీరన్న!
రామన్న! రాజన్న!
ఏజంట్ల దోపిడిని
సర్కారు జూచింది...
గడ్డుబతుకుల కోసం
చేతులే చాచింది...
భుజాలే తట్టింది..
ఏజెంటులే వద్దు
ప్రభుత్వమే ముద్దు
గల్ఫ్ కంపెనీలు
రెక్క కట్టుక వాలు
తెలంగాణ సర్కారు ముందు..!

ఒప్పంద పత్రాలు
జోరుగా చేసేను
సర్కారు నీడలో
ఉద్యోగ మొచ్చేను..!
ఏజంట్ల బాధలు
ఏజంట్ల మోసాలు
అటకెక్కించి
మూతపెట్టు...!!
సర్కారు నీడలో
లేబరు చట్టం కింద
హక్కులే వచ్చేను
ఆనందమొచ్చేను
కంపినీలన్ని
ఇంపుగా చూసేను...!
*************
రచన:అనుసూరి వేంకటేశ్వరరావు
మంచిర్యాల
పై కవిత నా స్వంతం దేనికి అనువాదం
లేదా అనుకరణ కాదు ముందు ప్రచురణకు పంపలేదు
.......అనుసూరి వేంకటేశ్వరరావు.
 ****అవేరా***







పాతిక వసంతాలు పరుగున గడిచాయి
12/03/2016
సత్యశ్రీ రాంకోటేష్ దంపతులకు
పాతిక వసంతాల సిల్వర్ జూబిలీ
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు!!
అభినందనలతో ....మీ..A,V,Rao Dy.S.E
కవిత సంఖ్య:193
రచన: అనుసూరి వేంకటేశ్వర రావు

పెళ్ళి పందిరిన బిడియపు చూపులు
తొలి వసంతాన తొలకరి వానలు
ప్రేమ జల్లులో విరిసిన హరివిల్లులు
మరుపు రాక
మరువ లేక
జ్ఞాపకాల దొంతరలు
ఎన్నొన్నోమధుర స్మృతులు
పాతిక వసంతాలు పరుగున నడిచాయి
వడి వడిగా గడిచాయి
చిగురించిన జీవితాలు
ప్రణయానికి"ప్రతీక్"గ
"ప్రణవ్"మై నిలిచాయి
మీ ప్రేమ
మీ ప్రేరణ
దివిటీలై
దారిచూపు
చిగురులు శాఖలు తొడిగి
మహావృక్షాలై నిలవగ...!
    ****అవేరా****


అయుత కవితా యజ్ఞం

12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:194
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: కల్తీ
*********
ప్రిమియర్ బియ్యంలో
నాసిరకం కల్తీ
పాలల్లో నీరు కల్తీ
కాదు...కాదు...
నీటిలోనే పాలుకల్తీ
పప్పులోన
మరోపప్పు కల్తీ
ఉప్పులోన
స్వచ్ఛత కరవై కల్తీ
పసుపులోన
రంగు పొడి కల్తీ
కారంలో ఎరుపు కల్తీ
నూనెలలో మరోనూనె కల్తీ
మిరియాలలో కల్తీ
టీపొడిలో గొర్రెలశుద్దము కల్తీ
ఇసుకలో ఫిల్టర్ ఇసుక కల్తీ
పెంటమట్టిలో మొరం కల్తీ
ఎర్రమట్టిలో సున్నపు మట్టి కల్తీ
సిమెంటులోన కల్తీ
సున్నపు రంగులలోకల్తీ
కల్లులోన కల్తీ
గౌడుల జీవన బృతి కల్తీ
ప్రేమికుల మనసులు కల్తీ
తోటి మనిషి కల్తీ
సాటి మనిషి కల్తీ
కుటుంబ ప్రేమలు కల్తీ
ఇరుగు పొరుగుల పలకరింపులు కల్తీ
కల్తీ ...కల్తీ....కల్తీ
నాటి ప్రహ్లాదు చక్రి బోలి
ఇందుగలదందులేదను
సందేహము వలదు
ఎందెందు వెతికి చూచిన
అందందు గలదు సర్వోపగతంబు కల్తీ!!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:195
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: జ్ఞానం

 విద్వత్తు
ఎంతయున్నను గాని
పరమాత్మ లీల
మవగతముకాదు
పాపపుణ్యాలనెంచలేవు
పరమాత్మదృష్టి
అచంచలము
అనంతము
నిస్పక్షపాతము
పాపికైనా
పుణ్యాత్ముడకైనా
అదే ఆకాశం....
అదే వర్షం.....
అదేభూమి......
సర్వజనులపై
సర్వాంతర్యామి
అదేదృష్టి......

తెలియకచేసిన పాపము
తండ్రివలె క్షమించును
సర్వోపగతుండు
ఆస్థికుని
నాస్తికుని
రెంటికి నడుమ
నడయాడే వారిని
అందరికీ సమదృష్టే
తప్పు తెలుసుకొని
శరణన్న వారిని
కాపాడి దరిజేరును....

సద్గుణాలు మనిషికి అలంకారాలు
దుర్గుణాలు మచ్చలు
పరాత్పరుణ్ణి
సాక్షాత్కరింప చేసుకొన
వేదజ్ఞానం ఒక్కటే
చాలదు
విద్వత్తెంత వున్నా
భక్తి లేనిదే
దైవలీలలు అర్థం కావు....

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:196
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రకృతి
శీర్శిక: పిచుకవిలాపం

జనంమద్యన
జల్సాగా బతికాము
ఒకప్పుడు
ఊరూరా
ఇళ్ళనుపంచుకొని
ఊరపిచ్చుకలయ్యాం
టెలిఫోను వైర్ల మీద
దొంగా పోలీసాడాము...!
వైరుకొమ్మచ్టిలాడాము..!
ప్రత్యూష కిరణాలు
వెలుగు నింపే వేళ
కిచకిచ కబుర్లతో
ఆనందంగా గడిపాము
చెట్లపైన .....

నేడు గూడు కట్టగా
చెట్టులేదు
ఆడుకుందామంటే
టెలిఫోను వైర్లులేేవు
సహచరులూ లేరు
అందరూ అడవిబాటపట్టారు...

వైరులేని ఫోనులంట
మా కొంప ముంచాయి
సెల్లు ఫోనులని
సెల్లు టవర్లని
వచ్చి మా బ్రతుకు టవర్ ను కూల్చాయి
రేడియేషన్ అని వచ్చి
మా బతుకు వైబ్రేషన్ చేసాయి...

పెద్దవూరు పెద్దటౌను
అయితే మా పిల్లలకు
పెళ్ళి సంబంధాలు
బారులు తీరేవి
ఇప్పుడు వామ్మో అని
అడవిలోకి పారిపోతున్నారు
పిల్లలు బ్రహ్మచారులుగా మిగిలి పోయి
సంతతి నశించి పోతుంది
ఉన్నవాళ్ళు రేడియేషన్ పుణ్యమాని
అర్ధాయుష్షుకే
టపా కట్టేసారు
మొండి ప్రాణులు
కొందరం
మొండిగా బ్రతికేస్తున్నం
మంచి రోజులొస్తాయని
ఆశతో.....
మా పిచ్చుక బ్రతుకు
రేపటి మనుషులకు
చరిత్రగా మిగిలిపోవలసిందేనా???

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:197
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: బడ్జట్

ప్రభుత చేతిలో
మంత్రదండము
యేడాదేడాది
యేటికి
ఎదురీదే సామాన్యునికి
విషమ పరిస్థితి
ఖాళీ బొక్కసానికి
మెరుగులు దిద్ది
నింపడానికి
కొత్త పన్నుల
రూప కల్పనకు
వేదిక.....

పన్ను పోటుతో
నడ్డి విరుగుతున్న
ఉద్యోగులు
ఆదాయ పన్ను
రాయితీకి
ఎదురుచూసి
వాచిన కన్నులు
ఆందోళన చెందే మనసు
తెరపి చెందేరోజు
ఉత్కంఠకు
తెరదించేరోజు....

పల్లెకింత
పట్నానికింత
రంగు రంగుల
రంగాన
హంగులున్న
పరిశ్రమలకింత
శాఖ శాఖలకు
కేటాయింపులు
అయిన మంత్రి
కాని మంత్రి
నావాడు
నీవాడు
నిజ నిర్థారణలేని
కాకుల లెక్కలు
ఖర్చులకోసం
నిధుల పంపకం
వడ్డింపుల
సడలింపుల
సమ్మిళితం......
మోద
ఆమోదాల
సమ్మిళితం....

అభివృద్ధి సుద్దులు చెప్పి
మొద్దురాచిప్పలై
పేదవానికి
ఇచ్చే వాటిని
బూతద్దంలోచూపుతూ
చేస్తున్న క్షవరాన్ని
తిమిరంలోకలిపేస్తూ
మెడకోగుదిబండనేసి
కదల లేని పేదలకు
బంగారు నిచ్చెనలేస్తారు

పార్లమెంటైనా
అసెంబ్లీయైనా
బడ్జటు సమావేశాలు
మాయామంత్రాల
మెస్మరిజం....!
మాటల గారడీల
హిప్నోటిజమ్..!
మీడియాకు
మురిపాలపండగ...!!

   ****అవేరా****


అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:198
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: ఆడంబరము

నిజ జీవితాన
నీ నిజస్థితినెరుగుము
పొరుగువానిని చూచి
ఆడంబరమునకు పోక
నిజస్థితిని జీవించుము
నీ చేతిన యున్నదె రొఖ్ఖము.....
దూరపు కొండలు నునుపను
నిజమును గనుము
మబ్బులో నీళ్ళు జూచి
నీళ్ళు ఒలక బోసుకోకు...!!

అప్పు చేయకు నెన్నడు
నాడంబరమునకు బోయి
క్రెడిటు కార్డులనగ
జేబున విషపు తేళ్ళు
అధికవడ్డీయప్పు
నీ తలపై నెక్కిన తెల్లయేనుగు
చంపియె వదులును....

తాగుడు
జూదము
తిరుగుట
వ్యసనముల
దరిజేరకు
జేరినయవి
లాగును ఊబిలోకి
బయటకు వచ్చుట కల్ల
నీకు దూరమౌను పిల్లజెల్ల ...!!


****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
12/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:199
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : ప్రేమ
శీర్శిక: నిరీక్షణ(భగ్న ప్రేమికుని ఆవేదన)
      **********
అన్నీ వున్నా
నీవులేని
జీవితం శూన్యమే ప్రియతమా!
నా జీవితాన
వసంతాగమనానికి
స్వాగతచినుకై రావా..!
నవ వసంతం కోసం
గొంతు నిండిన
రాగాలను
వీనుల విందుగ
కుమ్మరించాలని
లేమావి చిగురుల
రుచులనాస్వాదించాలని
ఆశగ ఎదురు చూస్తున్న
గండు కోయిలలా,...
ఎదురుచూస్తున్నా
నీ వెన్నెల కురిసే
కన్నులవొలికిన
మధురభావనలు,
మనసున విరిసిన
ఆనంద సుమ వీచికలు
నీ సుమధుర
భాషణా చతురత
కవ్వింపు ఆటలు
చిందించిన ప్రేమలు
మరపు తోటకు పోనంటున్నాయి!
గుండెలోగూడుకట్టుకున్నాయి!
అంబరమంటిన ప్రేమ
ఆర్ణవ లోతులలో నిక్షిప్త నిధియైనది!
మరుపురాక...!
మరువ లేక...!
చకోర పక్షినైనాను...!
నిత్య నిరీక్షణలో....!

****అవేరా***






     

అయుత కవితా యజ్ఞం

13/03/2016
సహస్రకవి 101
 కవిత సంఖ్య:**200**
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : సామాజికం
శీర్శిక: వెన్నుదన్ను

నీదు రెక్కల కష్టమే
నీకు దన్ను...!
నీ బ్రతుకు విజయమే
మాకు దన్ను...!
రైతులేని రాజ్యము
రాబందు బోజ్యము..!

నీదు సంక్షేమమే
దేశ సంక్షేమము
నీదు సంక్షోభమే
దేశ సంక్షోభము..!

కడుపు నిండని రైతు
కడలినీద గలడా?
కూలు సేద్యము
కాద బీడునేల...!

అన్నము పెట్టు వాడికి
సున్నము పెట్టుట పాడియా..??
దన్నుగ నిలవ వలె ప్రభుత..!
వెన్ను తట్టదా ప్రకృతి..??

చేవజచ్చిన రైతు
చేటు దేశానికి...!
పాడి పంటలతోనె
పావనమ్మగు పల్లె....!

రైతురాజవ్వగా
గ్రామస్వరాజ్యమివ్వరా..!

****అవేరా***

Monday, February 29, 2016

"అవేరా పద్య మాలికలు" శతకం


అయుతకవితాయజ్ఞం
28/02/2016 
సహస్రకవి 101 
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు 
అంశం : సామాజికం
శీర్శిక: జీవనసత్యాలు శతకం

ఆవె 1
కడుపునాకలి గల కడుపును నింపగ 
పూను పుణ్యముండు పుడమిలోన
నీదు కడుపు నిండ నిజముగ చాలదు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 2
చెప్పగ వినవలెను చెప్పరు పెద్దలు 
తప్పులుం వినయము తప్పవినక
పోయిన ఇడుములుగ పోగవు నిజముగ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 3
తెలియని మనుషులకు తెలియద మౌనము 
స్నేహము కలుపునని , స్నేహము తెగు
తెలియు మనిషి మాట తెగిన నిక్కముకదా 
విశ్వ మందు రామ వినురవేర

ఆవె 4
సృష్టిలోన తెలియు సృకము ఆడుమగల
నేటి బేధముండ నేల సమము 
కాద హక్కు నిజము కారణముతెలియ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 5
ఆడ యైనను మగ యైనను పుడమిన
మ్మ కడుపుననె జన్మమనిన సత్య   
మని తెలియగ ఆడ మగభేధ మేలర
విశ్వమందు రామ వినురవేర

ఆవె 6
తల్లి దండ్రి  కరుణ తప్పక కాపాడు
నీవు పూజ తోడ నిరతి కొలువ
ముసలి తనముు నాడు మూలన వదలకు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 7
నడక నేర్పెనయ్య నడతను నేర్పెను
గురువు మార్గదర్శి గురువు కాద
గురువు యనగ కనగ గురువుయె దైవము
విశ్వమందు రామ వినురవేర

ఆవె 8
హితులు స్నేహి తులును హితమును గోరుతు
నిను భుజమును తట్టి నిరత విజయ
మునన ప్రోత్సహించ మురియగ మనసున
విశ్వమందు రామ వినురవేర          

ఆవె 9
పరుల సొమ్ము కాశ పడకుర సర్పమై
కాటు వేయు నొప్పు కాదు నీకు 
పరుల పడతి కోర పశువృత్తియగునురా
విశ్వమందు రామ వినురవేర

ఆ. వె 10
కోప తాపమైన కోతియే మనసున
తాప మెన్నటికిని తాడి కెగురు
శాంత మున్న మనసు శాంతి బడయుచుండు
విశ్వమందు రామ వినురవేర

ఆ.వె11
పాలుపట్టవలదు పసిపాపకెప్పుడు
చాటులేక కొంగు చాలకున్న
దిష్టి సోకునమ్మ దినదిన కష్టము
విశ్వమందు రామ వినురవేర

ఆవె 12
గారమెపుడు చేయగాడి విడి నడయు
పిల్లలు క్రమముగ పిడుగు లగును
దారి తేవ గాదు దారి నిలప రాదు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 13
ప్రతిభ నణచకుండ ప్రతిగ ఫలమును
ఆశ పడక  పంచ కోటి పూజ
పుణ్య మరయు నీకు పుణ్య పురుషుడవే
విశ్వమందు రామ వినురవేర

ఆవె  14
పుస్తకమ్ము బరువు పుట్టెడవగ నేమి 
మేధలోని బరువు మెతకనేల
నేర్పు గురువు దీక్ష నేర్పగ వలయుర
విశ్వమందు రామ వినురవేర 

ఆవె 15
కరుణ నిండ మనసు కనులను  ప్రేమను
పంచు మంచి మాట పంచు ప్రేమ 
మంచి తలపు మోదమందదా వినవేర
విశ్వమందు రామ వినురవేర

ఆవె 16
సాగరమును బోలు సాదర మహిళలు
దుఖము కడుపులోన  దురిత ముగను
దాచుకొనుచు ప్రేమ దాతగ నిలచును
విశ్వమందు రామ వినురవేర

ఆవె 17
మనసు లోని భావ మందము గానున్న
నోటి వెంట మాట నోటి మూట
ప్రేమ దొరలు నిండు ప్రేరణ మనసుల్లొ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 18
మనసు నొకటి నోట మరొకటి చెప్పుట
పాడి  కాదు ఇలను   విజ్ఞులకును 
మనసు స్వచ్ఛనైన మన్నద మానవత
విశ్వమందు రామ వినురవేర 

ఆవె 19
నోరు మంచి దైన నూరును మంచిది
నోరు చెడ్ద దైన నొప్ప రుజన
మున్ జగతిన నిత్య ము సత్యమున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె 20
నీదు పుట్టుకన్న నీకుతె లియనిదే
దైవ ఆత్మనవ్వు ఐక్యమాత్మ
నీదు చావు యెపుడు నీకు తెసియదుగా
విశ్వమందు రామ వినురవేర

ఆ.వె21 
ప్రతిభ నిద్ర లేవ ప్రభవించు కాంతియు
మేల్కొనగను నీకు ప్రగతిసేయ
నిద్ర సోమరులను నిరతమణచునురా
విశ్వమందు రామ వినురవేర

ఆవె 22
దేవదేవయనుచు దైవమును కొలుతు
వేల నీవు తెలియవేల నీలో
లీనమైన దైవలీలలు తెలియర
విశ్వమందు రామ వినురవేర

ఆవె 23
మనుషులందు నుండు మాధవుండనునది
సత్య మనగ నిలన సత్య  మైని
లవగ తోటి మనుషు లకుసేవ చేయర
విశ్వమందు రామ వినురవేర

ఆవె 24
అమ్మ కడుపు జూచు ఆలిజూచురపర్సు
నిజము సత్య మిదియె నిలను వినర
అమ్మ కడుపు నిండ అతిశయము ప్రేమ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 25
బడికి పోయె బిడ్డ బడి యనంతరమున
సెల్లు ఆట లాడి సేయుసమయ 
మువృధాయనంగ ముప్పును తెల్పుర
విశ్వమందు రామ వినుర

ఆ.వె26
పుట్టినప్పుడధిక పురిటినొప్పులె తప్ప
ఏమి తెచ్చినవిల ఏలనీకు
ఆస్తి పాస్తి  కేలర అర్రులు చాచుట
విశ్వమందు రామ వినురవేర

ఆవె 27
ఆస్తు లెన్ని యున్న ఆయువు తీరగ
చావు తప్పదన్న చాపచుట్ట
మంచినే తలవర మాన్యులైన నెపుడు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 28
ఆస్తులేవి నీదు ఆస్తి కాదు ఎపుడు
నేడు నీదె రేపు నీది కాదు
నాది నీదనిన వినాయాస్తి తలవంగ
విశ్వమందు రామ వినురవేర

 ఆవె 29
ఆస్తి కోసమెపుడు సోదరులును కీచు
లాడ సిగ్గు తోడ లావు ప్రేమ 
బోసి పోయెను గద బోరున సోదర
విశ్వమందు రామ వినురవేర

ఆవె 30
ఆస్తి కోస మెపుడు అన్నదమ్ములిలను 
సిగ్గు వీడి బట్టి సిగన పట్లు 
కీచులాడగాను క్లేశంబు హెచ్చాయె 
విశ్వమందు రామ వినుర వేమ

ఆవె 31
సోదరులకు ఆస్తి సోకున రగిలిన
కక్ష చూసి తండ్రి కంట నీరు
దొరల వారి  కంట దొరలు నోటుకలలు
విశ్వమందు రామ వినురవేర 

ఆవె 32
వయసు వచ్చె గాని వనితల గారవిం
పంగ బుద్ది లేక పడుదు వేల
వెంట చెప్పు దెబ్బ వేయర పడతులున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె 33
అరువ దేండ్ల ముదిమి అందల మెక్కగ
లేత వయసు మొగ్గలేల చిదిమె
కామ మోహ మాయ కామాంధు వైతివి
విశ్వమందు రామ వినురవేర

ఆవె 34
మానవత్వ మేల మరచి చెరచితీవు
లేత పరువ బాలలేల నీకు
మనిషి జన్మ మలినమందగా దుర్మతి
విశ్వమందు రామ వినురవేర 

ఆవె 35
ప్రేమ ప్రేమ యనుచు ప్రేమలేనిపడుచు
వెంట పడగనేల వెతలు పెట్ట
ప్రేమ లేని మదిన ప్రేమ పుట్టదుగదా
విశ్వమందు రామ వినురవేర

ఆవె 36
ప్రేమ లేని చోట ప్రేమను పొందగ
లేవు ఆమ్ల దాడులేల నీకు
రాక్షసాధముడవు రాతిహృదయుడవు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 37
ప్రేమ రోగ మొచ్చి ప్రేయసినే తల
చినచొ చంక నాకి చిరుగు చదువు
లెల్ల పొత్తమేర లేతవయసు దోస్తు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 38
ఆడపిల్లనుచును ఆదిలో తుంచగా
భావ్యమగునె నీకు భానుతేజ
నేటి ఆడపిల్లే నీకు రేపటి దిక్కు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 39
కడుపులోనె తుంచ కన్నకడుపు కాద
నీది పుట్టు కేల నీదు పుత్రి
జంప ఆడ యనిన జననియనెరుగవా
విశ్వమందు రామ వినురవేర 

ఆవె 40
పెంట కుప్పలందు పెట్టగా పిల్లలన్
మనసు యెట్ల నొప్పె మంద బుద్ది
ప్రాణమున్న శిశువు ప్రాంకురముద్రుంచ
విశ్వమందు రామ వినురవేర


ఆవె 41
భార్య భర్త లనిన భాగ్యజీవు లనగ
పూర్ణ అర్ధములు పూర్ణమవగ
నీవు నేను అనగ నీకు శోభయెకాదు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 42
విద్య నేర్చినమ్మ విలువైన భార్యగా
కాపురమును చేయు కాంతి నిండ
భర్త మాట నెపుడు భారమని తలచక
విశ్వమందు రామ వినురవేర    

ఆ వె 43
భార్య భర్త లనిన భావమొకటిగనుం
డవలె లేని యెడల డంకతనము
కోల్పడినిల ఎదురుకోలునిడుములు
విశ్వమందు రామ వినురవేర 

ఆ వె 44
భార్య యనగ ఇంటి  భాగ్యదేవతయని
యెరుగ వలెను భర్త యెపుడు ఇంటిన
మంత్రి వోలె ఇంతి మసలిన స్వర్గమే
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 45
భర్త యనిన ఇంటి బరువును మోయును
భాధ్య తనువహించు బాధ మరచి
కంటి ముందు మసలు కమనీయ దైవము
విశ్వమందు రామ వినురవేర

ఆవె 46
శిశువు పుట్టె ననియు శిఖరమెక్కినటుల
మసలుటేల నీవు మంచి తనము
తోడు కాగ కూన తోడుగుండునెపుడు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 47 
ఇంగిలీషు చదవు ఇంపు కాదుర వింత
మాతృ భాష నేర్వ మధుర మేర 
భాష లెన్ని యున్న భాష యన్న తెలుగే
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 48
కొత్త వింత యౌను కొత్త చింతౌనుర
సంప్రదాయ మొదలి సత్ప్రవర్త
నొదలి కట్టు బొట్టు నొదలి సోకు పడగ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 49
పబ్బు  సంస్కృతియని పాడు నడతలను
నేర్పి చదువు సంద్య నేల పాడు
జేయు ననగ తెలియ జేయర యువతకు
విశ్వమందు రామ వినురవేమ 

ఆ వె 50
విలువ తెలియ లేక వింత ఆటలతోను
సెల్లు మాట లంటు సొల్లు తోను
నేటి కాల మంత నేల వృధాచేయ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 51
ఊరి ఆస్తి యనగ ఉమ్మడి చెరువేను
పచ్చని పొలములను పచ్చగుంచు
నీరు నిండుగున్న నింగిమానుయవుర
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 52
నిండు చెరువు ఊరి నిండుకుండగనొప్పు
తొణకకుండనుండు తొలకరులున
పల్లె రైతుకునిల పండుగే నిండుగా
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 53
చెరువు నిండి చేరు చేపలు కప్పలు
గంగ పుత్రులకును గంపెడాశ
బ్రతుక కావలె కాద బ్రతుకు తెరువు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 54
చెరువు నిండ విత్త చేతి నిండుగ చేప
పిల్లలన్ని క్రమము పిలపిలాడు
పంట చేతికంద పండగే జలపుత్ర
విశ్వమందు రామ వినురవేర6

ఆ వె 55
చెరువు లోని చేప చెంగుచెంగునెగురు
నీరు లేని యెడల నింగి కెగురు
ప్రాణము నిజము జల ప్రాణులన్నియు చచ్చు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 56
కాకతీయ రాజు కాచెను ప్రజలను
చెరువు తరువు లనిట చెడ్డ పెంచె
నీరు నీడ నివ్వ నింగికెగసె కీర్తి
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 57
చెరువు నిండకున్న చెరువగు కడుపుయ
న్నది నిజము నిండనదియె నింగి
మాను నిచట పండు మాగాణి నిండుగ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె  58
జీవమున్న  చెరువు జీవులుండుననుట
సత్యమిలను నిత్యసత్యమిదియె 
జీవ మన్న జలము జీవుల అమృతం
విశ్వమందు రామ వినురవేర

ఆ వె  59
చెరువు నీటి నాప చేయవలెను కట్ట
మత్తడిలను బలియమగు విధమున
మనగ లేడు రైతు మత్తడి తెగినచో
విశ్వమందు రామ వినురవేర 

ఆ వె 60
భూమిగర్భమందు భూగర్భజలముండు
వాన నీటినాపు వాగుల చెరు
వుల్లొ నిండ జలము వూటలూరంగను
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 61
చెరువు లనిన సిరులు చెరపకు కట్టలు
శికము లాక్రమించి శిరము పోటు 
చెరువు చిన్నదవగ చెరుపగు వూరికి
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 62
 చెరువు లాక్రమించి చెరపకు భవితను
స్వార్థ పరుల నిండు స్వార్థ బుద్ధి
కరువు పాలుజేయు కఠినమవ్వు బతుకు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 64
మాతృ భాష యన్న మధురము తేనెలొ
లుకుచు కులుకు నాతెలుంగు తేట
వెలుగు తుండు జగము వెలుగులు నింపగ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 65
దేశమువిడిచిన్ విదేశమేగియు మరు
వకుర మాతృ భాష వదల
కుండ చాటు ఘనత కువకువ లాడుచు
విశ్వమందు రామ వినరవేర

ఆవె 66
ప్రకృతి వరము అడవి ప్రతిన బూనియు గావు
అడవి యున్న పుడమి అలము కొనద 
పులకరింత హరిణ పులుల పరుగులతో
విశ్వమందు రామ వినురవేర

ఆవె 67
సంపద యనగ నిజ సంపద మానులు
మృగము లౌష ధులును మృగణ మేల
అడవి నందు దొరకు అటవీ నిధులివియే
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 68
చెట్టు పుట్ట గుట్ట చెలిమితో  పరిఢవిం
చు నడవతిశయింప చూడ చక్క 
ని సదృశములు నొప్పునిట యడవిననగా
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 69
జలజలయని పారు జలధారలన్ జూడ
జలసిరులిట నొప్పు జలతారు అందాలు
కంటి కింపు జేయు కనగ వెన్నెలతోడ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 70
అడవు లన్ని నరికి అరయునేల నటని
ట జల వనరు లన్నిట జలమెండె 
ను గద జలము లేక నూహింపు బతుకును
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 71
వేడి గాలి నిండి వేడెక్కె పుడమియు
ఎల్ని నోల తోటి ఎగసె దుఃఖ
మాకసముకు కాన మాడెనుదకమెండి
విశ్వమందు రామ వినురవేర

ఆనె 72 
అడవి నీటి గుంట ఆటాడ వేటాడ
అడవి మృగము చేరు అందు కొనగ
 వేట నీటి కొరకు వెతుకు దుప్పియు లేడిలన్
విశ్వమందు రామ వినురవేర
ఆ వె 73
వెన్నెలన్న వెండి వెలుగు పొగయెలేని
వెలుగు సొబగు నిండు వెలుగు నిచ్చు
వత్తి కాలి పొగను  వదలి కొవ్వత్తియు
విశ్వమందురామ వినురవేర

ఆ వె  74
తాను కాలి వెలుగు తానెగ త్యాగశీ
లి భువినింపు కాంతులీను చంద్రు
డైన కొవ్వువత్తి యైననిలన తెల్వ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 75
జిహ్వ చాప లతయె జిలుగులొలుకు మేను
శిథిల పరుచు మత్తు శిరమునెక్కి
మితము జిహ్వ ముద్దు మీరనీకు అతిగ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 76
అధిక ఆయు వన్న అతిగ తినుటకాదు
మితము తిన్న ఆయు హితము కాద
బతుక తినిన నిలన బలమగునాయుశ్శు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 77
బతుక తినగ వలయు బతుకు బాగుగయుండు
తినగ బతుక వలదు తిరము కాదు
మంచి తిండి యున్న మంచి ఆరోగ్యము
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 78
రోగబాధ కన్న ఖర్చు పీడించుయధికము
ఆసుపత్రి యన్న ఆశ్రుపత్రి
ధనము దోపిడియె కదా రోగ లక్ష్యము
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 79
రోగ మొచ్చు రీతి తెలియగ వచ్చును
దోపిడాప లేక దోషిగాకు
రోగ మాపి నిలన రోదన లాపర
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 80
నిత్య కర్మ లన్ని నీరసమునొదలి
రోగ పీడ తోడ రోగి వైతి
కర్మలాచరించు కడు నిష్ట తోడను
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 81
పూల అంద మనగ పూబోడి చందము
కోమల మనసున్న కోమలాంగి 
బాధ నోర్వ లేదు బాధపెట్టవలదు
విశ్వమందు రామ వినురవేర

ఆ  వె  82
సిరులు కురువ వేల సిరులింట నిలువవే
సిరిని సిరిగ కొలువ సిరులు విరియు
ఇంటి కిచట  సిరిగ ఇల్లాలు వెలగగా
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 83
ఆడ వారి మాట అర్థాలు వేరయా
మాటలో నిగూఢ మాటయుండు
రమ్మనియన పొమ్మురయనియర్థంబట
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 84
అడవి జంతువులతొ  ఆట సరియగునా
తెలిసి ఆడు వారు తెగ తిరుగు
కురచ బట్ట లేసి కుదురులేక నచట
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 85
అడవి యనిన కాదు అడవియది నిజము
కాంక్రిటుయడవియది కనిక రమ్ము
లేని మానవతయె లేని మనుజులుండు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 86
చదువు యున్న గాని చరలేడు నీతిగ
జ్ఞానమున్నయతడు జ్ఞాత కాదు
సాగరముల పాలు సంస్కార హీనులు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 87
ఇల్లు తనది కాదు ఇల్లాలు తానగు
తల్లి తనది కాదు తల్లి యగును
కోడలుగ నడుగిడు కోమలి యేతాను
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 88
అక్క తమ్ము డనిన ఆత్మ బంధునిలన
అన్న చెల్లె లనిన ఆత్మ మిత్రు
లిచట దొరలు ప్రేమ లిచట దొంతరలుగ
 విశ్వమందు రామ వినురవేర

ఆ వె  89
అన్న దమ్ము లనిన అందమైననుబంధ
మిచట యనుట సత్యమిలను రక్త 
బంధ మేల సిరికి బంధుక చేయుదు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 90
ఆశ పాశములను అరయగ నేలర
లంగరును విడిచియలరగ తెరల
చాప నెత్తి దివ్య చలనశక్తి గనుము
విశ్వమందు రామ వినురవేర

 ఆ వె 91
జీవిత గమనము జీరాడు నావలో
లంగరెత్తి తెరను లాగి యుంచు
జీవితాన వీచు జిలుగు వెలుగులును
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 92
రైలు బండి కాదురా జీవితం నడు
వదుర పట్ట పైన వడి వడిగను
సాగు తుండు నదిగ సాగరం వైపుకు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 93
జీవితమన కాదు జీవించుట విలువై
నట్టి జీవ సాధనమున పొందు
బ్రహ్మమెరిగియుపర ,బ్రహ్మసు జ్ఞానము
విశ్వమందు రామ వినురవేర

ఆవె 94
భీమ యనగ నిత్య భీతిన బతుకుల
భవిత కాచే రక్ష భంగ పడదు
నమ్మి నబతు కునిల నమ్మగ వలయును
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 95
ఎదిగి ఎదగ నిశిశు ఎదుగుదలవయసు
లోన గాడ్జె టులను అలవ రచగ
నేల మెదడు ఎదుగు నెమొబైలు నివ్వగ
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 96
గాడ్జెటులతొనాడగా పిల్లలు చురుకు
యని మురియుదువేల ఆలసించు
నెదుగుదలని యెరుగు నేర్వవిద్యయుబుద్ధి
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 97
వ్యాకులతన పెద్ద వారిలోనుండుట
జగము ఎరుగు నేడు జనము గాడ్జె
టులతొ బాల లాడ టుంగిరి వ్యాకులన్
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 98
బయట ఆట మరచి బారిన పడుదురు
ఊబకాయ మిలన ఉరికె గాడ్జె
టులతొ ఆట లాడ టుంగరి పిల్లలు
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 99
మొండి తనము పెరుగు మెండుగా బుడతల
చేతి కిచ్చె సెల్లు చేత వీడి
యేల ఆట పెంచు హింసాప్ర వృతియును
విశ్వమందు రామ వినురవేర

ఆ వె 100
దూరమవ్వునుప్రేమ దూరమవ్వును బంధ
ము ఇరుగు పొరుగులలొ ముప్పగునుర
బాలలకును సెల్లు బాధలను పడగా
విశ్వమందు రామ వినుర వేర 

   ***** అ వే రా *****

అయుత కవితా యజ్ఞం

అయుత కవితా యజ్ఞం
01/03/2016
అనుసూరి వేంకటేశ్వర రావు
సహస్రకవి 101
బల్లూరి ఉమాదేవి గారిచ్చిన పూరణ

సమస్య: వెన్ను చూపు వాడె వీరుడనగ 

ఆవె 101
కాపురమున నష్టకష్టముల వెరచి
వెన్ను జూపు వాడె వీరుడనగ
కాడు నిలువు భీతి కాదుర ధీశాలి
వై నిలువుము పోరు వైరి నిలిచి

05/03/2016 
అంశం : సామాజికం
శీర్శిక: టీవీ సీరియళ్ళు

ఆవె 102
నాడు టీవి యనగ నాణ్యత కరువైన
తెలుగు సీరియళ్ళు తెలియవేల
హిందియనగ కొంత ఆనందమేకద
విశ్వమందు రామ వినురవేర

ఆవె 103
హింది తెలుగులకును అధికమై భేదము
నుండ తెలుగు కన్న నాడు హింది 
మిన్న చరిత కథలు మిక్కిలి చక్కన
విశ్వమందురామ వినురవేమ

ఆవె 104
సీరియలులు చూడ సీరియలుగవచ్చు
నిరుగు పొరుగు టీవినిగని పొంద
సంతసమును తోడ సంతానమేతెంచ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 105
రమ్య మైన కథగ రసరమ్య భారతం
విరిసెనందమైన విరిగ నాడు
ఆదివారమనగ ఆనందమేకద
విశ్వమందు రామ వినురవేర

ఆవె 106
కొంత మెరుగ నేడు కొత్త సీరియలులు
బోరు కొట్ట కుండ బోలెడు మాటలు
సాగదీత తోడ సాగుచుండు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 107
పాట లేదు యుగళ పాటయే లేదుగ
నాటి కథలు వినగ నాణ్యతేది
నేటి కథల యందు  నాణ్యమౌ పాటలే
విశ్వమందు రామ వినురవేర

ఆవె 108
నాతి గీత దాటి నందున  పోరు 
సలుపు అత్త యత్త సాటియగుచు
కోడ లంత పోరు కోరగ మార్పును
విశ్వమందు రామ వినురవేర

18/03/2016 
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు 
(సియాటెల్,యూ ఎస్ ఏ)
అంశం : సామాజికం
శీర్శిక: విదేశీయానం
(అమెరికానుండి భరతమాతకు వందనం)
ఆవె:109
మాతృభూమి నొదలి మారుదేశమువొచ్చి
భరత మాత మరువ భావ్వ మగున
భరత మాత కిదియె భవవందనమిదే
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:110
మాటి మాటి కచట మాటను కలిపేటి
మంచి మిత్ర కవులు మనసున మెదలన్
వీర కృష్ణ కళలు విజయేందిరలున్
విశ్వమందురామవినురవేర

ఆవె:111
అయుత తోటి కవుల ఒక్కతా టినడుపు
రవికి తోడు వీర రాజ శర్మ
గుండు మధుయు సీవి ఘనుడగునంజయ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:112
అమెరి కాకు బోవ ఆఘమేఘమునన్
బయలు దేర నేను భయము లేక
సొమ్ము లెంచ మేను సొమ్మసిల్లెనురా
విశ్వమందు రామ వినుర వేర

ఆవె:113
గాలి మోటరెక్కి గాలికె గిరినను
మనసు నేల నొదలి మరలదేల?
ఏల ఖైదు అయ్యె యెదమితృుమదిలో?
విశ్వమందు రామ వినుర వేర

ఆవె:114
నేల నొదిలి యెగసె నెలవంకనరయు
మబ్బు దాటి చూడ నెలఁత విరిసె
గాలి శకటమంత గాంచ నెలతలన్
విశ్వమందు రామ వినురవేర

ఆవె:115
చిందగ చిరు నగవు చైత్రపు జల్లుగ
మెండగు మద్య జగము మోదములను
గాలి శకట కాంత గారము జేయగా
విశ్వమందు రామ వినుర వేర

21/03/2016 (USA)
శీర్షిక:కృష్ణమ్మ సోయగము
ఆవె 115
గలగలగల కృష్ణ గమనము వీనుల
విందగు రవములతొ విందు చేయు
కన్నులకును మదిని కదలించునటుల
విశ్వమందు రామ వినురవేర.

ఆవె:116
కొండ గుట్ట దూకు కొండల బిరబిర
పరుగు లెట్టు వంపు పల్లె లెంట
సేయ కృష్ణవేణి సేద్యపు పండుగ
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:117
వాగు వంక సొగసు వర్ణన తరమా
కృష్ణ సోయగమున కడలికి కదలగ
వర్ష ఋతువు నిచట వడివడి జనగా
విశ్వమందు రామ వినుర వేర

ఆవె:118
నురగ లగల గలల నుర్విని తడపగ
బిరబి రపరు గులతొ బిర్రు నడచు
వంపు సొంపు కాల్వ వాలున కృష్ణమ
విశ్వమందు రామ వినురవేర

21/03/2016 
సహస్రకవి 101 
సియాటెల్, వాషింగ్టన్ ,యూ ఎస్ ఏ
అంశం : ప్రకృతి
శీర్శిక: సమస్యాపూరణ
సమస్య:జలకళచే ఉట్టిపడే కృష్ణవేణీ
తరంగాల సొగసును వర్నించాలి

ఆవె 119
కొండ లందు పరుగు కోటిఆశలు రేపు
పరుగు  తోడ చేర పచ్చ కోన
కోటి కాంతి రేఖ కోన వెలిగెనుగ
విశ్వమందు రామ వినురవేర

ఆవె 120
ఆశలన్నపూర్ణ అవదా రైతుకు
జలము ధార లిడువ జగతి బ్రోవ
కదులు వడిగ రైతు కన్నీరు తుడవగ
విశ్వమందు రామ వినురవేర

 ఆవె :121
అలుపు సొలుపు రాదు అదిరే పటిమయె
మనది అయుత అయినమతిశయమున
సాగు కవన వరద  శారద సేవలో
విశ్వమందు రామ వినురవేర

ఆవె:122
ఒత్తిడులన రాయ ఒత్తుతి కవితయె
స్వేచ్ఛన వికసించు స్వచ్ఛ కవిత
విచ్చినవిరి యిచ్చు విశ్వపు పరిమళం
విశ్వమందు రామ వినురవేర

శీర్షిక':నమ్రుద్ రాజు ,ఇరాక్
ఆవె:123
ప్రాణము లేకయు నిలువ  రాచ ఠీవి 
ఎముక గూడు భోగ మెలిగె రాజు 
ప్రాణము లేని గూడు రంజిల్ల నగలతో
విశ్వమందు రామ వినురవేర
శీర్షిక:నమ్రుద్ రాణి
ఆవె:124
బతికె రాజిల్ల రాచ బతుకును రాణిగ
చచ్చి బతికె నగల చరిత తెలియ
రాచ బతుకు ఇలను రంజిల జేయగ
విశ్వమందు రామ వినుర వేర 

విషయము:కోతి నీరు త్రాగి వృధాయగుచున్న నీటిని ఆపుట 

శీర్షిక: నీటి పొదుపు
ఆవె:125
కపియె మిన్న మనిషి కన్నతెలియగా
నీటి విలువ రేపు నీరు నిలుప
చేయ నల్ల నాపి చేయగ పొదుపు
విశ్వమందు రామ వినురవేర

శీర్షిక:విజయం
ఆ.వె:126
పట్టు దలయె లేక భయమున్ బడయుచు
కృషియు లేక దైవ కరుణ ఏల
గావు నిన్ను పట్టుయు కృషివలయుగెలువ
విశ్వమందు రామ వినురవేర

ఆ. వె :127
మెట్టు మెట్టు ఎక్కు మేరువయినదక్కు
విజయ మెంతొ ఘనము వీరు నకును
జయము నొందు కాంక్ష జయమున్ ఇవ్వదా
విశ్వమందు రామ వినుర వేర

ఆవె 128
విజయ మొంద నీకు వినయము వలయున్
పెద్ద లంత నీదు పేరును  దలచి
దీవె నలను కురువ దివ్యము భవిత
విశ్వమందు రామ వినురవేర

ఆవె 129
కార్యదక్ష లేక కార్యశూరుడగుట
కాదు కాదు ఇలన కాదు కదర
కసిగ రగల వలయు కార్యసాధనకై
విశ్వమందు రామ వినురవేర 

శీర్శిక: ప్రమోషన్

ఆవె:130

తేనె మనసు చెల్లె తెగువ చూపు మగువ
చిరునగవుల తల్లి చిట్టి తల్లి
డీసి టీవో పదవి డీసెంటు గాపొంది
రాణి యవగ విధుల రాజిల్లునెపుడు

ఆవె: 131
ఇందిరమ్మ పోలు ఇలను లేరెవరును
కవిత రాసి వెలుగు కవన దేవి
మనసు కదలజేయు మమత పంచునిచట
వర్ధిలగనెపుడును వడిగ నున్నతిపొంద

ఆవె:132
వంద రాసి నీవు వందన మనిపించు
కున్నవమ్మా "ఇందు"కుశుభకాంక్ష
లందుకొమ్ము నెపుడు లంబోధరకృపన్
నీకు తోడుగుండు నిజము నమ్ము!

మిత్రుడు రవీంద్ర ప్రమోషన్ పై నా స్పందన

ఆవె:133
ప్రతిభ ముసుగు తొలగి ప్రభవించె నేడుగ
రవిని గ్రహణ మొదలి రమణ చేరే
వినతి రామా యనగ వినెనుగ రాముడు
ఈఈ నేడున్ ఎస్ఈ అవగ వేరా

శీర్శిక: పాదరసం
ఆవె:134
పాద రసము నేల పడినచో సాధ్యము
కాదు తిరిగి పొంద కాదు జార్చ
బంధమును తిరిగియు బొందగ మనిషికి
విశ్వమందు రామ వినురవేర

శీర్శిక:హెల్మెట్(శిరస్త్రాణం)
ఆవె:135
వాయు వేగ మునను పరుగులుయేల?
పరుగు లున్న యేల వద్దనదెవు
హెల్మెటులను రక్ష యెకద నిరతమున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె:136
కఠిన మైన పరీ క్షలకున్ ఎదురు
నిలచి విజయ ములను నిక్క ముగను
పొందిన కలుగునుగ పోరు ఆనందము
విశ్వమందు రామ వినురవేర

శీర్షిక:ఎండలు
ఆవె:137
మండెనెండలిచట మెండుగ జనముయు
తాళ లేక నీరు త్రాగి తాప మొదల
గొట్ట నీడ నుండ ఘోర హానితొలగ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:138
నీరు కలుషి తంబు నెరిగు వేసవిన్
నీటిని తగిన రీతి నేడె శుద్ధి
జేయు ఎండ పైన జెయమొందుమురా
విశ్వమందు రామ వినురవేర

ఆవె:139
ఎండ మంట తప్ప ఏలర బాధలు
ఖాది బట్ట లోన కాద సుఖము
వళ్ళు చల్ల గుండు వడయండదుగద
విశ్వమందు రామ వినురవేర

ఆవె:140
చల్ల పాని యాలు చలువయె కాదుర
చల్ల మజ్జిగేర చలువ జేయు
నిమ్మ రసము నుప్పు నీకురక్షయవును
విశ్వమందురామ వినురవేర

ఆవె:141
చలువ ఫలము తినిన చలువయె జేయును
ఎండ తాప మోర్చ ఏల బాధ
ద్రాక్ష పుచ్ఛ మించి రక్షఫలములేదు 
విశ్వమందు రామ వినురవేర

ఆవె:142
వేస వన్న చర్మ వేదన లేనుర
వెతుకు మార్గ మిలన వెతలు బాప
పసుపు ఉసిరి కీర పరివిధ ములువాడ
విశ్వమందు రామ వినురవేర


శీర్షిక;సూక్తులు
ఆవె143
సంపదేల వీకు సాగనంపగరాదు
నిండు బతుకు సిరి నీకు జాలు
పెరిగె సంప దంత పెరుగదు ఆయువు
విశ్వమందు రామ వినురవేర
*చ

ఆవె 144
పరుల నింద యేల పట్టదా నీతప్పు
సరిగ దిద్ద కోర సరియ వంగ
నీదు తప్పు తెలిసి నిజదారినడువు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 145
అవస రమను కున్న అలవక చేయుము
పనులు సాధ్యమైన పనులు చేయ
సాధన వలనే నసాధ్యము సాధ్యము
విశ్వమందు రామ వినురవేర

ఆవె 146
ఆత్మ విశ్వాసముయె అందలమెక్కగ
నీకు అస్త్రమగును నీవు జయము
నొంద దైవ చింతనుకలుగు ఆత్మలో
విశ్వమందు రామ వినురవేర

ఆవె 147
మనభవిశ్య కలలు మనకే చుక్కాని
నేటి కలలు రేపటి నిజవిజయము
కలలు విజయమునకు కథలుగ మిగులున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె 148
అక్ష రమ్ము రవము అరచిన వేళయె
తొక్కి నబతుకు కూడ తొడను గొట్టి
మౌన మొదలి అరచి మాటాడు మరువకు
విశ్వమందు రామ వినురవేర

ఆవె 149
బావురుమను కాద భావము లేకను
పద్య మనుట సబబు పద్య మువెల
వెలయు బోవ నేల విరియ భావమున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె 150
మంచి తలచు చుండు మంచి మనసుతో
మంచి మాట కన్న మంచి పనియె
మిన్న మంచి చేయు మెపుడును దీపమై
విశ్వమందు రామ వినురవేర

ఆవె:151
నీలో ప్రతిభ వెతికి నీవు వెలుగుతూ
నలుగు రికిని భృతిని నౌరా యనగ
నివ్వు ఇంటి దివ్వె నీవని మ్రొక్కగ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:152
పనులు నేర్వ నిలన పరిణతి వలయు
పక్వ మొంద నన్న పనితనమును
పరిణతిని చేయు పనులే అద్భుతః
విశ్వమందురామ వినురవేర

ఆవె:153
గొంతు నొక్కి నపుడు గొల్లుమనుటయేల
మాట లాడ గలిగి మాట రాదే
మాట తొక్కి నపుడె మాటవిలువతెల్వు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:154
కీడు యెంచి నీవు కృతమును చేయుము
మేలు పనుల నెపుడు మేలు కలుగు
జాగరూకులైన జాగుకాదు ఫలము
విశ్వమందు రామ వినురవేర

ఆవె:155
బాధ వేదనున్న బాగుగా సాగవు
పనులు నవ్వు చేరి పనులు పరుగు
లెట్టు సంతసమ్ము లేక బలములేదు
విశ్వమందురామ వినురవేర

ఆవె:156
మహిళ లెగసి పడిన మరితిరుగుయె లేదు
వృద్ధిజేయజూడు భయము నొదిలి 
మాన వాళి శక్తి మహిళయనెరుగుము
విశ్వమందు రామ వినురవేర

ఆవె:157
నీమనసున తిమిర నీడలెరిగినన్
చాలు పరుల తిమిర ఛాయ తెలియు
జ్ఞాన దీప మెలుగ జయము కలుగునీకు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:158
స్వేచ్ఛ లేని చదుపు స్వచ్ఛనేలయగును
బాలబాలికలకు భాగ్య రేఖ
స్వచ్ఛ తయెగ మనకు సాధనాయుధమున్
విశ్వమందు రామ వినురవేర

ఆవె:159
ఓటములను కసిగ నోడగ గొట్టుము
విజయ లక్ష్మి నీకు విజయ మిచ్చు
విజయ విజయ మేర విజయ పధములన్
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:160
నమ్మకమ్ము యున్న మోసముండునిలన
నమ్మకమ్ము లేక బతుకు లేదు
నమ్మకమ్ము ద్రుంచ నమ్మక ద్రోహమె
విశ్వమందు రామ వినుర వేర

ఆవె:161
నీసమస్య నీకు నిచ్చెనయవ్వద
నీకనుభవమయ్యే నీశ్రమంత
రేపు విజయ బాట రీతిని తెలవన్
విశ్వమందు రామ వినురవేర

ఆవె:162
జీవితాన్ని ఏల జీరాడ జేతువు
ఆశసౌధమందు అందు ఆశ
ఆశయాలనేల అణచెదవునిలన
విశ్వమందు రామ వినురవేర

ఆవె:163
నేటి అవసరాలు నేడు చూడుమనగ
నిన్న రేపు తలచ నీకు యేల
నేటి సంతసమ్మె నేతిమూటగనొప్పు
విశ్వమందు రామవినురవేర

ఆవె:164
నీదు నమ్మకమగు నీదువిజయమ్ము
నీదు నమ్మకమ్ము నీకు విజయ దీప్తి
నమ్మకమ్మెయాత్మ నమ్మక ముగనొప్పు
విశ్వమందు రామ వినురవేర

ఆవ:165
నమ్మకమ్ము జయము నాడునేడుయనగ
క్రాంతి నాప తరమ కాంక్ష నిండ
మేలు కున్న జనము మేలగు జగముకు
విశ్వమందురామ వినురవేర

ఆవె:166
ఓపికున్న నీవు ఓడిపోవనిజెప్పు
ఓపికున్న నీవు ఓటి బోవు
విజయ మంది నీవు విజయుడవగదువు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:167
తప్పు ఒప్పు లెంచ తరలును కాలము
గతము దల్చనేల ఘనత యేమి 
కాల విలువ తెలియ కాద తెలివియని
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:168
లక్ష్య మందు శ్రద్ధ లక్షణ మనినమ్ము
లక్ష్య సాధ నందు నరయు శ్రద్ధ
సాధనమ్ముతోనె సాధ్యము లక్ష్యము
విశ్వమందురామ వినురవేర

ఆవె:169
ముందు చూపు లేక ముప్పుయె పనికిన్
నెమ్మదైన మనిషి నిలన గెలుచు
ఓర్పు నేర్పు గూడి ఓడతరముగాదు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:170
తప్పు చేసి నోడు తప్పును తెలవగ
వగచు చుండ నేని వాడు క్షమకు
అర్హుడనియు తెలియు అంతమవగపగ
విశ్వమందు రామ వినరవేర

ఆవె:171
నిన్ను చూసి నవ్వ నీకుసిగ్గుయగును
విజయ బాట నడచి విరుచు నవ్వు
ఎగసి పడిన నవ్వు ఏడ్వగా నవ్వరా
విశ్వమందు రామ వినురవేర

ఆవె:172
జరగని పని దలచి జడువగ నేలర
జరుగ వలసిన పని జరుపబూను
వగచ చేయలేవు వక్కపనినిగూడ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:173
అనుకరణము యేలయనగను వినుముర
ఉనికి యందు నీవు   ఉండ  తొలగు
నీదు ముసుగు నీవు నీవుగ మెరువన్
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:174
నిన్ను తెలియ లేని నీవు జగతిని
తెలియ లేవు నిన్ను తెలియ
నీదు వెనుక సత్య రీతిని తెలియుము
జగతి మర్మ మునిల జయము తెలియ

ఆవె:175
తేట మనసు నిండ తేలుచుండునటుల
మాతృ సంస్కృతుండ మాట లేల
దేశ దేశ సంస్కృతేల ఘనమగును
విశ్వమందు రామ వినురవేర

సియాటెల్,యూఎస్ఏ
04/04/16

ఆవె:176
చెప్పిన విని జ్ఞప్తి జేయగ లేరులె
బోధ జేయు నపుడు బోధ పడును
చేసి చూపునపుడు చెరగదు మదినిన్
విశ్వమందురామ వినురవేర

ఆవె:177
ఆత్మలోన ఇముడు ఔనను సంస్కృతి
మాతృసంస్కృతన్న మరువ లేరు
విద్యలెన్నొ నేర్పు వినయము నేర్పురా
విశ్వమందు రామ వినురవేర

ఆవె:178
మదిలోనమెదిలె మధురభావాలెన్నొ
హృదిలోన కదిలె హృదయ తంతిృ
రూపు ఊపు చూడ రుచులన్ని మరచితి
విశ్వమందు రామ వినురవేర

ఆవె:179
దేశమనగ నీదు దేశమే స్వర్గము
బాధలేమి లేని బతుకు గదర
మాతృమూర్తిగన్న మాతృభూమిదియెరా
విశ్వమందు రామ వినురవేర

ఆవె:180
దేశ ద్రోహ మన్న దేనికో భయము
దోవ తెలియ లేని ద్రోహి మదిని
దొంగయన్న భుజము నేల తడిమెదవు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:181
మనసు నాది కాదు మదినేలు నారాణి
పారాణి రాసి పాణి పట్టు వరకు
నాడు నేడు నాలోన ప్రేమదొరల
విశ్వమందు రామ వినురవేర

ఆవె:182
కనుల లోన నీవె కలలోన నీవేగ
రామ రామ యనుచు రమ్యముగను
హనుమ హనుమ యన్న కనుమదాటు భయము
విశ్వమందు రామ వినురవేర

ఆవె:183
దుష్ట గ్రహము లెల్ల దూరమౌ నినుదల్వ
కష్ట నష్ట మేల కలుగ జేయు
రామ దయను పొంది రామరామయనగ
విశ్వమందు రామ వినురవేర
ఆవె:184
హనుమ యన్న నీకు అనురాగ మెక్కువ
రామ భక్తి యున్న రామ బంటు 
రామ కీర్త నమ్ము రాగమై రంజిల్లు
విశ్వమందు రామ వినురవేర 

ఆవె:185
పెంచు మంచి యన్న పెదవివిరుపులేల
పెదవి చేటు కాద పెంచ తప్పు
తప్పు చేత లొదలి తప్పుదారినొదులు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:186
జగము మార్చ యేల జయములు గలుగున్
మార లేని నీలొ మార్పు రాక
నీవు మారి చూపు నిజము జగము మారు
విశ్వమందు రామ వినురవేర

ఆవె:187
చక్కని చిరు నవ్వు చిక్కని కరుణను
తెలుపు నవ్వు పువ్వు తెలుపు మల్లె
మనసు స్వచ్చ నవ్వు మంచిగంధమవదా
విశ్వమందు రామ వినురవేర

ఆవె:188
ఎవరి కోస మిచట ఎదురుచూడగనేల
ఎవరు రారు నీవి వెతలు తీర్చ
నీదు వెతలు తీర్చ నీవె పూనవలెను
విశ్వమందు రామ వినురవేర

ఆవె:189
రాజకీయమందు రాజులై ఏలగా
కోట్ల సిరిని నేడు కొల్ల గొట్టి
జనుల సొమ్ము దోచ చరిత హీనులవర
విశ్వమందు రామ వినురవేర

అనుసూరి వేంకటేశ్వరరావు
సియాటెల్ యూఎస్ఏ
శీర్షిక:నల్లడబ్బు
ఆవె:190
వెండి తెరన వెలుగు వేల్పులై వెలగంగ
నిండు బతుకు నిలన నీచ మవ్వ
పన్ను కట్ట లేక మన్ను కరచనేల
విశ్వమందు రామ వినురవేర

ఆవె:191
కోట్ల సొమ్ము బొక్కి కోట్లుదాచనేల
పన్ను లన్ని తప్ప పర దేశముందాచ
మాయ జేయ నేల మచ్చపడగనేల
విశ్వమందు రామ వినురవేర

ఆవె:192
స్వార్థ చింత యేల స్వార్థబుద్దియవగ
దేశ సిరి యేల దిశను మార్చె
నల్ల ధనము దాచ నాగు పామగునుర
విశ్వమందు రామ వినురవేర

ఆవె:193
యెల్ల దాటి కదిలె యేళ్ళయభివృద్ధి
నల్ల బడెను సిరి నాల్గుచెరగులన్
పన్ను కట్టలేని పతిత జనులచేత
విశ్వమందు రామ వినురవేర

ఆవె:194
దొంగ లంత చేరి దొరికింది దోచిరి
నల్ల ధనము తోటి నల్ల దొరలు
భారతమ్ము కెపుడు భారమెభారతీ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:195
వన్నె చిన్నె లన్ని వగలుతో వడ్డించి
వలలు విసిరి జేరు వరుని తోటి
వరుని యుల్ల మెల్ల వదువుడెందమునిండ
విశ్వమందు రామ వినురవేర

ఆవె:196
కలువ కంటి వింటి కలువ తూపుల వాడి
వేడి రేపు మగడి వేడి మదిని
తాళ తరమె నేటి తరుణి చూపులవాడి
విశ్వమందు రామ వినురవేర

ఉగాది

ఆవె:197
వేకువ కువకువలకు వేడుకగ యుగాది
చైత్ర తళతళలుతొ జైత్ర యాత్ర 
దుర్ముఖి సుఖము లిచ్చు దుఃఖజనులకున్
జయము యనగ జనులు జయము గలుగ

ఆవె:198
కోయి లమ్మ పాట కోన దాటిన వేళ
మావి చిగురు లన్ని మాటు లేక
నోట చేరె పాట తోటవెలుగగన్
పరవశాన జేయ పండు గలను

ఆవె:199
కొత్త బట్ట లేసి కొత్త చిగురు మావి 
కోరి తినగ పాడె కోయిలమ్మ 
వీనులందు చేయు  విందు పొందు 
విశ్వమందు రామ వినురవేర

ఆవె:200
పచ్చడేల యనగ పండుగ వేడుక
ఆరురుచులతోడఆరగించు 
కొత్త బట్ట లేసి కోరుపూజలుచేసి
కొత్త వత్సరాన్ని స్వాగతించు

****అవేరా***